Dinakar Reddy

Abstract Children Stories Classics

3  

Dinakar Reddy

Abstract Children Stories Classics

పసుపు గణపతి

పసుపు గణపతి

2 mins
202


అమ్మా! మనం కూడా రంగు రంగుల గణపతి బప్పాను తెచ్చుకుందాం. పదమ్మా. మూడో తరగతి చదువుతున్న వేణు వాళ్ళ అమ్మ చేయిని పట్టుకుని అడుగుతున్నాడు. ఊరు మొత్తం వినాయక చవితికి సిద్ధమవుతోంది.


వైష్ణవి వంట చేస్తూ ఉంది. మనం రేపు ఇంట్లోనే వినాయకుణ్ణి చేసుకుందాం నాన్నా. మా తండ్రి కదూ నన్ను వంట చేసుకోనీయమ్మా అని వాళ్ళ అమ్మ అతణ్ణి సముదాయించింది.


వేణు చిన్నబుచ్చుకుని నాకు పేద్ద రంగు గణపతి కావాలి. మా ఫ్రెండ్స్ అందరి ఇళ్ళల్లో గణపతి బప్పా తెచ్చేశారు అంటూ అలిగాడు. ఆ రాత్రి వేణు మంకు పట్టు పట్టి అన్నం కూడా తినలేదు.


వైష్ణవి వాళ్ళ ఆయన శేఖర్ కృత్రిమ రంగులతో చేసిన వినాయకుడి బొమ్మను తెస్తానని చెప్పినా వైష్ణవి ఒప్పుకోలేదు.


మరుసటి రోజు ఉదయం వైష్ణవి స్నానాదికాలు ముగించుకొని ప్రసాదాలు సిద్ధం చేసింది.


పసుపులో కాస్త మైదా పిండి ఒక గిన్నెలో తీసుకుని కాసిన్ని పాలు పోస్తూ ఆమె దానిని ముద్దలా కలిపింది.


ఆ పసుపు ముద్దతో వినాయకుణ్ణి తలపైన ఉంచే గొడుగును ఇంకా మూషికాన్ని కూడా చేసింది. 


ఆమె పూజ చేస్తూ ఉండగా వేణు స్నానం చేసి పూజ గదిలోకి వచ్చాడు.

శేఖర్ కూడా తయారు అయి వచ్చి పూజలో కూర్చున్నాడు.

అమ్మా. ఈ గణపతి బప్పా క్యూట్ గా ఉన్నాడు. ఎలా చేశావ్ అమ్మా. నేను కూడా చేస్తాను అని వేణు వాళ్ళ అమ్మను అడిగాడు.


వైష్ణవి పూజ ముంగించి అక్షతలు చల్లుకుని పిల్లాడి పైన కూడా చల్లింది. శేఖర్ కూడా అక్షతలు చల్లుకుని ప్రసాదం తీసుకున్నాడు.


వైష్ణవి వేణును ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రసాదం తినిపించింది. చూడు నాన్నా వినాయకుడి బొమ్మ పెద్దది అయినా చిన్నది అయినా ఆ దేవుడికి అలాంటి బేధాలుండవు. 


కృత్రిమ రంగులు చల్లిన బొమ్మల కన్నా ఇలా మనం చేసుకునే పసుపు, మట్టి బొమ్మలు నిమజ్జనం చేయడం వలన ప్రకృతికి రసాయనాల ముప్పు తప్పుతుంది.


నీ ఫ్రెండ్సు కూడా నిన్నే మెచ్చుకుంటారు. వాళ్ళకు మన వినాయకుణ్ణి చూపించు. ముందు వెళ్లు. వెళ్ళి పుస్తకాలు తెచ్చి దేవుడి దగ్గర పెట్టి దణ్ణం పెట్టుకో అని వేణును అక్కడ నుండి ఇంట్లోకి పంపింది.


ఏమిటి శ్రీమతి గారూ! ఇవాళ చాలా నేర్పించేస్తున్నారు అన్నాడు శేఖర్.


నేను నేర్పేది ఏముంది లెండి. అయినా పార్వతీ దేవి గణేశున్ని సృజించింది కెమికల్స్ తో కాదు కదా అని పసుపు గణపతి వైపు చూసింది.

 

ప్రసన్నంగా నవ్వుతూ ఉన్నట్టు అనిపించింది ఆ పసుపు బొమ్మ.



Rate this content
Log in