Tejaswi Challapu

Others

5.0  

Tejaswi Challapu

Others

మా అన్నయ్యలే నా మొదటి స్నేహితులు

మా అన్నయ్యలే నా మొదటి స్నేహితులు

2 mins
36


"బుజ్జి ఇలా రా"

"బుజ్జి టీ పెట్టు"

"బుజ్జి ఆడుకుందామా"

"బుజ్జి చాక్లెట్ పంచుకుందాం"

"బుజ్జి అమ్మ పిలుస్తుంది"

"బుజ్జి నా ఫోన్ చూసావా"

"బుజ్జి ఎవరో వచ్చారు చూడు"

"బుజ్జి బయట ఉన్నాను, తినడానికి నీకేమైనా తీసుకుని రానా"

"బుజ్జి ఇది కొందామనుకుంటున్నాను నాకు ఎలా ఉంటాది అంటావ్"

"బుజ్జి చికెన్ బిర్యానీ చేసుకుందామా ఇవాళ"

బుజ్జి... బుజ్జి... బుజ్జి...

మా ఇంట్లో అమ్మ అనే పిలుపు తర్వాత ఎక్కువ వినిపించే పేరు ఇదే. ఇంతకీ ఎవరిది ఈ పేరు అనుకుంటున్నారా? నాదే అండి. పిలిచేది ఎవరో కాదు "మా ఇద్దరి అన్నయ్యలు". 

అసలయితే నా పేరు తేజస్వి. అమ్మ, నాన్న మొదలు అందరూ నన్ను "తేజా" అనే పిలుస్తారు కానీ అన్నయ్యలు మాత్రం "బుజ్జి" అంటారు. 

ఒకసారి అమ్మని అడిగా:

నేను : "అమ్మా! నా పేరు తేజ కదా మరి అన్నయ్యలు మాత్రం ఎందుకు బుజ్జి అని పిలుస్తారు?" 

అమ్మ : నువ్వు పుట్టినప్పుడు అన్నయ్యలు కూడా చిన్న వాళ్ళే కదా! నీ బుడ్డి బుడ్డి వేళ్ళు పట్టుకుని ఆడుకుంటూ, అమ్మా! చెల్లి పేరు ఏంటమ్మా అని అడిగేవారు. చెల్లి ఇంకా బుజ్జిది కదా పేరు పెట్టలేదు అని చెప్పేదాన్ని. అంతే అప్పటి నుంచి బుజ్జి అని పిలవడం మొదలు పెట్టారు.

అది విన్నప్పుడు నాకు భలే అనిపించింది. అదే కాదు అమ్మ మా చిన్ననాటి విషయాలు ఏం చెప్పినా ఒళ్ళు పులకరిస్తాది.

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి!! కాదు... కాదు... ఊహ తెలియక ముందు నుంచి "నా ప్రాణ స్నేహితులు అయిపోయారు మా అన్నయ్యలు".

పెద్ద అన్నయ్య అమ్మలా ప్రేమని కురిపిస్తే, చిన్న అన్నయ్య నాన్నల బాధ్యత వహిస్తాడు.

ఎప్పుడు నన్ను ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు అని ఆపలేదు. ఇలా ఉండు, అలా ఉండు అని ఆంక్షలు పెట్టలేదు. నన్ను నాలా ఉండనిచ్చారు. 

ఒక చిన్న సరదా సంఘటన చెప్తా వినండి:

చిన్నప్పుడు మేముండే వీధిలో అందరూ అబ్బాయిలే. అన్నయ్యలు, వాళ్ళందరూ కలిసి క్రికెట్ ఆడుకునే వాళ్ళు. నేను : నాతో ఎవరూ ఆడట్లేదు అని నేను అమ్మని సతాయిస్తున్నాను. 

అన్నయ్యలు : ఈలోపు క్రికెట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నావని నన్ను అడిగారు. 

నేను : మీరిద్దరూ ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారు, నేనొక్కర్తినే ఉంటున్నా, నాతో ఆడుకోవడానికి ఎవరూ లేరు అని దీర్ఘాలు తీసాను. 

అంతే ఆ తరువాతి రోజు నుంచి అందరూ వచ్చి మా ఇంట్లో ఆడుకోవటమే కాకుండా నన్ను కూడా వాళ్ళతో ఆడించేవాళ్ళు. 

ఇది వినడానికి అందరికీ చిన్న విషయంలానే అనిపించొచ్చు కానీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా వాళ్ళు నా చేతిని ఎప్పుడు వదలలేదు అలా అని నా స్వేచ్ఛను లాగుకొనలేదు.

ఏ అమ్మాయి అయినా కోరుకునేది ఇదే. అండ కావాలి కానీ ఆ అండ అడ్డం కాకూడదు. 

ఇలానే మా అన్నయ్యలు నాతో ఎల్లకాలం స్నేహితులుగా ఉంటారని ఆసిస్తూ.... 

ఓ చిట్టి చెల్లి


Rate this content
Log in