Sowmya Kankipati

Children Stories Inspirational Children

4.8  

Sowmya Kankipati

Children Stories Inspirational Children

మన బాల్యం

మన బాల్యం

4 mins
387


వేసవి కాలం అంటే ఎవరికి నచ్చవు చెప్పండి. చిన్నపిల్లలకి అయితే వేసవి సెలవలు వస్తాయి. ఇంక పెద్దవారి విషయానికొస్తే ఆ పిల్లలతో కాలక్షేపం చేయటానికి సమయం దొరికినట్టే. చెప్పాలంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమైన మామిడి పళ్ళు ఇంకా రకరకాల పండ్లన్ని ఈ కాలంలోనే వస్తాయి. ఇంక నెలవరకు పిల్లలకు సెలవులు కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలతో పాటు వారి సొంత ఊరుకో లేదా కొత్త ప్రాంతాలకో తీసుకుని వెళతారు. సెలవులు అయ్యేంతవరకు హాయిగా గడుపుతారు.

 వేసవి కాలం అంటే నాకు బాగా గుర్తు వచ్చేది మా ఊరు. మా అమ్మమ్మ నాన్నమ్మలది ఒకటే ఊరు కనుక మా అన్నయలు నేను ప్రతి యేడు ఏలూరు వెళ్ళేవాళ్ళం. ఇంక మా అత్తయ్యలు వాళ్ళ పిల్లలు అందరూ వస్తారు. బలే సరదాగా ఆడుకునేవాళ్ళం. అది కాకుండా మేం మధ్యాహ్నం అవ్వగానే అన్నయ్యలు నేను అన్నం తినేసి మా అమ్మమ్మ ఇంటికి వెల్పోయేవాళ్ళం. అక్కడ నలుగురు అక్కలు, ముగ్గురు అన్నయ్యలు ఉండేవాళ్ళు. వాళ్ళతో తెగ ఆడుకునేవాళ్ళం. అందరిలో నేను చిన్న పిల్లను కాబట్టి మా నలుగురు అక్కలు చిన్నప్పటి నుండి నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. చెప్పాలంటే ఇప్పుడూ అంతే ప్రేమగా చూసుకుంటారు సొంత అక్కలులాగా. వాళ్ళు మా మావయ్య పిల్లలు వరసకి వదినలు అవుతారు.  ఇంటి వెనక ఒక కాలువ ఉండేది. అక్కడ చాలా పెద్ద వేప చెట్టు చింత చెట్టు ఇంకా వేరే చెట్లు ఉండేవి. వేప చెట్టుకి తాడుతో ఉయ్యాల కట్టి ఊగుతూ ఉండేవాళ్ళం. మా అక్కవాళ్ళు అన్నయ్యలు చెట్టుపైకి ఎక్కి కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే నేను ఉయ్యాల ఊగుతూ ఉండేదానిని ఎందుకంటే నాకు చెట్టు ఎక్కటం వచ్చేది కాదు. కొంతసేపటికి ఇంటి దగ్గర ఉన్న అక్క స్నేహితులు వచ్చేవాళ్ళు. వాళ్ళు మేము అందరం కలిపితే ఒక 15 మంది వరకు ఉంటాము. మేమంతా కలిసి డబ్బులు పెట్టి హౌసీ ఆట ఆడేవాళ్ళం. నేను చిన్నదానిని కాబట్టి మా అక్క నేను కలిసి ఆడేవాళ్ళం. అలా ఆడి ఒక్కో ఆటలో 50 నుండి100 వరకు గెలిచేవాళ్ళం. అప్పట్లో అంత డబ్బులంటే గొప్పేగా. ఇంక, ఆట అయిపోయాక సాయంత్రం 5 గంటలకి, గెలిచిన డబ్బులు తీసుకుని కొట్టుకి వెళ్లి రకరకాల తినుబండారాలు కొనుక్కుని ఇంటికి కొంచెం దూరంలో ఉన్న పార్కుకి వెళ్లి గంటసేపు సరదాగా గడిపి అలసిపోయి తిరిగి ఇంటికి వచ్చేవాళ్ళం. మళ్ళీ మేము మా నానమ్మవాళ్ళ ఇంటికి వచ్చేసేవాళ్ళం. ఇలా రోజు సరదాగా గడిపేవాళ్ళం. నిజం చెప్పాలంటే ఎక్కువ మా అమ్మమ్మ ఇంట్లోనే గడపటానికి బాగుండేది. ఒకసారి ఏమైందంటే మేమంతా ఎప్పటిలాగే ఆడుకుని సాయంత్రం గోరింటాకు తోటకి వెళ్ళాం. గోరింటాకు పది రూపాయలది కొనుక్కుందాం అని వెళితే అక్కడ మరీ కొంచెం కోసుకోనిచ్చారు అందుకని మళ్ళీ వెళ్లి మేమంతా కలిసి కోసిన గోరింటాకును కొంచెం కొంచెం జేబుల్లో, సాక్సుల్లో, టోపిలో అలా చాలా దాసేసుకొని చేతిలో మాత్రం కొంచెం ఉంచుకొని ఇదే కోసుకున్నాం అని వాళ్లకి చూపించాం. ఇక చూడు అక్కడినుండి వచ్చేశాక తెగ నవ్వులే. ఆ సంఘటన ఎప్పుడు గుర్తు చేసుకున్నా బలే నవ్వొస్తుందిలే. ఇంకోసారి మేము చెట్టుకి ఉయ్యాల ఊగుతు ఊగుతు మా అక్క కాలువలో పడిపోయింది. తనని చూసి నవ్వుతుందని వాళ్ళ చెల్లిని కాలువలోకి లాక్కెల్లిపోయింది. అలా అందరం కాలువలో ఒకల్ని ఒకలు తోసుకుని మురికి మురికి చేసుకుని బయటకు వచ్చాం. ఇలా చెప్పుకుంటూ పోతే మా అల్లర్లు చాలానే ఉన్నాయి. ఇలా మా వేసవి సెలవలు చాలా సరదాగా గడిచేవి. ఇది కాకుండా మేం ఊరు వెళ్ళకముందు మా ఇంటి దగ్గర విబియస్ జరిగేది. ఈ వారం రోజులు చర్చ్ లో డ్రాయింగ్లు, ఆటలు పాటలు జరిగేవి అవి సరదాగా ఉండేవి. విబియస్ అంటే బాగా గుర్తొచ్చేది రస్నా. చర్చ్ అయిపోయాక పిల్లలందరికీ రస్నా ఇచ్చేవాళ్ళు. బలే రుచిగా ఉండేదిలే. ఇంటికి వచ్చి నేను నా స్నేహితులు కలిసి రస్నా పాకెట్స్ కొని మేం కూడా సుండే స్కూల్ పెట్టి పిల్లలందరినీ పోగు చేసి పాటలు ఆటలు ఆడించి వాళ్లకి రస్నా చేసి ఇచ్చేవాళ్ళం. మేమే పిల్లలం కానీ మేమే టీచర్లు లాగా చేసేవాళ్ళం. చెప్పుకుంటూ పోతే మా బాల్యంలో చేసిన చిలిపి పనులు రాయటానికి సమయం సరిపోదు. ఇదంతా రాస్తుంటే ఒక్కసారిగా నా బాల్యంలోకి వెలిపోయినట్టు అనిపిస్తుంది.   

  ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఎంతైనా 90 జనరేషన్ పిల్లలే అదృష్టవంతులు. మేము మాత్రమే అన్ని రకాల ఆటలు ఆడాం. రకరకాల తినుబండారాలు తిన్నాం. అసలు ఈ తరం పిల్లలకి ఏమి తెలుసు ఒక్క సెల్ ఫోన్ తప్ప. కానీ ఈ రోజు పిల్లలను చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. ఎప్పుడు చూడు ఫోను ఫోను ఫోను. ఫోనే ప్రాణం అన్నట్టు బ్రతుకుతున్నారు. ఫోను లేకపోతే ప్రాణం పోయినట్టు చేస్తున్నారు. పెద్దవాళ్ళు అన్ని తెలిసీ కూడా పిల్లలకి మంచి చెప్పటం మానేసి వాళ్ళు ఏది అడిగినా కాదనకుండా చేసేస్తున్నారు. అప్పట్లో మేము పిల్లలతో కోతి కొమ్మచ్చి, కర్ర బిళ్ళ, తొక్కుడు బిళ్ళ ఇలాంటి ఆటలు ఆడ మగ అనే తేడా లేకుండా కలిసిమెలిసి స్వేచ్ఛగా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ఆరుబయట అలసిపోయే వరకు తెగ ఆడేవాళ్ళం.ఆ ఆటలు మాకు మంచి ఆరోగ్యాన్ని ఆనందాన్ని అందించేవి. ఇంటికి వచ్చి చక్కగా స్నానం చేసి కడుపునిండా తిని పొడుకునేవాళ్ళం. కానీ నేటి పిల్లలు రకరకాల ఆటలు ఆడుతున్నారు కానీ అవన్నీ సెల్ ఫోన్లో ఆడుకుంటున్నారు. అవి వాళ్ల కళ్ళను మసగ చేయటంతో పాటు కదలక ఒళ్ళు నొప్పులు అని కొత్త జబ్బులు తెచ్చి పెట్టుకుంటున్నారు. అప్పట్లో పోకీమాన్, టామ్ అండ్ జెర్రీ, పవర్ రేంజర్స్ అనే కార్టూన్ బొమ్మలు చూసి అందులో హీరోలు లాగా లీనమై పెద్ద అయినాక గొప్ప పనులు చెయ్యాలని కలలు కనేవాళ్ళం. కానీ ఈ తరం పిల్లలు వినోదం అనే పేరుతో నానా చెత్త ప్రోగ్రామ్లు చూసుకుంటూ వాళ్ళ భవిష్యత్తు గురించిన అలోచనా శక్తి కోల్పోతున్నారు. ఆ రోజుల్లో మేము ఇద్దరు ముగ్గురు స్నేహితులతో చాలా సంతోషంగా మాటలు చెప్పుకుంటూ సమయం గడిపేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో పిల్లలు సోషల్ మీడియాలో 1000 మంది స్నేహితులు ఉన్నా కూడా సంతోషం లేదు. దానికి తోడు మోసం, ఒత్తిడి అదనంగా వస్తున్నాయి. అప్పట్లో మేము ఒకటో రెండో చిరు తిండ్లు కొనుక్కునేవాళ్ళం. అవి మా కడుపు నింపటమే కాకుండా మంచి ఆహ్లాదాన్ని కలిగించేవి. కానీ ఈ తరం పిల్లలు రకరకాల చిరుతిండ్లు తింటున్నా అవి అనారోగ్యంతో పాటు వాళ్ళ కడుపుకు ఒక సంచిలాగ పొట్ట పెంచుతున్నాయి. చివరిగా ఆ రోజుల్లో మేము వేసవి సెలవుల్లో పల్లెటూర్లు వెళ్లి పచ్చటి పొలాల్లో, పంట చేలల్లో, తోటల్లో, గొఱ్ఱెలతో, పాడి పశువులతో ఆడుకునేవాళ్ళం. అందువల్ల ప్రకృతి పర్యావరణం గురించిన కొత్త పాఠాలు నేర్చుకునేవాళ్ళం. కానీ నేటి 4జి, 5జి పిల్లలు ఇంటర్నెట్ తోడుతో ఆండ్రాయిడ్, ఆపిల్ అనే లోకంలో ప్రయాణం చేస్తూ సెలవలు గడుపుతున్నారు. వేసవి సెలవులే కాకుండా మిగతా రోజుల్లో కూడా సాయంత్రం బడి నుండి వచ్చి పిల్లలతో బాగా ఆడుకునేవాళ్ళం   ఎంతైనా మా చిన్ననాటి రోజులు ఒక మంచి అనుభవం అనే చెప్పాలి.ప్రతి పిల్లవాడు ఆ స్టేజి కచ్చితంగా రుచి చూసి రావాల్సిందే. కానీ ఈ తరం పిల్లల్ని చూస్తుంటే చాలా జాలిగా అనిపిస్తుంది. మంచి సమయాన్ని కోల్పోతున్నారని బాధగా ఉంటుంది. పిల్లల్లారా! మేల్కొండి!! మీ పడక మంచం మీద నుండే కాదు మీ అనుకూల చోటు నుండి కూడా మేల్కొండి. బయటకి రండి. ప్రపంచాన్ని తనివితీరా చూసి ఆస్వాదించండి. మీకు ఎటువంటి కష్టాలు లేని ఎగిరే స్వేచ్ఛా పక్షులు. ఆకాశమే మీ హద్దు. వెళ్లి ఆస్వాదించండి.. ఆనందించండి.. ఆరోగ్యం పెంచుకోండి.. అన్నట్టు ఇంకో మాట.. ఇది చదివిన ప్రతి ఒక్కరికీ తమ బాల్యం కళ్లు ఎదుట కనిపించే ఉంటుంది. ఎన్నో జ్ఞాపకాలు మీ ముందు కదలాడుతూ కనిపిస్తుంటాయి. అలాగే మీ పెదవులపై ఒక అందమైన చిరునవ్వుతో పాటు రెండు కళ్ళు కొంచెం చెమర్చినా ఆశ్చర్యం లేదు. మన బాల్యం అలాంటిది. మీరూ ఒకసారి మీ గతంలోకి వెళ్ళిపోయి మీ జ్ఞాపకాలన్నీ పోగుచేసుకొని ఆనందించండి😊


Rate this content
Log in