శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4.5  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

వెన్నెల్లో అనురాగం

వెన్నెల్లో అనురాగం

2 mins
454


            వెన్నెల్లో...అనురాగం

            -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


    వెన్నెల కురుస్తున్న రాత్రి!

    

    సముద్రంలో కెరటాలు రోజూ కంటే మరింత ఉదృతంగా ఆనందంతో ఉరలేస్తున్నాయి. పౌర్ణమి నాటి చంద్రుడిని చూస్తే సముద్రం కూడా మరింత హుషారుగా పోటెక్కుతుందేమో. పాల నురుగు లాంటి అలలతో ఆ వెన్నెల నీడలో ఎంతో అందమైన శోభనిస్తూ మెరిసిపోతోంది సముద్రం.


    అప్పటికింకా సమయమెంతో కాలేదు. ఎనిమిది అయ్యుంటుంది. 

    

   సముద్రాన్ని చూస్తూ ఇసుక తిన్నెలపై కూర్చుని వున్నారు అర్చన, మహేంద్ర. 


    అక్కడ చాలా జంటలు తీపి కబుర్లు చెప్పుకుంటూ, సరసాలాడుకుంటూ ఒకరికి ఒకరు అతుక్కుపోతూ చాలా అన్యోన్యంగా వున్నారు. వారిలో వివాహితులెంత మందీ, ప్రేమికులు ఎంతమందీ చెప్పడం కష్టమే. 


   కానీ...వారిద్దరూ అక్కడున్న వారిలా అసలు ఆనందంగా లేరు. ఒకరి కొకరు ఎడబాటుగా కూర్చుని చాలా నిర్లిప్తంగా వున్నారు. 


   ఇద్దరిమధ్యా నిశ్శబ్దం రాజ్యమేలుతున్నా...తాము అక్కడ ఉన్నామన్న ఉనికిని తెలియచేస్తూనే ఉంది సముద్రపు హోరు.


   వారి మధ్య నిశ్శబ్దాన్ని చేదిస్తూ...రవీంద్ర తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పాలనుకుని గొంతు విప్పాడు.


   "అర్చనా! నేను రమ్మన్న వెంటనే నువ్విక్కడకు వచ్చినందుకు థాంక్స్. నువ్వు మీ పుట్టింటికెళ్లి ఆరు నెలలు అయిపోయింది. కనీసం ఫోన్ చేసినా ఏమీ మాట్లాడ్డం లేదు. ఇలా బయటకలిస్తే అయినా మనసువిప్పి మాట్లాడుకోవచ్చని పిలిచాను." 


  " చెప్పండి" ముక్తసరిగా అంది అర్చన.

   

  "మా అమ్మ ప్రతిచిన్న విషయానికీ నిన్ను దెప్పిపొడవడం తప్పే. కానీ...కన్నతల్లి కావడంతో నేనేమీ అమ్మను ఎదిరించలేని నిస్సహాయుడ్ని. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోడంతో అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివించి ప్రయోజకుడ్ని చేసింది. నాకు పెళ్లిచేసిందే గానీ...తనకు నేనెక్కడ దూరమైపోతానో అని నన్ను అదుపు ఆజ్ఞల్లో ఉంచుకుంటూ ఉంటుంది. ఈ విషయం నచ్చకే కదా...నీ పుట్టింటికి వెళ్లిపోయావు." 

   

   "మీకోడలు కనిపించడం లేదేంటని" అందరూ అడుగుతుంటే...అమ్మ అవమానంగా ఫీలవుతున్నట్టు తెలుస్తూనే ఉంది. ఈపాటికే తన తప్పు తాను తెలుసుకుంది. నువ్వైనా వెళ్లి మీ ఆవిడని తీసుకురారా అంటూ ఈమధ్య చాలాసార్లు అంది. నిజానికి మనమధ్య ఎలాంటి గొడవలూ లేనప్పుడు మూడో వ్యక్తి కోసం మనం దూరంగా ఉండటం ఏమైనా బాగుందా చెప్పు అర్చనా?" 


   భర్త మాటలు వింటుంటే...అర్చన మనసు వెన్నపూసలా కరిగిపోయింది. నిజమే కదూ...వాళ్ళమ్మని ఏమీ అడగలేకపోతున్నారంటే ఆవిడకి ఈయనిచ్చే గౌరవంతోనే కదా. తల్లిని ఎదురించలేని సభ్యతే ఈయనలో ఉంది. దాన్ని నేను తప్పుపట్టడం న్యాయం కాదు. నేను పుట్టింట్లో వుంటున్నానని నా తల్లిని మాత్రం ఎంతమంది అడగడం లేదు? మొగుడ్ని వదిలేసి వచ్చేసిందా అంటూ. ఆవిషయానికి అన్నయ్యయైతే 'మీ ఇంటికి పోతావా పోవా' అంటూ రోజూ అరుపులే. నన్ను ఎప్పుడు తన్ని తరిమేద్దామా అని చూస్తున్నాడు. అక్కడ ఉండేకంటే...భర్తతో తనదైన ఇంటికే వెళ్లిపోవడం మంచిదనుకుని...అత్తగారు ఏ మాటన్నా ఒక చెవిన విని ఒక చెవిన వదిలేసివుంటే మాఇద్దరి మధ్యా ఇన్నాళ్లు ఎడబాటు ఉండేది కాదుకదా అనుకుంది మనసులో.


    మౌనంగా తల దించుకున్న భార్యను పిలుస్తూ...

    "అటు చూడు అర్చనా! ఇక్కడ ఏ జంట చూసినా ఈ వెన్నెట్లో ఎంతగా మైమరచి గడుపుతున్నారో. పక్కన ఒకళ్ళు చూస్తున్నారన్న ధ్యాసే వాళ్ళకి లేదు. మనకి పెళ్లై ఏడాది కూడా అవ్వకుండానే ఆర్నెల్ల ఎడబాటు వల్ల ఇలాంటి వెన్నెల రాత్రులనెన్నో చీకటి చేసుకున్నామని తెలుస్తుందా?" అంటూనే అర్చన దగ్గరగా వెళ్లి భుజం చుట్టూ చేయి వేసాడు. ఆ వెచ్చటి స్పర్శలో మనసులోని బాధంతా పోయింది. ఆ నిండు జాబిల్లి వెన్నెల కురిపిస్తుంటే...భర్త కురిపించే అనురాగంలో తడిసిముద్దవుతూ భర్త ఒడిలో గువ్వలా ఒదిగిపోయింది అర్చన!!*

    

    

    

     

 


Rate this content
Log in

Similar telugu story from Inspirational