Varun Ravalakollu

Children Stories Fantasy

4.8  

Varun Ravalakollu

Children Stories Fantasy

సూపర్ హీరోస్

సూపర్ హీరోస్

15 mins
467


న్యూయార్ నగరంలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అద్దాలకి గొంతుకి కూర్చుని వేలాడుతూ ఉన్నాడు ‘స్పైడర్ మ్యాన్’. సెల్ వైబ్రెట్ అయితే తీసి చూశాడు. ‘హీమ్యాన్’ కాలింగ్ అని ఉంది డిస్ ప్లే లో.

“హేయ్ బ్రో..., ఎలా ఉన్నావ్..., ఏంటి బ్రో ఈ మధ్యన కనిపించట్లేదు?” ఎత్తి మాట్లాడ్డాడు.

“నేను ఇక్కడ ‘అంకుల్ స్కూర్జ్’ ధనాగారానికి కాపలాగా ఉన్నా బ్రో” చెప్పాడు.

“అదేంటి దానికి సెక్యూరిటిగా ఉండాల్సింది ‘పవర్ రేంజర్స్ SPD’ కదా?.., మొన్న పేపర్ లో అంకుల్ స్కూర్జ్ సెక్యూరిటి కాంట్రాక్ట్ దక్కించుకున్న SPD అని చదివినట్టు గుర్తు!?”

“అవును బ్రో.., కాకపోతే వాళ్ళ గురువు ‘డాగి’ ఏవో కొత్త కాంబాట్ వెపన్స్ తెప్పించాడంట. ట్రైనింగ్ కోసం వెళ్ళారు. SPD D-squad వచ్చారు గాని.., వాళ్ళు గూర్ఖాలకి ఎక్కువ కానిస్టేబుల్స్ కి తక్కువ. అందుకే ఎందుకైనా మంచిది అని నన్ను కూడా ఉండమని రిక్వెస్ట్ చేస్తే ఉన్నాను”

“అవునా.., సరే ఇప్పుడెందుకు కాల్ చేశావ్?”

“ఏం లేదు బ్రో.., నేను చిన్న అర్జెంట్ పని మీద వెళ్ళాల్సిన అవసరమొచ్చింది. నా బదులు నువ్వు ఇక్కడ కాపలాగా ఉండటానికి కుదురుతుందా అని అడుగుదామని కాల్ చేశా”

“దానిదేముంది బ్రో.. ఉంటాను”

“థాంక్స్ బ్రో. ఇప్పుడే ‘లాంచ్ పాడ్’ని పంపిస్తాను. ఫ్లయిట్ లో వచ్చేయ్”

“వామ్మో వద్దు బ్రో. ఆ అంకుల్ స్కూర్జ్ గాడంటే సుడిగాడు కాబట్టి లాంచ్ పాడ్ ఎన్ని క్రాష్ లాండింగ్ లు చేసినా బతికేస్తున్నాడు. నాకంత సుడి లేదు. నేను నా తాళ్ళు అల్లుకుంటూ వచ్చేస్తానులే”

“సరే బ్రో ఉంటాను” కాల్ కట్ చేశాడు హీమ్యాన్.

హీమ్యాన్ అంకుల్ స్కూర్జ్ ధనాగారాన్ని వదిలి ‘అలాడిన్’ ప్రేయసి ఐన రాకుమారి ‘జాస్మిన్’ ఉండే అగ్రబః రాజ్యానికి బయల్దేరటం, స్పైడర్ మ్యాన్ అంకుల్ స్కూర్జ్ ధనాగారానికి బయల్దేరటం రెండు ఒకేసారి జరిగాయి.

***

అంతరిక్షంలో తన ‘టెర్రర్ స్పేస్ క్రాఫ్ట్’లో తిరుగుతూ ఉన్నాడు ‘ఎంపరర్ గ్రూమ్’. అతడు మానవ మెదడు ఆకారంలో కనిపించే తన మాస్టర్ ‘వొమ్ని’ ముందు నించుని ఉన్నాడు.

“యువర్ మ్యాగ్నిఫిసెన్స్..., మనతో చేతులు కలిపిన SPD A-squad వల్ల ఎటువంటి లాభం లేకుండా ఉంది. SPD B-squad మనల్ని ప్రతి యుద్దంలోను ఓడిస్తున్నారు. ‘బ్రూడ్వింగ్’ ఇస్తున్న ఆయుధాలు వాళ్ళ వెంట్రుకలని కూడా పీకలేకపోతున్నాయి. మీరే స్వయంగా ఆకారం ధరించి రంగంలోకి దిగాలని నా ఆకాంక్ష. అప్పుడే భూమిని మనం హస్తగతం చేసుకోగలం” వినయంగా అన్నాడు.

“అలాగే గ్రూమ్. కానీ నేను ఆకారం పొందాలంటే భూమిలో ఉండే బంగారంలో కనీసం సగం బంగారమైనా కావాలి. అంత బంగారాన్ని ఎలా సంపాధిస్తావు?” అధికారికంగా అడిగాడు వొమ్ని.

“ఆ విషయం నాకు వదిలేయండి మాస్టర్. భూమిలో అంకుల్ స్కూర్జ్ అనే ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ‘Forbes Magazine’లో చదివా. అతడి ఒక్కడి దగ్గరే భూమి మొత్తంలో ఉండే బంగారంలో సగం బంగారం ఉంది. నేను సంపాదిస్తా”

“అయితే కానియ్ గ్రూమ్. ఆకారం పొందాలని నాకు కూడా చాలా ఆతృతగా ఉంది. భూమి మీద మనం అధికారం చేసే సమయం ఆసన్నమైంది” వికటట్టాశం చేస్తూ అన్నాడు వొమ్ని.

“సెలవు మాస్టర్” సెల్యూట్ చేసి వచ్చేశాడు గ్రూమ్.

వచ్చి తన సింహాసనంలో కూర్చుని ఆలోచనల్లో పడ్డాడు. స్కూర్జ్ ధనాగారాన్ని కొల్లగొట్టాలంటే రెండు అవరోధాలు ఉన్నాయి.

ఒకటి.., ఆ ధనాగారం లోపలికి ప్రవేశించటం.

రెండు..,ప్రవేశించిన ధనాగారంలోంచి బంగారాన్ని తస్కరించి స్పేస్ క్రాఫ్ట్ లోకి చేరవేయటం.

ధనాగారానికి ఇప్పుడు SPD వాళ్ళు కాపలాగా ఉన్నారు. కాబట్టి తాను స్వయంగా ప్రయత్నిస్తే మొదటికే మోసం రావచ్చు. అంటే భూమిలో ఉండే ఎవరో ఒకరి సాయం తీసుకోవాలి. ఎవరు చేస్తారు?...ఆలోచించగా ఆలోచించగా మెరుపులా ఐడియా తట్టింది గ్రూమ్ కి.

‘కిల్విష్’ !!.....

అవును కిల్విష్ తనకి ఖశ్చితంగా సాయం చేస్తాడు. ఎందుకంటే అతడి లక్ష్యం తన లక్ష్యం ఒక్కటే కాబట్టి. మొదటి సమస్యకి పరిష్కారం దొరికింది. ఇక రెండో సమస్య, బంగారాన్ని ఒక్కపెట్టున స్పేస్ షిప్ లోకి లాగటం. అంత టెక్నాలజి ఇప్పుడు తన దగ్గర లేదు. అది ఎలా?

రెండు నిమిషాల ఆలోచన తరువాత అప్రయత్నంగా పెదాలపై నవ్వు విరిసింది గ్రూమ్ కి. అతడికి గుర్తుకు వచ్చిన పేరు,

‘లోథోర్’ !!.....

అయితే లోథోర్ చనిపోయి చాలా కాలమైంది. అయినా పర్లేదు, అతడి కొడుకు ‘కోథోర్’ బతికే ఉన్నాడు.

రెండో సమస్యకి కూడా పరిష్కారం దొరికినట్టే!!

***

ధనాగారపు బిల్డింగ్ కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతికఅంతస్తుల బిల్డింగ్ టెర్రర్స్ మీద నుంచి టెలిస్కోప్ సాయంతో చూస్తున్నాడు ‘బ్లూటో’. ధనాగారపు బిల్డింగ్ బయట స్పైడర్ మ్యాన్ నించుని ఉన్నాడు. అతడితో పాటు కాంబాట్ వెపన్స్ తో SPD సిబ్బంది గస్తీ తిరుగుతున్నారు. వారితో పాటు మామూలు సెక్యూరిటి వాళ్ళు కూడా ఉన్నారు.

“అదిగోరా అక్కడ కనిపిస్తుందే.., ఆ బిల్డింగే అంకుల్ స్కూర్జ్ గాడి ధనాగారం. అందులోకి దూకే రోజు ఆ స్కూర్జ్ గాడు ఈత కొడుతూ ఉంటాడు” ఇటువైపుకి తిరిగి తన ఇద్దరు అనుచరులని ఉద్దేశించి అన్నాడు బ్లూటో.

“తెలుసన్నా... ఆ బిల్డింగ్ నిండా బంగారు నాణాలే అంటగా!? ఆ అంకుల్ స్కూర్జ్ అదృష్టవంతుడు అన్నా” అన్నాడు మొదటి అనుచరుడు.

“అదృష్టవంతుడు కాదురా.., పిసినారి”

“అసలింతకీ ఇక్కడికి ఎందుకొచ్చాం అన్నా?” అడిగాడు రెండో అనుచరుడు.

“మనం ఈ రాత్రికి ఆ స్కూర్జ్ గాడి ధనాగారాన్ని కొల్లగొడుతున్నాంరా” నెమ్మదిగా చెప్పాడు బ్లూటో.

“ఏంటి!?...” షాకింగా అరిచారు ఇద్దరు. ఆ వెంటనే,

“ఊరుకోన్నా..., మనం ఇంతవరకు ఆ బక్కోడు ‘పొపాయ్’ గాడి నుంచి ‘ఆలివ్’నే దూరం చేయలేకపోయాం. ఇంక స్కూర్జ్ ధనాగారాన్ని కొల్లగొడుతున్నాం ఆట!! కామెడి కాకపోతే” అన్నాడు మొదటి అనుచరుడు.

ఫటేల్మని కొట్టబోయి తమాయించుకున్నాడు బ్లూటో.

“నువ్వు చెప్పింది నిజమే రా. పొపాయ్ గాడి దగ్గరంటే స్పినాచ్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేకపోయాం. కానీ స్కూర్జ్ ధనాగారాన్ని కొల్లగొట్టటానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది” అన్నాడు.

“ఏంటన్నా అది?”

“ఇది!!” అంటూ వెనుక కాలర్ లోంచి చుట్టి ఉన్న చార్ట్ లాంటిది ఒకటి బయటకి లాగుతూ అన్నాడు బ్లూటో.

“ఏంటన్నా ఇది?”

“ఇది ఆ స్కూర్జ్ ధనాగారపు బిల్డింగ్ యొక్క ప్లాన్. దీని సాయంతో మనం రాత్రి ఆ బిల్డింగ్ లోకి ప్రవేశిస్తాం. అలా ధనం మొత్తాన్ని దోచుకుంటాం” ప్లాన్ విప్పి చూపుతూ చెప్పాడు బ్లూటో.

“అర్దమైంది అన్నా. నువ్వు స్కూర్జ్ ధనాగారాన్ని కొల్లగొట్టి ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడివి అయిపోతావు, అప్పుడు ఆలివే పోపాయ్ ని వదిలేసి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అనేగా నీ ప్లాన్?” అన్నాడు రెండో అనుచరుడు.

“కాదురా. అసలు స్కూర్జ్ గాడి ధనాగారాన్ని కొల్లగొట్టాలి అనే ఆలోచన నాది కాదు. ‘కిల్విష్’ది. వాడే నాకు ఈ కాంట్రాక్ట్ ఇచ్చాడు. ధనం కొల్లగొట్టి వాడికిస్తే, వాడు నాకు ఆలివ్ ని సొంతం చేసుకోవటంలో సాయం చేస్తా అన్నాడు”

“కిల్విష్ అంటే ఇండియాలో ‘శక్తిమాన్’తో కొట్లాడుతూ ఉంటాడు.., వాడే కదూ!?” అనుమానంగా అన్నాడు మొదటి అనుచరుడు.

“అవునురా”

“అయినా అంత ధనాగారాన్ని కొల్లగొట్టాక ఇక నీకు కిల్విష్ తో పనేముంది అన్నా.., నువ్వు తలుచుకుంటే ప్రపంచాన్నే కొనేయగలవు. ఆలివ్ ఓ లెక్కా?!” మాట్లాడాడు రెండో అనుచరుడు.

“లేదురా. కిల్విష్ ని మనం తక్కువ అంచనా వేయకూడదు. వాడు రాక్షసుడు. అయినా నాకు ధనం మీద కాదు ఆశ. ఆలివ్ ని సొంతం చేసుకోవటమే నా ధ్యేయం”

“కిల్విష్ గాడు అంత శక్తిమంతుడు అయితే వాడే స్కూర్జ్ ధనాగారాన్ని కొల్లగొట్టచ్చుగా..., మన సాయం ఎందుకు తీసుకోవటం?” అడిగాడు మొదటి అనుచరుడు.

“ఏమోరా... వాడి లెక్కలు వాడికి ఉంటాయి కదా. మనకి అనవసరం” చెప్పాడు బ్లూటో.

బ్లూటో సమాధానానికి మాట్లాడలేదు ఇద్దరు అనుచరులు.

“సరే పదండి. ప్లాన్ మొత్తం మీకు మరొక్కసారి వివరిస్తా” ముందుకి కదులుతూ అన్నాడు బ్లూటో. అనుచరులిద్దరూ అతడ్ని అనుసరించారు. ముగ్గురు అక్కడ్నుంచి వెళ్ళిపోయారు.

వాళ్ళు అలా వెళ్ళగానే అక్కడే ఉన్న వాటర్ టాంక్ లోంచి బయటికొచ్చారు అంకుల్ స్కూర్జ్ మేనల్లుళ్ళు(పచ్చ, నారింజ, నీలం రంగు కుర్రాళ్ళు). అప్పటిదాకా వాటర్ టాంక్ లో దాక్కుని బ్లూటో మాటలు వింటూ కూర్చున్నారు.

“ఆరేయ్ హుఏయ్.., మనం దొంగాపోలీసు ఆడుతూ ఇక్కడ వాటర్ టాంక్ లో దాక్కోవటం మంచిదైందిరా. ఆ బ్లూటో పన్నాగం తెలుసుకోగలిగాం” అన్నాడు నారింజ రంగు కుర్రాడు.

“అవునురా దేవేయ్. మనం ఎలాగైనా అంకుల్ స్కూర్జ్ ధనాగారాన్ని కాపాడాలి” అన్నాడు నీలం రంగు కుర్రాడు.

“లేకపోతే మన అంకుల్ స్కూర్జ్ కి హార్ట్ ఎటాక్ వస్తుంది” వంతపాడాడు పచ్చ రంగు కుర్రాడు. అతడి పేరు లూయీ.

“ఈ ‘చోటాభీం’ ఎక్కడ ఉన్నాడు?” అంటూ సెల్ ఫోన్ నుంచి చోటాభీంకి కాల్ చేశాడు నారింజ కుర్రాడు.

“హలో చోటాభీం.., ఎక్కడ ఉన్నావ్?” అవతల చోటాభీం ఫోన్ లిఫ్ట్ చేయగానే అడిగాడు.

“మిమ్మల్ని వెతుకుతూ వస్తుంటే ఇక్కడ దారి మధ్యలో లడ్డూల షాప్ కనిపించింది. లడ్డూలు తింటున్నా” చెప్పాడు చోటాభీం.

“సరే నువ్వు అక్కడే ఉండు. మేము వస్తున్నాం” చెప్పి ఫోన్ పెట్టేశాడు నారింజ కుర్రాడు.

ముగ్గురు బయల్దేరారు. బయల్దేరుతూ తమ సెల్ ఫోన్లకి ‘లిటిల్ సోల్జర్స్’ సినిమాలోని థీమ్ సాంగ్ ని రింగ్ టోన్ గా మార్చుకుని అక్కడ్నుంచి కదిలారు.

***

అంకుల్ స్కూర్జ్ ధనాగారం నుంచి సరాసరి అగ్రబః రాజ్యానికి చేరుకున్నాడు హీమ్యాన్. స్నేహితుడు అలాడిన్ ఇంటికి వెళ్ళాడు.

“ఏంటి మిత్రమా..., వెంటనే రమ్మని కబురు చేశావు?” అడిగాడు హీమ్యాన్.

“సుల్తాన్ గారు రాకుమారి జాస్మిన్ కి వేరొకరితో పెళ్ళి నిశ్చయించారు. రాకుమారిని అంతఃపురంలో నిర్బంధించారు” వెలవెలబోతూ చెప్పాడు అలాడిన్.

రాకుమారి జాస్మిన్ కి పెళ్ళి అని వినగానే హీమ్యాన్ వెన్నులో రక్తం ఎగజిమ్మింది. అతడి పిడికిలి బిగిసింది.

“మరి ఏం చేద్దామనుకుంటున్నావ్?” అడిగాడు.

“నాకు తెలియట్లేదు. సమయానికి ‘జీని’ కూడా లేడు సాయానికి” ఏడుస్తూ చెప్పాడు అలాడిన్.

“ఎక్కడికి వెళ్ళాడు?”

“అతడు శక్తిమాన్ తో కలిసి ‘కుండలినీ యోగా’ సాధన చేయటానికి హిమాలయాలకి వెళ్ళాడు”

కాసేపు ఆలోచించాడు హీమ్యాన్.

“అయితే సరే, నేను వెళ్ళి సుల్తాన్ గారితో మాట్లాడతాను” తన ఆలోచన చెప్పాడు.

“కానీ సుల్తాన్ గారు నీ మాటకి విలువ ఇస్తారంటావా..., అసలు వింటారా?”

“గుర్తుంచుకో మిత్రమా.., నేను హీమ్యాన్ కన్నా ముందు రాకుమారుడిని. రాజవంశానికి చెందినవాడ్ని. ఆ హోదాలో మాట్లాడతాను. చూద్దాం ఏం అవుతుందో” బరోసాగా అన్నాడు హీమ్యాన్. తలుపాడు అలాడిన్.

వెంటనే సుల్తాన్ కోటకి బయల్దేరాడు హీమ్యాన్.

***

“పట్టుకో... వదలకు. ఈరోజు ఎలాగైనా నువ్వు దాన్ని పట్టుకోవాల్సిందే. రోజూ వంటశాలలో పదార్దాలన్నీ తినేస్తుంది అది” హీమ్యాన్ రాజప్రసాదంలోకి అడుగుపెట్టేసరికి చిందులేస్తూ కనిపించాడు సుల్తాన్.

“అదాబ్ సుల్తాన్!!... ఎవర్ని మందలిస్తున్నారు?” సుల్తాన్ని చేరుకుని అడిగాడు.

అనుకోకుండా వచ్చిన హీమ్యాన్ ని చూసి ఆశ్చర్యపోయాడు సుల్తాన్. అంతలోనే తేరుకున్నాడు.

“హా... స్వాగతం హీమ్యాన్!! అగ్రబః రాజ్యం మీకు స్వాగతం పలుకుతుంది” స్వాగత వచనాలు పలికాడు.

“ధన్యవాదాలు సుల్తాన్. ఇంతకీ ఎవర్ని అరుస్తున్నారు?”

“ఏం చెప్పమంటావు హీమ్యాన్.., కొన్ని రోజుల క్రితం మా కోటలోకి ‘జెర్రి’ ప్రవేశించినది. ఆ ఎలుక ఆగడాలు అన్నీఇన్నీ కావనుకో. వంటశాలలో సమస్త పదార్దాలని ఆరగించేస్తుంది. అందుకే ‘టామ్’ని రప్పించి దాన్ని పట్టుకోమని పురమాయించాను”

“ఆ ‘టామ్ అండ్ జెర్రి’ మిత్రుల గురించా మీరు మాట్లాడేది!? వాళ్ళు బయటకి కొట్టుకుంటున్నట్టు కనిపిస్తారే గాని, నిజానికి వాళ్ళంత గొప్ప మిత్రులు ఈ సమస్త భూమండలంలోనే ఎక్కడా ఉండరు. జెర్రి స్వయంగా తన ఉపాధి చూసుకుంటుంది. తన ద్వారా టామ్ కి ఉపాధి కల్పిస్తుంది”

హీమ్యాన్ మాటలకి గందరగోళానికి గురయ్యాడు సుల్తాన్.

“సరే అది వదిలేయండి. ఇంతకీ మీ ఆగమనానికి కారణం?” విషయం మార్చుతూ అడిగాడు.

“రాకుమారి జాస్మిన్ కి వివాహం నిశ్చయించారని విన్నాము?” అసలు విషయంలోకి వచ్చాడు హీమ్యాన్.

“అవును హీమ్యాన్. రాకుమారి జాస్మిన్ ఆ అలాడిన్ తో ప్రేమలో పడ్డారు. మాకు ఆ అలాడిన్ అంటే సుతరాము ఇష్టం లేదు. అందుకే వారికి వివాహం జరుప నిశ్చయించాము”

“మీకు అలాడిన్ నచ్చకపోతే జాస్మిన్ ని మాకిచ్చి వివాహం చేయండి” వెంటనే అన్నాడు హీమ్యాన్.

అనుకోని ప్రతిపాదనకి నిర్ఘాంతపోయి చూశాడు సుల్తాన్.

“ఏమిటి హీమ్యాన్.., మీరు అనేది?” పీలగా పలికాడు.

“అవును మహారాజ... మాకు రాకుమారి జాస్మిన్ మీద ఆపేక్ష ఉంది. మీకు సమ్మతమైతే మాకు వివాహం జరిపించండి”

“కానీ మీతో...” నసిగాడు సుల్తాన్.

“సందేహము వలదు మహారాజ. నేను హీమ్యాన్ అవటం కన్నా ముందు రాకుమారుడిని. ప్రిన్స్ ‘ఆడమ్’ నా పేరు. మహారాజు ‘రాండోర్’, మహారాణి ‘మర్లెన’ మా తల్లిదండ్రులు. మీలాగే రాజవంశం మాది. మీకు తెలియనిది కాదుగా?”

“మాకు ఆలోచించుకోవటానికి కొంచెం వ్యవధి కావాలి”

“తప్పకుండా సుల్తాన్. కానీ మేము ఒకసారి రాకుమారి జాస్మిన్ ని చూడవచ్చా?”

“రాకుమారి జాస్మిన్ అంతఃపురంలో ఉంది. వెళ్ళి చూడండి”

“ధన్యవాదాలు” జాస్మిన్ అంతఃపురానికి పయనమవుతూ చెప్పాడు హీమ్యాన్.

***

గతించిన తండ్రి లోథోర్ ఫోటో ముందు నించుని ఉన్నాడు కొడుకు కోథోర్. ఆ ఫోటో పక్కనే ‘పవర్ రేంజర్స్ నింజ స్టోర్మ్’ వాళ్ళ ఫోటో కూడా ఉంది. మరణించిన తండ్రి ఫోటో చూస్తున్నప్పుడు ఎంత బాధ కలుగుతుందో, ఆ మరణానికి కారణమైన నింజా రేంజర్స్ ని చూస్తున్నప్పుడు అంతే ఆవేశం కలుగుతుంది కోథోర్ కి.

“ఫోటో చూస్తూ పళ్ళు పటపటలాడించినంత మాత్రాన నీ తండ్రి ఆత్మకి శాంతి కలగదు కోథోర్...” వెనుక నించి మాటలు వినిపించటంతో వెనక్కి తిరిగి చూశాడు కోథోర్. ఎదురుగా ఎంపరర్ గ్రూమ్ నించుని ఉన్నాడు.

“నీ తండ్రి ఆశయం నెరవేరినప్పుడే అతడి ఆత్మకి శాంతి” ముందుకొస్తూ అన్నాడు.

“ఎందుకు వచ్చావు?” అడిగాడు కోథోర్.

“నీ బాధని తగ్గించటానికి. నీ ఆవేశానికి ఉపశమనం కలిగించటానికి”

“అంటే?”

“నీ తండ్రి లక్ష్యం లోకాన్ని హస్తగతం చేసుకోవటం. ఆ క్రమంలోనే నింజా రేంజర్స్ చేతిలో చంపబడ్డాడు. నీ తండ్రి లక్ష్యాన్ని చేరుకోవటం కొడుకుగా నీ బాధ్యత”

“నాకు ఏ లక్ష్యమూ లేదు. నా లక్ష్యమల్లా ఒక్కటే. నా తండ్రి మరణానికి గానూ ఆ నింజా రేంజర్స్ మీద ప్రతీకారం తీర్చుకోవటం. వారిని హతమార్చటం”

“వెరీ గుడ్!! నీ లక్ష్యానికి నేను సాయం చేస్తాను. అందుకు ప్రతిఫలంగా నువ్వు నా లక్ష్యానికి సాయం చేయాలి”

“ఏం చేయాలి?”

“నీకు గుర్తుందో లేదో.., ఒకానొక సందర్భంలో మీ నాన్న ఆ నింజా రేంజర్స్ మీద పైచేయి సాధించాడు. ‘మాగ్నటిక్ గ్రాబర్’ అనే పరికరంతో నింజా రేంజర్స్ పవర్స్ మొత్తం లాగేసుకున్నాడు. అప్పుడే ‘గ్రీన్ నింజా రేంజర్’ టైమ్ ట్రావెల్ ద్వారా కాలంలో వెనక్కి వెళ్ళి అదనపు శక్తిని సంపాధించి వచ్చాడు. మీ నాన్న ఓడిపోయాడు. లేకపోతే అప్పుడే మీ నాన్న గెలిచి ఉండే వాడు”

“అయితే?”

“నాకు ఆ మాగ్నటిక్ గ్రాబర్ పరికరం కావాలి. దాని సాయంతో నేను అంకుల్ స్కూర్జ్ ధనాగారంలోని బంగారం మొత్తాన్ని ఒక్కపెట్టున నా స్పేస్ షిప్ లోకి లాగేస్తా. ఆ బంగారంతో మా మాస్టర్ వొమ్నికి ఆకారాన్ని సమకూరుస్తా. ఒక్కసారి మా మాస్టర్ ఆకారాన్ని సంతరించుకుంటే ఈ విశ్వంలోనే అత్యంత శక్తిమంతుడు అవుతాడు. అప్పుడు ‘విండ్ నింజ అకాడెమీ’లో టీచర్స్ గా ఉన్న ఆ పవర్ రేంజర్స్ ని బంధించి తెచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను. నువ్వు వాళ్ళని ఏం చేసుకుంటావో నీ ఇష్టం” చెప్పాడు గ్రూమ్.

గ్రూమ్ చెప్పింది విని ఆలోచనల్లో పడ్డాడు కొథోర్. తల తిప్పి పక్కనే ఉన్న టేబుల్ వంక చూశాడు. ఫుట్బాల్ పరిమాణంలో ఆ టేబుల్ మీద ఒక పరికరం ఉంది. గ్రూమ్ అడుగుతున్న మాగ్నటిక్ గ్రాబర్ అదే. గ్రూమ్ కేసి తలతిప్పి అంగీకరిస్తున్నట్టు తల ఊపాడు కొథోర్.

***

హీమ్యాన్ అంతఃపురం చేరుకునేటప్పటికి లోపల రాకుమారి జాస్మిన్, పొపాయ్ ప్రియురాలు ఆలివ్ మాట్లాడుకుంటూ కనిపించారు. లోపలికి వెళ్ళకుండా బయటే నిలబడి వాళ్ళ మాటలు వినసాగాడు హీమ్యాన్.

“నువ్వు ఇలాగే కూర్చుంటే సుల్తాన్ గారు నీకు పెళ్ళి చేసేస్తారు. నువ్వు ఏదోకటి నిర్ణయం తీసుకోవాలి” అంది ఆలివ్.

“నాకు తెలియట్లేదు. అలాడిన్ భయస్తుడు. ఇక్కడికి రాడు. నేను ఇక్కడినుంచి కదల్లేను. ఇక మరణమే నాకు శరణం అనుకుంటా” నిరాశగా అంది జాస్మిన్.

“మనిద్దరి పరిస్థితి ఒక్కటే. బయటి శక్తుల కారణంగా ప్రేమని గెలిపించుకోలేని నువ్వు. లోపలి భయం కారణంగా పొపాయ్ ని దరిచేరనివ్వని నేను”

“నువ్వు అనవసరంగా భయపడుతున్నావ్. బ్లూటో మంచివాడు కాదు. అది నీక్కూడా తెలుసు. పొపాయ్ చాలా మంచివాడు. అతడ్ని దూరం చేసుకోకు”

“బ్లూటో అంటే నాకు ఇష్టం లేదు. పొపాయ్ అంటేనే ఇష్టం. పైగా పొపాయ్ కి నేనంటే ప్రాణం అని కూడా తెలుసు. కానీ పొపాయ్ కి బాధ్యత తెలీదు. ఎప్పుడు చూసినా నోట్లో పైప్ పెట్టుకుని వుయ్ వుయ్ అంటూ పొగ వదులుతూ అల్లరిచిల్లరగా తిరుగుతూ ఉంటాడు. తాగుతాడు. స్పినాచ్ తిన్నప్పుడే అతడి ప్రతాపం. అటువంటి వాడ్ని పెళ్ళి చేసుకుని రేపెలా కాపురం చేయాలి?”

ఆలివ్ అన్నదానికి మాట్లాడలేదు జాస్మిన్. సరిగ్గా అప్పుడే,

“రాకుమారి జాస్మిన్, త్వరగా పదండి. మనం ఇక్కడినుంచి వెళ్ళిపోవాలి” అంటూ లోపలికి వచ్చాడు హీమ్యాన్.

“హీమ్యాన్..., నువ్వెంటి ఇక్కడ?” ఆశ్చర్యపోతూ అంది జాస్మిన్.

“నన్ను అలాడిన్ పంపించాడు. త్వరగా పదండి”

“కానీ నాన్నగారు?...”

“నేను సుల్తాన్ గారితో మాట్లాడాను. లాభం లేదు. ఇంకా మీరిక్కడే ఉంటే మహారాజు మిమ్మల్ని వేరొకరికి ఇచ్చి వివాహం చేసేస్తారు. త్వరగా రండి” తొందరపెట్టాడు హీమ్యాన్.

“వెళ్ళు జాస్మిన్. ఇంతసేపు అలాడిన్ ఏం చేయట్లేదని బాధపడ్డావు. ఇప్పుడు ధైర్యం చేసి స్నేహితుడిని పంపించాడు. వెళ్ళు” ప్రోత్సహించింది ఆలివ్.

ఒప్పుకోలుగా తలాడించింది జాస్మిన్. వెంటనే ఆమెని తన బ్యాటిల్ క్యాట్ ఐన ‘క్రిన్గేర్’ మీద ఎక్కించుకుని అగ్రబః కోట నుంచి బయటపడ్డాడు హీమ్యాన్. తీసుకెళ్ళి తన రాజ్య దుర్గం అయిన ‘గ్రేస్కల్’ ముందు దించాడు.

“అలాడిన్ ఎక్కడ హీమ్యాన్?” దిగగానే అడిగింది జాస్మిన్.

“అలాడిన్ రాడు” నెమ్మదిగా అన్నాడు హీమ్యాన్.

“అదేంటి?” అర్థంకాలేదు ఆమెకి.

“అవును. నువ్వు అలాడిన్ ని మర్చిపోవాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సుల్తాన్ గారికి కూడా ఈ విషయం చెప్పాను. వారు అంగీకారం తెలిపారు. అందుకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను” చెప్పాడు హీమ్యాన్.

“ఏం మాట్లాడుతున్నావు హీమ్యాన్!... నేను, అలాడిన్ ప్రేమించుకుంటుంది నీకు తెలీదా? నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నమ్మలేకుండా ఉన్నాను”

“నమ్ము జాస్మిన్. నువ్వూ, అలాడిన్ ప్రేమించుకుంటున్నారని నాకు తెలుసు. కానీ నీకు తెలీని విషయం ఏంటంటే, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో. కానీ నువ్వు అలాడిన్ ని ప్రేమిస్తున్నావని ఇన్నాళ్ళూ నీ ముందుకు రాలేదు. ఇందాక నువ్వు పెళ్ళి చేసుకోబోతున్నావు అని అలాడిన్ చెప్పినప్పుడు నా రక్తం మరిగిపోయింది. వెంటనే సుల్తాన్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. నీతో కూడా చెబుదామని నీ దగ్గరికొస్తే, అప్పుడే నువ్వు ఆలివ్ తో మాట్లాడటం విన్నాను. అలాడిన్ లేకపోతే మరణమే శరణం అన్న నీ మాటలు విన్నాను. నాతో పెళ్ళి జరిగేలోపు ఎక్కడ నువ్వు అఘాయిత్యానికి పాల్పడతావోనని అబద్దం చెప్పి నిన్ను ఇక్కడకి తీసుకొచ్చాను”

హీమ్యాన్ చెప్పింది విని నిర్ఘాంతపోయింది జాస్మిన్.

“నువ్వు తప్పు చేస్తున్నావ్ హీమ్యాన్. నువ్వు మంచివాడివి అనుకున్నాను” అంది.

“ప్రేమలో తప్పొప్పులకి స్థానం లేదు జాస్మిన్” అన్నాడు.

“కానీ..” జాస్మిన్ మాట్లాడేంతలోనే వాతావరణం వింత మార్పులకి లోనైంది. ఆకాశం ఎర్రగా మారింది. ఆమె ఆగిపోయింది.

తల పట్టుకున్నాడు హీమ్యాన్. అప్రయత్నంగా చెవుల్ని మూసుకున్నాడు. అతడి కేదో సందేశం అందుతుంది. అది శక్తిమాన్ నుంచి వస్తుంది. అర్థంచేసుకున్నాడు హీమ్యాన్. సందేశం అర్థమయ్యాక భయంతో అతడి కళ్ళు విప్పారాయి.

“రాకుమారి జాస్మిన్.., ప్రపంచానికేదో పెను ముప్పు వచ్చింది. వెంటనే రమ్మని శక్తిమాన్ కబురు చేస్తున్నాడు. నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు. నా గురించి ఆలోచించు” అంటూ తన బ్యాటిల్ క్యాట్ ఎక్కి అంకుల్ స్కూర్జ్ ధనాగారానికేసి దూసుకుపోయాడు హీమ్యాన్. చూస్తూ నిలబడిపోయింది జాస్మిన్.

అక్కడ అగ్రబః రాజ్యంలో సుల్తాన్ గారితో మాట్లాడివస్తానన్న స్నేహితుడు రాకపోయేసరికి దిక్కుతోచకుండా ఉన్నాడు అలాడిన్.

***

అనుకున్న ప్లాన్ ప్రకారం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా స్కూర్జ్ ధనాగారం లోపలికి వెళ్ళాడు బ్లూటో, అతడి ఇద్దరు అనుచరులు. స్పైడర్ మ్యాన్ గాని SPD D-squad గాని పసిగట్టలేకపోయారు. ధనాగారం లోపలినుంచి గోడకి బోరుబావి పరిమాణంలో చిన్న రంద్రం చేశాడు. ఆ వెంటనే వాకీటాకీ తీసి కిల్విష్ ని కాంటాక్ట్ చేసాడు. అతడు వెంటనే గ్రూమ్ కి ఆ కనెక్షన్ ని ట్రాన్స్ఫర్ చేశాడు.

“కిల్విష్ అంతా చెప్పే ఉంటాడు. అంతా సిద్దమేగా?” అడిగాడు గ్రూమ్.

“సిద్దమే ఎంపరర్. రంద్రం కూడా చేసేసా. మీరు కేబుల్ పంపిస్తే కనెక్ట్ చేస్తా. వెంటనే మీరు బంగారాన్ని మొత్తాన్ని లాగేయొచ్చు”

“సరే. ఐదు నిమిషాల్లో కేబుల్ వస్తుంది. దాన్ని రంధ్రానికి అటాచ్ చేయగానే రెండు నిమిషాల్లో బంగారాన్ని మొత్తాన్ని స్పేస్ షిప్ లోకి లాగేస్తుంది. ఆ రెండు నిమిషాలే మనకు చాలా కీలకం. వాళ్ళకి పరిస్థితి అర్దమయ్యేలోపే మనం పని కానిచ్చేయాలి. ఒక్కసారి బంగారం మన చేతికి వచ్చిందంటే ఈ లోకం మన హస్తగతం అయినట్టే”

“జీ హుజూర్!!”

వాకీటాకీ కట్ చేశాడు బ్లూటో. అక్కడ స్పేస్ షిప్ లో కేబుల్ స్టార్టింగ్ పాయింట్ లో మాగ్నటిక్ గ్రాబర్ పరికరం అమర్చే పనిలో నిమగ్నమయ్యాడు గ్రూమ్.

***

ఆకాశం ఎర్రగా మారి పై నుంచి వస్తున్న సన్నని తీగ లాంటిది చూసి అలెర్ట్ అయ్యారు SPD సిబ్బంది. స్పైడర్ మ్యాన్ కూడా అలర్ట్ అయ్యాడు. సాధ్యమైనంత పైకి ఎగిరి చూడటానికి ప్రయత్నించాడు. వాటర్ పైప్ పరిమాణంలో ఉండి ఎదో స్పేస్ షిప్ కి కనెక్ట్ అయి ఉంది అది. చూస్తేనే అర్థమైపోతుంది అది ఎంపరర్ గ్రూమ్ స్పేస్ షిప్ అని. SPD సిబ్బంది కమాండ్ బేస్ కి ఇన్ఫోర్మ్ చేసి కాల్పులు మొదలు పెట్టారు. అయితే అప్పటికే గ్రూమ్ పంపిన సైనికులు వీరి మీద దాడి చేయటంతో, ఒకపక్క వారితో యుద్ధం చేస్తూ మరోపక్క ఆ కేబుల్ ను అడ్డుకోవటానికి వారి అనుభవం సరిపోవట్లేదు. స్పైడర్ మ్యాన్ ప్రయత్నిస్తున్నా అతడి ఒక్కడి వల్ల కావటం లేదు. ఆ కేబుల్ సరాసరి డ్రైనేజ్ అడుగుకి పోయి బ్లూటో ఏర్పాటు చేసిన రంధ్రాన్ని చేరుకుంది. బ్లూటో ఆ కేబుల్ ని రంధ్రానికి సెట్ చేశాడు. అప్పుడు జరిగింది అతడూహించని సంఘటన.

“హాండ్స్ అప్!!” అంటూ ముందుకొచ్చారు అంకుల్ స్కూర్జ్ పిల్లలు. అప్పటిదాకా వాళ్ళు డబ్బు మూటల వెనుక దాక్కుని ఉన్నారు. వారిలో చోటాభీం కూడా ఉన్నాడు.

అనుహ్యంగా ప్రత్యక్షమైన పిల్లల్ని చూసి అదిరిపడ్డాడు బ్లూటో. అతడు ఆలోచించే లోపే పిల్లలు వారి చేతిలోని వాటర్ గన్స్ షూట్ చేయటంతో కళ్ళలో నీళ్ళు పడి చూపు కోల్పోయాడు. ఇదే అదునుగా పిల్లలు అతడి మీదకి దుమికి, అతడ్ని నేలకి అదిమి పిడి గుద్దులు గుద్దటం ప్రారంభించారు. మరోపక్క చోటాభీం బ్లూటో అనుచరుల పని పట్టటంలో నిమగ్నమయ్యాడు. కానీ అప్పటికే బ్లూటో సెట్ చేసిన కేబుల్ తన పని ప్రారంభించటంతో బంగారం స్పేస్ షిప్ లోకి వెళ్ళటం మొదలైంది. వీళ్ళని అడ్డుకోవటమే కష్టంగా ఉంటే వెళ్ళిపోతున్న బంగారాన్ని ఎలా ఆపాలో అర్థంకాలేదు పిల్లలకి. అప్పటికే నిమిషం గడిచిపోయి సగం బంగారం దాకా వెళ్ళిపోయింది. చివరికి ఎలాగో లేచాడు లూయి(ఆకుపచ్చ పిల్లాడు). రంధ్రాన్ని చేరుకొని దాన్ని ఆపే ప్రయత్నం చేసాడు. అప్పుడు జరిగింది ఎవరూ ఊహించని సంఘటన. ఆకర్షణకు లోనై బంగారంతో పాటు లూయి కూడా కేబుల్ గుండా గ్రూమ్ స్పేస్ షిప్ లోకి వెళ్ళిపోయాడు. జరిగింది చూసి మిగతా పిల్లలతో పాటు బ్లూటో కూడా నిర్ఘాంతపోయాడు. కానీ అనూహ్యంగా ఆ తరువాత బంగారం వెళ్ళటం ఆగిపోయింది. కేబుల్ పని చేయటం మానేసింది.

***

SPD సిబ్బంది వల్ల కాకపోవటంతో తనే ఏదోటి చేయాలని నిర్ణయించుకున్నాడు స్పైడర్ మ్యాన్. ఆలోచిస్తే అతడికి తోచిన ఒకేఒక్క పరిష్కారం, కేబుల్ లింక్ కట్ చేయటం. ఆలోచన రాగానే అతి కష్టం మీద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేరుకొని కేబుల్ కట్ చేసాడు. దాంతో బంగారం వెళ్ళటం ఆగిపోయింది. అయితే అతడూహించని విషయం, అప్పటికే లూయి పైప్ గుండా స్పేస్ షిప్ లోకి వెళ్ళిపోయాడు అని.

బంగారం రావటం ఆగిపోవటంతో అసహనానికి లోనయ్యాడు గ్రూమ్. స్పైడర్ మ్యాన్ మీద అతడి కోపం నషాళాన్ని అంటింది. వెళ్ళి సగం వచ్చిన బంగారం ముందు నించున్నాడు. టింగ్… అంటూ అందులొంచి బయటికొచ్చాడు లూయి. అద్దిరిపడ్డాడు గ్రూమ్. ఆ వెంటనే నవ్వాడు.

***

ధనాగారం నుంచి బయటికొచ్చి లూయి వెళ్ళిపోయిన విషయం చెప్పాడు చోటాభీం. విని తలపట్టుకున్నాడు స్పైడర్ మ్యాన్. అప్పుడే అక్కడికి వచ్చాడు హీమ్యాన్. జరిగింది తెలుసుకుని నిర్ఘాంతపోయాడు.

“ఇక్కడ తప్పు జరుగుతుంది వెంటనే వెళ్ళమని శక్తిమాన్ నాకు సందేశం పంపాడు. అందుకే వచ్చా. శక్తిమాన్ ఏడి?” అడిగాడు.

“శక్తిమాన్ ఇక్కడ లేడు” స్పైడర్ మ్యాన్ సమాధానం చెప్పేంతలోనే అక్కడికి వచ్చారు SPD B-Squad రేంజర్స్. అంకుల్ స్కూర్జ్ కూడా వచ్చాడు. వస్తూనే SPD సిబ్బంది మీద చిందులు తొక్కాడు.

“నా లూయిని ఎలాగైనా తీసుకురండి” ఆ వెంటనే ప్రాధేయపడ్డాడు.

సరిగ్గా అప్పుడే స్పేస్ షిప్ నుంచి వాయిస్ వినిపించింది.

“మీకు లూయి కావాలంటే వెంటనే మిగతా బంగారాన్ని మీరు నాకు ఇవ్వాలి. లేకపోతే లూయి మీకు దక్కడు” అన్నాడు గ్రూమ్.

“నాకు బంగారం అక్కర్లేదు. నా లూయి కావాలి. బంగారాన్ని ఇచ్చి నా లూయిని తీసుకురండి” అన్నాడు స్కూర్జ్.

ఎవరూ మాట్లాడలేదు.

“లూయిని కాపాడటం నా సెక్యూరిటీ ఏజెన్సీగా మీ బాధ్యత. వాడికి ఏమన్నా జరిగితే ‘Breach Of Contract’ కింద SPD మీద కోర్ట్ లో కేస్ వేస్తా!...” గట్టిగా అరిచాడు స్కూర్జ్.

ముఖముఖాలు చూసుకున్నారు స్పైడర్ మ్యాన్, హీమ్యాన్.

రెండు నిమిషాల తర్జనభర్జన తరువాత చివరికి గ్రూమ్ కి బంగారాన్ని ఇవ్వాలనే నిర్ణయానికొచ్చారు SPD. గ్రూమ్ కి బంగారం ఇవ్వటం, ప్రతిగా లూయిని తీసుకోవటం ఏకకాలంలో జరిగిపోయాయి. బంగారం రావటంతో స్పేస్ షిప్ సహా వెళ్ళిపోయాడు గ్రూమ్. ఆకాశం మామూలు రంగులోకి వచ్చింది. అర్థంకాలేదు రేంజర్స్ కి. అప్పుడే హిమాలయాల నుంచి అక్కడికి చేరుకున్నాడు శక్తిమాన్. అతడితో పాటు జిని కూడా వచ్చాడు.

“ఇంత బంగారం తీసుకెళ్ళి ఏం చేసుకుంటాడు ఆ గ్రూమ్?” తనలో తాను అనుకుంటున్నట్టు అన్నాడు జాక్(రెడ్ పవర్ రేంజర్).

“దాని సాయంతో వాడి మాస్టర్ వోమ్నికి రూపం తెస్తాడు. హిమాలయాల్లో కళ్ళు మూసుకుని యోగ సాధన చేస్తున్నప్పుడు నాకు భవిష్యత్తు కనిపించింది” చెప్పాడు శక్తిమాన్.

వీళ్ళు మాట్లాకుంటునప్పుడే ఆకాశం మళ్ళీ ఎర్రగా మారింది. తలెత్తి చుస్తే భయంకరమైన రూపం ధరించి వచ్చి వాలాడు వోమ్ని. బంగారు వర్ణంలో మెరిసిపోతూ అత్యంత భయంకరంగా ఉన్నాడు.

“అతడ్ని ఎదుర్కోవటం అంత తేలిక కాదు. బంగారు కవచంతో ఉన్న అతడ్ని ఓడించటం కష్టం” కమాండ్ బేస్ నుంచి అన్నాడు SPD గురువు డాగి.

“అదీ చూద్దాం..., ఈరోజు వాడో మేమో తేలిపోవాలి. తీసుకున్న కాంబాట్ ట్రయినింగ్ అప్పుడే ఆచరణలోకి పెట్టాల్సివస్తుందని ఊహించలేదు” అన్నాడు జాక్. స్పైడర్ మ్యాన్ కేసి చూసి సైగ చేసాడు. తలాడించి వోమ్ని కళ్ళలోకి ‘స్పైడర్ గమ్ (సాలీడు జిగురు)’ స్పిల్ చేసాడు స్పైడర్ మ్యాన్. వోమ్ని కళ్ళు మూసుకుపోయాయి.

వెంటనే చేతికున్న ‘మోఫర్స్’ యాక్టివేట్ చేశారు రేంజర్స్. అప్పటిదాకా మాములు దుస్తుల్లో ఉన్న వాళ్ళు మరుక్షణం పవర్స్ వచ్చి రేంజర్ దుస్తుల్లోకి మారిపోయారు.

“By the power of Grayskull... I have the power!” కత్తి ఎత్తి గట్టిగా అరుస్తూ అన్నాడు హీమ్యాన్. అతడూ పూర్తిస్థాయి హీమ్యాన్ గా మారాడు.

“రేంజర్స్.., లెట్స్ పోజిషన్ ఇన్ టూ ‘ఈగల్’ ఫార్మాట్” అన్నాడు రెడ్ రేంజర్.

గ్రద్ద ఆకారంలోకి మారారు. వాళ్ళు ఆలా నించోగానే వాళ్ళ చేతుల్లోకి పాము ఆకారంలో వెపన్ ఒకటి వచ్చింది. వచ్చిన వెపన్ కి తమ శక్తిని ట్రాన్స్ఫర్ చేశారు పక్కనే ఉన్న హీమ్యాన్, శక్తిమాన్. ఇదంతా కేవలం క్షణాల్లో చేశారు. కళ్ళు తుడుచుకుని తెరిచాడు వోమ్ని. కానీ అప్పటికే ఆలస్యమైంది. చూస్తే ఎదురుగా రేంజర్స్ పోజిషనై ఉన్నారు.

“ఎంగేజ్....” ట్రిగ్గర్ నొక్కుతూ అరిచాడు రెడ్ రేంజర్.

ట్రిగ్గర్ నొక్కటం ఆలస్యం, వెపన్ లొంచి దూసుకొచ్చింది మండుతున్న అగ్నిగోళం. వస్తూనే వెళ్ళి వోమ్నిని ఢీకొంది. ముక్కలైపోయాడు వోమ్ని. సంబరాలు మొదలుపెట్టారు రేంజర్స్. కానీ శక్తిమాన్ కి అనుమానమే. వోమ్ని నిజంగా చనిపోయి ఉంటే ఆకాశం మామూలు రంగులోకి వచ్చి ఉండాలి. కానీ రాలేదు. అంటే?..,

“హ హ హ” అతడి అనుమానం నిజం చేస్తూ వినిపించింది వాయిస్. అది వోమ్ని వాయిస్.

కొయ్యబారిపోయారు రేంజర్స్.

“నేను చనిపోలేదు. చివరిసారి మీ ముఖంలో సంతోషం చూద్దామని ఇలా చేసాను” బద్దలైన ముక్కలు తిరిగి అతుకుంటుండగా అన్నాడు వోమ్ని.

“ఇప్పుడు మీకు నా అసలు శక్తీ ఏంటో చూపిస్తా” అంటూ పక్కనే ఉన్న బ్లూటోని మింగేశాడు వోమ్ని. వెంటనే అతడు రెండింతలు అయ్యాడు.

“నాకు చావు లేదు. నేను మృత్యంజయుడ్ని” చేతులు చాపి గ్రూమ్ ని, కోథోర్ ని కలిపేసుకుంటూ అన్నాడు. నాలుగింతలయ్యాడు.

“ఇప్పుడు నేను మాస్టర్ వోమ్నిని కాదు, ‘మాన్స్టర్ వోమ్నిని’” వికటట్ఠాసం చేస్తూ అన్నాడు. కిల్విష్ కూడా అతడిలో ఐక్యం అయిపోయాడు. పదింతలయ్యాడు.

“మాన్స్టర్ వోమ్ని ఈజ్ ఆర్డరింగ్ ది బ్లాక్ వరల్డ్ టూ సరెండర్” మరింత గట్టిగా అరిచాడు.

ఆకాశం ఎరుపు రంగు నుంచి భయంకరమైన నలుపులోకి మారింది. ఎక్కడెక్కడో ఉన్న కామిక్ విలన్స్ అందరూ వచ్చి అతడి నోటిగుండా అతడిలోకి కలిసిపోసాగారు. హీమ్యాన్ శత్రువు, బ్యాట్ మ్యాన్ శత్రువు జాతిబేధం లేనట్టు అందరూ కలిసిపోసాగారు. చూస్తుండగానే యాభై అంతస్తుల ఎత్తుకు ఎదిగిపోయాడు వోమ్ని.

ఇక అతడ్ని ఎదుర్కోవటం అసాధ్యం.

“ఏం చేద్దాం?” అన్నాడు రెడ్ రేంజర్. ఎవరూ మాట్లాడలేదు.

“డాగీ..., రెస్పాండ్”

డాగీ కూడా మాట్లాడలేదు.

“నౌ ఐ యామ్ ది ఎంపరర్ అఫ్ ది ఎర్త్” ప్రకటించుకున్నాడు వోమ్ని.

వెంటనే చేతులు జోడించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసాడు శక్తిమాన్. శక్తిమాన్ వోమ్ని ముందు చేతులు జోడించటంతో నివ్వెరపోయారు మిగతావాళ్ళు. అప్పుడు ప్రత్యక్షమయ్యాడు ‘లిటిల్ కృష్ణ’

ఊహించని ఎంట్రీ ఇచ్చిన లిటిల్ కృష్ణని చూసి చప్పట్లు కొట్టారు అంకుల్ స్కూర్జ్ పిల్లలు.

“అది…. ఇప్పుడు లిటిల్ కృష్ణ మన తరుపున యుద్ధం చేసి వోమ్నిని ఓడిస్తాడు” అన్నాడు లూయి.

“లేదు. నేను యుద్ధం చేయను. మహాభరతంలో కూడా యుద్ధం చేయలేదు” వెంటనే అన్నాడు లిటిల్ కృష్ణ.

“కరెక్ట్!!... లిటిల్ కృష్ణ యుద్ధం చేయడు. కానీ బోధ చేస్తాడు. అందుకే ఇప్పుడు మనకి భగవద్గీత 2pointO బోధించటానికి వచ్చాడు. అది విని మనం యుద్ధంలో ఈజీగా గెలుస్తాం” అన్నాడు చోటాభీం.

“ఇప్పుడు అంత సమయం లేదు మిత్రమా. ఇక్కడ అంత స్పేస్ కూడా లేదు. కాకపోతే గెలవటానికి మాత్రం ఒక ఉపాయం చెప్పగలను” అన్నాడు.

“ఏంటది?” అడిగాడు శక్తిమాన్.

“వోమ్ని ప్రపంచంలో ఉన్న అన్ని దుష్టశక్తులని తనలో ఐక్యం చేసుకుంటున్నాడు. అతడ్ని ఎదుర్కోవాలంటే మీరు కూడా కలవాలి. కానీ మీ భౌతిక శక్తులు కాదు, ఆత్మశక్తులు కలవాలి. మీ అందరిలో ఒక్కొక్కరికి ఒక్కో విలక్షణత ఉంది. ఉదాహరణకి ‘అలాడిన్’ ప్రేమ శక్తికి ప్రతీక. ‘జీని’ స్వామి భక్తికి ప్రతీక. ‘టామ్ అండ్’ జెర్రి స్నేహా బలానికి సూచిక. ‘శక్తిమాన్’ యోగశక్తికి ప్రతీక. మీ అందరి విలక్షణ ఆత్మలు కలిసి అఖండ శక్తిగా మారాలి. మీరు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న మిగతా అందరు హీరోస్ కూడా కలవాలి. అప్పుడే వోమ్నిని మీరు ఓడించగలరు. అది శక్తిమాన్ మాత్రమే చేయగలడు”

అర్థమైంది శక్తిమాన్ కి. వెంటనే కళ్ళు మూసుకుని యోగశక్తి ద్వారా అందర్ని అక్కడికి రప్పించాడు. ‘బ్యాట్ మ్యాన్’ మొదలుకుని ‘కెప్టెన్ అమెరికా’ దాకా, ‘రిచీరిచ్’ నుంచి ‘అలాడిన్’ దాకా, ‘టామ్ అండ్ జెర్రి’తో సహా అందరు హీరోస్ అక్కడికి చేరుకున్నారు. అన్ని రకాల పవర్ రేంజర్స్ కూడా వచ్చారు.

“ఆత్మశక్తికి మించింది ఏది లేదు. అందరి ఆత్మశక్తుల్ని నీలో కలుపుకో. అప్పుడు నువ్వు వోమ్నిని ఓడించగలవు” అన్నాడు లిటిల్ కృష్ణ.

అలానే చేసాడు శక్తిమాన్. అరచేయి చాచాడు. అందరు వచ్చి అతడి చేతిలో చేయి కలిపి తమతమ ఆత్మశక్తుల్ని దారాదత్తం చేశారు. ఐతే హిమ్యాన్, పొపాయ్ ల శక్తి శక్తిమాన్ లో కలవలేదు. అర్థంకాలేదు వాళ్ళకి.

“ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు. అది స్వార్థం లేనిదై ఉండాలి. బాధ్యత కలిగినదై ఉండాలి. అప్పుడే మనలోని ఆత్మశక్తికి అఖండ శక్తితో కలిసే అర్హత వస్తుంది” అన్నాడు లిటిల్ కృష్ణ.

లిటిల్ కృష్ణ అన్నది అక్కడ ఎవరికి అర్థంకాలేదు. హీమ్యాన్, పొపాయ్ లు మాత్రం చిన్నబోయారు. హీమ్యాన్ అప్పటికప్పుడే నిర్ణయించుకున్నాడు, జాస్మిన్ ని, అలాడిన్ ని మనస్ఫూర్తిగా ఒక్కటి చేయాలని. పొపాయ్ కూడా మారాలని నిర్ణయించుకున్నాడు. వాళ్ళు పశ్చాతాపం చెందినట్టు గ్రహించాడు లిటిల్ కృష్ణ.

“మరొక్కసారి ప్రయత్నించండి” అన్నాడు.

ప్రయత్నించారు ఇద్దరు. ఈసారి సఫలమయ్యారు.

అందరి శక్తులు అందుకుని అత్యంత శక్తిమంతుడయ్యాడు శక్తిమాన్. వోమ్ని కంటే వందరెట్లు వేగంగా పదింతలు పెరిగాడు. నిర్ఘాంతపోయి చూస్తుండిపోయాడు వోమ్ని. అతడు చూస్తుండగానే శక్తిమాన్ హృదయం లోంచి ప్రచంఢ నిప్పులు చెరుగుతూ వచ్చింది ‘స్వస్తిక్’ చక్రం. వస్తూనే వేగంగా వెళ్ళి వోమ్నిని గుద్దుకుంది. ‘ఢాం’ అని శబ్దం చేస్తూ పేలిపోయాడు వోమ్ని. బూడిదైపోయాడు. భూమిలో రాక్షసులు అందరూ ఒక్కపెట్టున పోయారు.

ఆకాశం తెల్లగా మారింది. వాతావరణం యదాస్థితికి వచ్చింది. చిన్నవాడయ్యాడు శక్తిమాన్. అతడి నుంచి విడివడి ఎవరి ఆత్మశక్తి వారిని తిరిగి చేరింది.

“మిత్రమా అలాడిన్, అక్కడ జాస్మిన్ నీకోసం నిరీక్షిస్తుంది. పద వెళదాం” అంటూ అలాడిన్ ని తన టైగర్ మీద ఎక్కించుకుని జాస్మిన్ కేసి దూసుకుపోయాడు హీమ్యాన్.

టామ్ ని చూస్తూ జెర్రి తోకాడించి పరిగెత్తటంతో, దాన్ని పట్టుకోవాలని టామ్ కూడా పరుగందుకున్నాడు. ప్రేమ ప్రస్తావన రావటంతో ‘మేరీ జేన్’ గుర్తుకొచ్చి అటువైపు ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు స్పైడర్ మ్యాన్.

“స్కూర్జ్ గారు, మీ బంగారం పోయినందుకు చింతిస్తున్నాం... ” అంటూ వచ్చాడు SPD హెడ్ డాగి.

“మాట్లాడకు!..., కాంట్రాక్ట్ టర్మ్స్ ప్రకారం నాకు గాని, నా కుటుంబానికి గాని సరిగ్గా రక్షణ ఇవ్వకపోతే మీ మీద కేసు వేయొచ్చు. నా బంగారం పోయినందుకు మీ నుంచి పరిహారంగా SPD ఆస్తులు లాగుతా. ఇక కోర్ట్ లోనే కలుసుకుందాం” అంటూ రుసరుసా వెళ్ళిపోయాడు స్కూర్జ్. “అది కాదండి..” అంటూ అతడి వెంటపడ్డాడు డాగి. అంతా మామూలు స్థితికి వచ్చేసింది.

చిరునవ్వులు చిందిస్తూ నించున్నాడు లిటిల్ కృష్ణ. వేణువు తీసి వాయించటం ప్రారంభించాడు. అతడి వేణుగానం భూమి నలువైపులా వ్యాపించసాగింది.

*** అయిపొయింది ***



Rate this content
Log in