kottapalli udayababu

Classics Inspirational Children

4  

kottapalli udayababu

Classics Inspirational Children

తాతయ్య ప్రేమలేఖ!

తాతయ్య ప్రేమలేఖ!

7 mins
309



స్కూటర్ దిగి నెమ్మదిగా తనగదిలోకి వెళ్ళబోతూ గుమ్మం ముందు ఆగిపోయిన విష్ణు మూర్తిగారు లోపలికి వచ్చిన చందన్ తో “ థాంక్స్ కన్నయ్యా.చాలా రోజుల తర్వాత ఒక గంట ప్రశాంతతని అందించావు. హార్ట్ ఫుల్ థాంక్స్ .” అనేసి వెళ్ళిపోయారు.


“ మమ్మీ...ఆకలి.ఏమైనా స్నాక్స్ పెట్టవా...”డైనింగ్ టేబుల్ ముందు కూలబడుతూ తల్లి మాధురిని అడిగాడు చందన్.


“ ఏమిట్రా..తాతగారు అన్ని సార్లు థాంక్స్ చెబుతున్నారు?” బ్రెడ్ మీద జామ్ చాకుతో రాస్తూ అడిగింది


“మమ్మీ...నువ్ రోజూ మాకు అన్నం పెడుతున్నావ్ గా...అందులో వింతేముంది?”


“అవున్రా ..రేపు నీ పిల్లలకు కూడా నువ్వు అన్నం పెట్టుకుంటావ్...అందులోను వింతేమీ లేదు”


“ మరి తాతగారేమిటి? వాళ్ళ మావయ్య కూతురు ఇంటికి తీసుకు వెళ్ళానా?... అన్నం పెట్టిన వాడు... మహాను భావుడు అని స్కూటర్ మీద వాళ్ళ ఇంటికి చేరేంతవరకు గొణుక్కుంటూనే ఉన్నారు. అక్కడకి వెళ్ళాక ఆయనదేవరిదో ఫోటో చూసి ఏడుపు కూడా...ఎప్పుడో ఒకసారి అన్నం పెట్టినందుకే అంత బాధపడాలా?” అన్నాడు చందన్


“నువ్వు ఆయన మాటలు పట్టించుకోకు. ఈ పెద్దాళ్ళు వాళ్ళ చాదస్తంతో మన బుర్ర తింటూ వుంటారు. అవేమీ మనసులో పెట్టుకోమాకు.నీ చదువు నువ్వు చదువుకో. అయినా నీకు లక్ష సార్లు చెప్పాను.అయన ఎక్కడికన్నా తీసుకువెళ్ళమంటే ‘నాకు వర్క్ ఉంది కుదరదు తాతగారు. మీరు ఆటో లో వెళ్ళండి’ అని చెప్పమన్నాను కదా.”అంది మాధురి.


“అదేంటమ్మా అలా అంటావ్?. ఎవరొచ్చినా ఆయనకోసమే వస్తారు కదా..పాపం.తాతగారు ఎప్పుడో గాని అడగరు. తీసుకెళ్తే తప్పేంటి? అదే మీ నాన్న - మా ఆ తాత వస్తే మాత్రం కాలేజ్ ఎక్కొట్టి మరీ తిప్పమంటావ్?ఆ తాతకో రూలూ . ఈ తాతకో రూలూనా?” అడిగాడు చందన్.


“ఆ తండ్రికి తగ్గ కొడుకు మీ నాన్న. మీ నాన్నకు తగ్గ కొడుకువు నువ్వు. సరిపోయింది.అందరూ కలిసి నాకు పెడతారు టెండర్.ఆయన తన తిండికి ఆయె ఖర్చు అయిదు వేలే ఇస్తున్నారు. మిగతా పెన్షన్ డబ్బంతా ఏం చేసుకుంటున్నారో తెలీదు. కూతురు అడిగినప్పుడల్లా పంపిస్తారు.మీ నాన్నకు మొహమాటం.’ఇంకో అయిదు వేలు ఇవ్వండీ ‘ అని అడగమంటాను. ఒక మనిషి ఎంత తిన్నా అద్దెతో సహా అయిదు వేలు సరిపోతుంది కదా...మనకు నిజంగా అవసరం అయినప్పుడు అడుగుతానులే.’ అంటారు. అంతా నా ఖర్మ.నా మాట ఎవరూ వినరు కదా.”విసుక్కుంది మాదురి.


*****


“అమ్మాయి.నేనలా పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళొస్తాను.పది నిముషాలలో వచ్చేస్తాను.” కోడలి సమాధానం కోసం ఎదురు చూడకుండా వీధి లోకి నడిచారు విష్ణు మూర్తిగారు చేతిలో కవరుతో.


“మీరెందుకండీ,ఏమైనా పోస్ట్ చెయ్యాలనుకుంటే చందూకి ఇవ్వండి. పోస్ట్ చేస్తాడు.” అని హాల్లోకి వచ్చిన మాధురికి మావగారు హాల్లో కనిపించకపోవడంతో కాలేజ్ కి బయల్దేరుతున్న చందన్ తో అంది నేరం చెబుతున్నట్టుగా.


“చూసావురా. ఆ కవర్ నీకిస్తే ఆయన ఎవరికీ ఎం పంపిస్తున్నారో నాకు తెలిసిపోతుందని ముందే వెళ్ళిపోయారు.ఆయన్ని నువ్వు వెనకేసుకోస్తావ్. నా మాటంటే ఎవరికీ లెఖ్ఖ?”


తల్లి అమాయకపు గడుసుదనానికి నవ్వుతూ ఒక్కసారిగా మాధురిని కౌగలించుకుని “ ముసలాయన.ఆయనతో నీకెందుకమ్మా? ...మా అమ్మ మంచిది.” అని తల్లి బుగ్గమీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు చందన్.


“ ఎవరు బాధ పడినా ఓర్చుకోలేడు. అందరూ కావాలి వెధవన్నకి.” మురిపెంగా బుగ్గ రాసుకుంటూ తలుపేసుకుంది మాధురి.


వీధి చివర మలుపులో బాదం చెట్టుకింద నీడలో నిలబడిన తాతగారిని చూస్తూనే బైక్ ఆపాడు చందన్.


“ ఏంటి తాతయ్యా ? ఇక్కడ నిలబడ్డారు? ఎక్కడికైనా వెళ్ళాలా?” అడిగాడు తాతగారిని.


“ లేదు కన్నయ్యా.నీకోసమే. నీకు తెలుగు చదవడం రాయడం వచ్చు కదూ?”


“వచ్చు తాతయ్యా. మీరు మీ గదిలో భగవద్గీత శ్లోకాలు పాడినంత బాగా రాదు.ఎందుకు అలా అడిగారు?”


“ ముందు నువ్వు నాకో మాట ఇవ్వాలి.ఇపుడు మనం ఇక్కడ ఇలా మాట్లాడుకున్నట్టు ఎవరికీ, ముఖ్యం గా మీ అమ్మకి చెప్పనని మాట ఇవ్వాలి. అపుడు చెబుతాను.” విష్ణుమూర్తిగారు చేయి చాచారు.


నిస్సంకోచంగా తాతగారి చేతిలో చేయివేసాడు చందన్.


“నేను నీకు ఒక ప్రేమలేఖ రాసాను.”


విస్తుబోయాడు చందన్.


“యు మీన్ లవ్ లెటర్? మీరు.... నాకు....ప్రేమలేఖా ...వాట్ ఈజ్ ఠిస్?


“ వెర్రి నాగన్నా.....మీ కుర్రకారు దృష్టిలో లవ్ అంటే స్త్రీ పట్ల ఆకర్షణ. ఇది అది కాదు నాన్నా...మమకారంతో, ఆత్మీయతతో రాసింది.నువ్వు కూడా నవ్వుకోకూడదు. పూర్తిగా చదవాలి. చదివాక కూడా అర్ధం అవకపోతే మళ్ళీ నాకు ఇచ్చెయ్యాలి.అంతే గాని ఇంట్లో ఎవరికీ చూపించకూడదు.సరేనా?”


“సరే.”


తన చేతిలోని కవర్ చందన్ చేతిలో పెడుతూ “చెప్పింది గుర్తుందిగా..” అడిగారు విష్ణుమూర్తి గారు


“ ఓ...వెళ్తాను తాతయ్యా..కాలేజ్ కి టైం అయింది.” కవర్ తన బుక్స్ బాగ్ లో పెట్టుకుని బైక్ మీద వెళ్ళిపోయాడు చందన్. మనవడు వెళ్ళాకా విష్ణుమూర్తి గారు ఇంటి దారి పట్టారు.


*****


కాలేజ్ కి వెళ్ళే దారిలో పార్క్ ముందు బైక్ ఆపి లోపలకి నడిచాడు చందన్. అతని మనసంతా ఏదో ఉద్వేగంగా ఉంది.తాతయ్య తనతో డైరెక్ట్ గానే చెప్పవచ్చు కదా..లెటర్ రాయడం ఏంటి? తనకు వచ్చిన తెలుగు భాషకి పరీక్షా ఇది? అమ్మకు చెప్పకూడనంత రహస్యం ఏముంది ఇందులో? చదివేస్తే పోలా? అనుకుని బాగ్ లోంచి కవరు తీసి లోపల ఉన్న కాగితాలను బయటకు లాగి చెట్టునీడన చల్లగాఉన్న చోట నీడలో కూర్చుని చదవసాగాడు. అందులో ఇలా ఉంది.


“ ప్రియమైన నా చందన్ బాబు కి,


ఉత్తరం అనేది మనం ప్రేమించే మనిషి ఎదురుగా ఉండగా చెప్పలేని అపురూప భావాలను వాళ్ళ మనోతీరాలకు తీసుకువెళ్ళే అద్భుత సమాచార సాధనం,చేతిలో పదినవెంతనే అందులో ఏముందో తెలుసుకోవాలనే ఆత్రుతతో మనసు పరిపరివిధాల పోతున్నా వాటిని పారద్రోలి మన ఏకాగ్రతను ప్రతీ అక్షరంపైన ఉంచి చదివి ఆకళింపు చేసుకుని ఆత్మానందపు సాగరంలో ముంచి తేల్చే మనోహర సౌధం.అందుకే నీకీ ఉత్తరం.


నీకు ఈ తాతగారి ఆశీస్సులు.నా వంశ వారసుడిగా నువ్ బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నా కోరిక. ‘ఈ పెద్దాళ్ళు వాళ్ళ చాదస్తంతో మన బుర్ర తింటూ వుంటారు. అవేమీ మనసులో పెట్టుకోమాకు’ అన్న మీ అమ్మ మాటలు నేను విన్నాను.అవే కాదు. మీరిద్దరూ మాట్లాడుకున్న అన్ని మాటలూ నేను విన్నాను.


ఈ ప్రపంచంలో నేను ఇక చెయ్యవలసిన పనులేమీ లేవు. నా బాధ్యతలన్నే తీరిపోయాయి నన్ను నీలో కైంకర్యం చేసుకో,’ అని ఏమనిషి సంతృప్తిగా భగవంతుని ఆత్మసాక్షిగా ప్రార్దిస్తాడో ఆనాడు ఆ మనిషికి స్వచ్చంద మరణం భగవంతుడు ప్రసాదిస్తే నాలా బాధ్యత తీరిన ఎందరో వృద్ధులు ప్రశాంతంగా శాశ్వత విశ్రాంతి పొందడానికి ఈ ప్రపంచంలో సిద్ధం గా ఉన్నారు.కానీ వ్రుద్దాప్యంలోనే మనిషి గత జన్మ లో చేసిన పాపాలు అనేక విధాల శాపాలై చుట్టుకుంటాయి.


మా నీడ పడితేనే పాపం అనుకుంటారు గాని... మన కుటుంబానికి తల్లివేరు ఆ వృద్ధులే అన్న నిజం తెలిసి కూడా నిర్లక్ష్యం గా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తుంటారు.నా అదృష్టం కొద్దీ ఇంకా నా కొడుకు కుటుంబం అలా అనుకునే స్థాయికి రాలేదనే ఆనందం నన్ను బ్రతికిస్తోంది నాన్నా..నిన్న సాయంత్రం మనం వెళ్ళింది నా మేనత్త కూతురు ఇంటికి.’ఒక్కసారి వచ్చి నన్ను చూసి వెళ్లి బావా’ అన్న నా మరదలు మాట తీసేయలేక నిన్న నిన్ను ఇబ్బంది పెట్టాను. ఇక్కడనుంచి ఇంకాస్త శ్రద్ధగా చదువు.” తాతగారు తన ఎదుటే నిలబడి చెబుతున్నట్టుగా అనిపించి ‘ఇలా రాస్తారా ఉత్తరం..’ అని ఆశ్చర్యపోతూ చందన్ చుట్టూ ఒకసారి కలియ చూసి సర్దుకుని కూర్చుని మళ్ళీ చదవడం కొనసాగించాడు.


‘నేను, మా చెల్లి మీ ముత్తాతగారికి ఇద్దరం పిల్లలం.మీ ముత్తాతగారు స్టేజి మీద నాటకాలు వేసేవారు.అంటే మీరు మీ కాలేజ్ ఫంక్షన్స్ లో స్కిడ్స్ వేస్తున్నారే అలాగన్నమాట.నేను స్కూల్ ఫైనల్స్ చదువుకు వచ్చేనాటికే పూర్వీకులు ఇచ్చిన ఆస్తినంతా ఆ నాటక సమాజాలవాళ్ళకే ఖర్చు చేసేసారు.


అవి స్వాతంత్ర్య పోరాటపు రోజులు. నేను సరిగా చదువుకోక ఆ ఉద్యమాల ఊరేగింపుల్లో, సభలలో పాల్గొనేవాడిని.ఎక్కడ అన్యాయం జరిగినా ఎదిరించేవాడిని.పోలీసులచేత ఎన్నో లాఠీ దెబ్బలు కూడా తినేవాడిని.డబ్బున్న స్నేహితుల చుట్టూ తిరిగి వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ ఉండేవాడిని.వాళ్ళల్లో ‘రంగడు’ అనే కోటీశ్వరుడు ఉండేవాడు.చిన్నవయసులోనే ఇంట్లో తెలియకుండా సిగరెట్ కాల్చేవాడు. ఆ పెట్టెలు నాచేత కొనిపించేవాడు. నాకు బీడీ కట్ట ఉచితంగా ఇచ్చేవాడు. నాకు బీడీలు అలవాటు చేసింది వాడే. ఒక దీపావళి పండగకు రెండు జతల బట్టలు కుట్టించారుమీ ముత్తాత గారు నాకు..రోడ్డు పక్కన ముష్టివాడు చలికి వణికి పోతుంటే వాడికి ఒక జత ఇచ్చేశాను.పోలీసుల లాఠీఛార్జి లో ఒకడికి ఒళ్ళంతా రక్తసిక్తమైతే వాడికి నా ఒంటి మీద ఉన్న రెండో జతలోని చొక్కా అక్కడికక్కడే విప్పి ఇచ్చేశాను.ఆరోజు మానాన్న నన్ను వెదురు బెత్తం తో చావగొట్టాడు.పరీక్షలకు వెళ్ళడానికి చొక్కా లేకపోతె రంగడు ఇచ్చిన చొక్కాతో పరీక్ష రాసాను.ఒకే నిక్కరు తో ఎంతకాలం ఉండను? దానిని ఉతికి ఆరవేసి దుప్పటి కట్టుకు వెళ్లి స్కూల్ ఫైనల్ పరీక్షలు రాసాను. పాసయ్యాను.


ఆ వేసవికి మా అమ్మమ్మగారి వూరు వెళ్లాను.అమ్మాయిలు ఎక్కడ కనిపించినా ఆట పట్టించేవాడిని.మీరు ఇప్పుడు చేస్తున్న రాగింగ్ లా... ఒక పెద్దాయన నన్ను పిలిచి వివరాలు అడిగి ‘మీనాన్నను తెచ్చుకో.మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను’అన్నాడు.వెళ్లి అమ్మమ్మతో విషయం చెప్పాను.నాకు ఉద్యోగం లేదు..గాలిగాడిని.


ఏం జరిగిందో ఏమో గానీ...వారం రోజుల్లో మీ నాన్నమ్మతో నాకు పెళ్లి అయింది. అపుడు నాకు 17.మీ నాన్నమ్మకు 14. పెళ్ళికి వచ్చిన మా మేనమామను మా నాన్న నాకు ఉద్యోగం ఎక్కడైనా వేయించమన్నాడు.ఆయన నన్ను రాజమండ్రి తీసుకువెళ్ళి ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు లో ఉద్యోగం వేయించాడు. చాలా మంచివాడు ఆయన. కానీ మా మేనత్త ఆయన లేనపుడు నన్ను పిలిచి “చూడు నీ ఉద్యోగానికి ౩౦౦ లంచం ఇచ్చాము.నీకొచ్చే 100 రూపాయల జేతం లో నెలకు 50 చొప్పున నాకు కట్టి మిగతా డబ్బు వాడుకో” అని చెప్పింది. మీ నాన్నమ్మ అక్కడ మా ఇంట్లో మా అమ్మచేత కోడింటికం అనుభవించేది.


అత్తయ్య అప్పు తీరిపోయాకా నేను మీ నాన్నమ్మను తీసుకువచ్చి రాజమండ్రి లో కాపురం పెట్టాను. అయినా మా అత్తయ్య మరో ఆరు నెలల పాటు నాదగ్గర నెలకు 50 రూపాయల చొప్పున మరో ఆరునెలలు తీసుకుంది.’అదేమిటి’అని అడిగాను.’నన్నే ప్రశ్నిస్తావా’ అని కోపగించుకుంది. ఆరు నెలలు పూర్తయ్యాకా మీ నాన్నమ్మకు మూడు కాసులతో మంగళసూత్రపు తాడు, మరో మూడు కాసులతో రెండు బంగారు గాజులు చేయించి నాతొ అంది “ అమ్మాయి ఒంటిమీద నగలు ఏనాడైనా తీసావో నీకు మర్యాద దక్కదు ‘


మీ నాన్న , మీ అత్తయ్యా పుట్టారు. మీ నాన్న చక్కగా క్రమశిక్షణతో చదువుకుని మా మాట విని ఆరోజుల్లోనే ఇంజినీరు అయ్యాడు. వాడికి వచ్చిన మార్కులు చూసి వాడికి వుద్యోగం వెంటనే ఇచ్చారు. మీ అత్తయ్యకు చక్కగా పెళ్లి చేసాము.


ఇదంతా నీకు ఎందుకు చెబుతున్నాను అంటే...ఆనాడు నన్ను రాజమండ్రి తీసుకువెళ్ళి వుద్యోగం మా మేనమామ ఇప్పించి ఉండకపోతే నా బ్రతుకు ఏమయ్యేది? నాకు, నా కుటుంబానికి అన్నం పెట్టింది ఎవరు? నిన్న మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్ ఫోటోలో ఒక ముసలి తాతగారిని చూసావే...ఆయనే నాకు అన్నం పెట్టినవాడు.అందుకే ప్రతీరోజు నేను భోజనం చేసేటప్పుడు ముందుగా ఒక ముద్ద తీసి కంచం బయట పెడతాను చూడు...అది ఆయన పేరు తలుచుకునే పెడతాను.ఈనాడు మన కుటుంబం ఇలా నిలబడిందంటే...దానికి కారకులేవరు? ఆ అన్నం పెట్టిన మహానుభావుడే..మన కుటుంబానికి తల్లివేరులాంటి ఆయనను మరిచిపోతే మనకు పుట్టగతులుండవు నాన్నా.చెట్టును నాటకుండానే దానికి కాసిన పరిపక్వానికోచ్చిన కాయను కోసుకుని తినే అదృష్టం మీ అమ్మకు దక్కింది, ఆమెకు నా కుటుంబ నేపధ్యం తెలియక అలా మాట్లాడుతుంది.ఇవన్నే ఆమెకు అర్ధం కావలసిన అవసరం లేదు.నీకు అర్ధం కావాలి.ఆ కష్టం చాటున దాగిన విలువ తెలియాలి.తాతగా నాపెరును నిలబెట్టే మంచి పొజిషన్ లోకి నువ్ రావాలి.నేడో రేపో రాలిపోయే వాడినినేను.కానీ నువ్వు మన వంశ పునాదుల్ని మరింత గా పటిష్టపరచవలసిన బాధ్యత గల వాడివి. ఎప్పటికైనా ఈ ప్రపంచంలో ప్రతీ తాతకు వారసుడు మనవడే నాన్నా.


అందుకే ఇదంతా నీతో ప్రేమగా పంచుకున్నాను.ఇది చదివాకా నన్ను నువ్వు ప్రేమిస్తావో లేదో మరి...కానీ నిన్ను నేను తుది శ్వాస వరకూ ప్రేమిస్తూనే ఉంటాను ..ఐ లవ్ యు ...కన్నయ్యా..ఐ లవ్ యు ఫరెవర్ .


ప్రేమాశీస్సులతో ,


తాతగారు. “


రెండుమూడుసార్లు చదివాకా, అందులోని అర్ధం బోధ పడ్డాకా...అక్షరాలు మసకబారుతుంటే అర్ధం అయింది చందన్ కి, తన కళ్ళల్లో అశ్రువులు సుడులు తిరుగుతున్నాయని. కోశస్థ దశనుంచి అప్పుడే బయటపడి తన రంగు రంగుల లేత రెక్కలతో ఎగురుతోన్న సీతాకోక చిలుకలా, తల్లి పాలకోసం ఆత్రంగా పొదుగు దగ్గర నోటితో రొమ్ము చేపుతూ తన బుల్లి తోకను ఊపుతున్న లేగ దూడలా, దేవుని పూజకోసం కొలనులో సూర్యకిరణాలు పడి అప్పుడే విచ్చుకున్న కలువపూవులా ఉన్న తనమనసునిండా తాతయ్య పట్ల ప్రేమ పొంగిపోరలుతుండగా చందన్ ఆ కాగితాలను పవిత్రం గా మడిచి బాగ్ లో పెట్టుకుని కళ్ళు తుడుచుకుని లేస్తూ “ ఐ లవ్ యు తాతయ్యా...రియల్లీ ఐ లవ్ యు .యు ఆర్ ది స్పిరిట్ ఆఫ్ మై లైఫ్.యు అర్ ఎ స్వీట్ అండ్ గ్రేట్ గైడ్ టు మీ. ఈ సమయం లో మీరు ఎదురుగా ఉంటె ఎంత బాగుండేది?” అనుకున్నంతలోనే ఎదురుగా విష్ణుమూర్తిగారు పార్క్ గేటు లోంచి లోపలికి తనవైపు రాగానే ఎదురుగావెళ్ళి రెండు చేతులూ జోడించి తాతగారి పాదాలకు నమస్కరించాడు చందన్.


ఆనంద భాష్పాలతో మనవడిని ఆప్యాయంగా కౌగలించుకుని ప్రేమాస్వాదనతో కళ్ళుమూసుకున్నరాయన.


సమాప్తం



Rate this content
Log in

Similar telugu story from Classics