SATYA PAVAN GANDHAM

Classics Inspirational Thriller

4  

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Thriller

"శ్రీ కృష్ణ మహా భారతం - 39"

"శ్రీ కృష్ణ మహా భారతం - 39"

6 mins
231


"శ్రీ కృష్ణ మహా భారతం - 38" కి

కొనసాగింపు...

"శ్రీ కృష్ణ మహా భారతం - 39"

ఎవరి అభిప్రాయలతో వాళ్ళు ఉండగా చివరికి సభ ప్రారంభమయింది. సభకు కౌరవులు, పాండవులు, భీష్ముడు, విదురుడు, శకుని మరియు కుటుంబ సభ్యులు తో పాటు రాజ్య సైనికులు సైతం సభలో పాల్గొనడానికి వచ్చి, ఎంతో ఆతృతగా దృతరాష్ట్రడు ప్రకటించబోయే కాబోయే యువరాజు కోసం ఎదురుచూస్తున్నారు.

దుర్యోధనుడు, శకుని మరియు ఇతర కౌరవులకు అపారమైన నమ్మకం..

మహారాజు యువరాజుగా దుర్యోధనుడినే ప్రకటిస్తాడని,

మరొకవైపు పాండవులకు కూడా అదే జరుగుతుందేమోనని ఆందోళన.

ఇంతలో మహారాజు దృతరాష్ట్రడు సభకు విచ్చేశాడు.

అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అతని ప్రకటన కోసం.

కానీ, అప్పుడే మహా మంత్రి విదురుడు లేచి,

"సభకు విచ్చేసిన అందరూ కాబోయే యువరాజు ఎవరనేది తెలుసుకోవడం కోసం ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో తెలుసు,

కానీ, మహారాజా..!

మీరు ప్రకటన చేయబోయే ముందు మహా మహితాత్మ భీష్ముల వారు తమ సందేశాన్ని వినిపించాలని ఆశిస్తున్నాను. అది కాబోయే యువరాజుకు ఆశీస్సులు అందజేస్తుంది." అని కోరతాడు.

దానికి దృతరాష్ట్రడు సానుకూలంగానే స్పందించి భీష్ముల వారి సందేశాన్ని వినిపించాలని ఆదేశిస్తాడు.

కానీ, శకుని మదిలో ఎందుకో కలవరపాటు ఈ సమయంలో భీష్ముడు దేని గురించి మాట్లాడతాడు ?,

దుర్యోధనుడి పట్టాభిషేకానికి అడ్డు తగలడానికే ఈ ఎత్తుగడ అని భావించి, అదే విషయం పక్కనే ఉన్న దుర్యోధనుడితో అనగా...

దాన్ని దుర్యోధనుడు పెద్దగా లెక్క చేయడు.

ఇంతలో భీష్ముడు తన సందేశాన్ని మొదలుపెడతాడు.

"పుర జనులారా...!

ఈ రోజు ఒక సూర్యోదయానికి నాంది. ఈ యాత్రికుడు అయినా తన యాత్ర ప్రారంభించే ముందు తన నివాస గృహ ద్వారాన్ని ఒకసారి వెనుదిరిగి చూసుకుని బయలుదేరతాడు. అలాగే నేను కూడా నా గడిచిన గతాన్ని ఒక సారి ఙ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉన్నాను.

ఇదే ప్రాంగణంలో ధృతరాష్ట్రడు, పాండు మరియు విదురుడు వారి చిన్నతనంలో నా ముందే విద్యాభ్యాసం చేసేవారు. నా ముందే ఆటలాడుకుంటూ చాలా ఆనందంగా గడిపేవారు.

ఒకసారి వారి ఆటల్లో భాగంగా...

పాండు మరియు విదురుడు ఒక పెద్ద చెట్టు కొమ్మను ఎక్కి అక్కడి నుండి వారి అన్న దృతరాష్ట్రడిని పిలుస్తూ దూకేసారు. అప్పుడు దృతరాష్ట్రడు ఒక్క ఉదుటున వెళ్లి వాళ్ళని రక్షించాడు.

ఇదంతా చూసిన నేను వాళ్ళని తిట్టాను, హెచ్చరించాను ఇంకెప్పుడూ ఇలా చేయవద్దని.

ఆ తర్వాత పాండు ను దగ్గరకి పిలిచి,

"ఎందుకు పుత్ర ఇలాంటి ప్రమాదకరమైన ఆటలు ఆడుతున్నారు" అని అడిగాను

దానికి పాండు ఒక చిన్న చిరునవ్వు నవ్వి,

"మా సోదరుడు ధృతరాష్ట్రుడు మీద మాకు అపారమైన నమ్మకం ఉంది పెద తండ్రి" అని అన్నాడు

దానికి నేను

"అతనికి మీరు పిలుపు మాత్రమే వినిపించగలదు. అతడు మిమ్మల్ని చూడలేదు. మరి అంత నమ్మకం ఏంటి పుత్ర..?" అని ప్రశ్నిస్తే,

"మమ్మల్ని అతడు చూడాల్సిన అవసరం లేదు. అతడు హృదయంలో మా మీద ఏర్పరుచుకున్న ప్రేమే, మేము అతడికి కనిపించేలా చేస్తుంది." అని బదులిచ్చాడు అంటూ భీష్ముడు చెప్తూనే,

"ఆ రోజు నా శిష్యులు నాకొక గొప్ప పాఠం నేర్పించారు.

ప్రేమ, విశ్వాసాల పాఠం" అంటూ ఉద్వేగభరితమవుతాడు.

దాంతో దృతరాష్ట్రడు , విదురుడితో పాటు అక్కడున్న వారందరి కళ్ళు చెమ్మ గిల్లుతాయి. ఒక్క శకుని మరియు దుర్యోధనుడు తప్ప..!

అలాగే మహారాజా..!

పాండు రాజుని యమధర్మరాజు సమీపించినపుడు కూడా అతడు అడిగి ఉండడు

ఇప్పుడు ఎవరి పై విశ్వాసంతో నా పుత్రులను వదిలి మీతొ రాగలను అని ?

(ధృతరాష్ట్రడు కూడా పాండు కుమారులను తన సొంత కుమారులతో సమానంగా చేరదీస్తాడని)

ఇంతకంటే నేనేం మాట్లాడలేను...

ఆ పరమేశ్వరుడు మీలో ప్రేరణ నిలుపు గాక..!

ఇదే నా సందేశం , నేనిచ్చే ఆశీర్వాదం" అంటూ తన సందేశాన్ని ముగిస్తాడు భీష్ముడు.

ఇక విదురుడు లేచి,

"మహారాజా ..!

మీ నిర్ణయం మరియు మీరు చేయబోయే ప్రకటన కోసం సమస్త పుర ప్రజలు ఎదురుచూస్తున్నారు" అని అంటాడు

దృతరాష్ట్రునునికి భీష్ముడి మాటలతో గతం అంతా జ్ఞప్తికి వస్తుంది.

రాజ్య సింహాసనం కోసం పాండుకి తాను ద్రోహం చెయ్యాలని చూసినా, అతడు మాత్రం నన్నొక యోధుడిగా భావించి తన హృదయంలో నాకొక ప్రత్యేక స్థానం కల్పించాడు. అంతేకాక తాను సాధించిన విజయాల పట్ల నన్నే స్ఫూర్తిగా తీసుకున్నానంటూ, తాను సాధించిన విజయాలను కూడా నాకే అంకితం చేశాడు. ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ తన కళ్ళ నీళ్ళు కారుతుంటే వాటిని తుడుచుకుంటూ...

"పుర ప్రజలారా ?

నా తర్వాత ఈ సింహాసనాన్ని అధీష్టించబోయే యువరాజును ధర్మబద్ధంగా నియమించాలనే ఉద్దేశ్యంతో యువరాజుల మధ్య పోటీని పెట్టాను. కానీ, అది సరైన ఫలితాలను ఇవ్వలేదు. కానీ నా మనసులో ఒకరిని యువరాజు గా నియమిద్దాం అనుకున్నాను. కానీ, ఇప్పుడు పేద తండ్రి గారి మాటలు నిజమే అనిపించాయి. నేను తీసుకునే నిర్ణయం ధర్మానికి కట్టుబడి ఉండాలి. అధర్మబద్దంగా ఉండకూడదు." అని దృతరాష్ట్రడు అంటుంటే,

"మీ మనసు ఎప్పుడూ ధర్మంతోనే నిండి ఉంటుంది మహారాజా !

అధర్మానికి అందులో చోటు లేదు. మీరు తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ధర్మ బద్ధంగానే ఉంటాయి. దయచేసి మీ నిర్ణయం ఏమిటో సెలవివ్వండి..!" అంటూ అసలు ఏమాత్రం సహనం, ఓపిక లేని దుర్యోధనుడు దృతరాష్ట్రడిని తొందర పెడతాడు.

దానికి దృతరాష్ట్రడు...

"నేను సామ్రాట్ దృతరాష్ట్రడను,

ఈ రోజు ప్రకటిస్తున్నది ఏమనగా ?

ఈ హస్తిన పుర యువరాజు.."

అంటూ తన నిర్ణయాన్ని చెప్పబోతుంటే

"కురు సామ్రాట్ వారికి జయము..! జయము..!!" అంటూ అక్కడికి వస్తాడు ద్రోణుడు.

"మహారాజా ..!

అంతరాయానికి నన్ను మన్నించాలి.

నాకు తెలుసు మీరు ఈ రోజు మీ యువ సామ్రాట్ ను ప్రకటించబోతున్నారని.

కానీ, నాదొక విన్నపం

అదేంటంటే, నా దగ్గర శిక్షణ పొందిన ఈ యువకుమారులెవరిని మీరు యువ రాజుగా ఇప్పుడే ప్రకటించడానికి వీల్లేదు." అని అంటాడు

ఆ సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతారు.

దాంతో దృతరాష్ట్రడు..

"మీరేం అంటున్నారో నాకు అర్ధం కావడం లేదు గరువర్యా..!" అని సందేహంగా అంటాడు

"శిల్పాన్ని చెక్కిన శిల్పి సంతృప్తి చెందనంత వరకూ ఆ శిల్పం పూజకు పనికిరాదు. ఆ పరేమేశ్వరుడు కూడా దానికి సంతృప్తి చెందడు" అంటూ వివరించగా..

అవేమీ అర్థం కాని దృతరాష్ట్రడు ఇంకా ఆశ్చర్యంగానే అతడి వైపు చూస్తాడు...

అప్పుడు విదురుడు

"అదేం లేదు మహారాజా..!

ఇప్పటివరకూ మన రాకుమారులు గురువు ద్రో వారికి గురుదక్షిణ చెల్లించలేదు. గురుదక్షిణ చెల్లించనంత వరకూ వారు ద్రొణుల శిష్యుల గానే పరిగణించబడతారు." అంటూ వివరిస్తాడు.

దానికి దృతరాష్ట్రడు

"అయితే వారి నుండి మీరు ఇప్పుడు ఏం ఆశిస్తున్నారు ?" అని అడుగుతాడు

"నేను ఆశీస్తున్నది ఒక్కటే మహారాజా !

నేను నేర్పిన విద్యను ఉపయోగించి వారు నాకు గురుదక్షిణ ఇవ్వాలి. అప్పుడే అందులో సర్వ శ్రేష్ఠుడు ఎవరో నేను గుర్తించగలను. యోధుడు ఎవరో నిర్ణయించగలను." అంటూ బదులు ఇస్తాడు.

దానికి విదురుడు...

"తప్పకుండా గురుదేవా..!

తమ శిష్యులలో ఎవరు శ్రేష్ఠుడో నిర్ణయించే అధికారం తమరికి మాత్రమే ఉంటుంది. అలాంటి వారిని యోగ్యుడిగా ప్రకటించే హక్కు మీకు కలదు.అదే అన్నింటికీ కన్నా ఉత్తమమైన పద్దతి. అప్పుడు ఎవరూ మనల్ని పక్షపాతం చూపాం అని విమర్శించలేరు" అంటూ సమాధానమిస్తాడు.

శకుని లేచి,

"క్షమించాలి మహారాజా..!

క్షమించాలి మహారాజా..!

మాటి మాటికి ఇలా యోగ్యతను పరీక్షించాలి అనుకోవడం సరైన పద్దతి కాదు మహారాజా..!

అద్దంలో మనం ముఖం పదే పదె చూసుకోవడం వలన అందులో లోపాలు కనిపిస్తాయి కదా గురుదేవా ద్రోణాచార్య..!" అంటూ ఒక ఉదాహరణతో అతన్ని విమర్శిస్తాడు.

దానికి విదురుడు కలుగజేసుకుని

"అందులో తప్పేం ఉంది. అద్దంలో కేవలం బాహ్య ఆకృతిని మాత్రమే ప్రతిబింబిస్తుంది. కానీ, పోటీ శారీరక సామర్థ్యానికి సంబంధించింది." అంటూ బదులు చెప్తాడు.

"అయినా ఇప్పటికే పోటీని నిర్వహించారు కదా మహామంత్రి" అని శకుని అంటే,

"కానీ, ఆ పోటీ సరైన సత్ఫలితాలను ఇవ్వలేదు అని స్వయంగా మహారాజు వారే చెప్పారు కదా . కాబట్టి, ఇప్పుడు యోగ్యత పరీక్ష గురుదేవుల ద్రోణుల వాటి గురు దక్షిణ ద్వారా జరగాలంటే దానికి అభ్యంతరం ఏముంది?" అని శకునికి అడ్డుపడుతూ అతన్ని నిలదీస్తాడు.

దానికి దృతరాష్ట్ర కూడా అంగీకారం తెలుపుతాడు. శకుని మరియు దుర్యోధనుని మొహాలు మాడిపోతాయి.

అప్పుడే విదురుడు...

"గురువర్యా..!

మీ గురు దక్షిణ ఏమిటో అడగండి..!

అందులో మీకు శ్రేష్ఠుడు అనిపించిన వాడినే యువరాజు గా నియమిద్ధాం" అని అంటాడు.

శకుని దుర్బుద్ధితో

"కానీ, గురుదేవా !

మీకిష్టమైన వారిని ఒక్కరిని మాత్రమే పక్షపాతంతో శ్రేష్ఠుడిగా నియమిస్తే,..." అంటూ ప్రశ్న లేవనెత్తగా...

దానికి స్వతహాగా కోపిష్టి అయినా ద్రోణుడు...

"మీరు నన్ను శంకించి అవమాన పరుస్తున్నారు గాంధార రాజా..!" అతడిపై కొప్పడుతూ...

"గురువెన్నడూ పక్షపాతం చూపడు...

ఇక నా గురుదక్షిణ కేవలం ఏ ఒక్క రాకుమారుడు కాదు, మొత్తం రాకుమారులందరూ కలిసి అయినా సాధించగలరా అనేది నా అనుమానం"

"ఇంతకూ తమరి గురుదక్షిణ ఏమిటి గురుదేవా ?" అని భీష్ముడు అడగగా

"నా గురుదక్షిణ ఏమంటే,

పాంచాల దేశ రాజు దృపదుడి శిరస్సుని నా పాదాలపై పడేట్టు చేయడం." అని ద్రోణుడు అనగానే ఒక్కసారిగా సభలో ఉన్నవారంతా భయంతో ఆశ్చర్యపోతారు.

ఎందుకంటే, అతడు అత్యంత పరాక్రమవంతుడు.

ద్రోణుడు మరింత కొనసాగిస్తూ...

"ద్రుపదుడు నా స్నేహితుడు. అతడు నన్ను తన రాజ్య సభలో అందరి ముందు ఘోరంగా అవమానించాడు. ఒక శత్రువు కించపరిస్తే, అది కేవలం ఆగ్రహాన్ని కలిగిస్తుంది. అదే ఒక మిత్రుడు కించపరిస్తే అది పరాభవమే మహారాజా..!

యువ రాకుమారులారా?

నేను తలుచుకుంటే దృపదుడిని నేను ఆ క్షణమే అంతమొందించగలను. కానీ, అతడు అవమానించింది నా విద్యను. ఇన్నాళ్లు నా మదిలో రగుకుతున్నతున్న అగ్నిని అణిచివేసుకుంటూ వచ్చాను. కానీ, ఇప్పుడు మీ ద్వారా నాకొక అవకాశం లభించింది. మీకు కూడా ఇదే మంచి సమయం..

రాకుమారులారా..!

ఎవరు తీర్చుకుంటారు నా ప్రతీకారాన్ని.?

ఎవరికుంది ఈ సామర్థ్యం..?

ఎవరిలో ఉంది ఈ సామర్థ్యం..?" అంటూ గట్టిగా రాకుమారులను అడుగుతాడు

దానికి

"ఇది అసంభవం..

శక్తివంతమైన దృపడుతో నా పుత్రులు యుద్ధం చేయలేరు. అతడికి రెండు అక్షోహుణుల సైన్యం ఉంది. దానికి నేను అంగీకరించలేను. మీరు ఇంకేదైనా అడగండి" అంటూ బదులు ఇస్తాడు దృతరాష్ట్రడు.

అప్పుడు ద్రోణుడు...

"ఇది గురుదక్షిణ మహారాజా..!

వ్యాపారం కాదు..!

ఒకవేళ నా శిష్యులలో ఇలాంటి సామర్థ్యం కలిగించలేక పోతే అది పూర్తిగా నా దౌర్భాగ్యమే అవుతుంది. దానికి పెద్దగా చింతాల్సిన అవసరం లేదు. నేను మరొక రాజ్యానికి వెళ్లి వేరే శిష్యులను తయారు చేసుకోగలను. ఎందుకంటే నాకు ప్రతీకారము మాత్రమే ముఖ్యము.

అప్పుడు మీరు కూడా ఆ శిష్యులలో ఒకరిని ఈ రాజ్యానికి యువరాజును చెయ్యాల్సి వస్తుంది. ఎందుకంటే వీరికి యోగ్యత లేదు కదా..!" అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు...

సరిగ్గా అప్పుడే

"గురుదేవా !" అంటూ ఒక పిలుపు వినబడుతుంది వెనుక నుండి ద్రోణుడికి.

"ద్రోణుడిని పిలిచిందేవరూ...?

ద్రోణుడి ప్రతీకారాన్ని ఎవరు తీర్చుకుంటారు...?

దానికి మహారాజు అంగీకరిస్తాడా ...?

లాంటి విషయాలన్నీ తర్వాతి భాగాలలో తెలుసుకుందాం.

"శ్రీ కృష్ణ మహా భారతం" కొనసాగబోతుంది.

తర్వాతి భాగం "శ్రీ కృష్ణ మహా భారతం - 40"

అప్పటివరకూ పాఠకులందరూ మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను సమీక్షల ద్వారా తెలుపగలరు.

అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, ఈ కథ మరింత బాగా రాయడానికి నూతనోత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Classics