గోదా. లిఖిత్ కుమార్

Children Stories


4.7  

గోదా. లిఖిత్ కుమార్

Children Stories


విందు ఆంతర్యం..బంగారు వర్షం

విందు ఆంతర్యం..బంగారు వర్షం

2 mins 112 2 mins 112


విధర్భ రాజ్యానికి చక్రవర్తి వేదాంతుడు. ఆయని పాలనలో ప్రజలు ఎంతో సుభిక్షంగా, సుఖసంతోషాలతో జీవించే వారు. తన దగ్గర బంగారు రాశులు, వజ్రాల నిధులు సమృద్ధిగా వున్నాయి.

ఒక రోజు తన సభకు బంగారయ్య అనే బీదవాడు వచ్చాడు ఓ ఆహ్వాన పత్రిక ను చేతపట్టుకుని. అతని అవతారం ఎలా వుందంటే మాసిన గడ్డంతో, చినిగిన బట్టలతో, చింపిరి జుట్టు తో అచ్చంగా ఒక పపిచ్చివాడిలా ఉన్నాడు. వేదాంతుడికి నమస్కరించి ''మహారాజా! నన్ను బంగారయ్య అంటారు. పేరుకే బంగారయ్య కానీ నా జీవితంలో ఒక్క పైసా కూడా నిలిచింది లేదు. నేను కటిక బీదవాణ్ణి. యువకుడినే అయినా ఏదో ఒక పని చేసి జీవనం సాగిద్దామనుకున్నా ఎక్కడా పని దొరకడం లేదు. ఎవ్వరూ ఇవ్వడం లేదు. నా వల్ల, నా నిరుపేద స్థితి వల్ల నా కుటుంబం ఎన్నో ఇక్కట్లు అనుభవిస్తుంది.అయినా నేను మీకు రేపు విందు ఇవ్వదలిచాను.తప్పకుండా తమరు నా ఇంటికి విచ్చేసి నేను ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా మనవి. దయచేసి నా ఈ ఆహ్వానాన్ని పెడచెవిన పెట్టకుండా నా ఆహ్వనాన్ని అందుకోండి. నేను మీకు ఏ లోటు లేకుండా ఆతిథ్యం ఇస్తాను. కావున ఈ నిరుపేద బంగారయ్య ఆహ్వానాన్ని తప్ప కుండా అందుకోగలరు. నా ఇంటికి విచ్చేయగలరు''. అని అన్నాడు బంగారయ్య. వేదాంతుడు ఆలోచన లో పడ్డాడు. ''ఒక పేద వాడు తన కెలా విందు, సకల సౌకర్యాలు కల్పిస్తాడు. పూటకు గడవడమే ఎంతో కష్టంగా ఉంది అతని పరివారానికి తన వేషం, మాటలు చూస్తుంటే. అయినా తనకు పంచభక్ష పరమాన్నాలు కల్పిస్తానంటున్నాడు. నా దగ్గర నుండి ఏం ఆశిస్తున్నాడు. ?''అనే ఆతృత, సందేహంతో, అతని తో ''సరే! నేను వస్తాను లే! ''అని బదులు ఇచ్చాడు.

మరుసటి రోజు వేదాంతుడు తన మంత్రులు, సైన్యంతో బంగారయ్య ఇంటికి ఆతిథ్యానికి వెళ్లాడు. మహారాజుని బంగారయ్య కుటుంబ సభ్యులు, పూలు ఆయని పై చల్లుతూ ఎంతో సాదరంగా ఆహ్వానించారు. బంగారయ్య భార్య సుమతి వేదాంతుడికి పంచభక్ష పరమాన్నాలు వడ్డించింది. మహారాజు కడుపు నిండా భోజనం ఆరగించాడు.

''ఇక సరే!భోజనం,నీ పరివార ఆహ్వానం నన్ను మెప్పించింది. భళా! మంచి ఆతిథ్యాన్ని కల్పించావు. రాజ్యాంలో చాలా పని ఉంది. నేనిక బయల్దేరతాను బంగారయ్య!''అని అన్నారు. బంగారయ్య ఎంతో దిగులు తో వేదాంతుడుని సాగనంపే ఏర్పాటు చేశాడు. వేదాంతుడు వెళ్లే ముందు ''బంగారయ్య! అసలు నన్ను విందుకు పిలవడానికి గల ఆంతర్యమేమిటి? కాస్త దిగులు కూడా నీ ముఖంలో తాండవిస్తుంది. ఏమిటి విషయం? ''అని అడిగాడు. బంగారయ్య చేతులు జోడించి నమస్కరించి, బిక్క ముఖంతో, నీరస గొంతు తో అసహనం వ్యక్తపరుస్తూ ''మహారాజా! మీరు కుబేరిడితో సమానమట కదా! మీరున్న చోట బంగారు వర్షం (నాణేలు )కురుస్తుందట అని నా మిత్రుడు చెబితే విన్నాను. నేను కటిక బీదవాణ్ణి కదా!ఎలాగోలా అప్పు చేసి మీకు విందు ఇస్తే నా ఇంట్లో బంగారు వర్షం కురుస్తుందనే ఆశతో అప్పులు చేసి మిమ్మల్ని ఆతిథ్యానికి ఆహ్వానంచాను. కానీ, అంతా నా దురదృష్టం. నాకు దిగులే తప్ప ఒక్క పసిడి నాణం కూడా రాల లేదు. ఇక నా గతేంటో? ఎలా బ్రతకాలో? భగవంతుడా ? '' అని మొరపెట్టు కున్నాడు.

వేదాంతుడికి అతని సైన్యనికి పగలబడేంత నవ్వు వచ్చింది. మహారాజు నవ్వుతూ ''భలే వాడివయ్య! నేనున్న చోట బంగారు వర్షం కురుస్తుందని, బంగారు నాణేలు రాలతాయని నమ్మివా? పిచ్చి బంగారయ్య!పోనీ లే నీ అమాయకత్వం నా సంపదకి నిదర్శనమని తెలుస్తుంది. సరే! ఇందా వెయ్యి బంగారు వరహాల వర్షం. ఈ ధనం చక్కగా నీ వ్యాపారానికి వినియోగించు. నీ కుటుంబాన్ని చక్కగా పోషించుకో. ఇక నేను వెళ్ళి వస్తాను! ''అని వరహాల మూట ఇచ్చారు. ''అంతా మీ దయ ''అని అన్నాడు బంగారయ్య. వేదాంతుడు రాజ్యానికి పయనమయ్యాడు. బంగారయ్య రాజు ఇచ్చిన ధనం తో వ్యాపారం మొదలు పెట్టి, కుటుంబాన్ని పోషించసాగాడు.

రచన : గోదా. లిఖిత్ కుమార్.


Rate this content
Log in