Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

శాలరీ - స్నేహం

శాలరీ - స్నేహం

1 min
270


ఓ రోజు మధ్యాహ్నం కొత్త నంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. పనిలో ఉండి (అదే బాస్ పక్కనే ఉండి గమనిస్తూ ఉండడంతో) కాల్ తియ్యలేదు.


డిస్ప్లే పిక్చర్ చూసి వీడు మన ఇంటర్మీడియెట్ రామ్ గాడు కదా అని సాయంత్రం ఫోన్ చేస్తా అని మెసేజ్ పెట్టాను. సరే అని రిప్లై వచ్చింది.


సాయంత్రం వాడే ముందు ఫోన్ చేశాడు. ఏంట్రా మ్యారేజ్ ఇన్విటేషన్ చెప్పడానికేనా అని అన్నాను ఫోన్ తియ్యగానే.


రేయ్. ఎలా ఉన్నావ్ ఏంటి అని అడక్కుండా పెళ్లి గురించే అడుగుతారు ఏంటో. మీరు ఎప్పుడు డెవలప్ అవుతార్రా అన్నాడు వాడు నవ్వుతూ.


నీకు సిగ్గు లేదు. పదేళ్ల తరువాత ఫోన్ చేస్తే మ్యారేజ్ ఇన్విటేషన్ గురించేమో అనుకున్నా. అంత బాగోగులు అడిగేవాడు ఇన్నేళ్ల తరువాత ఫోన్ చెయ్యడు అని గట్టిగానే బదులిచ్చాను.


సర్లేరా అని ఒకరికొకరం కబుర్లలో పడ్డాం. వాడి ప్రేమ విజయవంతంగా పెళ్లి వరకూ తీసుకురాగలిగాడని తెలిసి సంతోషించాను. అదే చెప్పాను కూడా. నువ్వు గ్రేట్ రా అని.


నీ శాలరీ ఎంత? ఏంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ అని అడిగాడు మాటల మధ్యలో.


ఏదోరా మీలాగా సాఫ్ట్ వేర్ జాబులు కాదు కదా మావి అని నాన్చాను.


ఒక లక్ష అన్నా వస్తుందా అన్నాడు. 


బాబోయ్. అందులో సగం కూడా రాదు అని చెప్పాను.


అదేంటో నాకెప్పుడూ శాలరీ గురించి మాట్లాడబుద్ధి కాదు. బహుశా అలాంటప్పుడు నేను వెనకబడి ఉన్నానని ఒప్పుకోవాలి అనేమో.


తరువాత కొద్ది సేపటికి తనకేదో అర్జంట్ పని పడిందని మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పి వాడు ఫోన్ పెట్టేశాడు.


తరువాత వాడి నుంచి ఫోన్ రాలేదు. నేను మాత్రం మ్యారేజ్ విషెష్ మెసేజ్ పెట్టి ఇంక ఆ విషయం మరచిపోయాను.


ఏమో. చాలా వరకూ స్నేహాలు ముందుకు వెళ్లాలన్నా సమాన సంపాదనలు కావాలేమో. 


ఏమో. నాకూ పెద్దగా తెలీదు. అన్ని విషయాలు తెలిసుంటే నేనూ నెలకి ఓ లక్ష రూపాయలు సంపాదించే వాణ్ణి కదూ అని సరిపెట్టుకున్నాను.



Rate this content
Log in

Similar telugu story from Abstract