Sathaiah Sagarla

Children Stories Drama

4.5  

Sathaiah Sagarla

Children Stories Drama

పరివర్తన

పరివర్తన

3 mins
319



అది రాఘవాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల. అప్పుడే ప్రార్థన ముగిసింది. పిల్లలందరూ వరుసగా తరగతుల్లోకి వెళ్తున్నారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయుడు సమయపాలన పాటించాలని హెచ్చరిస్తూ లోపలికి పంపిస్తున్నాడు. నిన్న పాఠశాలకు రాని పిల్లలను ప్రధానోపాధ్యాయుడు కారణాలు తెలుసుకుంటున్నారు. "నమస్కారం సార్" గేటు తెరిచి లోపలికి వస్తూ అన్నాడు నరసయ్య. 'ఆ.. నమస్తే నరసయ్య బాగున్నారా?' అంటూ ప్రతి నమస్కారం చేశారు ప్రధానోపాధ్యాయుడు. 'ఏమిటి విశేషాలు? పత్తి చేను ఎలా ఉంది? రమేష్ ఇంటి దగ్గర చదువుతున్నాడా? ఈమధ్య పాఠశాల వైపు రావడమే మానేశావు? ' అంటూ పిచ్చాపాటీ మాట్లాడుతూ ఆఫీస్ లోకి దారి తీసాడు హెడ్మాస్టర్. 'ఆ.. అదే సార్ వాడి గురించే మాట్లాడదామని వచ్చాను. పత్తి చేను కలుపు తీత పని ఒత్తిడిలో ఇన్నాళ్లు రాలేకపోయాను' అన్నాడు నరసయ్య. 'ఏమైంది నరసయ్య? ' అన్నాడు హెడ్మాస్టర్ కూర్చోమని ఎదురుగా కుర్చీచూపుతూ. 'మా వాడు ఏడు దాకా బాగానే చదివాడు సార్. చిన్న బడిలో ఉన్నప్పుడు అన్నింటిలో ఫస్ట్ ఉండేవాడు. ఇప్పుడు ఇంటికొస్తే పుస్తకం పట్టుకోవడం లేదు. రాత్రి పది గంటల దాకా దాక బయట తిరుగుతున్నాడు. ఏందిరా అంటే నాకు హోం వర్క్ లేదు అంటున్నాడు. వాళ్ళ అమ్మ ఏమైనా అనబోతే తనని ఎదిరిస్తున్నడు. ఈ సంవత్సరం తొమ్మిదవ తరగతి. గిట్లనే చదివితే రేపు పది ల ఫెయిల్ అయితడేమో భయంగా ఉంది సార్' అన్నాడు నరసయ్య. 

     "అవును సార్ రమేష్ నిజంగానే హోం వర్క్ చేయడం లేదు. నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడు. నేను చెప్పే మంచి మాటలు అతని చెవికెక్కడం లేదు" అంటూ ఫిర్యాదు చేశాడు లెక్కల మాస్టారు వెంకటయ్య. "అదే సార్ నేను అంటున్నది. పంతుల్ల భయం లేకనే పిల్లవాడు చెడి పోతున్నాడు. మీరు ఎట్లైనా దారికి తేవాలి" అన్నాడు నరసయ్య. "నిజమే నరసయ్యా మా మా ప్రయత్నం మేము పాఠశాలలో చేస్తుంటాం. మీరు ఇంటి దగ్గర కూడా తను ఏం చేస్తున్నాడో గమనించాలి. పిల్లల గురించి పట్టించుకోవాలి" అన్నాడు అనునయంగా హెడ్మాస్టర్. "నా పనే నాకు తీరదు. ఇక వాన్ని నేనేం పట్టించుకుంట సార్"? అసహనంగా అన్నాడు నరసయ్య. "అయ్యో అలా అంటే ఎలా ఒక్క చేతితో కొడితే చప్పట్లవుతాయా? రెండు చేతులు కలవాలి గాని. అట్లనే మేము ఒక్కరమే ప్రయత్నిస్తే లాభం లేదు. మీ సహకారం కూడా ఎంతో అవసరం" అన్నాడు హెడ్మాస్టర్.  "నేను కూడా ఇదే బడిలో చదువుకున్న. ఆర్థిక పరిస్థితి బాగా లేక పెద్ద చదువులు చదవలేదు గానీ ఇక్కడే పది పాసైన. నా తల్లిదండ్రులకు అక్షరం ముక్క రాదు. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు. అప్పటి సార్లు మంచి వాళ్ళు ఉండే. అందుకే నాకు చదువు వచ్చింది. మరి ఇప్పుడు నా కొడుకునేమో నన్ను చదివించమంటున్నారు. ఇక మేము చదివించినంక మీరు ఎందుకు సార్" కాస్త కోపంతోనే అన్నాడు నరసయ్య. 

      "నరసయ్యా ఆవేశ పడకు. నీవు చదువుకునే రోజుల్లో మీ ఇంట్లో టీవీ ఉందా?"

 "లేదు సార్ ఆదివారం రోజు సినిమాకు మా ఊరి కరణం పంతులు ఇంటికి పోయి చూసి వచ్చేవాళ్ళం"

 "సెల్ ఫోన్ఉందా? "

 "టీవీ కూడా లేనప్పుడు సెల్ ఫోన్ ఎట్లా ఉంటది సార్? అది అంటే ఏందో కూడా మాకు చిన్నప్పుడు తెలవదు."

 "మీరు బడికి విడిచిపెట్టిన తరువాత ఏమి చేసేవారు? "

 "అమ్మ నాయన చెప్పిన పని చేసేవాళ్ళం. కాసేపు ఆడుకునేవాళ్లం. సార్ చెప్పిన హోంవర్క్ చేసేవాళ్ళం. అయినా ఆ రోజుల్లో చాలా క్రమశిక్షణ ఉండేది సార్" అన్నాడు నరసయ్య. 

 మరి ఇప్పటి పరిస్థితులను గమనించావా? ఇప్పుడు మీ ఇంట్లో ఫోన్ ఉందా? 

 "ఒకటేమిటి సార్ నాకు ఒకటి, మా ఆవిడకు ఒకటి,  రమేష్ ఏడుస్తుంటే మొన్ననే కొత్త టచ్ ఫోన్ కొనిచ్చిన ఇట్లనన్న చదువుతడో ఏమో అని."

     "నరసయ్యా ఇది మనం చేస్తున్న పొరపాటు. పిల్లలకు అతి గారాబం కొద్దీ అవసరం లేని వస్తువులు అన్నీ కొనిస్తాం. అవి పిల్లలు చెడు మార్గం పట్టడానికి కారణం అవుతున్నాయి. ఈ సెల్ ఫోన్ల వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంది. తెలిసీ తెలియని వయసులో పిల్లలు చూడకూడని అంశాలు సెల్ ఫోన్ లో చూస్తున్నారు. వాటికి బానిసలుగా మారుతున్నారు. కొంతమంది పిల్లలు ఎవరూ లేని చోట గుంపులుగుంపులుగా కూర్చొని ఫోన్ చూస్తుండడం గమనించావా? ఈ పిల్లవాడు రాత్రి పది గంటలకు కూడా ఇంటికి రావడం లేదంటే ఆది ఫోన్ పుణ్యమే." 

 "నిజమే సార్ వచ్చినా కూడా వాడు నిద్ర పోయేవరకు ఫోన్ తోటే గడుపుతున్నాడు. అది కాసేపు కనిపించకపోయినా నానా హైరానా చేస్తున్నాడు. బ్యాలెన్స్ అయిపోయింది అంటే డబ్బులు ఇచ్చే వరకు ఒకటే గొడవ." 

    "పిల్లలు చెడి పోవడానికి ఫోను, టీవీ ప్రధాన కారణమవుతున్నాయి. ఫోన్లో సామాజిక మాధ్యమాలకు, టీవీలో సీరియళ్లకు పిల్లలు బానిసలుగా మారుతున్నారు. తల్లిదండ్రులుగా పిల్లలు పెడదోవ పట్టకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన మాటలు పిల్లల తలకెక్కక పోవడానికి కారణం అంతకంటే ఎక్కువగా ప్రభావితం చేస్తున్న ఈ సెల్ ఫోన్ లే. ఇప్పటికైనా పిల్లవాని నుండి సెల్ ఫోన్ దూరం చెయ్యి. అప్పుడు రమేష్ తప్పక బాగుపడతాడు" అన్నాడు హెడ్మాస్టర్.

     "మరి ఫోన్ అక్కర లేదంటారా? దానివల్ల కూడా లాభం ఉందిగా సార్?" అన్నాడు నరసయ్య. "ఫోన్, టీవీల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి కానీ వాటిని దుర్వినియోగ పరచనంతవరకే లాభాలు ఉంటాయి. చెడు వైపు వాడటం మొదలు పెడితే మనిషి పతనానికి కారణం అవుతాయి." అన్నాడు హెడ్మాస్టర్.

    "ఈరోజు వాడు ఇంటికి రాగానే వీపు పగలగొడతా. ఇన్ని రోజులు నేను గమనించలేదు." అంటూ ఆవేశంగా ఊగిపోయాడు నరసయ్య.

    "పిల్లల్ని కొట్టడం పరిష్కారం కాదు. వారిలో పరివర్తన తీసుకురావాలి. దాని వల్ల కలిగే చెడు పరిణామాలను వివరించ గలగాలి. చదువుకోవడం వల్ల జరిగే మేలును గురించి చెప్పాలి. పిల్లలు మాటలతోనే మారుతారు గాని దెబ్బలతో కాదు. ఆవేశపడకుండా ఆలోచనతో రమేష్ కు మంచి బుద్ధులు నేర్పండి. తప్పకుండా పూర్వపు స్థితికి వస్తాడు" అన్నాడు హెడ్మాస్టర్.

    నరసయ్య సంతోషంతో "అలాగే సార్ పిల్లల పెంపకంలో బాధ్యతతో వ్యవహరిస్తాం. వారు దారి తప్పకుండా మా వంతు బాధ్యతను నిర్వహిస్తాం. వెళ్లొస్తాను సార్ ఇంతసేపు మీ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు" అంటూ నరసయ్య కదిలాడు భుజాన తుండు సవరించుకుంటూ...



Rate this content
Log in

More telugu story from Sathaiah Sagarla