తనతో ప్రయాణం(తన స్నేహం)పార్ట్2
తనతో ప్రయాణం(తన స్నేహం)పార్ట్2
తనతో ప్రయాణం (తన పరిచయం) పార్ట్ 1...
తర్వాతి భాగం కొనసాగింపు..
తనతో ప్రయాణం (తన స్నేహం) పార్ట్ 2
అలా ... కాంటాక్ట్ నంబర్స్ మార్చుకోవడం తో మొదలైంది మా పరిచయం.
కాలం చేస్తున్న పొరపాట్లకు నా కలలు కనుమరుగవుతూ సమస్యలతో సతమతమవుతున్న రోజులవి...
ఊరిలో ఒంటరి కుటుంబం, నాన్న పెద్ద దిక్కు. అప్పటికే ఆయన సన్నిహితులు చేసిన మోసాలకు ఊబిలో కూరుకుపోతున్నారు..
ఒదార్చే చుట్టాలు లేరు, పంచుకునే సన్నిహితులు లేరు. తల్లికి, చెల్లికి ధైర్యం చెప్తూ కుటుంబ భారాన్ని బుజాలపై మోసుకుంటూ ముందుకు లాగడం నా వంతైంది...
ఆ క్రమంలోనే నాకున్న అక్షర పరిజ్ఞానంతో, స్ఫూర్తిదాయక కవితలు రాస్తూ నాలో నేనే స్ఫూర్తిని నింపుకుంటూ నిలదొక్కుకుంటున్న తరుణం...
మోటివేషనల్ కవితలు రాయడం, వాటిని సామాజిక మాధ్యమాల్లో నాతో పాటు నలుగురితో పంచుకోవడం ఇదే నా దిన చర్య.
ఇందులో భాగంగానే తనకి నా రాతల మాటున దాగిన ఆంతర్యం అర్ధమయ్యో, లేక తనలో అవి స్ఫూర్తిని రేకెత్తించో నా వాక్యాలు తనని కట్టి పడేశాయి(అది తన మాటల్లోనే).
ఏం రాసినా..!! ఎలా రాసినా..!! మొట్ట మొదటి పొగడ్త తన దగ్గర నుండి రావడం సహజమయ్యింది.
తనకి కూడా కవితలన్న , కవితలు రాసేవరన్న ఇష్టమని ఒకానొక సందర్భంలో చెప్పకనే చెప్పారు.
నా కాంటాక్ట్ లో ఉన్న అరవై , డబ్బై మంది లో తనకే నా కవితా భా"ష"ధ అర్థమయ్యి, రెస్పాండ్ అయ్యేవారంటే అర్ధం చేసుకోవచ్చు తనకి కవితలు అంటే ఎంత మక్కువో.!!
(నా కవితా బాషని అర్ధం చేసుకునే వారిలో, మా స్కూల్ ఇంగ్లీష్ టీచర్ మరొకరు. నా కవితా గురువు ఆమె.)
ఆనాటి తన మెప్పుకొలే, నా అక్షరాలకు ఊపిరి పోసి ఈ రోజు నా రచనల మాటున దాగున్న భావాలకు పునాదయ్యింది.
ఇలా నా మీద తనకి ఒక మంచి అభిప్రాయం ఏర్పడడం, అది రోజు రోజు కి పెరగడం, ఒకానొక టైం లో తన మెప్పు కోసమే మంచి మంచి పదాలు కూర్చి మరీ రాయడం, నాలో ఉన్న కవితా నాణ్యతను మరింత పెంచింది.
ఫేస్ బుక్ లో గేమ్స్ దగ్గర నుండి పర్సనల్ లైఫ్ లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వరకూ ఇద్దరి సంభాషణల్లో ఒక్కటే తీరు, ఒక్కోసారి అసలు టైమే తెలిసేది కాదు. ఎప్పుడూ.. రాత్రి తొమ్మిది గంటలకే నిద్రపోయే నేను, తన ఊసులుతో అర్ధరాత్రి పన్నెండు, ఒంటిగంట.. ఒక్కోసారి రెండింటి వరకూ మేల్కొనే ఉండేవాళ్ళం.
నాకున్న మరొక క్వాలిటీ పిల్లల ఆశ్రమాలకు వెళ్ళడం..
ఒకసారి తనకి ఈ విషయం తెలిసి నాకున్న లక్షణాలను అభినందించారు. నాకొచ్చే వైఫ్ అదృష్టవంతురాలని, మీలాంటి వారు దొరకడం మీ పేరెంట్స్ చేసుకున్న పుణ్యమని ఏవేవో నాకు అలవాటు లేని పొగడ్తలతో ముంచెత్తారు.
"అదేంటోనండి.. మీ పొగడ్తలు నాకు కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నాయి. ఇక చాలు ఆపండని.!!"
ఓల్టేజ్ హోం మరియు పిల్లల ఆశ్రమాల ఏర్పాటు నా జీవిత లక్ష్యమని. ప్రేమ, పెళ్లి లాంటి ఆలోచనలతో సమయాన్ని వృధా చేస్తూ నా లక్ష్యాన్ని చేరుకోలేనని, వాటి మీద నాకు పెద్దగా ఆసక్తి లేదని ఆ కొద్ది పరిచయం లోనే నా మనసులో మాట తనకి
బహిర్గతం చేశాను...
దాంతో నా పై తనకి మరింత గౌరవం పెరిగిందని, తన మాటల్లోనే తెలియజేసారు.
తనకి కూడా ఈ బేస్ రిలేషన్స్ పై పెద్దగా నమ్మకం లేదని.. పెళ్లన్న! , ప్రేమన్న! తనకి నచ్చదని సందర్భానుసారంగా చెప్పారు...
ఇద్దరు, ముగ్గురు ప్రపోజల్స్ తో ముందుకొచ్చినా నిర్మొహమాటంగా తిరస్కరించానని,
అందుకే ఇంట్లో వాళ్లు, తమ ఇష్టాలను గౌరవించి ఇప్పటికీ తనని(అకౌంటెంట్), వాళ్ళ అక్కని(సాఫ్ట్వేర్ ఎంప్లాయ్) నచ్చిన ఉద్యోగాలు చేయిస్తున్నారు అని చెప్పుకొచ్చారు.
"ఇరవై దాటితే పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపుతున్న ఈ రోజుల్లో... కాలానికి, కట్టుబాట్లకు దీటుగా నిలబడే ఆ అక్క చెల్లెళ్ళ సాహసం, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకిచ్చే స్వేచ్ఛా, సపోర్ట్ నన్ను మరిపించాయి. ఈ కాలపు ఆడపిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులకు స్ఫూర్తి కూడా..."
నాలాగే.. తనకి ఈ ప్రేమ, పెళ్లి అంటే అసలు నచ్చేది కాదు .. పాతికేళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న కన్న వాళ్ళని కాదని మధ్యలో పుట్టే ఈ కపటి ప్రేమలంటే మాకు పడేది కాదు.
ఎంతలా అంటే ఆ టైం లో మారుతి రావు ఇన్సిడెంట్ లో అందరూ అతని కూతుర్ని, అల్లుడిని సపోర్ట్ చేస్తుంటే, మేము మాత్రం మారుతీరావు కి సపోర్ట్ గా నిలిచేంత..!!
నాలాంటి అభిరుచులు, ఆలోచనలు కల అబ్బాయిలే ఉండరనుకున్న రోజులు.. కానీ, ఒక అమ్మాయి అలాంటి అభిరుచులతో దరికి చేరడం నా ఆలోచనలకు మరింత ఊతమిచ్చాయి.
అసలు అబ్బాయిలు అంటే భయపడే తను, నాతో ఇంతలా ఎందుకు అన్నీ విషయాలు పంచుకుంటుందో..!!!
ఎవరైనా (అబ్బాయిలు) మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వని తను, నాకే ఎందుకు పదే పదే మెసేజ్ పెడుతూ నా రిప్లై కోసం ఎదురుచూస్తుందో..!!
అసలు నాకే ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుందో...!! తెలియడం లేదంటూ! తనకి తానే నాకు పలుమార్లు చెప్పినా...
తన మాటల్లో ఆంతర్యం అర్ధం అయ్యేది కాదు.
ఇష్టాల మొదలు, కష్టాల వరకూ...
లక్షణాల మొదలు, లక్ష్యాల వరకూ...
అలకలు మొదలు, ఆశయాలు వరకూ...
కేరింగ్ మొదలు, కెరీర్ వరకూ...
ప్రతీది.. ఒకరికి ఒకరు పంచుకున్నాం.
అంతా ఆ వాట్సాప్ చాటింగ్ లోనే!!
తన స్వరం వినక పోయినా.. తన ప్రతి సపోర్టింగ్ వర్డ్ ..
నాకొక మార్గదర్శకంగా అనిపించాయి.
స్ఫూర్తిని నింపే నా కవితలు ఎవరి మద్దతు లేక కనుమరుగవుతాయనుకున్న వేళ.. తన కాంప్లిమెంట్స్..! మరింత ప్రేరణ అందించాయి. నా కవితా ప్రయాణానికి ఒక దిక్సూచి అయ్యాయి.
"అలసిన నా మది అలకు విశ్రాంతి తీరం తను...!!
ముసిరిన నడిరేయి లో ఓ వెన్నెల జాబిలి తను...!!
చీకటి చుట్టిన జీవితంలో ఓ దీపపు కాంతి తను...!!
వేకువ పొడిచే పొద్దులో ఓ ఆశా "కిరణం" తను...!!"
అందుకే ...
తన స్నేహం... "ఓ మధురం.."
తర్వాత భాగం
తనతో ప్రయాణం (తనపై ప్రేమ..) పార్ట్ 3
- సత్య పవన్✍️