కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children Stories

3  

కాశీవిశ్వనాధం పట్రాయుడు

Children Stories

రోలు మొర మద్దెల చురచుర

రోలు మొర మద్దెల చురచుర

1 min
37


రోలు మొర..మద్దెల చుర చుర

*********************************


అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో సీతాపతి అనే మద్దెల వాయిద్య కళాకారుడు ఉండేవాడు. నిత్యం కార్యక్రమాల్లో పాల్గొంటూ తన అసమాన ప్రతిభతో అందరి మెప్పు పొందేవాడు. వారు ఇచ్చిన డబ్బుతో జీవనం సాగించేవాడు. 


సీతాపతి ఇంట్లో కర్రతో చేసిన రోలు, రోకలి ఉండేవి. ఆ ఊరి మొత్తం మీద అదొక్కటే రోలు, రోకలి. ఒకసారి పొరుగూరిలో కార్యక్రమాన్ని ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు సీతాపతి. గుమ్మంలో ఉన్న రోలు పక్కనే మద్దెలను ఉంచి విశ్రాంతి తీసుకోవడానికి గదిలోకి వెళ్ళాడు. ఇదే అదనుగా భావించి రోలు "ఎన్ని రోజులయ్యింది మిత్రమా నిన్ను కలిసి. పక్కనించే వెళ్తావు కానీ తలతిప్పి చూడవు, పలకరించవు. నీ పని బాగుంది, రోజుకో ఊరికి షికారు చేసి వస్తున్నావు. నేను ఈ ఊరు దాటలేదు. అయినా ఎన్ని అనుకుని ఏం లాభం చేసుకున్నవారికి చేసుకున్నంత" అంది నిట్టూరుస్తూ.


"ఏమైంది మిత్రమా అంత బాధ పడుతున్నావు?" అని అడిగింది మద్దెల.


"ఏమని చెప్పను. ఊరు మొత్తానికి నేనొక్క దాన్నే అవడంతో పసుపు దంచడానికి, వడ్లు దంచడానికి నన్ను వాడి నా ఒళ్లు హూనం చేస్తున్నారు. అన్నట్టు మర్చిపోయాను కారం దంచిన రోజు అయితే నా ముక్కు పుటాలు అదురుతాయి. ఊపిరి ఆడదు. తుమ్ములే తుమ్ములు. నా కష్టాలు ఎన్నని చెప్పను?" అని మద్దెల దగ్గర వాపోయింది రోలు. 


"మిత్రమా నీటిలో మునిగిపోతున్న వాడి మెడను మరొకడు పట్టుకున్నట్టు... నీ కష్టాలు నాకే చెప్పు..." అంది మద్దెల.


"ఎందుకలా అన్నావు" అని అడిగింది రోలు.


"నీకు ఒక వైపే వాయింపు. నాకు గూబలు గుయ్య్ మన్నట్లు రెండు పక్కలా వాయింపే. ఆ శబ్దాన్ని నేను భరించలేకున్నాను. నేను ఎవరితో చెప్పుకోను?"అంది మద్దెల బాధగా.


"రోలు వెళ్ళి మద్దెలతో మొరపెట్టుకుంది చూడు... భలే భలే" అని పకపక నవ్వింది రోకలి.


(ప్రజాశక్తి చిన్నారి లో 2-3-2024 న ప్రచురితమైంది)


Rate this content
Log in

More telugu story from కాశీవిశ్వనాధం పట్రాయుడు