EERAY KHANNA

Children Stories Inspirational Children

4.7  

EERAY KHANNA

Children Stories Inspirational Children

" మచ్చలేని గాయం "

" మచ్చలేని గాయం "

5 mins
442


  " మచ్చలేని గాయం "     - రాజేష్ ఖన్నా

================================

   మా అమ్మమ్మ నన్ను చూడాలని కబురు పంపితే పరుగు పరుగునా ఢిల్లీ నుండి ఫ్లైట్ లో బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నాను. హైదరాబాద్ నుండి మరో మూడు గంటల ప్రయాణం తర్వాతనే నేను మా ఊరు సింధూపురం చేరుకోగలను. అందుకే  నేరుగా శంషాబాద్ విమానాశ్రయం నుండే టాక్సీ బుక్ చేసుకొని మా ఊరికి బయలుదేరాను. 

 ఊరికి చేరుకున్నాకా మా అమ్మమ్మ నన్ను ఎందుకు రమ్మన్నదోనని మా అమ్మనడిగి చూశాను. తను కూడా నాకు అసలు విషయం చెప్పనేలేదు. మా అమ్మమ్మ నాకు చిన్నప్పుడు ఎంతోసేవా చేసింది, అలాంటి వ్యక్తిని కలవడానికి కారణం అవసరం కాకూడదని భావించి వెంటనే బైక్ తీసుకొని చిన్నపాలెంకి బయలుదేరాను.

    సింధూపురం నుండి కొండాకోనల్ని దాటుకొంటూ మరో ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మా అమ్మమ్మ ఊరు చిన్నపాలెం వస్తుంది. ఆ ఊరుకి చుట్టు ముట్టు కొండలు, కోనలుంటాయి. ఆ ఊరిని ఎటునుండి చేరుకోవాలన్నా దట్టమైన అడవిని దాటుకొంటూ వెళ్ళాలి.

     కానీ సింధూపురం నుండి చిన్నపాలెం వెళ్ళాలంటే కనీసం మూడు కిలోమీటర్ల మేరా దట్టమైన జంగ్లాత్ ని దాటుకొంటూ వెళ్ళాలి. అందుకే ఆ ఊరుకి ఎప్పుడు వెళ్లాలన్నా నాకు మాత్రం ఒళ్ళు జలదరించిపోతుంది. దారిపొడవునా దోపిడిదొంగలు కూడా ఉంటారు. వాళ్ళకి చిక్కకుండా, భయపడకుండా ముందుకు సాగితేనే ఆ ఊరిని చేరుకోగలం. అందుకే ఆ ఊరిని దొంగ చిన్నపాలెం అంటారు కొందరు.

   ఈసారి ఎందుకో తెలియదు కానీ అడవిలోకి ప్రవేశించినా భయమనిపించలేదు. నా చిన్నప్పుడు దారిపొడవునా చూసిన  బంకమట్టి కొండలన్నీ ఇప్పుడు కరిగిపోయాయి. దారిపక్కనే ఉండే గంధపు చెట్లు కూడా మాయమయ్యాయి. ఆ అడవి ఏమాత్రం కూడా భయంకరమైనదిగా అనిపించలేదు. ఆ అడవి మధ్యలో దారికడ్డంగా వచ్చే నీటికయ్య కూడా ఎండిపోయింది. అక్కడా ఒంటరిగా మిగిలిన దారితప్పా విలువైనదేమి కనిపించలేదు.

   దొంగల అలికిడి లేదు, మనుషుల మనుగడ లేదు, పక్షుల కిలకిలారావాలు లేవు, ఫారెస్ట్ విభాగం పరిధిలోని  అడవంతా నాశనమయ్యింది. ఎన్నో యూకలిప్టస్ చెట్లని అడ్డదిడ్డంగా నరుక్కుపోయారు. ఎందుకో తెలియదు అనాథలా మారిపోయిన ఆ అడవిని చూసి బోరుమని ఏడవాలనిపించింది. మొదటిసారిగా ఆ అడవిలో ధైర్యంగా ఆగిపోయి నిలబడి చుట్టూతా కలయచూశాను.

      ఆ ఊరికి రోజుకి రెండుసార్లు బస్సు కూడా వెళ్తుంది. బస్సు వెళ్ళేటప్పుడు కొండని దాటుకొని లోయలోకి దిగుతూ వెళ్తుంది. బస్సులో అలా కిందికి వెళ్తున్నప్పుడు ప్రాణాలు పైపైనే పోతున్నంతగా భయం వేస్తుంది. ఆ ఊరికి ఒకవైపు చెరువు గట్టుంది. ఆ చెరువు గట్టుకింద పచ్చని పొలాలు, పిల్లలు ఆడుకొనే పచ్చని మైదానాలు, పశువులకోసం ప్రకృతి ప్రసాదంగా దొరికిన పచ్చికబయలు. ఒక్కటేమిటి, ఆ ఊరంతా పచ్చని ముగ్గులతో అలంకరించినట్లుగా అందంగా ఉంటుంది.  

     ఆ ఊరికి సమీపంలో దారికి ఇరువైపులా కట్టిన తోరణంలా, స్వాగతం పలికే ప్రధానద్వారంలా ఒక పెద్ద ఊడలమర్రి చెట్టుంది. దాని కింది నుండి వెళ్తుంటే ఒక సొరంగంలో నుండే వెళ్తున్న భావన కల్గుతుంది. ఆ మర్రి చెట్టు ఊడల్ని పట్టుకొని పిల్లలు ఆడుతూ, కేరింతలు కొడ్తుంటారు. ఆ పిల్లలమర్రిని చేరాలంటే ఒక అరకిలోమీటర మేరనున్న ఇసుక వాగులో నడుచుకొంటూ వెళ్ళాలి. ఇన్ని అందాలున్న చిన్నపాలెంకి వెళ్ళకా చాలారోజులయ్యింది. ఉన్న ముగ్గురు మేనమామల్లో ఇద్దరు ఊరుదాటి పట్నంలో ఉంటున్నారు. ఇంటి ఐదుగురు ఆడపడుచులు పెళ్లిచేసుకొని వెళ్లిపోయారు. అక్కడా అమ్మమ్మ, చిన్న మామయ్య, అతని భార్య మాత్రమే ఉన్నారు. నేను వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా సంతోషిస్తారు. కానీ, మొదటిసారిగా అమ్మమ్మ నన్ను ఎందుకో ఢిల్లీ నుండి రప్పిస్తోంది. అదే విషయం నాలో అంతుతేలని అలజడిని సృష్టించింది. 

     అలా అంతరించిపోతున్న అడవిని దాటుకొని చిన్నపాలెంకి చేరుకొనేసరికి నాకు ప్రాణం పోయినట్లుగా అనిపించింది. అక్కడా ఇసుకవాగు లేదు, దాని ముందున్న పిల్లలమర్రి కూడా లేదు. ఒకప్పుడు పెళ్లికూతురిలా అందంగా ఉండే ఆ ఊరు, సనాతన సమాజంలో చచ్చుబడిన విధవలా బోసిపోయి కనిపించేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు.

    ఒకప్పుడు నేను ఆ ఊరికెలితే ఊరంతా మీ అమ్మ ఎలా ఉంది, నీవు ఎలా ఉన్నవని పలకరించే అమ్మలక్కలు ఒక్కరు కూడా బయట కనిపించలేదు. పిల్లల అల్లరి లేదు, పశువుల అరుపులు లేవు, మట్టి వాసన లేదు. చిన్నపాలెం రూపురేఖలు మారిపోయాయి, మనుషులు సహితం మారిపోయారు.

 దగాపడిన మనసుతో మా అమ్మమ్మ ఇంటికి చేరుకున్నాను. ఇంట్లో ఆమె మాత్రమే ఉంది. నన్ను చూడగానే మా అమ్మమ్మ కళ్ళల్లో ఆనందంతో వచ్చే మెరుపు కనిపించలేదు. నేను చాలారోజుల తర్వాత వచ్చానని అలిగిందేమోనని కాస్త ఊరుకున్నాను. నా కళ్ళల్లోకి సరిగ్గా చూడలేకపోతోంది. నాకు కాళ్ళు, చేతులు కడుక్కొని తినమని చెప్పింది. తను చెప్పినట్లుగానే కడుక్కొని వచ్చి, పీటపై కూర్చొన్నాను.

   నాకిష్టమైన మేకమాంసం,  సాయిజొన్న రొట్టెలు, భక్ష్యాలు, గర్జలు, పెరుగు, జామకాయలన్నింటిని తీసుకొచ్చి  ఒక వరుసలో నా ముందు పెట్టింది. వాటిని నేను ఆ వరుస ప్రకారమే తింటానని తనకు మాత్రమే తెలుసు. తింటూ అడిగాను,

    " ఏమయ్యింది.... నాతో సరిగ్గా మాట్లాడట్లేదు...."

    " నాకేం అయ్యింది?..... మాట్లాడుతూనే ఉన్నా కదా. నీవు ముందు తిను కొడకా...., కొలువు కోసం కోసుల దూరం పోయి సరిగ్గా తింటున్నావో, లేదో!. బక్కగైనవ్ కదా, అందుకే నీవు తిను ....." అని నేను తలవంచుకొని తింటుంటే, నా వైపు చూడసాగింది.

   నేను తలఎత్తుకొనేసరికి తను తల తిప్పుకొంది. నేను ఉద్యోగం రీత్యా ఇంటికి దూరం ఉంటాను కాబట్టి ఒకసారి కడుపునిండా నాకు భోజనం పెట్టాలనుకొని పిలిచి ఉంటుందనుకొన్నాను. జీవమున్న తన గాజుకళ్లు కన్నీళ్లతో సుళ్ళు తిరుగుతున్నాయి. నాలోని ఉత్కంఠతని బయటికి చెప్పలేకా లోపల ఉంచుకోలేకా తనతో ఏదో ఒకటి మాట్లాడాలని, 

   " అమ్మమ్మ!..., నీవు కూడా తిను " అని అన్నాను

  " నీవు.... తిను, నేను జరాసేపైనంకా తింటా..." కళ్లు తూడ్చుకొంటూ అన్నదామె.

  తను అలా కన్నీటిపర్యంతమయ్యేసరికి నాకేం చేయాలో అర్థంకాకా ఢీలాపడిపోయాను. నేను తిననేమోననుకొని తను కూడా పళ్లెం తీసుకొని నాకు ఎదురుగా కూర్చోంది. ఏదో అరకొరగా తినడం మొదలుపెట్టింది. నేను చాలా రోజుల తర్వాతా కనిపించేసరికి ఉద్వేగం ఎక్కువై ఏడ్చిందనుకొన్నాను. నాలో నేను ఆలోచించుకొంటూనే భోజనం ముగించాను.

  కానీ ఈసారి వరుస తప్పింది. భోజనం చివరలో పెరుగులో చెక్కర కలుపుకొని తినే అలవాటున్న నేను, మధ్యలోనే కూరలో వేసుకొని తిన్నాను. తను అన్నీ గమనిస్తూనే ఉంది. నాకు నచ్చిన భోజనం నా ముందున్నా, నాకు భోజనం చేసిన తృప్తే లేదు. లోలోపల నేనేదో తప్పు చేసిన భావన నాకు కల్గింది. అమ్మమ్మని అలాంటి పరిస్థితిలో ఇప్పటివరకు చూడలేదు. కాసేపటికి తానే,

  " కొంతమంది వాళ్ళ అలవాట్లతో పాటు అనుబంధాల్ని గుటా మర్సిపోతరు...."

  ఆ మాటకి నా గొంతులో మాట తడబడింది. నేను మరో మాట అనే ధైర్యం చేయలేదు. 

  " నాకున్న పాతికమంది మనుమరాళ్లు, మన్మలందరిలో ఒక్కోక్కరిని ప్రతీ రెండునెల్లకోసారి పిలిచి వాళ్ళతో నాకు ముడిపడిన బంధాన్ని బట్టి , ఒక బహుమానం ఇస్తున్నా. ఇప్పటిదాకా అందరూ ఐపోయిండ్రు, నీవొక్కడివే మిగిలుంటివి. నీవేమో కొలువు ఎర్రిలా బడి రాకపోతివి.

      ఏది ఏమైతేనేం ఆ దేవుడు నేను కన్నుమూసే లోపలే నిన్ను పంపిండు. నీవొక్కడివే అందరి కంటే నా మనసుకి బాగా నచ్చింది.

    ఎందుకో తెలుసా, నీ కళ్లు అచ్చం నా భర్త బలరాం కళ్ళలాగనే ఉంటాయి. కానీ నా భర్త ముక్కోపి, అందుకే జీవితాంతం అతని కళ్ళల్లకి చూసే ధైర్యం చేయలేదు. భయంతోనే బ్రతుకీడుసుకొంటా వచ్చినా.   నీవెప్పుడైతే చీటీకి మాటికీ నన్ను చూడటానికి రావట్టినవో అప్పుటి నుండి, నీవు ఒక వారం దినాలు కనబడకపోతే నా ప్రాణం విలవిలలాడ్తుండే.

    మీ తాతనే చెప్పిండే నాకు, నీ కళ్లు అతని కళ్ళలాగా ఉన్నాయని. అందుకే అతని కళ్లల్లోకి చూసే ధైర్యం లేని నేను, నీ కళ్లల్లోకి చూసి మురిసిపోయేదాన్ని..... " మా అమ్మమ్మ అలా చెప్తుంటే ఖచ్చితంగా నాకు ఓ ఎకరం భూమి రాసిస్తుందేమోననుకొన్నాను. అందరికంటే నాకు చాలా పెద్ద బహుమతి వస్తుందని సంబరపడ్డాను. మళ్ళీ అమ్మమ్మ -

" కానీ, మీ తాతలాగనే ఒక రోజు నీ కళ్లుగుటా ఎర్రబడ్డాయి. నీవు మీ తాత లాగనే నన్ను కోపంతో తిట్టినవ్....." అని అనేసరికి నాకు గుండె సర్రున జారిపోయినట్లుగా అనిపించింది. గొంతులో తడి నిండిపోయి నోటమాట రాలేదు.

   " ఇరవయైదేండ్ల కిందటి ముచ్చటా, నీకు యాదికున్నదో లేదో, కానీ నాకు ఇంకా యాదికున్నది. మీ తమ్ముడు పుట్టిండని తెలిస్తే కట్టేపట్టుకొని వానలో తడుసుకొంటా మీ ఇంటికొచ్చింటి. అప్పటికే నేను ముసల్దాన్ని కదా, గట్లా వర్షంలా తడవంగానే వణుకుపుట్టింది.

     మీ కొట్టంలో పొయ్యిలా మంట కనబడంగనే పాణం అటు గుంజింది. చలి ఆగకపోయేటళ్లకే ఇంకా రెండు, మూడు కట్టే పుల్లలు పొయ్యిలేసినా. గంతట్లనే  మీ అమ్మ దగ్గరికాడికెళ్ళి ఉరుక్కొచ్చి నీవొక మాటన్నావ్.

      " ఏయ్!... ముసల్దానా... పొయ్యిలా కట్టెలు పెట్టకు.  మా దగ్గరా కట్టెల్లేవు....తడిసిపోయి రాకుండా యడనన్నా ఆగి రాకపోయినవ్?. మా ఇంట్లో కట్టెలు అయిపోగొట్టనికే వచ్చినట్లున్నావ్.... " అని మరే ఆలోచన లేకుండా సూటిగా అన్నావు. ఆ మాటలు నా మనసుని గాయపరిచినయ్. నా గుండెని ఛీల్చివేసినయ్. అందుకే నేను వెంటనే ఆ సమయానికి చీకటి పడ్తున్నా గుటా మీ ముఖం సూడకుండా తిరిగిరావటింటి. నేనొక కోసు దూరం రాంగనే నీవు పరిగెత్తుకొచ్చి, అమ్మ రమ్మంటుందని పిలిసి ఎన్కకు తీసుకపోయినవ్.

    అందుకే నేను నా జీవిత చరమాంకంలోనైనా నీకు శానాసేపు మంటనిచ్చే కట్టెల్ని ఇద్దామనుకొన్నా. వాటితో నీ కుళ్ళిపోయిన మనుసునే కాల్సుకొంటావో లేకా మళ్ళీరాని జ్ఞాపకాలకి చలించిన నీ గుండెని పేల్సుకొంటావో నీ ఇష్టం. 

   నీకిద్దామనుకొన్నా బహుమానం గుటా అదే. ఒక మాటలా సెప్పాలంటే నీకిచ్చేదే అందరికి ఇచ్చిన దానికంటే పిరేమైనది (ఖరీదైనది). నెలరోజులు అడివంతా తిరిగితే ఆ కట్టెలు దొరికినయి..... ఆ కట్టెల మోపులో రకరకాల అడవి ఫలాల చెట్లు, సింధూరపు చెట్టు, కొండరావి చెట్టు ఇలా అడవిలో దొరికినా,  గొడ్డలికి కూడా దంగలేని గట్టి కట్టెల్ని తెచ్చినా. ఆ మోపులో ఒక్కో కట్టే ఒక్కో చెట్టుది....ఎంతలేదన్నా ఒక్క కర్ర నీకు ఒక రోజంతా మంటనిస్తది...." అని వాకిలి చివరన ఒద్దికగా, అందగా తాడుతో కట్టి ఉంచిన ఓ కట్టెలమోపుని చూపించింది.

    " ఆనాడు తెలియకా అలాంటి మాటలు అన్నందుకు నన్ను క్షమించు అమ్మమ్మ!..." అని తన కాళ్ళమీదా పడి ఏడ్వాలనిపించింది. కానీ నా అవివేకం వల్లా ఆ మట్టిమనిషిని క్షమాపణ అడగలేకపోయాను. 

  నేను ఉద్యోగం చేసేచోటా నా అభిప్రాయాన్ని గౌరవించడానికి ఎంతోమందిని ఒప్పిస్తాను. కానీ మా అమ్మమ్మని ఎలా ఒప్పించాలో, నా మీదున్న కోపాన్ని ఎలా తగ్గించాలో అర్థం కాలేదు. నాకు తల తీసేసినట్టు అనిపించింది. నేనేం చెప్పినా తను వినదని అర్థమయ్యింది. మా తాతయ్య చనిపోయేవరకు ఒక్కసారి కూడా ఏడవలేదంటా. 

    తనలాంటి కళ్లున్నా నేను కూడా ఏ రోజూ ఏడవకూడదని నాతో ఒట్టు వేయించుకున్న అమ్మమ్మ ముందు ఏడవకుండా నన్ను నేను అదుపుచేసుకొన్నా. ఆపుకోలేని దుఃఖం లోలోపలి నుండి తన్నుకొస్తుంటే ఎక్కడా ఏడ్చేస్తానేమోనని భయపడి ఆమే కాళ్ళని మొక్కి ఆ కట్టెలమోపుని బైక్ మీదా పెట్టుకొని బయలుదేరాను.

    మా అమ్మమ్మ కళ్ళకి ఎప్పుడో కనుమరుగయ్యాను. ఆమే ఏడుస్తూనే ఉంది. ఆమే నా మీదా కోపంతో ఆ కట్టెలమోపునివ్వలేదు, కేవలం అలిగింది అంతే. నేను తనని,  తన భర్త ఓదార్చినట్లుగా ఓదారుస్తానని ఆశించి ఉంటుంది. కానీ బాంధవ్యాలకు, బంధువులకు దూరంగా ఎవరికీ అంటునట్టుగా తామరాకులా బ్రతుకుతున్న నాకు, నాలో లేని ప్రేమని ఆమె మీదా చూపించడం నాకు కేవలం నటనగానే అనిపించింది.

    

     కానీ ఆమే నాకోసం ఏమేమి చేసిందని చెప్పను?. ఆమే చేతిలో ఒకప్పుడు నేనొక మాంసపు ముద్దని మాత్రమే. నా జీవితచక్రంలో నా కోసం ఎన్ని కలలు కని ఉంటుంది?. చిన్నపాలెంని దాటాకా, చిన్నగా మొదలైన నా కన్నీళ్లు ఒకటొకటి ధారలుగా మారి నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. 

   మార్గమధ్యలో నా మనసు తేటపడేవరకు ఏడ్చి, ఏడ్చి సింధూపురం చేరుకున్నాను. నేను తీసుకెళ్లిన కట్టెలమోపుని చూసిన మా అమ్మ మీనాక్షి ఆశ్చర్యపోయింది. అప్పటివరకు తను వండుతున్న కంది పప్పు ఎంతకీ ఉడకకపోయేసరికి నేను తీసుకెళ్లిన మోపులోంచి ఓ కర్రని తీసి పొయ్యిలో పెట్టింది. 

  నిజంగానే ఆ ఒక్క కర్ర పావువంతు కూడా కాలకముందే మా అమ్మ వంట పూర్తి చేసేసింది. ఆ కర్రని చూసి ఆశ్చర్యపోయినా మా అమ్మ,

  " ఏం కట్టే బెటా ఇది. ఎంతసేపు పెట్టినా మండుతూనే ఉంది....యాడికెళ్లి తెచ్చినావు?.... " అని అడిగింది. 

  " పాతికేళ్ల క్రితం నీ అక్కచెల్లళ్ళని చూసినట్లుగా నిన్ను చూడలేదని అమ్మమ్మ మీదా కోపం పెంచుకొన్న నీ ఆలోచనని అనుసరించి,  చలికి చతికిలబడిపోయిన అమ్మమ్మని నా చేతా తిట్టించి నీ కోపాన్ని చల్లార్చుకొన్న నా తల్లీ.... నేను ఆ రోజు చేసిన తప్పుకి శిక్షగా వేసిన బిక్షనే ఈ కట్టెల మోపు అని చెప్పమంటావా?. నా పసిప్రాయపు తప్పుని ఈ రోజు వరకు గుర్తుంచుకొని నన్ను , నా చావుని నేనే ఎంచుకొని నా చితి పేర్చుకోడానికిచ్చిన కట్టెల మోపు అని చెప్పమంటావా?... నా తల్లికొచ్చిన కోపం , నీ తల్లి నాకిచ్చిన శాపం, నా పాపపరిహారానికి రూపం ఈ కట్టెల మోపులోనే ఉందని చెప్పమంటావా?.... " అని నాలో నేనే మాట్లాడుకొంటూ కాలిపోతున్న నా మనసుని, కాలని ఆ కర్రని పొయ్యిలోకి నెట్టుతూ బాధతో వచ్చిన కన్నీళ్లను,  పొగతో రావాల్సిన కన్నీళ్లుగా చిత్రీకరించి నా తల్లికి సమాధానం చెప్పకుండానే దాటవేశాను. 

    నేను మా అమ్మమ్మకి ఏదో ఒకరోజు క్షమాపణ చెప్పాలనుకున్నాను. కానీ నా క్షమాపణ వినడానికి తానూ ఈ భూమ్మీద లేదు, నాతో తిట్టించిన మా అమ్మకి ఆ సందర్భమే గుర్తులేదు.  కానీ నిజం చెప్పి మా అమ్మని, తన అమ్మ దగ్గర చెడ్డదాన్ని చేయాలేకనే నేను చెడ్డవాడినయ్యాను. 

   చివరికి అమ్మమ్మ మెచ్చని మనుమడిగా, అమ్మకి నచ్చని కొడుకుగా, ఆలుకి గిట్టని నా గందరగోళ జీవితంలో బాధని భరిస్తూ, బంధాన్ని తెంచుకొన్నది నేను మాత్రమే.  

  ఆడదాని మనసు అద్దంలాంటిది. మగవాడికి ఆ అద్దాన్ని పగలగొట్టడమే వచ్చు కానీ అతికించడం రాదు. ఆ మనసు అమ్మమ్మదైనా, అమ్మదైనా, చివరికి ఆలుదైనా ఒకటే ఫలితం ఉంటుంది. నేనూ  కూడా ఈ విషయానికి అతీతున్నేం కాదు గనుకే, కన్నీళ్లు తప్పలేదు. 

 ఇప్పటికీ అవతలి వాళ్ళ ఆలోచనల్ని, ఆవేశాన్ని నా మాటల్లో చెప్పాలనుకునే ఆలోచన నాకు రాగానే, అమ్మమ్మ ఇచ్చిన కర్రలే గుర్తొస్తాయి. జీవితంలో దేన్నైనా సుళువుగా నేర్చుకోగల్గిన నేను, స్త్రీ చేతా ప్రేమించబడటం ఎప్పుడు నేర్చుకొంటానో మరీ?.. 😪😪.

   మనది కానీ ఆలోచనకి మనం బానిసలం కాకూడదు, మనదైన ఆచరణకి ఇతరులు బాధితులు కాకూడదు.... అన్న ఆలోచనతోనే భారంగా బరువైన బాధతో  బ్రతుకుతున్నాను.


=======సమాప్తం===========


  

  

   

    

  

    

     

   

     

 

 

  

    

     



Rate this content
Log in