gopal krishna

Classics Fantasy Inspirational

4  

gopal krishna

Classics Fantasy Inspirational

ప్రజావైద్యశాల

ప్రజావైద్యశాల

3 mins
290



నరసింహం గారు మా ఊళ్ళో నే కాకుండా చుట్టుపక్కల పదిహేను ఇరవై గ్రామాల్లో ఆయుర్వేదవైద్యం చేసుకుంటూ ఊళ్ళో వాళ్ళు ఇచ్చిన తృణమోఫణమో పుచ్చుకొని, సంసారాన్ని నడిపించుకునేవారు. నర్సింహం గారి హస్తవాసి మంచిది కావడంతో రోజుకు కనీసం వందరూపాయలు కళ్లజూస్తూ ఉండడంతో వచ్చిన డబ్బుని పొదుపు చేసుకుంటూ, ఇద్దరు పిల్లల్ని చదివించి ప్రయోజకుల్ని చేయగలిగారు.

పెద్దకొడుకు బెంగుళూరు లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ ఉంటే చిన్నకొడుకు నిజామాబాద్ లో ఏదో గవర్నమెంట్ జాబ్ చేసేవాడు. పిల్లలిద్దరూ పెరిగి పెద్దవారై ప్రయోజకులు కావడంతో కొడుకులవద్ద కొంతకాలం ఉండాలని భార్యాభర్తలిద్దరూ వెళ్ళి అక్కడ గడపడానికి ప్రయత్నం చేసారు. కానీ వెళ్లిన ప్రతిసారి కోడళ్ళు అనే మాటలు వాళ్ళకి కంటిమీద కునుకు లేకుండా చెయ్యడంతో మారుమాట్లాడ కుండా తిరిగి తమ గ్రామానికే వచ్చి ఆ శిథిలావస్థకు చేరిన ఇంట్లోనే ఉండసాగారు.

     వయసు మీద పడిన నరసింహం గారు మందులను గుర్తించలేక ఒంట్లో ఓపిక నశించడంతో, సరైన వైద్యం చెయ్యలేక, ఇంగ్లీష్ వైద్యాలకు ప్రజలు అలవాటు పడి, ఆయుర్వేదాన్ని పట్టించుకోకపోవడంతో అప్పటి దాకా తాము దాచుకున్న డబ్బుతో గుట్టుగా బతకడం అలవాటు చేసుకున్నారు. ఊళ్ళో వాళ్ళ మంచి తనం వలన భార్యాభర్తలకి గవర్నమెంట్ పెన్షన్ రావడం వలన రోజులు లోటులేకుండా గడిచిపోయేవి.

                       *********

"పోస్ట్" అంటూ పోస్టుమాన్ పిలిచిన పిలుపుకి వరండాలో కునికిపాట్లు పడుతున్న నరసింహంగారు ఉలిక్కిపడి మేలుకుని పోస్టుమాన్ వైపు చూసారు. తనకు ఎప్పుడో కానీ రాని మనీ ఆర్డర్ వచ్చిందేమో అనుకున్నారు. పోస్ట్ మాన్ రిజిస్టర్డ్ కవర్ చేతిలో పెట్టి, సంతకం తీసుకొని, వెళ్ళిపోయాక కవర్ తెరిచి చూసిన అతనికి ఒక పేపర్ కనిపించింది. "డాక్టర్ గారూ, ఎన్నెన్నో ప్రాణాలు కాపాడిన మీకు పాదాభివందనాలు. మీరు కాపాడిన ప్రాణాల్లో నా ప్రాణాలు కూడా ఉన్నాయి. మీకోసారి కృతజ్ఞతలు చెప్పుకుందామని మీ ఇంటికి వచ్చాను. కానీ అక్కడి పరిస్థితులు చూసాక నా కళ్ళల్లో నీరు నిండిపోయింది. పాడైపోయి కూలడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు, మంచి నీరే మధ్యాహ్న భోజనంగా పుచ్చుకున్న పార్వతీ పరమేశ్వరుల లాంటి మిమ్మల్ని చూసాక, పలకరించగలిగే ధైర్యం నాకు లేకపోయింది. నాకు కన్నీరు ఆగలేదు.

అందుకే మిమ్మల్ని కలుసుకోలేక, పాదాభివందనం చెయ్యలేక తిరిగి వచ్చేసాను. నేను ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో లక్నో కి దగ్గరలో ఒక మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నాను. అన్నింటికన్నా ఉత్తమమైనది ఉపాధ్యాయవృత్తి. దాని తరువాతి స్థానం వైద్యవృత్తిది. ఈ రెండు కలిసి రావాలని మెడికల్ కాలేజీ లో ప్రొఫెసర్ గా స్థిరపడ్డాను. నేను వైద్యుణ్ణి కావాలని మిమ్ములను స్ఫూర్తిగా తీసుకొని చదివాను. చిన్నతనంలో అర్థరాత్రి పాము కరిస్తే చనిపోతాడని అందరూ చెప్పినప్పుడు, గంటలో లేచి కూర్చోపెడతాను అని మీరు చీకట్లో పరిగెత్తుకుంటూ వెళ్లి, తీసుకొచ్చి వేసిన ఆకుపసరు ఇవాళ నన్ను ఇలా ఉన్నత స్థితిలో కూర్చోపెట్టింది. మీకు ఎన్ని పాదాభివందనాలు చేసినా అవి చాల తక్కువే అని నా అభిప్రాయం.

డాక్టర్ గారూ, ఈ ఉత్తరంతో నేను మూడు లక్షల రూపాయలకు ఒక చెక్కు పంపిస్తున్నాను. ఆ చెక్కు బ్యాంకు కి తీసుకెళ్లి మార్చుకోండి. మీకు నచ్చిన పద్ధతిలో జీవిస్తూ, మీలాంటి పదిమందికి వైద్యం నేర్పిస్తూ, మీ ఇల్లు శుభ్రం చేయించి, మీ గ్రంధాల్ని ఒక లైబ్రరీలాగా ఏర్పాటు చేసి, అంతరించిపోతున్న ఆయుర్వేదాన్ని, పదిమందికి తరువాతి తరాలకు అందుబాటులో పెట్టి, నా కోరిక నెరవేర్చగలరని ఆశిస్తాను. వైద్యులు లేని మన గ్రామాలకు మీరు బాసటగా నిలబడాలని నా కోరిక. మళ్ళీ త్వరలో మీకు డబ్బు పంపిస్తాను. ఉంటాను డాక్టర్ గారూ, పాదాభివందనలతో--- కిషోర్ "

"కామాక్షి, ఇలా రా" పిలిచారు నరసింహం గారు. "ఎవరో, కిషోర్ అట చెక్కు పంపించారు చూడు". అంటూ వుత్తరం ఆమెకి అందించారు. "భగవంతుడే సాయం చేసాడేమో ఆ వ్యక్తి రూపంలో" అన్నారు ఆవిడ ఉత్తరం చదివి. ఆ రోజులో పదిహేను ఇరవైసార్లైనా ఆ ఉత్తరం చదువుకున్నారు ఆయన. జీవితంలో ఏదో ఒకటి సాధించాలని కృతనిశ్చయం ఆయన కళ్లల్లో కనిపించింది. తన చేతికి అందివస్తారనుకున్న కొడుకులు తనను విడిచిపెట్టి వెళ్ళిపోయినా అసలు గుర్తేలేని ఒక అబ్బాయి ఇంత పెద్దమొత్తంలో డబ్బు తనకు పంపించడం చాల ఆశ్చర్యం అనిపించింది,

     ఒక స్థిరమైన అభిప్రాయంతో తన వృత్తిని పదిమందికి నేర్పించి తన పాడుపడిన ఇంటిని బాగుచేయించి ప్రజావైద్యశాలగా మార్చాలని, తన తదనంతరం ఆ ఇంటిని ప్రజలకే అంకితం చేసి, తన జన్మ సార్ధకం చేసుకోవాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు.


Rate this content
Log in

Similar telugu story from Classics