నేను చెట్టుని మాట్లాడుతున్న
నేను చెట్టుని మాట్లాడుతున్న
నేను చెట్టుని మాట్లాడుతున్న
అందరు భూమ్మీదపడ్డట్టే నేను కూడా!
ఆకలైతే అమ్మ బువ్వేసిచ్చినట్టూ
రోజు యిన్ని పండ్లు రాల్పుత
మీరు రాళ్లతో కొట్టినప్పుడు
నా ఒళ్ళంతా పచ్చి పుండయితది...
బడిలో సార్లు చెప్పిన పాఠాలు
తిరిగి అప్పజెప్పనందుకు మీరు మాత్రమే కాదు
నేను కూడా!
ఎక్కడికక్కడ పెలపెలా విరిగిపోతా...
చేనుకు కట్టుకపోయిన సద్ధిముల్లె కింద వెడితే
చీమలలెక్కుతయి, దుమ్ము వడుతదని
కూలీ తల్లులంతా చెట్లకొమ్మలకు దేవులాడినప్పుడే
నేను గెలిసిన...
జాతరని రొండు మూడు రోజుల ముందునుండే
బండ్లు కట్టుకొనొచ్చిన ఊరంత మందికి
నేనుంటా!
మీ తాతలు,తండ్రులు నాటిన యాదిలో...
నాది వృక్షజాతే అయిన
మనుషులెప్పుడు నాలో వేరు కాదు!
మనుషులు మనుషులుగా రాలిపోతున్న
యీ నేలన నేనో విత్తుని
నీళ్లుపోసిన మీరే! నిలువుకు నరుకుకున్న మీరే!
చెట్టంటే ఒక నిండు ప్రాణం అనేంతలా
అల్లుకుపోయిన తల్లి,పిల్లవేర్లని
ఏ బుల్డోజర్లతోనో జేసీబిలతోనో తెంచేస్తారెందుకు?
నాకు అర్థంకాక అడుగుతా!
ప్రతి ఇంట్లో పట్టదారు పాస్ బుక్కున్నట్టుగా
చెట్లనెందుకూ ఉంచుకోరు?
చెట్టుంటే మనిషున్నట్టూ
చెట్టుంటే ఇల్లున్నట్టూ
చెట్టుంటే ఊరే ఉన్నట్టూ...
ఊరంత బోనం ఎత్తుకొని వస్తున్నప్పుడు
పసుపు కుంకుమల బొట్లు పెట్టుకున్న,
ఎల్లమ్మ తల్లినయిత...
ఇంటికాడ మీరు పిల్లలను యిడిసి
పనులకు వెళితే నేను అమ్మమ్మనయిత
బుద్ధుడు లాంటి ఋషులెందరో
నా దగ్గరకు వస్తే జ్ఞానబోధ చేసినదానను
బడులల్లో ఆరుబయట తరగతి గదినై
ఎందరెందరికో బతుకు పాఠాలు చెప్పిన
పానం బాలేక మంచంమీద పడ్డప్పుడు
నాలోని ఔషధ గుణాన్ని మీకు అందించిన
ఆ బలానంత కూడగట్టుకొని గొడ్డండ్లతో
ఏపొద్దు దాడికి దిగిన అడ్డుచెప్పనూ లేదు
నా కొమ్మను రెమ్మను కాండాన్ని
పువ్వును మీకు అర్పిస్తున్న
మొద్దు నుండి మళ్ళీ చిగురిస్తుంటే
గ్యాసు పోసి కాలుస్తూ
మిమ్మల్ని మీరు సంపుకుంటారెందుకు?
నన్ను కాదు! మీరు తగులబెట్టేది
మీ అస్థిత్వాలను...
◆ తలారి సతీష్ కుమార్
