మనవత్వం విరిసింది బాలల
మనవత్వం విరిసింది బాలల


అభినవ్ డి.ఎ.వి. స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు.
చదువులోను ఆటల్లోను ముందుంటాడు. జంతువులన్నా పక్షులన్నా
ప్రేమ ఎక్కువ. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూంటాడు.
ఇంటి ఆవరణలో పక్షులకు గూళ్లు కట్టి చిన్న ప్లాస్టిక్ టబ్ లలో
నీళ్లు తిండి గింజలు ఏర్పాటు చేస్తూంటాడు. గూళ్లలోంచి పక్షి పిల్లలు
కింద పడిపోతే జాగ్రత్తగా వాటిని గూటికి చేరుస్తాడు.
స్కూలు అయిన తర్వాత , శలవు రోజుల్లో ఇంటి ముందున్న పూల
మొక్కలకు నీళ్లు పెట్టడం, పెరట్లో కూరగాయ మొక్కలకు గొప్పులు
తవ్వడం , కూర పాదులకు పందిరి వేయడంలో తాతయ్యకి సహాయం
చేస్తూంటాడు.
రోజూ మాదిరి పుస్తకాల బేగు పట్టుకుని స్కూలుకి బయలు
దేరాడు అభినవ్. స్కూల్ బస్సు కోసం రోడ్డు పక్కన నిలసడి ఎదురు
చూస్తున్నాడు.
ఇంతలో తన పక్క నుంచి ఒక వీధి కుక్క రోడ్డు దాటే తొందరలో
పరుగు పెట్టింది. అనుకోకుండా ఒక కారు స్పీడుగా వచ్ఛి కుక్కను
వెనక నుంచి ఢీ కొట్టి వెళిపోయింది. కారు చక్రాలు కుక్క వెనుక కాళ్ల
మీద నుంచి తొక్కి పోయాయి.
కుక్క వెనుక రెండు కాళ్లూ నుజ్జయి పోగా అరుచుకుంటూ
ముందు కాళ్ల సాయంతో ఈడ్చుకుని రోడ్డు అవతలి పక్కనున్న
పాన్ షాపు దగ్గరకు చేరింది.
రోధిస్తున్న కుక్కను చూసిన అభినవ్ మనస్సు కరిగిపోయింది.
పరుగున రోడ్డు దాటి కుక్క దగ్గరికి చేరుకున్నాడు. కుక్క బాధతో
మొరుగుతోంది. అటుగా వెల్తున్న జనం ఎవరూ పట్టించుకో లేదు.
అభినవ్ వెంటనే తన దగ్గరున్న వాటర్ బాటిలు నుంచి నీళ్లు
కుక్క నోట్లో పోసాడు. టిఫిన్ బాక్సు నుంచి బిస్కిట్సు తీసి దాని
నోటికి అందించాడు. ఇంతలో స్కూల్ బస్సు రావడంతో దిగులుగా
బస్సెక్కాడు. అభినవ్ స్కూల్ కి చేరాడే
కాని క్లాసులో కూడా కాళ్లు
విరిగిన కుక్క గురించే ఆలోచిస్తున్నాడు.
సాయంకాలమైంది. స్కూలు అయిన తర్వాత అభినవ్ స్కూల్
బస్సు ఎక్కి తన స్టాప్ దగ్గర దిగి ఆతృతగా పాన్ షాపు దగ్గర కెళ్లి
చూడగా కుక్క కనబడలేదు. పాన్ షాపతన్ని అడిగితే మున్సిపల్
వారు బస్టాపు వెనక పడేసినట్టు చెప్పాడు. పరుగున బస్టాప్ వెనక్కి
చూడగా కుక్క నీర్సంగా పడుంది. అభినవ్ ని చూడగానే విశ్వాసంతో
తోక ఆడించింది.
అభినవ్ వెంటనే దగ్గరగా ఉన్న తన ఇంటికి చేరుకుని అమ్మనడిగి
సీసాతో పాలు , చిన్న ప్లాస్టిక్ ప్లేటు తెచ్చి కుక్క నోటి వద్ద బ్రెడ్డు పాలు
ఉంచాడు. కలత చెందిన మనసుతో ఇంటికి తిరిగి వచ్చి జరిగిన
విషయం తాతయ్యకి చెప్పాడు. వాడి దయా గుణానికి అభినందించారు.
రాత్రంతా కుక్క ఆలోచనలతోనే గడిపాడు.. మర్నాడు స్కూలుకి
తొందరగా బయలుదేరి బస్టాపు దగ్గర పడున్న ఠుక్కకి బ్రెడ్డు పాలు
అన్ని వసతులు ఏర్పాటు చేసి బాధగా వెళ్లాడు.
స్కూలు అయిపోగానే తొందరగా బయలుదేరి ఆందోళనగా
బస్టాప్ వెనక కొచ్చాడు. కుక్క కనిపించ లేదు. దిగులుగా పాన్ షాపతన్ని
అడిగితే కుక్క చనిపోయిందనీ , మున్సిపల్ సిబ్బంది చెత్తల బండిలో
వేసుకు పోయారని చెప్పాడు.. అభినవ్ దిగ్బ్రాంతికి గురయాడు.
బాధగా ఇంటికి వచ్చిన అభినవ్ ని విషయం అడిగి తెలుసుకుని
కుక్క చచ్చిపోయిందని విని మాటలతో ఓదార్చేరు.
వారం రోజుల వరకు అభినవ్ మామూలు స్థితికి రాలేక పోయాడు.
* * *