SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"శ్రీ కృష్ణ మహా భారతం - 53"

"శ్రీ కృష్ణ మహా భారతం - 53"

6 mins
243


. "శ్రీ కృష్ణ మహా భారతం - 52" కి


కొనసాగింపు...


"శ్రీ కృష్ణ మహా భారతం - 53"


ఇక కాసేపు మన కృష్ణుడు కథ కాసేపు పక్కన పెడితే,


ఇక్కడ హస్తినా రాజ్యంలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉంటారు.


యుధిష్ఠిరుడు వంటి గొప్పవాడు, మంచివాడు ఈ రాజ్యానికి రాజుగా ఉండడం వల్లనే సకాలంలో వర్షాలు పడి, పంటలు సమృద్ధిగా పండుతున్నాయని వారు విశ్వసిస్తున్నారు.


అలా ఒకరోజు యుధిష్ఠిరుడు రాజు అయిన పిదప శకుని వద్దకు ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లి అతని చరణముల పై పడి అతని ఆశీస్సులు తీసుకుంటాడు.


శకుని పైకి మంచి మనసుతోనే యుధిష్ఠిరుడిని ఆశీర్వదించినట్టు దీవించి, లోపల మాత్రం ఈర్ష్యతో రగిలిపోతుంటాడు.


శకుని వద్దే ఉన్న దుర్యోధనుడు, దుశ్శాసనుడు కూడా యుధిష్ఠిరుడి కాళ్ళకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకుంటారు.


ఇదంతా దూరం నుండి గమనిస్తున్న మహా మంత్రి విదురుడుతో ఆస్థాన గురువు కృపాచార్యుడు...


"కురు కుమారులు మరియు పాండు కుమారుల మధ్య సౌభ్రాతృత్వం పెరిగింది, ఇదంతా చూస్తుంటే నా మనసంతా ఆనందంతో ఉప్పొంగుతుంది మహా మంత్రీ..!" అని అంటాడు


దానికి,


"మీరన్నది నిజమే గురువర్యా..!


కానీ, ఆ గాంధార రాజు ఇక్కడ లేకపోతే నా మనసు కూడా ఈ సన్నివేశం చూసి ఉప్పొంగేది. అతను ఇక్కడ ఉన్నంత కాలం కురు రాజ్యానికి వినాశనమే" అంటూ శకుని యొక్క కుయుక్తులు పసిగట్టిన విదురుడు కృపాచార్యుడితో అంటాడు.


ఇక శకుని, దుర్యోధనుడిని మరియు దుశ్శాసనుడిని తీసుకుని రాజ్యంలో ఉన్న తన ఏకాంత మందిరానికి వస్తాడు.


అక్కడ ఒక సాలి పురుగు అల్లిన వలయాన్ని చూపిస్తూ...


శకుని దుశ్శాసనుడిని...


"ఆ సాలి పురుగు అంత కష్టపడి ఎందుకు అలా వలయాన్ని అల్లిందో ఎప్పుడైనా గమనించావా దుశ్శాసనా ?" అని అడుగుతాడు.


దానికి దుశ్శాసనుడు లేదని బదులు ఇస్తాడు.


అప్పుడు శకుని...


"దానికి కారణం లేకపోలేదు...


శత్రువులు వచ్చి తన ఆ వలలో చిక్కుకునిపోతారు. పిదప అందులోనుండి బయట పడలేక విలవిలలాడిపోతారు, అలసిపోయి శక్తి హీనులవుతారు, చివరికి చేసేదేం లేక తమ ప్రాణాలను సైతం త్యజిస్తారు." అని అంటాడు...


అప్పుడు దుశ్శాసనుడు చిన్నగా నవ్వుతూ...


"నాకు ఇప్పుడు అర్థమైంది మామా ...!


సైనికులు అన్ని ఏర్పాట్లు చేశారు


పాండవులు వారనా వర్తం అయితే వెళతారు కానీ,


వాళ్ళు హస్థినా పురం తిరిగి వచ్చే అవకాశమే లేదు మావయ్య..!" అని అంటాడు.


దానికి ఆనందంతో శకుని, దుర్యోధనుడు కూడా నవ్వుతారు.


అంతలోనే దుశ్శాసనుడు...


"ఒకవేళ పాండవులు వారణావర్తం వెళ్లకపోతేనూ..?" అంటూ తన సందేహాన్ని బయటపెడతాడు.


"ఎందుకంటే యువరాజుకు స్వయంగా మహారాజు వారే ఆదేశించాలి" అంటూ తన సందేహం వెనకున్న ఆంతర్యాన్ని చెప్తాడు.


"అంతేకదా...!


అది నేను చూసుకుంటాను. మహారాజు ఆదేశించే విధంగా కాదు, స్వయంగా యువరాజు యుధిష్ఠిరుడే వారణా వర్తం వెళ్లడానికి అనుమతి అడిగే విధంగా చేయగలను" అంటూ దుర్యోధనుడు వాళ్ళకి చెప్తాడు.


దానికి దుశ్శాసనుడు...


"అదెలా సాధ్యం అగ్రజా..!" అని అడగ్గా...


"మేనల్లుడా దుశ్శాసునా..!


మీ సోదరుడు బుద్ది బలం నీకు ఇంకా తెలిసినట్టు లేదు. అతను అనుకుంటే అది తప్పక నెరవేర్చి తీరుతాడు." అంటూ పెద్దగా నవ్వుతాడు.


అతడి ప్రశంశకి దుర్యోధనుడు కూడా ఉప్పొంగిపోతాడు.


శకుని మాటలు అర్ధమయ్యి అర్థమవ్వని అయోమయ స్థితిలో దుశ్శాసనుడు అమాయకంగా వారి వైపు చూస్తూ నవ్వుతాడు.


ఇటువైపు...


గాంధారి తన ఏకాంత మందిరంలో అప్పుడే కొత్తగా చేయించిన బంగారు ఆభరణాలను తాకుతూ ఉండగా, అక్కడికి మహారాణి ఆదేశం మేర తన సేవకురాలు సుఖుధ వస్తుంది.


అలా సుకుధ రావడం గమనించిన గాంధారి, తన చేతిలో ఉన్న నగలు చూపిస్తూ...


"వచ్చావా సుఖుధ...!


నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఇవి చూడు దుశ్చల స్వయంవరానికి ఈ బంగారు ఆభరణాలు చేయించాను. ఎలా ఉన్నాయో చెప్పు..!" అంటూ ఆమె అభిప్రాయాన్ని అడుగుతుంది.


దానికి సుఖుధ ఆశ్చర్యపోతూ...


"యువరాణి దుశ్చలకి స్వయంవరమా ?


మీకు ఇది తెలియదా...!


యువరాణి దుశ్చలకి సింధు దేశ యువరాజు జయందృతునితో దుర్యోధనుడు వివాహం నిశ్చయించారని,


ఈ విషయం రాజ్యం అంతా చర్చించుకుంటున్నారు మహారాణి" అంటూ గాందారితో అనగానే


"సింధూ దేశపు యువరాజుతో దుశ్చలకు వివాహం నిశ్చయించారా ?


ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు ?


వారికి తెలీదా హస్తినాకు, సింధు దేశానికి ఎప్పటినుండో శతృత్వం ఉందని,


దీనికి పెద్ద మావయ్య గారు భీష్ముల వారు ఏ విధంగానూ ఒప్పుకోరు..!" అంటూ గాంధారి తన మనసులో మాట చెప్తుంది సుఖుదకి


(దుర్యోధనుడు పన్నిన పన్నాగం ఇదే కావచ్చు)


ఇక ఒకపక్క సభలో అదే విషయం పై మహారాజు దృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు సమక్షంలో దుర్యోధనుడికి, యుధిష్ఠిరుడుకి మధ్య చర్చ జరుగుతుంది.


"సింధూ దేశ రాజుతో దుశ్చల వివాహం జరగడానికి వీల్లేదు..!"


ఎవరితోనూ చర్చించకుండా అసలు సింధూ దేశ రాజుకి వివాహా ఆహ్వానం ఎందుకు పంపావ్ ?" అంటూ యుధిష్ఠిరుడు దుర్యోధనుడిని నిలదీస్తాడు.


దానికి దుర్యోధనుడు...


"మా సోదరి వివాహ విషయంలో ఎవరితో చర్చించాల్సిన అవసరం నాకు లేదు. ఇది మా సొంత విషయం" అంటూ ఘాటుగా సమాధానం చెప్తాడు.


అప్పుడు విదురుడు...


"కానీ దుర్యోధనా...


రాజ్య శ్రేయస్సు విషయంలో నిర్ణయాలు తీసుకునే అధికారం తీసుకునే హక్కు మంత్రి మండలికి ఉంది. స్వయంవరానికి కూడా మనం కొంతమందికి మాత్రం ఆహ్వానం పంపిస్తాము. ఎందుకంటే ఆ రాజ్యాలతో మనకు సత్సంబంధాలు మెరుగుపడతాయన్న భావనతో.." అంటూ అతని మాటలకు అడ్డు తగులుతాడు.


దానికి బదులుగా...


"క్షమించాలి పిన తండ్రి,


నా సోదరి వివాహాన్ని రాజకీయం చేయకండి" అంటూ విదురుడికి అడ్డుతగులుతాడు దుర్యోధనుడు.


"దుర్యోధన రాకుమరా?


మగధ, సింధు రాజ్యాలతో మనం ఏ విధమైన సంబంధాలు ఉంచుకోరాదు. అదే మన రాజ్య సిద్దాంతం..!" అంటూ ఒకవైపు నుండి భీష్ముడు కూడా చెప్తాడు.


దానికి దుర్యోధనుడు...


"రాజ్య సిద్దాంతం పాటించాల్సింది యువరాజు యుధిష్ఠిరుడు. ఎందుకంటే అతనే యువరాజు కాబట్టి, నేను కాదు కదా..!


నాకు కేవలం నా సోదరి సుఖం మాత్రమే ముఖ్యం" అంటూ తనలో ఉన్న అక్కసుని బయట పెడతాడు.


ఇంతలో...


"దుర్యోధన రాకుమారా..!


దుశ్చల నీకు సోదరి మాత్రమే,


కానీ, సామ్రాట్ దృతరాష్ట్రల వారికి పుత్రిక,


మీకన్నా ఆమె వివాహ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం సామ్రాట్ ల వారికే అధికం.


కాబట్టి, దుశ్చల వివాహం స్వయంవరం ప్రకారమే జరగాలి ..!" అని భీష్ముడు అంటాడు.


" ఋషి వశిష్టల వారి వివాహం విదర్భ రాకుమారి లోపామృతతో జరిగింది కదా మహితాత్మ..!


ఎందుకంటే, దేవి లోపామృత అలా కోరుకున్నది.


అలాంటప్పుడు మన దుశ్చల వివాహం తనకి నచ్చినట్టు సింధు రాజుతో ఎందుకు జరగకూడదు..!


అయినా మీరు కర్తవ్యం అనే ముసుగులో వేరే వాళ్ళ ఇష్టాయిష్టాలను ఎప్పటికపుడు కాలరాస్తునే ఉంటారు కదా..!"


అంటూ అడ్డూ అదుపూ లేకుండా భీష్ముడి గురించి శకుని తన నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే,


"గాంధారి రాజా..!


మీ మాటలను అదుపులో పెట్టుకోవడం మీకే మంచిది..!" అంటూ శకుని మాటలకు కోపంతో హెచ్చరిస్తాడు విదురుడు.


అంతలో దుర్యోధనుడు కలుగజేసుకుని,


"ఇందులో శకుని మామ తప్పేం లేదు మహామంత్రి,


వారి భీష్ముల వారిని కించపరచాలని ఉద్దేశ్యంతో అలా మాట్లాడలేదు. కేవలం కర్తవ్య భావనతో ఉండడం వలన ఇతరుల ఇష్టాలను లెక్కచేయని వారిగా మిగిలిపోతారు. కర్తవ్యమ్ అనేది అత్యంత శ్రేష్ఠమైనది, కఠినమైనది. అలాంటి కఠినమైన వాటిని మనలాంటి సామాన్యులు పాటించలేరు కదా మంత్రి వర్యా...!" అంటూ శకునికి మద్దతుగా ఉంటాడు.


"దుర్యోధనుడు చెప్పింది సత్యమే మహామంత్రి..!


నేను భీశ్ముల వారిని కించపరచాలని ఉద్దేశ్యంతో అనలేదు..


సూర్యుడు స్వయం శక్తి కలవాడు. అందుకే అతడు ప్రకాశిస్తాడు.


కానీ, చంద్రుడు స్వయంగా ప్రకాశించలేని వాడు, అందుకే చల్లదనాన్ని అందిస్తాడు.


అలా ఎవరి శక్తి సామర్థ్యాల బట్టి వారి ప్రవర్తన ఉంటుంది.


భీష్ముల వారికి కుటుంబం అనేది లేదు కాబట్టి, ఆయనికి బాంధవ్యాల గురించి పెద్దగా అవగాహన లేకపోవచ్చు.


కాబట్టి, మీరు కేవలం కర్తవ్యానికి మాత్రమే కాకుండా సంబంధ బాంధవ్యాలకు కూడా కొంచెం విలువని ఇస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం" అంటూ శకుని మళ్ళీ ఘోరంగా భీష్ముణ్ణి అవమానిస్తాడు.


అప్పుడు భీష్ముడు...


"అవునూ..!


నువ్వన్నది నిజమే శకుని, నాకు కుటుంబం అనేది లేదు. నేను కర్తవ్యమ్ అనే ముసుగులో పడి కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి అనే ఆలోచనను విరమింపజేసుకున్నాను. కానీ, నాకు కుటుంబం లేదని నువ్వు ఎలా అనుకుంటున్నావు...


ఈ సమస్త కురువంశం నా కుటుంబమే,


గుండె కొట్టుకోవడం వలనే రక్తప్రసరణ జరుగుతుంది.


రక్తం ప్రవహించడం వలనే గుండె కొట్టుకుంటుంది.


అలా ఏ రకంగానైతే గుండె నుండి రక్తాన్ని, రక్తం నుండి గుండెను వేరు చేయలేమో..!


అదే రకంగా నన్ను ఈ కురు వంశాన్ని వేరు చేయలేరు." అంటూ చాలా బాధగా శకుని మాటలకు సమాధానం ఇస్తాడు.


"గాంధార రాజా !


గుర్తుంచుకో..!


కర్తవ్యమ్ జనించేది సదా కరుణ మరియు స్నేహాల నుంచేనని,


రాకుమార దుర్యోధన..!


వారు సూర్య భగవానుని ప్రేమ వంటివారు.


వారు ఈ సమస్త విశ్వానికి వెలుతురు పంచేందుకు స్వయంగా అగ్నిని ధారగా చేసి జీవిస్తున్నారు" అంటూ విదురుడు వివరిస్తాడు.


దానికి దుర్యోధనుడు...


"మీరు చెప్పింది నిజమే చిన్న తండ్రి..!


మరి ఇదీ నిజమే కదా..!  


సూర్యుని ప్రకాశం వలన వృక్షం జన్మిస్తుంది, కానీ, చంద్ర కాంతి వలన ఆ వృక్షం నుండి ఔషదం ఉద్భవిస్తుంది. అంటే, అమూల్యమైనవి కర్తవ్యం నుండి లభిస్తాయా?


లేక ప్రేమ నుండా?" అంటూ విదురుడిని ఎదురు ప్రశ్నిస్తాడు.


"ఇదంతా ఇప్పుడు ఎందుకు ?


పితామహులు దుశ్చలకు స్వయం వారం జరగాల్సిందేనని ఆదేశించారు కదా..!


ఆయన మాటే అందరికీ శిరోధార్యం..!" అంటూ యుధిష్ఠిరుడు అంటాడు.


దుర్యోధనుడు...


"మీకు శిరోధార్యం ఏమో యువరాజ..!


నాకు కాదు. ఎందుకంటే ఈ రాజ్యానికి మీరు యువరాజు నేను కాదు. ఆయన మాటను పాటిస్తే మీరు పాటించండి. నేను మాత్రం ఇక్కడ ఎవరి మాటా వినాల్సిన అవసరం లేదు. నాకు నా సోదరి సుఖం మాత్రమే ముఖ్యం ..!


నేను మీ నిర్ణయాలను అడ్డుకోగలను, కానీ మీరు నా నిర్ణయాలను వ్యతిరేకించలేరు.


జల ప్రవాహం భూమిని శుద్ధి చేయగలదు, కానీ భూమి జల ప్రవాహాన్ని అడ్డుకోలేదు." అంటూ మొండిగా మాట్లాడతాడు.


ఇక ఆ రోజు రాత్రి తన ఏకాంత మందిరంలో...


ఆది నుండి తను కాపాడుకుంటూ వస్తున్న రాజ్యాన్ని తన వాళ్ళే శత్రువుల పాలు చెయ్యాలని చూస్తున్నారని దీర్ఘంగా ఆలోచిస్తూ, విచారిస్తూ ఉంటాడు భీష్ముడు.


సరిగ్గా అప్పుడు అక్కడికి యుధిష్ఠిరుడు వస్తాడు.


"పితామహ..!" అంటూ భీష్ముణ్ణి యుధిష్ఠిరుడు పలకరించగానే,


"పుత్రా యుధిష్ఠరా..!


ఒకసారి పార్వతి పరమేశ్వరునితో ఆటలాడుతూ...


అతని కళ్ళు మూసి అంధకారున్ని చేసింది. అప్పుడు సమస్త లోకం అంధమయం అయ్యింది. అప్పుడే అంధకారుడు అనే రాక్షసుడు జన్మించి ఈ లోకాన్ని నాశనం చేయాలని చూసాడు. దేవతలందరికీ ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అతన్ని పార్వతి పరమేశ్వరులు మినహా అన్యులేవరూ చంపలేరు. అటువంటి సమస్యే ఇప్పుడు మనకీ వచ్చింది..!" అని అంటాడు.


"అప్పుడు పరమేశ్వరుడు జగతిని ఉద్దరించాలనుకున్నాడు పితామహ..!" అంటూ యుధిష్ఠిరుడు బదులు ఇస్తాడు.


"సామ్రాట్ దృతరాష్ట్రడు తమ పుత్రునిపై ఆంక్షలు విధించలేడు.


లేక వానిపై ఆంక్షలు విధించే ఉద్దేశ్యమే లేదేమో ?" అంటూ విచారం వ్యక్తం చేస్తాడు భీష్ముడు..


దానికి యుధిష్ఠిరుడు...


"ఇటువంటి పరిస్థితిలో ఒక్కటే ఉపాయం మహితాత్మా...!


మీరే ఒక నిర్ణయం తీసుకోండి...


యువరాజు పదవి నుండి నన్ను తొలగించి, ఆ పదవిలో దుర్యోధనుడిని నియమించండి. లేదంటే, ఆతను ఇటువంటి స్థితి మాటమాటికి కల్పిస్తూ ఉంటాడు.


కురు రాజ్యంతో మైత్రి లేని రాజులతో మైత్రి చేస్తాడు అతను.


మన రాజ్యంలో మైత్రి కలవారితో శతృత్వం పెంచుకుంటాడు అతను.


మాటమాటికీ ధర్మసంకటాలు తీసుకురాగలడు అతను." అంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు.


"నీవు ధర్మ సంకటాలకు భయపడుతున్నాావా యుధిష్ఠరా..?


నీ నుండి ఇది ఆశించలేదు పౌత్రా..!" భీష్ముడు ప్రశ్నిస్తాడు.


"ఇక్కడ జరిగే పరాభవాలకు భయపడుతున్నాను పితామహ..!


దుర్యోధనుడు ఇలాంటి సందర్భాలు ఇంకా కల్పిస్తూనే ఉంటాడు. మీకే అనేక పరాభావాలు కలుగుతున్నాయి" అని యుధిష్ఠిరుడు అంటుండగా...


"అంటే నీ ఉద్దేశ్యం ?


నిన్ను యువరాజు పదవి నుండి తొలగిస్తే నన్ను అతడు గౌరవిస్తాడని నువ్వు అనుకుంటున్నావా?" అంటూ భీష్ముడు యుధిష్ఠిరుడిని ప్రశ్నిస్తాడు.


ఇంకా...


"పౌత్రా యుధిష్ఠిరా..!


నేను నా పితృదేవలకు ప్రమాణం చేశాను. ఈ హస్తినా పుర సింహాసనం పై శాంతి భద్రతలు, ధర్మము నెల కొల్పేవరకూ...


ఈ విధంగానే నా సంఘర్షణ కొనసాగుతుందని,


ఒకవేళ నువ్వు యువరాజు పదవి త్యజించినట్టు అయితే,


నీ ముందుగానే దుర్యోధనుడిని యువరాజు పదవిలో అధీష్ఠీనట్టైతే, అప్పుడు నా వాగ్దానం అసంపూర్ణం అవుతుంది.


నా జీవన పర్యంతం సంఘర్షణ వ్యర్థం అయిపోతుంది. అది నాకు పెద్ద పరాభవం అవుతుంది.


నీవు జీవించి ఉన్నంత వరకూ ఈ హస్తినా పురానికి దూరం కాలేవు !" అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

తర్వాత ఏం జరగబోతుందో తర్వాత భాగాలలో తెలుసుకుందాం


తర్వాతి భాగం "శ్రీ కృష్ణ మహా భారతం - 54"


"శ్రీ కృష్ణ మహా భారతం" కొనసాగబోతుంది.


అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.


అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.


నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.


రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Abstract