SATYA PAVAN GANDHAM

Classics Inspirational Thriller

4  

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Thriller

"ప్రేమ లేఖ - 8"

"ప్రేమ లేఖ - 8"

7 mins
558


"ప్రేమ లేఖ - 7" కి

కొనసాగింపు...

"ప్రేమ లేఖ - 8"

వాళ్ళిద్దరు అలా కోపంగా ఒకరినొకరు చూసుకోవడం గమనించిన కీర్తన, మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో కలుగజేసుకుని

"సరే...

సరే...

మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేలా ఉందే..!

పవన్ గారు తన(కావ్య) గురించి వదిలేయండి కానీ.

లేఖ కు కొంచెం ఒంట్లో బాలేదు. తను ఇక్కడికి రాలేని పరిస్థితి.

మళ్ళీ తన కోసం ప్రేమ్ వచ్చి నిరాశగా వెళ్ళిపోతాడనీ...

లేఖే మమ్మల్ని ఇక్కడికి పంపించింది. పైగా నేను లేఖకు బాగా కావలసిన క్లోజ్ ఫ్రండ్ ని,

నన్ను మీ చెల్లెలిలా భావించి, నా మొహం చూసి కొంచెం ప్రేమ్ గురించి చెప్తారా..?

అతన్ని కలిసి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి." అంటూ పవన్ ని సున్నితంగా బ్రతిమలాడుతూ ప్రేమ్ గురించే వివరాలు అడిగే ప్రయత్నం చేస్తుంది కీర్తన...

"ఆ ముఖ్యమైన విషయం ఏంటో నాకే చెప్పండి..!

నేను ప్రేమ్ కి చెప్తాను" అంటూ ప్రేమ్ గురించి చెప్పడానికి తిరస్కరిస్తాడు పవన్.

అప్పటికే తన మీద కోపంతో ఊగిపోతున్న కావ్య ..

"చెప్పానా..!

ఇతను ఇలా కూల్ గా చెప్తే వినే రకం కాదని" అంటూ కీర్తన మీద కోప్పడుతుంది.

"అది కాదండీ ..!

ఒక్కసారి ప్రేమ్ నీ కలవాలి ...

ప్లీజ్ అర్థం చేసుకోండి" అంటూ మళ్ళీ మళ్ళీ ప్రాధేయపడుతుంది కీర్తన.

"నేను కూడా అదే చెప్తున్నా ...

నేను కూడా ఒక్కసారి లేఖను కలవాలి...

తనకి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి..!" అంటూ పవన్ వాళ్ళతో వితండ వాదం చేస్తాడు.

ఆకరికి కీర్తనకి కూడా ఇక ఓపిక నశించింది.

"ఏంటసలు...

పోనీలే పాపమని ఇంతలా బ్రతిమాలుతుంటే, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు..?"

(తను కూర్చున్న దగ్గర నుండి పైకి లేస్తూ)

ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు...

మేము ప్రేమ్ నీ కలవాలి..." అంటుంటే

"ప్రేమ్ నీ కలవడం ఇప్పుడు కలవడం కుదరదు" అంటూ తేల్చి చెప్తాడు పవన్.

దీంతో కీర్తన, కావ్య పవన్ తో ఒక చిన్న పాటి గొడవకు దిగుతారు.

అలా ఆ గొడవలో విచక్షణ కోల్పోయిన కావ్య

"లేఖ అసలు లేదు.

లేఖ ఇక తనకి లేదన్న విషయం చెప్పాలి.

ఇంకెప్పటికి తన దగ్గరకు చేరదని, తనకే కాదు మాకు కూడా అందనంత దూరం...

శాశ్వతంగా వెళ్లిపోయిందని తనకి చెప్పాలి" అంటూ నోరు జారీ గట్టిగా ఏడుస్తూ అక్కడే కూలబడిపోతుంది.

కావ్య... కీర్తనను ఓదారుస్తూ... పైకి లేపి కూర్చోబెడుతుండగా..

అప్పటికే షాక్ అయిన పవన్...

"ఏంటి మీరు చెప్పేది ..?

లేఖ లేదా...?

తనకేమైంది..?" అంటూ వాళ్ళని నిలదీస్తాడు పవన్

దానికి బదులుగా కావ్య నోరు విప్పుతుంది.

"కొన్ని రోజులు క్రితం...

ప్రేమ్ గురించి, లేఖ ఇంట్లో చెప్పింది అంట..

అసలే తల్లి లేని తను, సవతి తల్లి పెట్టే క్షోభను అప్పటివరకూ అనుభవిస్తూనే వచ్చింది.

చివరికి ఇంట్లో నలుగురి మధ్య చర్చించాల్సిన లేఖ ప్రేమ విషయాన్ని... వీధి పాలు చేసి, లేఖకు సమాజంలోనున్న మంచి పేరును, తన తండ్రికున్న గౌరవాన్ని, పరువును నాశనం చేసింది. ఆవిడ రాక్షస ఆనందం కోసం కావ్యను బజారు కీడ్చింది. తన పై ఒక చెడ్డ ముద్ర వేసి అప్పటివరకూ తనతో ఉన్న వాళ్లందరని తనకి దూరం చేసింది.

పాపం అమాయకురాలైన, అసలే సున్నిత మనస్కురాలైన లేఖ అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది."

అది విన్న పవన్ తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు..

తడిచిన కనులతో

"మరి ఆ లెటర్స్..!" అంటూ కావ్యని అడుగుతుండగా ..

ఒకప్పుడు లేఖ ఉన్న ఇంట్లోనే ఇప్పుడు మేము అద్దెకు ఉంటున్నాం. తనకు వస్తున్న లేఖలన్ని చదివి, ప్రేమ్ చాలా పిచ్చిగా లేఖను ప్రేమిస్తున్నాడని అనిపించింది. లేఖ లేకపోతే తను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడడని అర్థమైంది.

ఇక లేఖ లేదు, తను ఇక తిరిగి రాదు అన్న విషయం అతనికి తెలిస్తే తను ఏమైపోతాడోనన్న భయం వేసింది. ప్రేమ్ లేఖ పై పెంచుకున్న ప్రేమ తను రాసే ఆ లెటర్స్ ద్వారా నాకు తెలిసింది. అందుకే, లేఖలా నేనే ప్రేమ్ కి ఆ లేఖలు రాశాను. అది కూడా ప్రేమ్ ను బ్రతికించడం కోసమే.

కానీ ఇంకా తనని మోసం చేయడం ఇష్టం లేక ఇదిగో నిజం చెప్దామని తనని కలవడానికి ఇక్కడికి వచ్చాము" అంటూ జరిగిన దానిని సవివరంగా పవన్ కి చెప్తుంది కావ్య.

పవన్ మనసు బరువెక్కింది.

తన గుండె బద్దలయ్యింది.

మరొక పక్క తనకేం సంబంధం లేని వాళ్ల గురించి కావ్య తీసుకున్న నిర్ణయాన్ని తన మనసులో మెచ్చుకొక తప్పడం లేదు పవన్ కి.

కావ్య మనసుకి, ఆ మంచితనానికి తను చేసిన ఆ సాహసానికి ఆ సహాయానికి ముగ్ధుడవుతాడు.

అప్పటి వరకూ తనకి కావ్య మీద ఉన్న ఆ చెడు అభిప్రాయం కాస్త ఓ మంచి అభిప్రాయంగా మారింది పవన్ కి.

కానీ, కావ్యకు మాత్రం పవన్ మీదున్న అభిప్రాయం ఏమాత్రం మారలేదు. కావ్య అంతే కోపంగా పవన్ చూస్తూ....

"ఇప్పటికైనా ప్రేమ్ గురించి చెప్తావా..?

మాకసలే చాలా పనులున్నాయి...

తనని కలిసి మేము కూడా ఇక్కడ నుండి తొందరగా వెల్లాలనుకుంటున్నాము." అంటూ పవన్ తో కొంచెం గడసరిగా మాట్లాడుతుంది కావ్య.

మరొక పక్క కీర్తన కూడా అంతే ఆతృతగా ప్రేమ్ గురించి పవన్ ను పదే పదే అడుగుతుంది కావ్యతో పాటు...

ఎరుపెక్కిన కళ్ళతో ...

బరువెక్కిన మనసుతో...

ముక్కలైన హృదయంతో...

మూగబోయిన ఆవేశంతో...

పవన్ నెమ్మదిగా తన పెదవులు కదుల్చుతూ నోరు విప్పితూ

"ప్రేమ్ ఇక్కడే కాదు...

అసలు ఈ ప్రపంచంలోనే లేడు..!" అంటూ కొంచెం భీతిల్లిన.. ఆపై నెమ్మదించిన స్వరంతో వాళ్ల ప్రశ్నకు బదులిస్తాడు పవన్.

దాంతో పవన్ మాటలకు ఒక్కసారిగా ఖంగుతిన్న వాళ్ళిద్దరూ (కావ్య, కీర్తన)...

"ఏంటి నువ్వు చెప్పేది..?"

అంటూ ఒక్కసారిగా కొంచెం తమ స్వరం పెంచి రెట్టిస్తూ అడుగుతారు పవన్ ని.

"అవును...!

నేను చెప్పింది నమ్మడానికి మీకు భారంగా అనిపించొచ్చు

కానీ, అదే నిజం. నా ప్రాణ స్నేహితుడైన ప్రేమ్ లేడన్న విషయం మీరే కాదు నేను కూడా జీర్ణించుకోలేని ఓ నమ్మసఖ్యం కాని వాస్తవం. వాడు లేడన్న వార్తను నా ద్వారా అందరికీ తెలియచేయడం నేను చేసుకున్న దౌర్భాగ్యం." అంటూ వాళ్ళతో విషయం చెప్తూ... ఉన్న చోటే, కుమిలి కుమిలి ఎక్కెక్కి పడి ఏడుస్తాడు పవన్.

పవన్ చెప్పినదానికి ఒకపక్క కీర్తన, కావ్య...

ఇద్దరి హృదయాలు కూడా ఆగినంత పనయ్యాయి.

పవన్ చెప్తున్న వాటికి కావ్య అలానే నిశ్చలంగా బిగుసుకుపోయింది. కీర్తన మాత్రం పవన్ దగ్గరకి వచ్చి అతనని ఓదారుస్తుంది.

కాసేపటికి,

"ప్రేమ్ కి ఏమైంది..?

అసలేం జరిగింది..?

ఎలా జరిగింది ...?" అంటూ నెమ్మదిగా బాధనుండి కోలుకుంటున్న పవన్ నీ అడుగుతుంది కీర్తన.

"నేను... ప్రేమ్.. ఇద్దరం ఇంటర్ నుండి మంచి స్నేహితులం.

తనది ఒక మధ్య తరగతి కుటుంబం. ఐఏఎస్ అవ్వాల్లన్నది తన చిరకాల కోరిక. అసలే మధ్య తరగతి కుటుంబం. పైగా క్రమశిక్షణ గల తల్లి దండ్రుల పెంపకం. దానికి తోడు ఐఏఎస్ అవ్వాలన్న లక్ష్యం. అన్నీ తనని వేరే ఆలోచనల వైపు వెళ్లకుండా చేశాయి.

తను ఎప్పుడూ ఏ అమ్మాయి జోలికి వెళ్ళేవాడు కాదు. అసలు అమ్మాయి అంటేనే ఆమడ దూరం ఉండేవాడు. ఈ కాలపు కుర్రాళ్ళు అలవాటు చేసుకుంటున్న ఏ చెడు వ్యసనం తనకి అలవాటు లేదు. ఎవరికి ఏ కస్టమ్ వచ్చినా తానే ముందుంటాడు. పైగా సామాజిక సేవలలో పాల్గొంటుంటాడు. అంత మంచివాడు వాడు.

పదవ తరగతి పూర్తిచేసి ఇంటర్ లో చేరిన నాకు, వాడి గురించి అప్పుడే తెలిసి, ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండడంతో తనతో స్నేహం మొదలుపెట్టాను కొద్ది రోజులకే.

దాదాపు ఈ ఆరేళ్ల ప్రయాణంలో చాలా క్లోజ్ అయ్యాము.

ప్రతీ చిన్న విషయం ఒకరికొకరం పంచుకునే వాళ్ళం.

వాళ్లింట్లో నేనొక వాళ్ల బిడ్డలా...

మా ఇంట్లో వాడొక మా వాళ్ల బిడ్డలా కలిసిపోయేటంతలా ఉండేవాళ్ళం.

అన్నదమ్ముల బంధం కూడా సరితూగదన్నట్టనిపించేది మా చెలిమి చూస్తున్న వాళ్ళకి. మా స్నేహబంధాన్ని చూసి మాకున్న స్నేహితులలోనే కొందరు ఈర్ష్య పడేవారు అంతలా ఉండేది మా స్నేహబంధం.

అలా ఈ మధ్య సరిగ్గా ఒక నెల రోజులు క్రితం...

తను ఆ ఐఏఎస్ ఎగ్జాం రాయడానికి ఇద్దరం కలిసి మా ఊరికి దగ్గరలోనున్న టౌన్ కి వెళ్ళాం.

అలా ఎగ్జామ్ అయిపోయాక ఆ టౌన్ లో నున్న రైల్వే స్టేషన్ కి తీసుకెళ్ళాడు. ఎందుకు అని అడిగితే ముందు చెప్పలేదు కాని...

తర్వాత మెల్లగా చెప్పడం మొదలుపెట్టాడు. అది ఎవరి గురించో కాదు లేఖ గురించి. ఒక సంవత్సర కాలంగా ఇద్దరి మధ్య ఈ లేఖల సంభాషణ సాగుతుందని. తనతో వస్తూ ప్రేమలో పడ్డాడని, ఆ విషయం తనకి చెప్తే తను కూడా ఒప్పుకుందనీ...

ఒట్టి కాలి చేతులు తప్ప ఏమి లేని తనకు ఇంట్లో చెప్పడానికి, తనని కలవడానికి దైర్యం చాలడం లేదని...

లేఖ లేకుండా వాడు ఉండలేనని...

తనకి(లేఖ) కూడా అంతేనని...

ఇలా తన గురించి తానే స్వయంగా చెప్తూనే నేనే కాదు వాడి గురించి తెలిసిన వాళ్లకి చెప్పినా నమ్మలేనటువంటి నిజాలు ఆ రోజే చెప్పాడు ప్రేమ్.

"ఏంట్రా...!

ఇదంతా నిజమా..?

అయినా ఇంతకాలం ఎందుకు చెప్పలేదు రా..?" అంటూ నేనడిగితే...

"అసలిప్పటి వరకూ ఈ విషయం ఎవరికీ తెలియదని...

తను ప్రేమిస్తున్న విషయం కూడా లేఖకు ఈ మధ్యే చెప్పినట్టు...

తన నిర్ణయం తెలుసుకున్నాక నీకే ముందు చెప్పానని...

అసలిప్పటి వరకూ ఇద్దరం ఒకరికొరు ఎదురుపడలేదని..

కలిస్తే ముందు తనని నీకే చూపిస్తానని" వాడు నాతో అన్నాడు.

ప్రేమంటే...

కలిసి తిరగడం...

చిన్న గొడవైతే విడిపోవడం ...

రంగు, రుచి

ఆస్తి, అంతస్తూ...

కులం, గోత్రం

మతం, ప్రాంతం లాంటివి ప్రేమను ఏలుతున్న ఈ రోజుల్లో వాళ్ల ఇద్దరి మధ్య ఇన్నాళ్ళుగా కుదిరిన ఆ సయోధ్యయే గా నిజమైన ప్రేమంటే అని నా మనసుకి అనిపించింది.

అందుకే,

ఇంకెందుకు లేటు మరి,

ఆ అమ్మాయిని కలుస్తాను అని చెప్పేయకపోయావా ..?

అదే నేననేది తనని కలుస్తాను అని ఒక లెటర్ రాయకపోయావా ..? అంటూ తన ప్రేమకు మద్దతుగా నిలుస్తూ నేనంటే,

"అసలేం లేకుండా నేను తనని నాకిమ్మని ఎలా అడగాలి..?

అందుకే, ఒక ప్రయోజకుడిని అయ్యాకా ముందుకు వెళ్దాం అనుకున్నా...!

ఇదిగో ఈ ఐఏఎస్ ఎక్సాంలో సక్సెస్ అయితే నాకన్ని మంచి రోజులేగా" అంటూ తను చెప్పాడు.

"అవన్నీ తర్వాత ...

ఎలాగో మెయిన్స్ అయిపోయాయి కదా..!

ఒకసారి తనని కలుస్తాను అని చెప్పు...

మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడదాం" అంటూ నేను సర్ది చెప్పాను.

దానికి సరే అనుకుని, ఇద్దరం అక్కడి నుండి వచ్చేస్తుంటే,

సరిగా అప్పుడే ఒక చిన్న పాప రైలు పట్టాలను దాటుకుంటూ వెళ్తూ అదే పట్టాలపై పడిపోవడం, అదే సమయానికి ఒక ట్రైన్ ఆ పట్టాలపై వస్తుండడం గమనించిన ప్రేమ్...

ఆ పాపను రక్షించే క్రమంలో ....

ఆ పాపనైతే కాపాడాడు కానీ...,

తను మాత్రం మృత్యువుకు బలైయ్యాడు.

అంతా క్షణాల వ్యవధిలోనే, నా కళ్ళ ముందే జరిగింది. ఇప్పటికే అది నా కళ్ళ ముందే కదలాడుతుంది.

వాడు ఇక లేడన్న సంగతి వాళ్లింట్లో, మా ఇంట్లో పాటు నా స్నేహితులందరికి నా నోటితో నేనే నా గుండె రాయిని చేసుకుని చెప్పాల్సి వచ్చింది.

ఆ సంఘటన నుండి కోలుకోవడానికి నాకు కొన్ని రోజులు పట్టింది. ఆ తర్వాత లేఖ విషయం గుర్తుకువచ్చింది. వీడు లేడన్న సంగతి తెలిస్తే అంతగా తనని ప్రేమించిన లేఖ ఏమైపోతుందోనని భయ పడ్డాను.

అందుకే, ప్రేమ్ లా లేఖకు లేఖలు రాశాను. కానీ, నిజాన్ని ఎన్నాళ్ళు దాయగలం, ఎప్పటికైనా చెప్పాల్సిందే గా ....

అందుకే , తను ఒకసారి కలుద్దాం అని తన దగ్గర నుండి ఆ లెటర్ వచ్చిన దగ్గర నుండి నా ఒళ్ళంతా చెమటలు పట్టాయి. నా గుండె అంతా బరువెక్కింది.

తనకి విషయం చెప్తే ఎలా తీసుకుంటుందా అని...

కానీ, ఇప్పుడు మీ ద్వారా తను కూడా ఈ లోకంలో లేదన్న ఆ విషయం తెలిసి ఆ గుండె బద్దలైయింది." అంటూ జరిగినది అంతా వాళ్ళకి వివరించాడు పవన్ కూడా.

ముగ్గురి కళ్ళల్లో కన్నీళ్లు సంద్రాన్నే తలపించాయి.

వాళ్ల ముగ్గురి చుట్టూ విషాద ఛాయలు అలుముకున్నాయి.

ప్రేమ్... లేఖ ల స్వచ్ఛమైన ప్రేమలో

వాళ్ళు పంచుకున్నవి

అభిప్రాయాలు... అభిరుచులు

అనురాగ ... మమకారాలు మాత్రమే

వాళ్ల రంగు, రూపం..

ఆస్తి, పాస్తులు...

కులం, గోత్రం ..

మతం, ప్రాంతం తో చివరికి వాళ్ల వాళ్ళ చావు కూడా ఒకరికోరు తెలియకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. వాళ్లు మరణించే ఉండొచ్చు కానీ వాళ్ల ప్రేమ మాత్రం అమరమే! వాళ్ల ఆ ప్రేమ ఈ లోకంలో కాకపోయినా మరొక లోకంలో అయినా బలపడాలని. అక్కడైనా ప్రేమ్ లేఖలు ప్రేమతో ఒక్కటవ్వాలని ఆశిద్దాం.

చీకటి పడుతుండడంతో...

బాధాతప్త హృదయాలతో ఎవరిల్లకు వాళ్లు తిరుగు ప్రయాణమయ్యారు.

మరి...

పాత గాయాలతో అంతలా ఒకరిమీద ఒకరు కక్షలు పెంచుకున్న కావ్య, పవన్ లకు

లేఖ, ప్రేమ ల అమరమైన ప్రేమ ఒక మందులా పనిచేసి ఆ గాయాన్ని మానిపిస్తుందా..?

అసలు వాళ్లిద్దరి మధ్య రేగిన ఆ పాత గాయం ఏంటి..?

వాళ్ల మధ్య ఎలాంటి అనుభందం ఉండేది..?


లాంటి విషయాలతో పాటు కథలో మిగిలిన భాగం గురించి తెలుసుకోవడానికి "ప్రేమ లేఖ - 9" వరకూ కాస్త ఓపిక పట్టండి.

అంతవరకూ ...

పాఠకులందరూ...

కొంచెం ఓపిక పట్టి,

మీ విలువైన అభిప్రాయాలను సమీక్షల ద్వారా తెలపండి. అవి నాకు మరింత ఉత్సాహాన్నిచ్చి, నా ఈ కథకు నూతనొత్తేజాన్నిస్తాయి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు

రచన: సత్య పవన్ ✍️✍️✍️


Rate this content
Log in

Similar telugu story from Classics