sudha Atreyaa

Inspirational Drama Children Stories

3.9  

sudha Atreyaa

Inspirational Drama Children Stories

మైత్రి!!! నా కూతురు

మైత్రి!!! నా కూతురు

12 mins
525


రెండు రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను ఇంకా వుత్తరం రాకపోవడమేమిటా అని ... నా నిరీక్షణ ఫలించి ఈవాళ అందుకున్నా తాతయ్య ఉత్తరం.

ఇప్పుడైతే గూగుల్ మాత ఉంది కానీ అప్పట్లో మాతాతే వాకింగ్ ఎన్సైక్లోపీడియా. మా చుట్టుపక్కల ఊళ్లలో లో మహాదేవరావు గారు అంటే తెలియని వారుండరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే... సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో నాగేశ్వర్ రావు లాంటి వారు. ఆయన పొట్టి వారు... మా తాత ఆరడుగుల ఆజానుబాహుడు అంతే తేడా.. ఆయన కు తెలియని విషయమంటూ లేదు. నాన్నమ్మ ఆయనకు తగ్గ ఇల్లాలు. ఇప్పటికి తాతయ్య నుండి ఫోన్ వస్తే టక్కున నిల్చుంటారు నాన్న. అది భయం కాదు భక్తి.

తన దగ్గరే పెరగడం మూలాన నాకూ ఆయాన లాగే పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది. తాతయ్యకు రీడింగ్ రూమ్ సెపరేటుగా ఉండేది. ఆయన దగ్గర వున్న బుక్స్ కలెక్షన్ చూస్తే అసలు పుస్తక పఠనాభిరుచి ఉన్నవాళ్లకు మరిక ఆకలి కూడా వేయదు. తను బహుభాషా కోవిదుడు. అందువల్ల పుస్తకాల సేకరణ కూడా బహు భాషల్లో ఉండేవి. ఆయన గ్రంధాలయం లో పుస్తకాలు చదవగా చదవగా నాకూ కూడా కథలు రాయాలన్న చిన్న ఆలోచన పుట్టింది. కానీ... గృహిణిగా బాధ్యతలు అనుకున్నంత త్వరగా వ్రాయించలేదు. ఇప్పుడు కొద్దిగా వెసలుబాటు దొరకడంతో వ్రాయడానికి ఉపక్రమించా ... అలా కథావస్తువు కోసం ప్రతిదీ తరచి తరచి చూసా. అన్నిటికన్నా మా కాలనీ కి ప్రక్కనే వున్న వాడలో ప్రతి గడపదీ ఓ కథ.. కథా వస్తువుకు వెతుకుతూ వెతుకుతూ వాళ్ళ కన్నీటి వ్యథలకు చలించిపోయా. వారి కన్నీళ్ల ఆధారంగా మూడు కథలు ఒక నవల రాసాను. అనూహ్యంగా పేరొందిన పత్రికల్లో పబ్లిష్ అయ్యాయి. నవల స్వాతి మాస పత్రిక అనుబంధంగా విడుదలై నవల పోటీలో రెండవ స్థానం దక్కించుకుంది. అన్ని ప్రశంసలు దక్కినా ఇంకా ఏదో మిస్ అయినట్లు అనిపించింది. అదే మావారితో అంటే మీ తాతగారి సర్టిఫికెట్ అన్నారు. అవును ఖచ్చితంగా అదే. మొదటి కథ రాసినప్పుడే తాతయ్యకు చూపించాలనుకున్నా కానీ ఎందువల్లో చూపించలేదు బహుశా ఏ మూలో భయం అయ్యుండవచ్చు. . ఇప్పుడు మూడు కథలు ఒక నవల, బహుమతి కూడా అందుకున్నాను ఆ ధైర్యం తో తాతయ్యకు నా అన్ని కథలను పంపాను. వారి అభిప్రాయం చెప్పమని అడిగే ధైర్యం లేదు కేవలం ఇవి నేను రాసినవి అని మాత్రం పంపాను. ఇదిగో ఇప్పుడు తాతగారు నాకథలకు రిపోర్ట్ పంపారు. వారి మార్కులకోసమే ఎదురుచూపు. శంఖం లో నుంచి పోస్తేనే కదా తీర్థం... నిజానికి తన మూల్యాంకనం చదవాలంటే భయంగా కూడా వుంది. తప్పక ప్రోత్సహిస్తారని తెలుసు అయినా ....

చి. కుం. సౌ. లక్ష్మి కి ఆశీర్వాదములతో,

ఉభయ కుశ లోపరి. చాల సంతోషం రచయిత్రి గా క్రొత్త పరిచయం ఇచ్చినందుకు. నీ కథలన్నీ చదివాను. చాల బాగున్నాయి. వారి కన్నీటి వ్యథలను నీ భాషలో ప్రపంచానికి బహు చక్కగా వివరించావు తల్లీ. ఒక్క విషయం గుర్తుం చుకో ప్రపంచానికి పరిచయం చేయటం తో నీ బాధ్యత తీరిపోదు... ఒక ఆమోద యోగ్యమైన సూచననో లేక నీకు అనిపించిన ఆచరణయోగ్యమైన సలహానో ఇచ్చి వారిని కార్యోన్ముఖులను చేసినప్పడే నీవు రచయిత్రి గా గెలుపొందినట్లు... ఇకపై ఆ దిశా గా అడుగులు వేసి నీ కథలు చదివేవారిలో కనీసం ఒక్కరిలో నైనా నీవు ఆలోచన, ఒక ఆచరణ అనే విత్తును నాటి రచయిత్రి గా అనంతమైన కీర్తి శిఖరాలను అందుకోవాలని ఆశీర్వదిస్తూ....

దీర్ఘ సుమంగళి భావ ...

మహాదేవరావు....

అందుకే తాత గారి రిపోర్ట్ కోసం పడిగాపులు ఎంతో మంది సమీక్షించారు కానీ కన్నీటి భాషను తెలుసుకోవడమే కాదు వాటికి విలువను, చేజారకుండా చూడాల్సిన భాద్యతను చాల చక్కగా చెప్పారు. మనసులోనే తాతయ్యకు ప్రమాణం చేశాను ఇకపై ఆ దిశగానే అడుగులు వేస్తాను అని .

అదిగో ఇప్పుడే అసలు చిక్కంతా... వాళ్ల బాధల్ని చెప్పినంత సులువుగా వాటికి ఏమి పరిష్కారమో అర్థం కావడంలేదు. మనసు కుదురుగా లేదు. శ్రీవారిని అడిగా చిరునవ్వే సమాధానం. నాకు నా కూతురు అప్పుడప్పుడు నిజానికి చాలా సార్లు నాకది తల్లిలా అనిపిస్తూవుంటుంది.

పేరు మైత్రి పేరుకు తగ్గట్టు అది అందరికీ మిత్రురాలు. నాకు ముద్దుగా అది మిట్టు. చాలా సార్లు అది చెప్పిన కబుర్లే నా కథలకు మంచి స్పందనను ఇచ్చాయి. చదివేది ఎనిమిదో తరగతి. అప్పుడే ప్రపంచాన్ని చదివిన జ్ఞాని. తనను అడిగి చూద్దాం ఏమంటుందో అని. నాకన్నా దానికి మా కాలనీ లో ఎక్కువ మంది ఫ్రెండ్స్. ఉయ్యాల బల్ల మీద కూర్చొని హోంవర్క్ చేసుకుంటుంటే తనకి మ్యాగీ అందిస్తూ విషయం చెప్పా.

"మిట్టు మనం మన వెనక వీది వాళ్లకు ఏవిధంగా సహాయపడగలమంటావు" అనడిగా దాని కది పెద్ద గొప్పదానిలా ఫోజు కొడుతూ

" అమ్మ నాకు వాళ్లలో కొంత మంది ఫ్రెండ్స్ వున్నారు" అని కళ్ళను పైకి ఎగరేస్తూ ముద్దుగా అంది.

" ఏమే వాళ్ళు కూడా నీకు ఫ్రెండ్సా. నీకు ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎవరో చెప్పవే"" అన్నాను.

"వాళ్ళు ఫ్రెండ్స్ గా ఎందుకు ఉండకూడదు. ఇందులో ఏమిటి తప్పు."

" అమ్మ తల్లి మైత్రి దేవిగారు ఇందులో ఎటువంటి తప్పులేదు. ఊరికే అడిగా నీకు అక్కడ కూడా ఒక బృందం ఉందా!! అని. అంతే తల్లి. పోనిలే విషయం చెప్పు మన ఏ విధంగా సహాయ పడగలం.""

"అమ్మ నువ్వు కోప్పడనంటే ఒక మాట చెప్పనా. ఎలాగూ నీకు చెప్పేదానిని అనుకో. ఆ బస్తీ లో సునీత అని నా స్నేహితురాలు ఉంది. తనకు చదువంటే చాలా ఇష్టం. కానీ చదువుకోవడానికి వారి తల్లి తండ్రులు ఒప్పుకోలేదు. తిను చదుకోవడానికి వెళ్తే పని ఎవరు చేస్తారని. కానీ వాళ్ల తమ్ముడిని మాత్రం చదివిస్తున్నారు. ఇదే మాదిరి చాలా మంది ఉన్నారు. అందుకే మేము ముగ్గురు స్నేహితులము కల్సి త్వరగా హోమ్ వర్క్ ముగించి మన గుడిలో ఎవరెవరికి చదువుకోవాలనుందో వారికి చదువు చెప్పాలనుకుంటున్నాము."" అంది

నిజంగా నా కుతుర్ని మెచ్చుకోకుండా ఉండలేక పోయా...వెనకనుంచి మావాడు కార్తీక్.

""మిట్టు గారు ఏమైనా ఎలక్షన్స్ లో పోటీచేయాలనుందా"" అని దాన్ని ఉత్తినే ఉడికించాడు. నాకుతెలుసు వాడికి అదంటే ప్రాణమని.

"" అది అంత మంచి పని చేస్తుంటే అలా అంటావేంటిరా"

""అమ్మా ఆ బస్తీవాళ్ళు మరీ అంత మంచివాళ్లేమి కాదమ్మ. చాలా మంది తాగుబోతులు. మా కాలేజ్ బస్ కు ఒక క్లీనర్ వున్నాడు, వాడిది అదే బస్తి. వాడు చెప్తుంటాడు. వాడికి వాళ్ళవాళ్ళు అంటే రోత పుట్టి ఇంటికి కూడా వెళ్లడం మానేశాడు. ఆడమగా అంతా తాగుతారంట అందుకే వద్దమ్మా. దానికి చెప్పు.""

వీడి మాటలు విన్న తరువాత నాకెందుకో చాలా భయం వేసి దాని వైపు చూసా అన్నయ్య చెబుతున్నది వింటున్నావా అని.

""నిజమే అమ్మ. సునీత చెప్పింది. ఇది వీళ్ళ బస్తి వాళ్లు కాదు కొత్తగా వీళ్ల బస్తి వెనక ఇంకో కొత్త బస్తి వచ్చిందంట. వాళ్లు. వాళ్ళతో మాకెమి పనిలేదు. అయినా నీవు నీకథ కోసం ఒకరిద్దరిని కలిసావుగా అమ్మా. అందరూ పాపం ఎంత మంచివాళ్ళు. వీరికి చదువుంటే ఎంత బాగుంటుంది చెప్పు"".

"నిజమే మిట్టు కానీ ఆడ పిల్లవు ఇలా వెళ్లి ఆ రాత్రి పూట... ఏమోనే నాకు భయంగా ఉంది."

"అమ్మ నీవే అడిగావుగా వారికి ఏమి చేద్దాం అని. అదే అడగాలనుకుంటున్నాను. అందులో కొంత మంది పెద్ద వాళ్ళు కుడా చదువు కోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారేమి పరీక్షలు గట్రా రాయరమ్మ కేవలం చదవడం, చిన్న చిన్న లెక్కలు కావాలి. అందుకే ఎటూ సాయంత్రం నీ పని అయ్యాక నీవు పెద్ద వాళ్లకు చెప్పు. జతగా మన టామీ ని తీదుకెళదాం. టామీ మనతో ఉంటే సింహం మనతో ఉన్నట్టే. "" క్షణాల్లో పరిష్కారo చెప్పింది. నా మిట్టు.

"నాకెక్కడ కుదురుతుంది""

"నువ్వే అన్నావు కదమ్మ వాళ్లకేం చెయ్యలని. ఓ గంటే అంతే. నువ్వు చెప్తావు అంటే ఇంకా చాలా మంది వస్తారు. పైగా మన పూజారి తాతయ్య ఎనిమిది గంటలవరకు వుంటారు.భజన వాళ్ళు వుంటారు. ఇంకెందుకమ్మ భయం. మనది ఏడింటికి అయిపోతుంది.""

"నిజమే ఏరా నీవేమంటావు."

"అమ్మా వాళ్లకు వేరే ఏమీ వద్దు కొద్దిగా చదువు అంతే. లోక జ్ఞానం బాగావుంది. అన్ని విషయాలు ఇప్పుడు వాళ్లకు బాగా తెలుసు. చదువు వల్ల ఆలోచించే జ్ఞానం వస్తుంది అంతే"" అని నాకు గీతోపదేశం చేసింది.

"సరే అమ్మా నేను వస్తాలే ఆ టైముకు.కొన్ని రోజులే కదా." అనిమావాడు పచ్చ జండా ఊపాడు.

శ్రీవారు కూడా సరే అనే పాటికి కొండంత ధైర్యం వచ్చింది. మా పని పిల్ల కూడా చాల సంతోషించింది. అందరము కలిసి పూజారి గారితో విషయము చెప్పాము. పూజారి గారు ఆయన భార్య ఎంతో సంతోషించారు. పూజారి గారి భార్య లక్షమ్మగారు వచ్చిపోయే భక్తులకు ఇబ్బంది లేకుండా గుడి వెనక భాగాన్ని శుభ్రం చేపించారు. మా ఈ ప్రయత్నం విన్న మా కాలనీ ప్రెసిడెంటు గారి భార్య తన వంతగా ఒక వైట్ బోర్డు మార్కర్లు ఉచితంగా ఇచ్చారు. గుడికి రోజు వచ్చే భక్తుడు తనవంతుగా అందరికి కూర్చోవడానికి మంచి చాపలు ఇచ్చాడు. ఊహించని విధంగా అందరి సాయం అందుతోంది. మా వారి ఆఫీస్ వాళ్ళు యాభై నోట్ పుస్తకాలు పెన్నులు ఇచ్చారు. అన్నిటికన్నా ఆశ్చర్యం మా కాలనీ కిరాణాకొట్టు శెట్టిగారు పరమ పిసినారి అని పేరున్న అతను యాభై పలకలు, ఒక బలపాల డబ్బా ఉచితంగా ఇచ్చాడు.. టీవీలు దినపత్రికలు వాట్సాప్ప్లు ఒకటేమిటి ఈ భూమి మీద మంచే లేదన్నట్టు కేవలం చెడును మాత్రమే చూపిస్తుంటాయి. భావి తరం కు మంచి అన్నది కేవలం పుస్తకాలలో మాత్రమే ఉన్నట్టు. కానీ చుడండి ఒక మంచి పని అది పసి హృదయాలు తలపెట్టగానే అందరూ తలో చేయీ వేశారు. ఈ కార్యక్రమానికి కర్త క్రియ అయిన నా మిట్టును మెచ్చుకోకుండా వుండలేకపోయా. అందరు నన్ననుకుంటున్నారు. నేను కాదు నాకూతురు అని చెప్పాలని వుంది కానీ దానికి ఎక్కడ ద్రుష్టి తగులుతుందేమో అని మిన్నుకుండిపోయా.

ఒక శుభ ముహూర్తాన పూజారి గారు కొబ్బరికాయ కొట్టి మా గుడి బడిని ప్రారంభించారు. ఆరుగురు పిల్లలు ముగ్గురు పెద్ద వాళ్లు అందులో ఒక మగవాడు కూడా వున్నారు. ఒక అరగంట ముప్పావు గంటో బడి నడిచేది మిగతా సమయం లక్ష్మమ్మ గారు వారికి పామర భాషలో రామాయణం లో భారతం లో నీతికధలను చాల హృద్యంగా చెప్పేవారు. మా మిట్టు దాని స్నేహితురాలి చిరు ప్రయత్నం పది రోజులు తిరిగేలోగా పాతిక మందికి చేరింది. జనం పెరిగారు ఒక్కదాన్నే ఎలా అనుకుంటుంటే మా వీధి చివరవుండే రిటైర్డ్ ఆయుర్వేద డాక్టర్ గారు తను పదిరోజులుగా మా గుడి బడిని చూస్తున్నట్టుగా చెప్పారు. ఇవాళ నేను లక్ష్మమ్మ గారితో మాట్లాడ్డం చూసి తనను ఈ అక్షర యజ్ఞంలో భాగస్వామిని చేయమని అర్థించడానికి వచ్చారు. నాకు భలే ఆశ్చర్యం వేసింది. అంతకన్నా ఇంకేమి కావాలని సంతోషంగా ఆహ్వానించాను. డాక్టర్ గారి రాకతో మా బడికి ఒక నూతన కళ వచ్చినట్టుంది అనిపించింది. వారు చదువు చెప్పడమే కాదు సత్కథ కాలక్షేపమయ్యాక ఆయుర్వేదం డాక్టర్ కదా అందరికి ఇంటి వైద్యం చిట్కాలు చెప్పేవారు. డాక్టర్ గారు వచ్చాక నా పిల్లల్ని ఇంటివద్దే వుండమన్నాను. ఆరోగ్యం బాగాలేని వాళ్లకు ఉచితంగా వైద్యం కూడా చేసేవారు. ఆనోటా ఈ నోటా పడి రెండు బస్తీల వాళ్ళు కలిసి నెల తిరిగే లోపు యాభయ్ మందికి చేరుకున్నారు. ఎంత మంది వచ్చినా సరిపోయే లాగుంది మా రాములోరి గుడి. అందరికి చదుకోవాలని ఉందని చూసి ఆశ్చర్యం వేసింది కేవలం అవకాశం లేకే పాపం ఉండిపోయారు అనిపించింది. ఇప్పుడు డాక్టర్ గారి భార్య కూడా జతయ్యారు. గుడిని రాములోరిని నమ్ముకున్న పూజారి గారి ఆదాయం కూడా పెరిగింది. వారి నమ్మకం వారి దయ గుణం వారికి శ్రీరామ రక్ష. కానీ ఆ దంపతులు ఆ ఆదాయం వీరివల్ల అని ఓపికగా ప్రసాదం తయారు చేసి బడి అయ్యాక గుడిలో అందరికి హారతులయ్యాక ప్రసాదం పంచేవారు.

గుడి బడి నాలో నూతన ఉత్తేజాన్ని నింపింది. ఏదో నావంతు ఉడుత సహాయం సమాజానికి చేస్తున్నాను అనిపించింది. తాత గారికి ఈ విషయం గురించి వుత్తరం రాసాను. అనూహ్యంగా ప్రత్యుత్తరం స్థానే ఎప్పుడూ లేనిది వారు మాఇంటికి వచ్చి ఒక వారం రోజులు వున్నారు. నాతొ ప్రతిరోజు మా రాములోరి బడికి వచ్చి తన గంభీరమైన ఖంఠం తో ఏదో ఒక విషయం మీద తన అనుభవాన్ని ఎంతో అందంగా చెప్పేవారు. వారి ఈ ప్రసంగాలు గుడికి వచ్చే వారిని కూడా కట్టి పడేశాయి. తాతయ్య వెళ్ళిపోయాక అందరు ఆయనని చాల మిస్ అయ్యారు. మా గుడి బడికి కి రాములోరి బడి అని పేరుస్థిరపడ్డది.

మామూలు బడి లోలాగే హాజరు పట్టిక కూడా వచ్చింది. ఎవరైనా రాకపోతే అనారోగ్యమైతే డాక్టర్ గారు ఉచితంగా మందులు ఇచ్చేవారు. వేరే కారణాలు ఐతే వారి అభీష్టం.

అప్పుడే రెండునెలలు కావస్తోంది ఏ ఆటంకం లేకుండా బడి సాగుతోంది. హాజరు కూడా బాగుంటోంది. గత రెండు రోజులు గా కొత్త బస్తి నుంచి తల్లి కూతుర్లు రావటం లేదు. మామూలుగానే వాకబు చేయించాను. విషయం ఏమిటంటే తన కూతురుని మంచి స్కూల్ లో వేయడం కోసం బొంబాయిలో వాళ్ల మేనత్త దగ్గరకు పంపినట్టు చెప్పింది. స్కూల్ కోసం బొంబాయి ఎందుకు పంపినట్టో అర్థం కాలేదు. అందులో కొత్త బస్తి వాళ్ళను చూస్తే పాత బస్తి వాళ్లకు భయం, పడదు కూడా. సరే నాకెందుకులే అనుకోని వూరుండిపోయా. ఇది జరిగిన వారం పది రోజుల తర్వాత మరో కొత్త బస్తి తల్లి కూతుర్లు అదే మాటే బొంబాయ్ బదులు ఇంకో వూరు. ఆశ్చర్యం వేసింది. మరో వారాని ఇంకో కారణం మీద ఇంకొకరు. అందుకు కారణం ఒకటే ఊర్లు మాత్రం వేరు. మనసెందుకో కీడు శంకించింది. వివరాలు కనుక్కుందాం అనుకున్న కానీ ఎందుకో అందరు కొత్త బస్తి వాళ్లు అంత మంచోళ్ళు కారు అన్న మాటలు నాలోనూ భయాన్ని నిలిపి వూరుకుండేటట్లు చేసాయి.

ఒక రెండురోజులు డాక్టర్ గారు ఊరెళ్తున్నాము రానన్నారు. సరే ఒక్కదాన్నీ కష్టం అవుతుందని బడికి సెలవులు చెబుదాం అనుకున్న. కానీ లక్షమమ్మ గారు తను సాయానికి వస్తానన్నారు. స్కూలుకు సెలవు కావడం తో మిట్టు కూడా వస్తానంది. సరే అన్నాను. తనకి పెత్తనాలు ఎక్కువ. నేను కాదన్నా నాతొ వస్తుంది. అందుకే టామీ తో కలసి ముగ్గురం వచ్చాము. ఎందుకో ఈ కొత్త బస్తి హాజరు తగ్గుతోంది. భయమనిపించింది. మా చాకలి అబ్బాయ్ చెప్పినదాన్ని బట్టి ఎవరి పిల్లలైతే మేనత్తల దగ్గర చదువుకు పోయారో వారిలో చాల మందికి వున్న పళంగా బాగా డబ్బులొచ్చాయని తెలిసింది. అనుమానం బల పడింది. నేను చేగలిగిందేంఉందని ఊరుకుండిపోయా. ఇవాళ త్వరత్వరగా బడి ముగించేసా. హారతి ముగించుకొని మిట్టు కోసం చూస్తే అది కనిపించలేదు. ఎప్పుడు ఇంతే కుదురుగా ఉండదు. ఎటుపోయిందో అని అటు ఇటు చూసా. ఎక్కడ కనిపించలేదు. ఎందుకో బాగా గాభరాగా అనిపించింది.. బడికి వచ్చిన వాళ్ళు కూడా మిట్టు కోసం వేతకసాగారు. మిట్టు లేదు. మా టామి కూడా కనిపించటం లేదు. అరగంటయింది తన జాడే లేదు. మావారు నాకొడుకు అందరం వెతికాము. పాత బస్తి, కొత్తది. మొత్తం వెతికాము. మావారు పోలీస్ కంప్లయింట్ ఇవ్వడం తో వారు వచ్చారు. అందరం ఎంత వెతికిన కనిపించలేదు. తెలిసిన వారు, కాలనీ వారు బస్తి వారు పోలీసులు అంతా జల్లడ పడుతున్నా నా మిట్టు నా బంగారుకొండ కపటం లేని నా బుజ్జి తల్లి ఆచూకీ తెలీటం లేదు. కిడ్నాప్ చేసుంటే ఈ పాటికి కనీసం ఫోన్ అయినా చేయాలి కదా!!! అదీ లేదు. ఏమైందో నాకుతురికి అని భయం వేస్తోంది.దేవుడిని మొక్కుతున్నాను తిడుతున్నాను. మావారి పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంది. స్నేహితులతో కలిసి ఊరంతా గాలించి గాలించి తెల్లవారుతుండగా వచ్చారు. నా చిట్టి తల్లితో వచ్చారనుకున్నా.!!! వట్టి చేతులతో వచ్చారు. అంతే నేను కుప్పకూలిపోయా. పాపం ఇరుగు పొరుగు అంతా నాతోనే వున్నారు.

అమ్మ నాన్న, తాతయ్య అందరూ వచ్చారు. ధైర్యం చెప్తున్నారు కాని.... అసలే దానికి ఆకలికి తట్టుకోవడం దానికి చేతకాదు. ఏమన్నా తిన్నదా లేదా... ఇవే ఆలోచనలు. అందరూ చాలా బాధ పడుతున్నారు. తాత గారి సాంత్వన వచనాలు కూడా సాంత్వన కలగ చేయటం లేదు. మావారికి ఏమి పాలుపోలేదు. మా వాడు, వాడి స్నేహితులు వెతికి వెతికి ఉసూరుమని వచ్చికూచున్నాడు.

సాయంత్రమవుతున్నా ఇంకా ఎటువంటి జాడలేదు. పోలీసులు వారి వంతు సహకారం చాలా బాగా అందిస్తున్నారు. టామీ కూడా కనిపించటం లేదు. అంటే ఖచ్చితంగా అది మిట్టు తోనే ఉంటుంది. ఈ విషయం నాకు కొద్దిగా బలాన్నిస్తోంది.

రాత్రి ఎనిమిది అవుతుండగా పోలీసు వారినుంచి ఫోను మమ్మల్ని స్టేషన్కు రమ్మని. మావారు వద్దని వారిస్తున్నా నేను కూడా వెళ్ళాను. ఏ వార్త వినాల్సివస్తుందో అని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని వెళ్ళాము. పోలీసు వాళ్లు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి మమ్మల్ని కూర్చుబెట్టి మర్యాదలు అవి చేస్తుంటే పై ప్రాణాలు పైననే పోయాయి. ఏమడిగినా sp గారొస్తారు అంతవరకు ప్లీస్ సహకరించండి అని. నాకేదో చావు కబురు చల్లగా చెప్పడానికి రంగం సిద్ధం చేస్తున్నారేమో అనిపించి ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది. పాపం మావారు ఓదారుస్తున్నారు కానీ ఏడుపు ఆగటంలేదు. ఆయన పరిస్థితి అలాగే వుంది. మగవాడు కదా ఏడవట్లేదు అంతే.

""అమ్మ sp గారొచ్చారు"" అని మావాడు పరుగు పరుగున వచ్చి చెప్పాడు. మాతో కూడా చాలా మంది వచ్చివున్నారు. sp గారిని చూడగానే అంతా ఆయన ఏమి చెప్తారో అని వేచి చూడసాగారు. ఆయానేమో ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోయారు. ఒక 5 నిమిషాల అనంతరం మమ్మల్ని లోపలి రమ్మని పిలుపు.

ఆయానేమీ చెప్తారో అని భయం భయంగా లోపలికి అడుగు పెట్టాము. పుణ్యానికి పోతే పాపం ఎదురు కావడం అంటే ఇదే కాబోలు. ఆ బడి ఎందుకన్నా మొదలుపెట్టానా అనిపించింది. మమ్మల్ని చూడగానే తన కుర్చీలోంచి లేచి మావారికి షేక్ హాండ్ ఇచ్చి సాదరంగా కూర్చోమన్నాడు.

"SP గారు మా మిట్టు అదే మా పాప ఆచూకీ ఏమైనా తెలిసిందా" అని ఆయన మర్యాదలు అవేవి పట్టించుకోకుండా అడిగేసాను.

దానికి ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్వి ""మీ అమ్మాయేమో ఎంతో సాహసవంతురాలు. వారి తల్లీ తండ్రులంటే ఇంకెంత సాహసవంతులో అనుకుంటే మీరెంటి ఇంత బేల గా వున్నారు"" అన్నాడు.

"అంటే మా మిట్టు మా మిట్టు క్షేమమే కదా" చాలా ఆతృతగా అడిగాను.

"మీ పాప పూర్తిగా క్షేమంగా ఉంది అంతే కాదు ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి అమ్మాయిల అక్రమ రవాణా చేసే ముఠాను పట్టించింది. మీ అమ్మాయి ఈ సాహసం వల్ల ఎన్నో రోజులనుంచి పోలీసులకు తలనొప్పిగా మారిన వారందరిని వలేసి పట్టుకున్నాము"" అని ఎంతో గొప్పగా చెప్పారు.

"మరి నా కూతురు ఎక్కడ. మొదలు నా కూతురిని నాకు చూపించండి". అని అడిగాను.

"తప్పకుండా అమ్మా. తన ఈ సాహసం లో కొద్దిగా గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది"అన్నారు

"అయ్యో గాయలా తను బాగుంది కదా నిజం చెప్పండి" అన్నాను

"మీరు భయపడాల్సినది ఏమి లేదు కేవలం చిన్న చిన్న గాయాలు మాత్రమే అంతే." అన్నారు

"మరి మా టామీ అదే మా కుక్క దాని ఆచూకీ ఏమైనా తెలిసిందా". అడిగాను

"నిజానికి ఈ సాహసంలో మీ పాప పాత్ర ఎంతవుందో మీ టామీ పాత్ర కూడా అంతే వుంది. తనకు చిన్న చిన్న గాయాలు అయ్యాయి. కుక్క కూడా చికిత్స చేశారు. అది కూడా బాగుంది." చెప్పారు.

"మా పాపను మేము చూడోచ్చా." అని అడిగాను.

"తప్పకుండా నేనె స్వయంగా మిమ్మల్ని అక్కడ కు పిల్చుకొని వెళ్తాను రండి" అని మమ్మల్ని తమ వెంట పిల్చుకెళ్ళారు.

మమ్మల్ని ఆసుపత్రి లో చూడగానే మా టామీ ఒక్కసారిగా మా మీద పడి నా చీరను పట్టుకొని మిట్టు దగ్గరకు పిల్చుకెళ్లింది. బిడ్డను చూడగానే ప్రాణం లేచొచ్చింది. ఒక్కసారి తనను చూసుకొని ముద్దులు పెట్టుకున్నాక అప్పుడు మనసు కుదుట పడ్డది.

"ఇప్పుడు చెప్పవే అసలేం జరిగిందో "

నాతో పాటు మా వారు నా కొడుకు sp గారు అందరూ అది ఏమి చూపుతుందో అని వినసాగారు. మా టామీ మాత్రం తలుపుకు అడ్డంగా ఎవ్వరు లోపలికి రాకుండా ఉంది.

"నేను నీతోనే వున్నాను. సునీత నీకు తెలుసుకదా నా ఫ్రెండ్ తనను వాళ్ళమ్మ బలవంతంగా బొంబాయి పంపుతోంది. వాళ్ళమ్మకు నచ్చచెప్పామని నన్ను అడిగింది. సరే ఇక్కడే కదా అని నేను టామీ వెళ్ళాము. ఇంతలో పెద్ద వస్తాదుల లాంటి ఇద్దరు నన్ను సునీతను మత్తు మందు కర్చీఫ్ ముక్కుకు పెట్టి వాన్న్లో ఎక్కించారు. ఎందుకో అనుమానం వచ్చి ముక్కుకు చెయ్యి అడ్డం పెట్టకున్నా అందుకే అంతగా స్పృహ తప్పలేదు. అది వారికి తెలిస్తే చంపేస్తారని స్పృహ కోల్పోయినట్టు నటించా. టామీ ని చంపేస్తారనుకున్నా. టామీ బాగా ఎదురు తిరిగేపాటికి దానికి మత్తు మందు ఇచ్చి వాన్ లో వేశారు. బహుశా స్పృహ వస్తే టామీ కనపెడుతుందేమో అని కాబోలు. నాకు స్పృహ వచ్చి మెల్లిగా చూస్తే వాన్ లో మొత్తం ఐదుగురు వున్నారు. అప్పుడర్థం అయ్యింది. ఈలోపు టామీ కూడా స్పుహలోకి వచ్చింది. దానికి శబ్దం చేయొద్దు అని చెప్పాను. కాసేపటికి వాన్ను ఒక డాబా దగ్గర ఆపారు. ఒక సారి మమ్మల్ని చూసి ఇద్దరు దిగిపోయారు. నేను టామీ తప్ప ఎవ్వరూ స్పృహలోలేరు. వారు గుర్తించకుండా నా స్థలంలో అక్కడున్న సంచులను సర్ది టామీ స్థలంలో కూడా ఒక గోతామును పరిచి మెల్లిగా నేను టామీ వాన్ దిగిపోయి అక్కడే దాక్కున్నాము. పరిగెట్టడము అవి ఎవరైనా చూస్తే వాళ్లకు చెప్తే కష్టం కదా అందుకే. కాసేపటికి వారు వెళ్లిపోయారు. అయినా ఇంకా కాసేపు అక్కడే దాకున్నాము. ఒకవేళ చూసుకొని వెనక్కు వస్తే ఎవరైనా చెప్తారేమో అని. ఈలోపు ఒక బస్సు వచ్చి ఆగింది ఇదే అదను అనుకొని ఎవరు గమనించకుండా నేను టామీ బస్సు ఎక్కేసాము. మా అదృష్టానికి చివరి సీట్లు కాలీగా ఉన్నాయి. ఎవరికి కనిపించకుండా నక్కి నక్కి కుచున్నాము. బస్సు వాళ్లు కూడా మమ్మల్ని గమనించలేదు. మొత్తానికి బస్సు కదిలింది. ఎక్కడ వారు ఆపారో తెలీలేదు బస్సు ఎక్కడికి వెళ్తోందో తెలీదు. బస్సులో వాళ్ళని అడుగుదాం అనుకున్న కానీ వాళ్ళు మమ్మల్ని నమ్మక ఎందుకొచ్చిన గొడవ అనుకోని వదిలి వెళ్ళిపోతే కష్టం కదా. మొదట నేను తప్పించుకుంటే కదా వారికి సాయం చేయగలను. మా గండం గడిచింది కానీ వారిని ఎలా కాపాడాలో అర్థం కావటం లేదు. తెలవారుతోంది అనగా బస్సును ఒక టీ కొట్టు దగ్గర ఆపారు. ఇదే అదనుగా నేను టామీ దిగిపోయాము.

దగ్గర్లోనే ఊరు ఉందని అర్థం అయ్యింది. మెల్లిగా నేను టామీ నడుస్తూ ఊరు చేరుకున్నాము. అది మరీ పల్లెటూరు. వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్కు చేరాము. అక్కడ ఎవ్వరు లేరు. మీకు కాల్ చేద్దాం అంటే ఎవరు కనిపించలేదు. అక్కడే పోలీస్ స్టేషన్ దగ్గరే నేను టామీ కుచున్నాము. చాలసేపటికి ఒకతను వచ్చి పోలీసు స్టేషన్ తలుపులు తీసాడు. అతనికి నన్ను కిడ్నప్ చేశారు తప్పించుకొచ్చాను అని చెప్పా. నన్ను కూచోమని చెప్పి ఎవరికో ఫోన్ చేసాడు. బహుశా SI గారనుకుంటాను కాసేపటికల్లా వచ్చారు. వివరాలు కనుకున్నారు. నన్ను కిడ్నప్ చేశారని చెప్పాను. కానీ అసలు విషయం చెప్పలేదు. వారి వద్దనుండి మీకు ఫోన్ చేస్తానని ఫోను తీసుకొని అక్కడే బోర్డ్ మీదున్న SP గారి నంబరుకు ఫోన్ చేసాను. కాస్త పక్కకు వెళ్లి ఆయనకు మొత్తం విషయం చెప్పాను. సర్ అంతా విని ఇప్పుడే మీకు కాల్ చేయొద్దని చెప్పి SI గారికి ఫోను ఇవ్వమన్నారు. వారికేమి చెప్పారో తెలీదు. నన్ను జాగ్రత్తగా మనూరికి పిల్చుకొచ్చి ఒక ఆసుపత్రిలో చేర్పించారు కూడా ఇద్దరు కనిస్టేబుళ్లను కాపలా ఉంచారు."" అనిచెప్పి SP గారి వంక చూసింది.

" అవునమ్మా నేనె మీకు కాల్ చేయొద్దన్నాను. పాపదొరికింది అంటే వారికి పాప తప్పించుకుంది అని అర్థం అయ్యి మరింత అప్రమత్తం అవ్వొచ్చు లేదా వారి చెర లో ఉన్న అమ్మాయిలకు ఆపద తలపెట్టవచ్చు. బస్తీలో వాళ్ళు వాళ్లకు చాలా సహాయం చేస్తున్నారు. మాకు మనుషుల అక్రమ రవాణా సాగుతోందని తెలుసు కానీ వాళ్లు చాలా పగడ్బందీగా డబ్బు ఇచ్చి రాజమార్గంలో మనుషులను తరలిస్తున్నారు. ఒక తీగ దొరికితే చాలనుకున్నాము. ఈలోపు మీ పాప కిడ్నాప్ విషయం మాకు చేరింది. విషయమంతా తెలుసుకున్నాము. ఇది ముంబయ్ ముఠా పనే అని మాకు అర్థం అయ్యి మేము ఆ దిశలో మా

విచారణ మొదలు పెట్టబోతున్నాము మీ పాప నుండి ఫోను. తను అందించిన విలువైన సమాచారం వల్ల ముఠాను త్వరగా పట్టుకున్నాము. పిల్లల్ని విడిపించి వారి తల్లి తండ్రులను కూడా జైలులో వేశాము. పాప ఎక్కడా భయపడకుండా ముందు చూపుతో తను వ్యవహరించిన తీరు అమోఘం.""అని నా కూతుర్ని అభినందించి మావైపు తిరిగి

"" అమ్మా మీ గుడి బడి గురించి తెలుసుకున్నాను. చాలా మంచి పని చేస్తున్నారు. ఈ ఐడియా పాపదే అని మీ పాప చెప్పింది. సమాజానికి మీవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నందుకు గాను మా పోలీసు శాఖ తరుపున పదివేల రూపాయల పారితోషికాన్ని మీ గుడిబడికి అందిస్తున్నాము. అంతే కాదు మిట్టు సాహసానికి మా పోలీసు శాఖ సాహస బాలిక అవార్డును ప్రకటించింది. ఆగస్ట్ 15 న దానిని అందచేస్తారు. అంతే కాదమ్మ ఈ సంఘటన తర్వాత మీకు భయం సహజం. అందుకే ఆ బస్తీల్లో గస్తీని పెంచాము. మీరు నిరభ్యంతరంగా స్కూల్ కోనసాగించవచ్చు" అని చెప్పి మమ్ములను ఇంటి వెళ్లొచ్చు అని చెప్పి వెళ్లిపోయారూ.

పెద్ద గండం గడిచి అందరం ఇల్లు చేరుకున్నాము. మొదటే నాకుతురు ఓ పెద్ద సెలబ్రిటీ ఇప్పుడు హీరోయిన్ అయ్యింది. బడిని అటకెక్కిద్దం అనుకుంటుంటే ఇప్పుడు నేను చాలా మందికి రోల్ మోడల్ ను. అంతేనా మా గుడి ధర్మకర్తగారు ఇప్పుడు గుడిలో బడి కోసం ఒక రేకుల షెడ్డును వేయించారు. పసి హృదయాల తపన ఎంతో మందికి చదువు చెప్పింది.

ఆగస్ట్ 15 న నా కూతురు పోలీసు మెడల్ అందుకుంటుంటే నా హృదయం గర్వంతో ఉప్పొంగింది...

సర్వే జనా సుఖినోభవంతు....Rate this content
Log in