SATYA PAVAN GANDHAM

Others

4.6  

SATYA PAVAN GANDHAM

Others

తనతో ప్రయాణం(తన పరిచయం)పార్ట్1

తనతో ప్రయాణం(తన పరిచయం)పార్ట్1

3 mins
531


మొత్తం 7 భాగాలు... అందులో మొదటిది..

తనతో ప్రయాణం (తన పరిచయం.. "ఓ అద్భుతం") పార్ట్ 1

(గమనిక : చదువుతున్న పాఠకులకు కొంచెం విసుగ్గా అనిపించొచ్చు, కానీ యదార్ధాన్ని కల్పితం గా చిత్రీకరించి కల్తీ చెయ్యాలనిపించలేదు.)

ఇది ఊహించి రాసిన కల్పిత కథ కాదు , నా హృదయపు లోగిళ్ళలో నిక్షిప్తమై యున్న ప్రేమ భావాన్ని అక్షరాలు గా పేర్చి తను మరిచిన గతాన్ని, ఓ జ్ఞాపకంగా మలిచి తనకి చేరవెయ్యాలనే చిన్ని ఆశతో.. తీర్చిదిద్దిన ఓ వాస్తవ ప్రయాణం.

"తనతో ప్రయాణం...*

స్వల్ప కాలమే అయినా... దీర్ఘకాలం చెరగని మధుర స్మృతులను మిగిల్చింది.

ఇందులో ప్రతి పదం అక్షర సత్యం.

అది సెప్టెంబర్ 14, 2018..

ఆరోజు ఏంటో చాలా చిరాకు గా ఉంది. ఎప్పుడూ నాతో తిరిగే నా ఫ్రెండ్స్, నన్ను వదిలి ఈ మధ్య ఇతర వ్యాపకాల (వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్) తో బిజీగా గడపడం వల్ల అనుకుంటా, అసలే సరైన జాబ్ లో సెటిల్ అవ్వక కాళిగా కాలాన్ని గడుపుతున్న రోజులవి, పైగా వీటికి తోడు ఇంట్లో సమస్యలు.

ప్రతీ చిన్న విషయానికి అమ్మాయిలకు ఫోన్ చేసి , గంటలు గంటలు మాట్లాడే.. వాళ్ళని చూస్తుంటే ఒకింత నవ్వొచ్చిన, నన్ను దూరం పెడుతున్నారనే ఎక్కడో చిన్న అసూయతో కూడిన ఆవేదన.

గౌరవంతోనో, భయంతోనో, లేక ఈ కాలపు అమ్మాయిలు అవలంబించే తీరు తోనో, విసిగి చెంది అమ్మాయిలు అంటే ఆమడ దూరం ఉండేవాడిని.

అమ్మ ప్రేమ తప్ప అమ్మాయి ప్రేమ అసలే తెలియదు.

ఆ రోజు రాత్రి ఇవన్నీ ఆలోచిస్తూనే ఫేస్బుక్ న్యూస్ ఫీడ్ చదువుతున్నా...

అదేంటో ఉన్నపాటుగా నా చూపు ఒక ప్రొఫైల్ వైపు తిరిగింది.

కేవలం తన బ్లాగ్ లో రాసుకున్న ఆ ఒకే ఒక్క క్వోట్(వారి తాత గారి గురించి) నన్ను ఇంప్రెస్ చేసింది (నాలో కూడా తాతయ్య లేని లోటు అలానే ఉంది).

ఇంతకు ముందు అమ్మాయిలు రిక్వెస్ట్ లు పెడితే నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసే నేనే, ఎందుకో తనకి మొట్ట మొదటి సారిగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టేసాను. (భయపడుతూనే.. !)

ఒక క్వోట్ కి ఇంప్రెస్స్ అయ్యాడని ఆశ్చర్య పోకండి!

నాకు పదాల పై ఉన్న మక్కువ అలాంటిది మరి..!!

అవునూ.. నా గురించి చెప్పలేదు కదూ...!

అప్పటికే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి రెండున్నరేళ్ల గడుస్తున్నా.. ఇంకా సరైన జాబ్ లో స్థిరపడక, నాకున్న అదనపు వ్యాపకం..

"కవితలు రాస్తూ కాలంతో కాలక్షేపం చేస్తున్న ఓ కాళిదాసుని."

"కుటుంబ పరిస్థితులు , వృత్తిపరమైన ఒడిదుడుకులకు మధ్య మానసికంగా నలుగుతున్న ఓ మధ్యతరగతి వాడిని."

"పాతికేళ్లు నిండుతున్నా.. ఈ కాలపు కుర్రాళ్ళ లా ఎలాంటి వ్యసనాలు అలవాటు చేసుకోని, కొన్ని కొన్ని వ్యాపకాలు మాత్రమే అలవరుచుకున్న ఓ పాతకాలపు మనిషిని."( మా ఫ్రెండ్స్ ఎగతాళి చేసినట్లు).

ప్రొఫెషనల్ గా సివిల్ ఇంజనీర్ అయినా ...

కవితలు చదవడం అంటే ఇష్టం!

రాయడం అంటే మహా పిచ్చి!

నేను రిక్వెస్ట్ పెట్టడం, తను ఆక్సెప్ట్ చేయడం వెంట వెంటనే జరిగిపోయింది.

ఏం మాట్లాడాలో... ఎలా మాట్లాడాలో.. తెలియదు! ఎవరితోనైనా, ఎప్పుడైనా చనువుగా ఉంటే కదా..! తెలిసేది.

అసలు ఒక అమ్మాయిని చూడడమే మహా పాపం గా భావించేవాడిని.

(స్నేహితులంతా అపరిచితుడు సినిమా లో రామానుజం అని హేళన చేసేవారు).

అప్పటివరకు స్కూల్ లో కానీ, కాలేజ్ డేస్ లో కానీ, ఏ ఒక్క అమ్మాయి వెనక తిరిగిందీ లేదు, అసలు మాట్లాడిందే లేదు.

ఈ పాతికేళ్ల ప్రయాణంలో మొట్ట మొదటి సారి నాకు నేనుగా ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా అనే అంక్సైటీ ఒక వైపు, బిడియం, సిగ్గు మరొక వైపు. ఇంకోవైపు భయం కూడా..!

ఎందుకో, తను తెలిసిన అమ్మాయి అయినా, పలకరిస్తే గుర్తు పడుతుందా అనే చిన్న సందేహం.

స్కూల్ చదువులు అయ్యి అప్పటికి సుమారు ఎనిమిదేన్నరెళ్ళ అవుతుంది కదా మరి!

అవును...!!

తను, నేను ఒకటి నుండి పది వరకూ వూళ్ళో ఉన్న స్కూల్ లో నే కలిసి చదువుకున్నాం.

ఇంటర్మీడియట్ కూడా ఒకే కాలేజ్ (వేరు వేరు బ్రాంచ్ లు).

పన్నెండు యేళ్లు కలిసే చదువుకున్నా, ఎప్పుడూ తనతో మాట్లాడింది లేదు..

హాయ్..!, హల్లో..!! అని పలకరించిందీ లేదు.

(పల్లెటూరు కదా! చూట్టు ప్రక్కల ఎవరైనా చూస్తే అంతే సంగతి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాట్లాడుకుంటే చాలు ఫలానా వాళ్ళ అబ్బాయి, ఫలానా వాళ్ళ అమ్మాయి అంట..!! అనే పుకార్లు సర్వసాధారణం... నాలో అదొక భయం!)

అసలు తను మూడేళ్ళ క్రితమే ఊరు వదిలి సిటీ కి వెళ్లి జాబ్ చేస్తున్నారు అని విన్నాను.

తన మాటల్లో , అలవాట్లలో సిటీ కల్చర్ ఏమైనా ఇనుమడింప చేసుకున్నారేమో!! (నాకేమో పల్లెటూరి వాతావరణం అంటే ఇష్టం)

ఇంత సడెన్ గా పలకరిస్తే, ఇప్పుడు నన్ను గుర్తుపడతారో..? లేదో..?

ఒకవేళ నన్ను గుర్తుపట్టినా చూసి చూడనట్లు పెద్దగా పట్టించుకోరెమో..?

ఇలా ఎన్నో సందేహాలు.

హాయ్.. !! నేను ఫలనా అని పెట్టిన మెసేజ్ కి, నా చిన్ననాడే మరుగున పడిన అసలు పేరు(ఎప్పుడో 15 ఏళ్ల క్రితం స్కూల్ టీచర్ తప్పిదం వల్ల పేరు మారింది, అది నాకు తప్ప ఎవరికి తెలియదు) తో పిలవడం ఒకింత నన్ను ఆశ్చర్యానికి లోనుచేసినా, తనకి కూడా చిన్ననాటి విషయాలు అన్నీ జ్ఞాపకమేనన్న నాలో కలిగిన ఆ భావన, అప్పటివరకూ నాకున్న సందేహాలన్నింటిని పటాపంచలు చేసాయి.

అప్పటికే, స్కూల్ మేట్స్ గేదరింగ్స్ కోసం ప్లాన్ చేస్తున్న నేను, సంకోచిస్తూనే ... నిస్సిగ్గుగా..

అభ్యంతరం లేకపోతే తన కాంటాక్ట్ నంబర్ ఇవ్వాలని, గేదరింగ్స్ ప్లాన్ చేసే పనిలో ఉన్నాం అని, ఒకవేళ ఇస్తే తనని కాంటాక్ట్ చేయడానికి ఈజీ గా ఉంటుంది అని రిక్వెస్ట్ చేశాను.

అడిగిన వెంటనే, ఇది నా పర్సనల్ నంబర్ అని తన కాంటాక్ట్ నంబర్ షేర్ చేశారు.

అసలు నాకు తన కాంటాక్ట్ నంబర్ అడగాలనే అంత దైర్యం ఎలా వచ్చిందో..?

తర్వాత తలుచుకుంటే నా మీద నాకే ఆశ్చర్యం వేసింది!!

అలా ...

కాంటాక్ట్ నంబర్స్ మార్చుకోవడం తో మొదలైంది మా పరిచయం ..

అసలు ఊహించలేదు, ఒక అమ్మాయితో ఫోన్ నంబర్స్ మార్చుకుని పరిచయం పెంచుకునే రోజు నా జీవితంలో వస్తుందని.

అందుకే ...

తన పరిచయం... "ఓ అద్భుతం"

                                                 ✍️సత్య పవన్ గంధం✍️

తర్వాత భాగం

తనతో ప్రయాణం (తన స్నేహం ... "ఓ మధురం") పార్ట్ 2.



Rate this content
Log in