STORYMIRROR

Santhosh Sarma Lakkaraju

Others

4  

Santhosh Sarma Lakkaraju

Others

బైరాగి

బైరాగి

4 mins
15

ఔరంగాబాద్ కు సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఘృష్ణేశ్వరం. ఔరంగాబాద్ పట్టణానికి అతి చేరువైనా కూడా కొండల మధ్యలో, జన రద్దీకి దూరంగా రహదారి పక్కన పొదలలో చుట్టు చుట్టుకుని పడుకున్న పాములా అనిపిస్తుంది ఈ జ్యోతిర్లింగ దేవాలయం. ఆ గుడి ముందర ప్రదక్షిణ మార్గంలో ఒక మూలకి కూర్చుని ఉంటాడు అతను. వయసు నలభై సంవత్సరాల పైనే ఉంటుంది. తెలుగు దేశం నుండి ఎప్పుడో ఘృష్ణేశ్వరంకి వచ్చాడు. మాసిపోయిన ధోవతి, తలకి చుట్టు, చేతిలో ఒక డోలు, ఇదే అతని ఆస్తి. రోజూ గుడి తెరిచే సమయానికి వస్తాడు, ఎప్పుడూ ఒకే చోట కూర్చుంటాడు. శూన్యంలోకి చూస్తూ అలానే కూర్చుని ఉంటాడు. మధ్యాహ్నమో, సాయంత్రమో ఒకసారి తలకి చుట్టిన గుడ్డ తీసి పక్కన పరిచి, డోలు నెమ్మదిగా వాయిస్తూ ఒక పాట పాడతాడు.


భక్తి నిండిన మదిలో

పాట పొంగుచున్నది

రసిక శిఖామణి

నీ పదము చేరుతున్నది..


ఇలా అతను తెలుగులో పాడుతుంటే, భాష అర్ధం కాకపోయినా, భావము గ్రహించలేకపోయినా, ఎదో ఒక తీక్షణ శక్తి పట్టి ఆపినట్టు ప్రదక్షిణ చేసే జనం ఆగిపోయి ఒక రసానుభూతికి లోనవుతారు. పాట అవగానే తృణమో పణమో అతని పక్కన పరిచిన తల చుట్టు మీద వేసి తిరిగి వారి కోరికల వలయాన్ని గుడి చుట్టూ తిప్పటానికి కదులుతారు.

సంధ్య దాటగానే అతను వచ్చిన కాసిన్ని డబ్బులు తల గుడ్డలో చుట్టుకుని, లేచి బయట నుంచే ఘృష్ణేశ్వరునికి ప్రణమిల్లి వెళ్ళిపోతాడు. ఇది గత ఇరవై ఏళ్లుగా అతని దినచర్య. అతని పేరు ఎవరికీ తెలీదు. డోలు బైరాగి అని పిలుస్తుంటారు అక్కడి జనం.

ఒక రోజు ఔరంగాబాద్ నుండి గౌరవ్ ప్రభు అనబడే ఒక ప్రముఖ సంగీత విద్వాంసుడు ఆ గుడికి వచ్చాడు. సరిగ్గా అదే సమయానికి బైరాగి పాట అందుకున్నాడు. అతడు డోలు వాయించే విధానం, గాద్గదిక కంఠంలోనుండి వస్తున్న పాట గాఢత ఆ విద్వాంసుడుని మంత్ర ముగ్ధుడుని చేసాయి. పాట పూర్తవగానే గౌరవ్ బైరాగి దగ్గరికి వెళ్లి అతని చేతులు పట్టుకుని అభినందిస్తూ తనతో ఔరంగాబాద్ రమ్మని, అక్కడ ఒక కచేరి ఏర్పాటు చేస్తానని, అక్కడ బైరాగి పాడవలసిందిగా కోరాడు. ఈ మాటలు విని బైరాగి నవ్వుతూ నేను ఈ గుడిలో తప్ప ఇంకెక్కడా పాడను అన్నాడు. కానీ గౌరవ్ వదిలిపెట్టలేదు. డబ్బు ఇస్తానన్నాడు, పేరు ప్రతిష్టలు వస్తాయి అన్నాడు, పట్టణంలోనే ఇల్లు చూస్తా అన్నాడు, ఇలా చాలా బలవంత పెట్టాడు. కానీ బైరాగి మాత్రం ఇవేమి తనకి అక్కర్లేదన్నాడు. చివరికి గౌరవ్ విసిగిపోయి సరే మీ ఇష్టం, కోరి వచ్చిన అదృష్టాన్ని కాలితో తంతున్నారు, నేను కొన్ని రోజులలో మల్లి వస్తాను. మీ మనసు మార్చుకుంటే ధన్యుడిని అని వెళ్ళిపోయాడు. సాయంకాలం కావటంతో బైరాగి కూడా శివుడికి నమస్కరించి తన దారిన తాను పోయాడు.


ఆ రోజు రాత్రి గుడి మూసేసే సమయంలో శివలింగం మీద కనపడి కనపడకుండా ఒక నల్లటి చార కలిగింది.


ఒక వారం రోజులలో గౌరవ్ తిరిగి వచ్చాడు. బైరాగిని మళ్లీ బ్రతిమిలాడాడు. బైరాగి కుదరదన్నాడు. ఇలా నెల రోజులు గడిచాయి. చివరికి ఒకరోజు గౌరవ్ ఇలా అన్నాడు.


"నేను ఎంత అడిగినా మీ మనసు కరగటం లేదు. సరే కచేరి వద్దు. పట్టణంలో నేను కట్టించిన ఒక శివాలయం ఉంది. అక్కడ శివరాత్రి ఉత్సవాలు చేస్తున్నాము. శివరాత్రి రోజున మాత్రం ఒక్కసారి వచ్చి పాడండి చాలు. ఈ ఒక్క కోరిక మన్నించండి"


బైరాగి కాసేపు ఏమీ మాట్లాడలేదు. చివరికి అతని ఆర్తి చూసి, శివాలయంలోనే కదా పాడేది అని సరే అన్నాడు.


మరునాటి ఉదయం ఘృష్ణేశ్వరునికి అభిషేకము జరుగుతుండగా ఒక అర్చకుడు నల్లటి చారను గమనించాడు.

సంగీత విద్వాంసుడు కట్టించిన గుడిలో శివరాత్రి ఉత్సవాలు ఆరంభమయ్యాయి. బైరాగి వచ్చాడు. పరమ భక్తితో పాట పాడాడు. అంతే అప్పటిదాకా కోలాహలంగా ఉన్న గుడి ప్రాంగణంలో నిశ్శబ్దం ఆవరించింది. అందరూ రసానుభూతిలో మైమరిచి పోయారు. కొంతసేపటికి ఆకాశం విరిగి పడిందా అన్నట్టు చప్పట్లతో ప్రాంగణం దద్దరిల్లింది. బైరాగి కి ఇది ఒక కొత్త అనుభూతి. అప్పటిదాకా అతను తాను పాడిన పాటలో తాను మైమరచిపోవటమే తప్ప పరుల ప్రశంస రుచి చూడలేదు. కుండ నిండి నీళ్లు పొంగినట్టు ఆ ఘృష్ణేశ్వరుడి మీద భక్తి పొంగి అతని కంఠంలో నుండి పాటగా వచ్చేది. ఆ పాట ఎవరి చప్పట్లు కోరేది కాదు. కానీ ఈ రోజు ఇంత మంది ప్రశంస అతనికి నచ్చింది. తిరిగి వెళ్లిపోయేముందు, గౌరవ్ తో "మీరింకెక్కడైనా ఉత్సవాలు జరిపిస్తుంటే చెప్పండి. వచ్చి పాడతాను" అని చెప్పాడు.

అటు పైన రెండు సంవత్సరాలు ఔరంగాబాద్ లో బైరాగి పేరు మారుమోగిపోయింది. గుడి ఉత్సవాలలో పాడటమే కాకుండా ఎన్నో కచేరీలు కూడా ఇచ్చాడు. ప్రజలు అతనికి నీరాజనాలు పట్టారు. బైరాగి ఆ పేరు ప్రతిష్టలలో ఓలలాడుతున్నాడు. మకాం కూడా పట్టణానికే మార్చాడు.


అక్కడ ఘృష్ణేశ్వర గుడిలో శివలింగం పైన నల్ల చార అందరికి తెలిసేలా పెరిగిపోయింది. దేవాలయం వారికి ఏమీ చేయాలో పాలు పొవట్లేదు.


మరొక్క సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు బైరాగి పాటలో గాఢత తగ్గసాగింది కానీ మాధుర్యం మసకబారలేదు. అందుకే శ్రోతలలో అతని వెలుగు కూడా కొద్దిగా రెపరెపలాడుతున్నా ఇంకా ప్రకాశవంతంగానే ఉంది. కానీ రోజుల గడుస్తున్నకొద్దీ బైరాగి ఇదివరకటిలా మనసు నిండా పాట కట్టలేకపోతున్నాడు. పాడేటప్పుడు కూడా తీవ్రత బాగా తగ్గింది. చింతామనస్కుడైన అతని పాట మధురంగా కూడా ఉండటం లేదు. కొన్ని మాటలను ప్రాస సరిపోయేలా కలిపి పాటలు అల్లుతున్నాడు అంతే. అవి భాషాభిమానులు తప్ప సామాన్య ప్రజలను సంతృప్తి పరచటం లేదు. అంచేత అతని వెలుగు కూడా కొండెక్క సాగింది.

ఒకనాడు అతనికి తెల్లవారుజామునే మెలుకువ వచ్చింది. లేచీ లేవటంతోనే అతని కంటి వెంట అశ్రుధారలు కురుస్తున్నాయి. చిన్న పిల్లాడిలా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. అలా ఎన్ని గంటలు ఏడ్చాడో తెలీదు. కొంతసేపటికి ఏడవటం ఆపి దిగ్గున మంచం మీద నుండి లేచాడు. ఇల్లు, ధనం, చివరికి కట్టుకున్న బట్టలు కూడా వదిలేసి, తాను మూడేండ్ల క్రితం మొదటిసారి పట్టణానికి వచ్చినప్పుడు ఉన్న మాసిన పంచ, తలపాగా, డోలు తీసుకుని ఘృష్ణేశ్వరానికి బయలుదేరాడు.

తాను కూర్చునే పాత చోటు అలా కాలీగానే ఉంది. అక్కడే కూర్చుని తల పాగా విప్పి పక్కన పరిచాడు. జనమంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా, డోలు అందుకుని కన్నీరు కారుస్తూ ఇలా పాడాడు...


భక్తి నిండుకొన్న మనసు

నీ పదము వాలుతున్నది

పాట కట్టే సత్తు లేక

శరణు వేడుచున్నది


పునః ప్రతిష్టా కార్యక్రమానికి తేదీ నిర్ణయించే చర్చలో ఉన్న అర్చకులు, దేవాలయం వారు నివ్వెఱపోయి చూస్తుండగా ఘృష్ణేశ్వరుని నల్లటి చార మాయమయింది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

More telugu story from Santhosh Sarma Lakkaraju

బైరాగి

బైరాగి

4 mins చదవండి