శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

5.0  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

వలస

వలస

2 mins
375


   


             వలస

        -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


   

  రంగయ్యకు వయసు మళ్లింది...!

  

  తన జీవితం కన్న కొడుకు దగ్గర సాఫీగా సాగిపోతున్నందుకు తానెంతో అదృష్టవంతుడని ఎన్నోసార్లు అనుకుంటూ ఎంతమందికో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. ఆ వయసులో అంతకన్నా తృప్తి మరోటి ఉండదేమో...? అయినా...ఆయన్ని అసంతృప్తి వేధిస్తూనే ఉంది. ఎంత వయసు వచ్చినా...మనసు పిల్లల గురించే ఆలోచించడం మనిషి నైజమేమో...?


  కోడలు కూడా ఆనాటి అమ్మాయి కాబట్టి అణకువగా వుంటూ ...అత్తగారు చనిపోయినా మావగారికి వేళకు కావాల్సినవన్నీ అందిస్తూ...కన్నతండ్రిలా చూసుకుంటుంది రంగయ్యను. 


   ఎంతో అలవాటైన మనుమలిద్దరూ...ఇక్కడ చదువులు లేనట్టు విదేశాల చదువుల కోసం ఎగిరిపోయారు. వారు ఇక్కడ లేరన్నలోటు తప్పించి ఏలోటూ లేదు రంగయ్యకు. ఓసారెళ్లి చూసొద్దామనుకున్నా సుదూరంలో వున్నారు. పిల్లల్ని చదువుల కోసం దూరంగా పంపేసి... కొడుకూ కోడలూ ఎలా వుండగలుగుతున్నారో అర్థంకావడం లేదాయనకు.


  రంగయ్య ఒక వ్యవసాయ కుటుంబంలో రైతు కావడంతో ఆ గ్రామంలోనే ఉన్న హైస్కూల్లో పది వరకూ చదివించాడు కొడుకు సారధిని. చదివిన చదువు చాలు వ్యవసాయం చూసుకోమంటే...తనకు డిగ్రీ చేయాలని ఉందని చెప్పడంతో కొద్ది దూరంలోని పట్నానికి పంపించక తప్పలేదు. అక్కడే ఒక రూము చూసి...వంటకి కావాల్సిన చిన్నచిన్న సామాను అమర్చి వచ్చాడే గానీ....అక్కడ కొడుకు ఎలా ఉంటున్నాడో ఏంటోననే బెంగతో నెలకు రెండు మూడుసార్లు వెళ్లి చూసొస్తూ ఉండేవాడు. డిగ్రీ చదువైపోయిన వెంటనే ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం రావడంతో రంగయ్య ఆనందానికి అంతేలేదు. తమ ఊరు మునసబు గారమ్మాయిని చూసి పెళ్లిచేసేసి ఓ ఇంటివాడిని చేసాడు. కొడుకు కోడలతో కాపురం పెట్టించి...భార్యతో పాటూ తమ ఊరికి వచ్చేసాడు .


   వీలు చిక్కినప్పుడల్లా...బస్సులో మూడు గంటలు ప్రయాణం చేసి... పట్నంలో ఉన్న కొడుకూ కోడుకూ కోడలు దగ్గరకెళ్లి గడిపొచ్చేవారు. 


   కాలంతో పాటూ...కొడుకు ఇద్దరి పిల్లలకు తండ్రవ్వడం..చూస్తుండగానే పిల్లలు ఎదిగి...చదువులకోసం విదేశాలకు వెళ్లిపోవడం అంతా జరిగిపోయింది. ఈలోపులోనే భార్యకూడా గుండెపోటుతో దేవుడిదగ్గరకు వెళ్ళిపోయింది.


  మీరొక్కరూ ఎంత మాత్రమూ ఈపల్లెటూర్లో వుండొద్దంటూ పట్నానికి తీసుకొచ్చేసాడు కొడుకు. వారి సమక్షంలో జీవితం సాఫీగా సాగిపోతున్నా... మనసులో ఏదో బెంగ రంగయ్యకు.

 ఆబెంగ తనకోసం కాదు...కొడుకు గురించే.


   కొడుకు కూడా ఉద్యోగ బాధ్యతల నుంచి రిటైర్డ్ అయిపోయాడు. ఓ విధంగా వాడికీ పెద్దవయసు వచ్చేసింది. పిల్లలకు పెళ్లిళ్లు చేసినా... వారిక్కడ ఉంటారా అనుకుంటే...అసలుండరు. పెళ్లాలతో తిరిగి విదేశాలకు ఎగిరిపోయేవారే. 


   నాటి పిల్లల చదువులు ప్రభుత్వ స్కూళ్ళో తెలుగు మీడియంలో చదువుకున్నా ఇంటర్, డిగ్రీలతో ఆపేసినా చుట్టుపక్కల ఊళ్లలోనే వచ్చిన ఉద్యోగంతో తృప్తిగా వుంటూ కాపురాలు చేసుకున్నవారెంతో మంది. వారిలో కొద్దిమందైనా వృద్ధులైన తల్లిదండ్రులకు ఆసరాగా వుంటున్నారు. 


   కానీ....


   నేటి పిల్లల చదువులన్నీ ఇంగ్లీషు మీడియం చదువులు..

 కార్పోరేట్ చదువులు. ఆపై విదేశీ చదువులు. అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే.  ఉంటే పెద్ద పెద్ద సిటీల్లో లేదంటే విదేశాల్లో. అక్కడే కాపురాలు...పిల్లలు కనడం.


   అందుకే రంగయ్య ఆలోచిస్తున్నాడు...తనకు కొడుకు దగ్గర సాగినట్టు...తన కొడుక్కి మనుమల దగ్గర సాగదేమోనని. రేపన్న రోజు కొడుకు కోడలు పరిస్థితి ఎలా వుంటుందోనని భయం పట్టుకుంది రంగయ్యకు...!!*



         ****    ****    ***


   




   



Rate this content
Log in

Similar telugu story from Inspirational