ఎర్ర చున్ని
ఎర్ర చున్ని


ఎర్ర చున్ని..
ఇరవై అయిదు సంవత్సరాల నాటి మరువలేని మధుర జ్ఞాపకం.
@@@
సమయం ఉదయం 7:30...
కళాశాల హాస్టల్ లో..
స్టూడెంట్స్: ఇదేం బాలేదు సర్..
వార్డెన్ : ఏం బాలేదురా?
స్టూడెంట్: భోజనం సర్, ఇడ్లీ చూడండి ఎంత గట్టిగా ఉందో..
వార్డెన్: మీకదే ఎక్కువ నోరు మూసుకుని తిని వెళ్ళండి.. వద్దంటే వదిలేసి పొండి.. కుక్కలకేస్త తర్వాత..
స్టూడెంట్స్: మర్యాదగా మాట్లాడండి సర్, కుక్కలతో పోలుస్తున్నరేంటి?
వార్డెన్: మీ కొంపల్లో గంజి నీళ్లకి గతిలేని మీరు, govt. పుణ్యమా అని యిదైనా తింటున్నారు. అట్టాంటిది, ఇక్కడేదో మీ బాబు గాడి సొమ్ము లాగా ఇది బాలేదు, అది బాలేదు అంటే , ఇట్టానే మాట్లాడతారు. మూసుకుని వెళ్ళి తినండ్రా..
అని.. గంజి కి గతిలేని పెతి వొడిని ఇట్టా తిండి పెట్టీ మేపితే ఇట్టాగే మొరుగుతాయి. అని గొణుగుతూ ఉంటాడు.
ఆవేశపరుడైన ఒక స్టూడెంట్ అవి విని, govt ఇచ్చిన సొమ్మంతా నీ భార్య నగలకే సరిపోవట్లేదు ఇంక మాకు పెట్టడానికి ఇలాగే ఏడుస్తారు అని అంటాడు.
మేమంటే నిజమే తినడానికి లేకపోతే మా govt. మాకు పెడుతోంది. అన్ని ఉన్నా, ఇంకా మాకిచ్చే దాన్ని కూడా లాక్కునే నిన్ను ఏమనాలో ఆలోచించుకో?
వార్డెన్: రేయ్ బలిసిందా, నన్నే అంటున్నావా? ఈ కాలేజీలో ఎట్టా సదువుతావో చూస్తా అని వార్నింగ్ ఇస్తాడు.
కొంతమంది ఆపుదామని చూస్తున్నా ఆగకుండా సవాళ్లు విసురుకుంటూ ఉంటారు.
స్టూడెంట్: నీతో మేమంతా క్షమాపణలు చెప్పించు కుని మరీ ఈ కాలేజీ లో చదువుతాం అని ధైర్యంగా అంటాడు.
కొంత మంది స్టూడెంట్స్ , సర్ది చెప్పడానికి ప్రయత్నించినా మరికొంత మంది స్టూడెంట్స్ ఆత్మాభిమానం కూడా దెబ్బతిని , తగ్గడానికి ఒప్పుకోలేదు.
అంతా వెళ్లి సూర్య కి జరిగినదంతా చెప్దామని నిర్ణయించుకుంటారు.
సూర్యను నేనే.. పేద విద్యార్థులకు నాయకునిగా ఎన్నుకోబడిన వాడిని.
జరిగింది విని, వార్డెన్ దగ్గరకు వెళ్ళి సర్, మీరు క్షమాపణ చెప్పేయండి, ఇక్కడితో వదిలేస్తాం, లేదంటే ప్రిన్సిపాల్ వరకు విషయం వెళుతుందని హెచ్చరించాను.
వార్డెన్ చాలా ధీమాగా కంప్లయింట్ ఇస్తే ఇచ్చుకొండి. నన్నే అనే.. వారెవరో చూస్తా అంటాడు.
సమయం ఉదయం 9:00
అందరం కాలేజీ కి వెళ్ళాం. ముందుగా ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పాం, అప్పటికే.. పై వారి నుండి ఫోన్ రావటం, మా పై చర్యలు తీసుకోమని చెప్పడం తో , ఇంతటి తో ఈ విషయాన్ని వదిలేయండి సూర్యా.. మంచి స్టూడెంట్స్ మీరు భవిష్యత్తు నాశనం చేసుకోకండి అని మృదువుగా , నిస్సహాయంగా చెప్పారు.
సర్, ఇది మా ఆత్మాభిమానం పై కొట్టిన దెబ్బ, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం పరీక్షలు రాస
్తాం. దీనిని వదిలే ప్రసక్తే లేదు.
ఆయన ఏం చెయ్యలేక మీ ఇష్టం అన్నారు.
కళాశాల ఆవరణలోకి వచ్చాం, అందరం కలిశాం, వారికి జరిగినదంతా చెప్పాను. ఏదేమైనా , దీక్ష చేయాలని, అది శాంతియుతం గా ఉండాలని నిర్ణయించుకున్నాం.
టెంట్ వేసాం. దాని ముందు జెండా .. ? శ్రామికుల స్వేదం, వారి రక్తానికి ప్రతీక, ఎరుపు రంగు...
హడావిడిలో ఎక్కడున్నాయో..
అప్పుడే కనిపించింది... ఆమె.. ఎరుపు రంగు చున్నీ తో..
అడగాలా వద్దా సందేహం.
దగ్గరకెళ్లి.. మ్యామ్, మాకు జెండా ఇక్కడ దొరకలేదు, మీరేమనుకొకపోతే, ....
బాగ్ లో చెయ్యి పెట్టీ శాలువా తీసుకుని నిండుగా కప్పుకుంది,...
ఆ ఎరుపు రంగు చున్నీ నా చేతిలో పెట్టింది, చిరు మందహాసం తో..
ఆమె మంచి మనసుకి, ఉన్నత వ్యక్తిత్వానికి, నా కళ్ళలో మెరిసిన మెరుపు ఆమె కళ్ళలో ప్రతిఫలించిందా అనిపించింది...
మరుక్షణం ఈ లోకం లోకి వచ్చి.. జెండా ఎగరేసి.. దీక్షకు కూర్చున్నా.
పది రోజులకు అందరూ దిగొచ్చారు. క్షమాపణ చెప్పించారు.
ఎర్ర చున్నీ..జెండా గా తీసేసాం.. తన గుర్తుగా నా దగ్గర దాచుకున్నా...
తర్వాత కళాశాల లో ఆమె కనిపించినప్పుడు.. కనురెప్పల భాషలో మాట్లాడుకోవడం మొదలైంది నాకు తెలియకుండానే...
ఆఖరి సంవత్సరం...
తన ఇంట్లో చెప్పింది.. అగ్రవర్ణం కదా... మా చితి మంటల వెలుగులో తాళి కట్టించుకో .. మాకే అభ్యంతరం లేదన్నారు.
కన్నవారిని కాటికి పంపే కళ్యాణం వద్దంది..
దేనికి తలవంచని నేను.. ఆ క్షణం తన కన్నీళ్లకు తలవంచాను.
కాలం ఎవరినైనా ఎదిరించగలదు.. ఓడిపోయాను...
తన పెళ్లయిపోయింది... ఎర్రని చీరలో మంగళ సూత్రాలతో తను..
మనోహరంగా అనిపించింది..
ఇది చేదు సంఘటన కాకూడదు అనుకున్నాను.. మరుపురాని జ్ఞాపకం లా నా మనసుపై ముద్రించుకున్నాను.
దేశానికి ఉపయోగపడాలని , ఆర్మీ లో చేరాను.
ఎన్నో పదవుల్లో పని చేశాను.. ఎప్పుడు ఎరుపు రంగు చూసినా తన జ్ఞాపకమే...
ఎందుకో మరో మనిషిని ఆహ్వానించ లేకపోయాను.
వంటరిగా కాదు..
తన జ్ఞాపకాలతో జంట గా ఉన్నాను..
పదవీ విరమణ తరువాత ..
తనని కలవాలనిపించింది.. కేవలం ఒక స్నేహితురాలిగా...
గతకాలపు విద్యార్థుల సమ్మేళనం... కళాశాలలో..
ఇవాళ వెళుతున్నాను...
వెళ్ళి అందరినీ పలకరించి గేట్ వైపే చూస్తున్నా దూరం నుంచి...
తెలుపు రంగు కార్ లో నుంచి తాను దిగింది...
ఎర్రని కాటన్ చీరలో...
మనసంతా తెలియని సంతృప్తి...
ఈ జన్మకి ఈ జ్ఞాపకాల సవ్వడి చాలనిపించింది..
అక్కడి నుంచి వెను తిరిగాను తనకి కనిపించకుండా...
కార్ లో కూర్చుని భద్రంగా దాచిన ఎర్ర చున్నీ ని చూసుకున్నాను...
చిరునవ్వు మెరిసింది నా మనసులో...
తన పేరు చెప్పలేదు కదూ... అరుణ..
ఆ రంగు కొద్దిగా నా కళ్ళద్దుకున్నాయి ఇప్పుడు...
కానీ ఎప్పటికీ ఈ ఎర్ర చున్నీ మధుర జ్ఞాపకమే...