STORYMIRROR

C v subba Rao Madhunapanthula

Others

3.0  

C v subba Rao Madhunapanthula

Others

ఎవరికి ఋణo

ఎవరికి ఋణo

4 mins
352

ఉదయం పది గంటలు అయింది. తెల్లటి కారు ఆ వృద్ధుల ఆలయం ముందు ఆగింది. కారులోంచి బ్యాగ్ పట్టుకుని ఒక యువకుడు ఒక వృద్ధురాలు దిగి తిన్నంగా రిసెప్షనిస్ట్ గదిలోకి తొంగి చూసారు. అప్పటికే రిసెప్షనిస్ట్ చుట్టూ చాలామంది గుమిగూడి ఉన్నారు. అమ్మా ఇక్కడ కూర్చుoదాము ఖాళీ అయ్యాక వెళ్ళవచ్చు అంటూ గది బయట ఉన్నబల్ల మీద కూర్చున్నారు తల్లి కొడుకు.


 కొంతసేపటికి జనమంతా బయటకు వచ్చేసారు. అమ్మ నేను వెళ్లి మాట్లాడ వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు అన్నాడుకొడుకు రఘు.ఆ తల్లి నుండి ఏమి స్పందన లేదు. ఎటో చూస్తూ ఉండిపోయింది. మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటూ ముక్కు ఎగపీలుస్తోంది.మొహం అంతా కందగడ్డలా ఉంది. నాన్నగారి పోయిన తర్వాత అమ్మ బాగా బెంగపెట్టుకుంది ఆరోగ్యం కూడా సరిగా లేనట్టుగా ఉంది. నాన్న బతికున్న ఉన్నన్నాళ్ళు ఆమెకు ఏ దిగులు లేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఇలా ఒంటరి అయిపోయింది. అమెరికా తీసుకెళ్దామంటే ఇద్దరు ఉద్యోగస్తులo. పిల్లలంతా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా పెద్దవాళ్లకు అక్కడ తోచదు. ఒంటరిగా ఇంట్లో ఉండవలసి వస్తుంది.


 చాలామంది భార్యలు లాగే తన భార్య కూడా అమ్మ చేత పనులు చేయిస్తుంది. అమ్మ నాన్న కలిసి అమెరికా వచ్చినప్పుడు అన్ని పనులు అమ్మే చేసేది. రఘు భార్య మొహమాటానికి కూడా వద్దని చెప్పలేదు.ఏనాడు గుప్పెడుఅన్నం అత్తమామలకు వండి పెట్టలేదు. రోజు ఉదయం 9 గంటలకు లేచి స్నానం చేసి హడావుడిగా టిఫిన్ తిని బాక్స్ పట్టుకుని ఆఫీస్ కి వెళ్ళిపోయేది. అమ్మ నాన్న ఉన్నన్నాళ్ళు ఇలాగే జరిగింది. సాయంకాలం కూడా ఇదే పద్ధతి. మామూలుగా రోజు ఇంట్లో వంట చేసుకునే భార్య లత అమ్మ రాగానే పద్ధతి మార్చేసింది. ఇవన్నీ అమ్మ గమనించలేదేమో కానీ రఘు గమనిస్తూనే ఉన్నాడు.తండ్రి కూడా అమ్మని అనేకసార్లు పనిచేయవద్దని హెచ్చరించడం రఘు గమనించకపోలేదు.


అమ్మకు తెలిసిందల్లా ఒకటే. ప్రేమ అందులో మాయ మర్మం ఉండదు.రఘు తండ్రి టీచర్ గా పని చేయడంతో ఒక్కగానొక్క కొడుకుని క్రమశిక్షణగా పెంచారు. విద్యాబుద్ధులు చక్కగా చెప్పించి సాఫ్ట్వేర్ ఇంజనీరుని చేశారు.మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. భార్య లత కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏ లోటు లేదు. ఇద్దరూ మగ పిల్లలు పుట్టారు. నాన్న హఠాత్తుగా పోవడంతో అమ్మను ఏం చేయాలనే ప్రశ్న మనసును వేధిస్తోంది.


 ఆఖరికిస్నేహితుడుసలహామీదఈవృద్ధులఆలయంలోచేర్పించవలసి వస్తోంది .అమ్మకు నిజం చెప్పలేదు బయటికి వెళ్దామని బట్టలు సర్ది తీసుకొచ్చాను. ఇవన్నీ అయ్యేటప్పటికి ఏ టైం అవుతుందో సాయంకాలం ఫ్లైట్ కి అమెరికా వెళ్ళిపోవాలి అని ఇలా ఆలోచిస్తూ రిసెప్షనిస్టు గదిలోకి అడుగు పెట్టాడు రఘు. విషయం అంతా receptionist కి రహస్యంగా చెప్పాడు రఘు ఈ అప్లికేషన్ పూర్తి చేయండి అంటూ ఫారం చేతిలో పెట్టింది. అప్లికేషన్ ఫారం పూర్తి చేసి డబ్బు కూడా పూర్తిగా కట్టేసాడు. సామాన్లు తీసుకుని అటెండర్ రాగా అమ్మ చేయి పట్టుకుని ముందు నడిపించి మూడో నెంబర్ గదిలోకి అడుగుపెట్టాడు రఘు తల్లి పార్వతమ్మ తో పాటు. ఎక్కడ సామానంతా అక్కడ సర్దేసి అటెండర్ వెళ్ళిపోయాడు. అమ్మతో కబుర్లు చెబుతూ ఉండిపోయాడు రఘు.పార్వతమ్మ దేనికి సమాధానం చెప్పటం లేదు.అన్నింటికీ తల ఊపుతూనే ఉంది. అమ్మ మనసులో ఏమనుకుంటోంది? అమ్మ దేనికి నన్ను ప్రశ్నించలేదు. ఎక్కడికి తీసుకు వచ్చావు అని అడగలేదు. చిన్నప్పుడు అబద్ధం చెప్తే చెవి మెలిపెట్టేది. ఇప్పుడు ఆమెకు ఆ హక్కు ఉన్నా ఎందుకో మీద చెయ్యి వేయడం లేదు. నేను అబద్ధం చెప్పిన సంగతి ఆమెకు తెలిసిపోయిందా. తెలిసి నాటకం ఆడుతోందా. తన కష్టం చిన్నప్పటినుంచి ఎవరికి చెప్పలేదు. అది ఆమె నైజం. ఇలా ఆలోచిస్తుండగా లంచ్ బెల్ మోగింది.


డైనింగ్ హాల్ లో తల్లి పార్వతమ్మతో పాటు అడుగుపెట్టాడు రఘు. అక్కడ అందరూ ఇంచుమించుగా అమ్మ వయసు వాళ్లే. అందరి కళ్ళల్లో నిరాశ కనబడుతోంది. అయిన వాళ్లందర్నీ వదులుకొని ఇలా ఒంటరిగా ఉండవలసి వస్తుందని బాధ కళ్ళల్లో కనబడుతోంది. చేతిలో కలుపుకున్న ముద్ద పూర్తిగా నోరు చేరడం లేదు . మధ్య దారిలోనే కింద పడిపోతుంది. అంటే శక్తి ఎంతవరకు ఉందో అర్ధం అవుతుంది. యాంత్రికంగా ఏదో తింటున్నారే తప్పితే ఓ ఉత్సాహం ఎక్కడ కనపడట్లేదు. ప్రతి ఒక్కరి వెనుక గుండెల పిండే కథ . ఇద్దరు యాంత్రికంగా నాలుగు ముద్దలు తిని మళ్లీ ఇద్దరూ గదిలో చేరారు.


 అమ్మా కాసేపు పడుకో అంటూ పక్క సర్ది నేను ఇప్పుడే వస్తాను అంటూ పార్వతమ్మ గారు నిద్రలోకి జారే వరకు గదిలో ఉండి తర్వాత రిసెప్షనిస్ట్ గదిలోకి వెళ్ళి తల్లి గురించి జాగ్రత్తలు చెప్పి కళ్ళు తుడుచుకుంటూ తన కారు ఎక్కి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయాడు రఘు. సాయంత్రం ఆరు గంటలు అయింది. పార్వతమ్మ గారు కళ్ళు తెరిచేటప్పటికీ ఎక్కడున్నారో అర్థం కాలేదు. చుట్టుపక్కలంతా చూసింది . ఎవరు కనపడలేదు. బాబు రఘు అంటూ గట్టిగా అరిచింది. ఎక్కడి నుంచి సమాధానం రాలేదు.కనపడిన వాళ్లందరినీ మా అబ్బాయి ఎప్పుడు వస్తాడు అంటూ అడుగుతూ ఆ శరణాలయం అంతా కలియ తిరుగుతోంది.


కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. చిన్నప్పుడు తల్లి కనబడని బిడ్డ ఏ విధంగా ఏడుస్తాడో ఆ విధంగా ఉంది ఆమె పరిస్థితి.ఆ సిబ్బందికి కళ్ళు నీళ్లు ఆగలేదు ఆమె బాధ చూసి. పార్వతమ్మ మాటిమాటికి వీధి వేపు తొంగి చూస్తోంది. రాత్రి భోజనాలు వేళయింది బలవంతంగా నాలుగు ముద్దలు శరణాలయం వాళ్లే తినిపించి బలవంతంగా నిత్యం వేసుకునే మందులతో పాటు నిద్ర మాత్రలు వేసి పడుకోబెట్టారు. ఎప్పటిలాగా తెల్లారింది. పార్వతమ్మ మొహం కడుక్కుని శరణాలయం సిబ్బంది అందించిన కాఫీ తాగి పెట్టి చేతిలోకి తీసుకుని వీధి గేటు తీసుకుని రోడ్డు పక్కగా నిలబడి వచ్చేవారిని పోయే వారిని పలకరించి మా అబ్బాయి వస్తున్నాడు నేను అమెరికా వెళ్ళిపోతున్నాను అంటూ చెప్పసాగింది.


ఇదంతా వెనక నుండి గమనిస్తున్న శరణాలయ సిబ్బందికి కన్నీళ్లు ఆగడం లేదు. రోజు ఎంతోమంది వృద్ధులు ఈ శరణాలయంలో చేరుతుంటారు. అయినా ఇటువంటి అనుభవం ఎప్పుడూ వారికి కలగలేదు అనుకుంటూ పార్వతమ్మ గారి దగ్గరికి వెళ్లి అమ్మ మీ అబ్బాయి రేపు వస్తాను అని ఫోన్ చేశాడు అని అబద్ధంచెప్పిపార్వతమ్మనిలోపలికితీసుకొచ్చారు. అలా రెండు సంవత్సరాలు గడిచి పోయాయి.


 పార్వతమ్మ గారి దినచర్యలో ఏమీ మార్పు లేదు. రోజు అదే తంతు. శరణాలయ సిబ్బంది కూడా అలవాటైపోయింది ఈలోగా ప్రపంచం అంతా కుదిపేసిన కరోనా శరణాలయానికి కూడా పాకింది. జాగ్రత్తలు పాటించని పార్వతమ్మని కూడా తీసుకుపోయింది చాలామంది వృద్ధులతో పాటు. ఈ విషయం కొడుకు రఘు కి ఫోన్ చేసి చెప్పారు శరణాలయం సిబ్బంది .ఇక్కడ ఎయిర్ పోర్ట్ లన్ని మూసేశారు . మేము ఇల్లు కదలడం లేదు. కరోనా మూలంగా వర్క్ ఫ్రం హోమ్ .మీకు డబ్బు పంపిస్తాను. మీరే ఆ కార్యక్రమం అంటూ మధ్యలోనే మాట ఆపేశాడు. శరణాలయం సిబ్బందికి కన్నీరు ఆగలేదు. పరిస్థితులు ఒక్కొక్కసారి మన చేతుల్లో ఉండ వు. పున్నామ నరకం తప్పించే కొడుకు కోసం తల్లితండ్రులు ఎన్నో కలలు కంటారు.


ఈ తల్లికి ఉన్న పరిస్థితుల అటువంటివే. ఆఖరి రోజుల్లోనూ కొడుకు దగ్గర లేదు. ఈ లోకం నుండి వెళ్లిపోయిన తర్వాత కూడా కరోనా దగ్గరికి చేరనివ్వలేదు. ఎంతోమంది అనాధ శవాలకి దహన సంస్కారాలు చేసిన శరణాలయ సిబ్బంది స్వచ్ఛందంగా చందాలిచ్చి దశ దానాలతో సహా యధావిధిగా పార్వతమ్మ గారి కర్మకాండ జరిపించి మానవత్వం చాటుకున్నారు కొందరి తలరాతలు విచిత్రంగా ఉంటాయి. ఏ సంబంధం లేని వాళ్లు కర్మకాండలు జరపడం నిజంగా పార్వతమ్మ గారి అదృష్టం. ఎవరి రుణం ఎవరు తీర్చుకుంటారో ఆ పైవాడికే ఎరుక.


 రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279


Rate this content
Log in