ధరణికి మిత్రులు
ధరణికి మిత్రులు
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
ధరణకి మిత్రులు
(ద్విరదరతి రగడ )
ఆకాశ వీధిలో నాటాడు మేఘాలు
సాకారమై వెల్గి సాగించు పయనాలు
గిరిరూపమును దాల్చి కిలకిలా నవ్వినవి
తరువుగా మారినవి తరుణిగా నిల్చినవి
కాలమేఘంబులట కరితతిగ దుమికినవి
గాలివీచిన చాలు కలతతో కూలినవి
దూదిపింజల వోలె తూగాడు జలదములు
మోదమును కలిగించ మురియులే లోకములు
సొగసుతో కులుకుతూ సొంపైన నడకతో
వగలుతో మేఘాలు వలపించు నగవుతో
వర్షమును కురిపించ వరముగా నరుదెంచె
తర్షముల నందించి తాపమును తొలగించె
పల్లెలందున పసిడి పంటలే పండగా
వెల్లువగ నదులెల్ల పృథ్విలో పాఱగా
ధరణికే మిత్రులై దప్పికను తీర్చునవి
సిరులనే పొంగించి జీవమును నిల్పునవి
వనములను గాంచగా పరువెత్తి వచ్చునవి
చినుకులను రాల్చుచూ శ్రేయంబు నిచ్చునవి
ఆ నీలి మేఘాలు నరుదుగా కనుపించె
కాననంబులు లేక కన్నీరు చిలికించె
నీరదంబులిపుడు నీరసంబుగ వెడలె
భారమాయెను జనుల బ్రతుకులీ విధి వడలె
తెలిసికొనుము యువతా!తెలివితో మెలగండి!
చెలిమితో వనములను శీఘ్రముగ పెంచండి!
మేలొసగు మబ్బులే మిన్నుపై విహరించ
వీలుగా వానలను విరివిగా కురిపించ
జలదముల రాకతో జవసత్త్వముల నొంద
సలిలములతో నదులు సాగుచూ ముదమొంద
కరువుకాటకంబుల కష్టాలు రావులే!
ధరయందు సంపదల ధగధగలు మెరయులే!
జగతిచక్రంబపుడు చక్కగా సాగులే!
ప్రగతిబాట యందున భావి పరిగిడునులే!//