gopal krishna

Tragedy Classics Others

4  

gopal krishna

Tragedy Classics Others

ఓ నాలుగు రోజులు

ఓ నాలుగు రోజులు

5 mins
271



     "నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదురా నిన్ను చూడాలని అంటున్నారు, ఒకసారి రాగలవా?" ఫోన్ లో ఎంతో రెక్వెస్టింగ్ గా అడిగింది అక్క. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అదంతా నాన్నగారు, అక్క దయకాదూ! తాను అంత రెక్వెస్టింగ్ గా అడగడం ఎందుకో నా మనసు కలిచివేసింది. ఎంత తొందరగా బయల్దేరినా మర్నాడు మధ్యాహ్నానికి గానీ ఇంటికి చేరుకోలేను.నిజమే నాన్నగారిని చూసి ఆరేడునెలలు అయిపోయింది. ప్రశాంతంగా ఆయన పక్కన కూర్చొని భోజనం చేసి రెండేళ్లయ్యిందేమో. ఎప్పటికప్పుడే వెళ్ళాలనుకున్నా సెలవులు సులభంగా దొరికే ఉద్యోగం కాదు.

    "సర్, అర్జెంటు ఫైల్స్ ఉన్నాయి సర్, ఇవాళ క్లియర్ చేసి చీఫ్ సెక్రటరీ గారికి పంపించెయ్యాలి" ,    'సి సెక్షన్' సూపరింటెండెంట్ చెప్పిన మాటలు నా చెవిలోకి వెళ్లడం లేదు. ఎలాగైనా లీవ్ అప్లై చేయాలి. కమీషనర్ గారికి ఫోన్ చేసి చెప్పి, ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి.ప్రోసిజర్ ప్రకారం ఇంటిమేషన్ ఇవ్వడానికి రింగ్ చేశాను. ఫోన్ రింగ్ అవుతూ ఉంటే నా హృదయస్పందన నాకే వింతగా వినిపిస్తోంది. ఏమంటారో? లీవ్ లెటర్ పడేసి వెళ్లిపోయే ఉద్యోగం కాదాయే.

    "సర్, మా డాడ్ కి బాగోలేదట. ఫోన్ వచ్చింది. అర్జెంటు గా ఇంటికి వెళ్ళాలి. లీవ్ గ్రాంట్ చేయగలరా ప్లీజ్" సాధ్యమైనంత పొలైట్ గా అడిగాను. ఏ కళనున్నాడో ఆయన "ఇట్స్ ఓకే. మెయిల్ మీ" అని చెప్పడంతో ఒక్కసారి గుండెల నిండా ఊపిరి పీల్చి, చకచకా లీవ్ అప్లై చేసుకొని బయట పడేసరికి సాయంత్రం నాలుగయ్యింది. ఆఫీస్ కారు లో ఎయిర్పోర్ట్ కి చేరుకొని కోల్కతా ఫ్లైట్ పట్టుకొనేసరికి ఆరున్నర అయిపోయింది. గంటన్నర ప్రయాణంలో ఎన్నో ఆలోచనలు.

     మాదొక చిన్న పల్లెటూరు. చిన్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు మట్టి దారిలో ఏదైనా రాయి కాలికి తగిలి గాయమైతే అది తగ్గినంతవరకూ మాకంటే ఆయనే ఎక్కువ శ్రద్ధ తీసుకునేవారు. తిండి తినేటప్పుడు ఆత్రంగా తినకూడదు, చిన్నగా ముద్దలు చేసుకొని, అన్నం మెత్తగా నమిలి మింగితే తిన్నది శరీరానికి పడుతుంది అనేవాళ్లు. కాళ్ళూ, చేతులు కడుక్కుంటే కానీ తినే తిండి ముట్టుకోకూడదు అంటూ చెప్పేవారు. నీ పక్కన ఎవరైనా ఉంటె నీ పళ్ళెంలో ఉన్న ఆహరం వాళ్ళతో షేర్ చేసుకోవాలని ఆహారం విలువను అర్థమయ్యేలా చెప్పేవారు.

    ఆకాశంలో నక్షత్ర మండలాల గురించి, రైతులు ఎదురుచూసే వర్షాలు, కార్తెల గురించి, చంద్రోదయం ఎలా జరుగుతుందో లెక్కలు కట్టి మరీ చెప్పేవారు. అందుకే ఆయన్ని నడిచి వచ్చే విజ్ఞానసర్వస్వం అనేవారు ఆయన శిష్యులు. ఆలోచనల్లోంచి బయటికి వచ్చి, ఆయన వర్తమానం గురించి ఆలోచనలో పడ్డాను.

     రెండు నెలల కిందట కూడా ఇలాగే ఫోన్ వచ్చింది. కానీ అప్పుడు ఇంటికి వెళ్ళడానికి కుదరనే లేదు. ఆలోచనలు నాన్నగారి గురించే. ఆ రోజు నేను చాల నొచ్చుకున్నాను. తనని చూడలేకపోయినందుకు చాల బాధపడుతూ ఆశక్తత ను తెలియజేశాను. "పోనీలే నాన్నా, నేను బాగున్నాగా. నీ ఉద్యోగం అలాంటిది ఏం చేస్తాము. నువ్వు ఆలోచనలు మానుకొని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో" అన్నారు. ఇంకెప్పుడు ఇలా కాకుండా ఉండాలంటే రెండే రెండు మార్గాలున్నాయి. మొదటిది నాన్నగారిని నా దగ్గర ఉండిపోయేలా చూసుకోవడం. రెండోది నేనే ఉద్యోగం మానేసి నాన్నగారితో కలిసి ఉండడం.

    ఒకరోజు అదే మాట ఫోన్ లో చెప్పాను. "మీరెందుకు ఇక్కడికి వచ్చి ఉండకూడదు" అంటూ అడిగాను. "నాకు ఆ చల్లని వాతావరణం పడదురా నాన్నా, నాకు చిన్నతనంలో ఆస్తమా ఉండేది. ఆహారపుటలవాట్లు అన్నీ మార్చుకోవడం వలన ఇన్నాళ్లు ఇబ్బంది పడలేదు కానీ ఈ మధ్య తరుచుగా బాధపెడుతోందిరా" నాన్నగారు ఫోన్ లో మాట్లాడ్డానికి అవస్థ పడుతున్నారని అర్థమైంది. కాసేపు మాట్లాడాక, "నేను రెస్ట్ తీసుకుంటా నాన్నా. ఎక్కువ ఆలోచించకుండా ఆరోగ్యం చక్కగా చూసుకో" ఫోన్ పెట్టేస్తూ చెప్పిన మాటలు అవి. ఎప్పటిలాగా పని బిజీ లో పడిపోయి కాలాన్ని మరిచిపోయాను.

     రెండునెలలు ఎలా గడిచిపోయాయో నాకు గుర్తులేదు. అక్క ఫోన్ చేసి విషయం చెప్తే కానీ అసలు ఇల్లు విషయం గుర్తుకూడా రాలేదు. చిన్నతనం గుర్తొచ్చింది ఒక్కసారిగా. చిన్నతనంలోనే అమ్మ చనిపోతే మళ్ళీ పెళ్లి జోలికి పోకుండా తానే తల్లీ, తండ్రి అయ్యి పెంచారు మమ్మల్ని. తాను మాత్రం పుట్టి, పెరిగిన ఊరు ని విడిచి ఎప్పుడూ ఇంకో ఊరు వెళ్ళింది లేదు. "కొడుకు దగ్గర ఉండొచ్చు కదా" అని ఊళ్ళో వాళ్ళు చెప్తే, "నాకిక్కడే బాగుంది. అక్కడ సదుపాయాలున్నా, అక్కడ ఉంటే ఏదో విదేశాల్లో ఉన్నట్లు అనిపిస్తుంది" అనేవారు.

    ఆలోచనల్లోనే కోల్కతా నుండి వైజాగ్ కి వెళ్ళే ఫ్లైట్ ఎక్కి కూర్చున్నా. కళ్ళు మూసుకుంటే అమ్మ ముఖమే కనిపిస్తోంది నవ్వుతూ. ఎప్పుడూ నాకు అలా అనిపించలేదు. వైజాగ్ లో ఫ్లైట్ ఎప్పుడు ల్యాండ్ అయ్యింది తెలియనేలేదు. ముందే ఇంటి ఫోన్ చేసి ఉండడం మూలాన ఎయిర్పోర్ట్ కి కారుపంపించింది అక్క. నాకు ఎలా ఉంటే సదుపాయంగా ఉంటుందో అక్కకంటే ఎక్కువగా తెలిసినవాళ్ళు ఎవరూ ఉండరేమో అనిపిస్తుంది. వెనకాల సీట్ లో కూర్చొని హాయిగా వెనక్కి చారబడ్డాను. మూడున్నర గంటల ప్రయాణం తరువాత ఇంటిముందు కారు ఆగింది.

                 ********

    "నాన్నగారిని డాక్టర్ పార్థు చూసాడురా. బాగా నీరసించిపోయారని చెప్పాడు" అక్క మాటలు వింటూ "ప్రిస్క్రిప్షన్ ఇవ్వు" అన్నాను. ఒక ఫైల్ తీసి చేతిలో పెట్టింది. స్వతహాగా డాక్టర్ని అయిన నాకు ఆ ఫైల్ చూడక్కర్లేకుండా చాల విషయాలు అర్థమైయ్యాయి. హిమోగ్లోబిన్ తగ్గిపోతోంది కండిషన్ క్లిష్టమని అర్థమవుతోంది. "ఏమయిందిరా" అడిగింది ఆందోళనగా.

    "ఏంకాలేదు. హాస్పిటల్ కి వెళ్లకతప్పదు". "డాక్టర్ పార్థు చూసాడురా" అంది అక్క. పదినిమిషాల్లో కారు లో బయలుదేరాం. కొంచెం రెస్ట్ తీసుకోవాల్సింది నాన్నా, ఇప్పుడేగా వచ్చావు" నాన్నగారి మాటలు వింటూ కూర్చునే పరిస్థితి కాదు, నిముషాలు గడుస్తూ ఉంటే పరిస్థితి విషమిస్తోంది మరి. "మీకు తెలియంది కాదు. మీరూ డాక్టరే కదా! ఈ నాలుగు రోజులూ తనని ప్రశాంతంగా ఉండనిస్తే చాల బాగుంటుంది. ఆయన మీకు తండ్రి. ఈ రోజు నేను డాక్టర్ గా నిలబడడానికి పునాది వేసిన శ్రామికుడు ఆయన. చదువు రాదని అమ్మా నాన్నా వదిలేస్తే తాను కృషి చేసి నన్ను మనిషిగా తీర్చిదిద్దిన మహా మనీషి. ఇంటికి తీసుకెళ్లండి. సాధ్యమైనంత సంతోషంగా ఉండేలా చూసుకోండి" భుజంమీద తడుతూ చెప్పాడు డాక్టర్ పార్థు.

   "మిమ్మల్ని అందర్నీ ఒకేచోట చూస్తూ ఉంటే చాల సంతోషంగా ఉందిరా" నాన్నగారి మాటలకు కన్నీళ్ళు ఉబికి వచ్చేసాయి. చిన్నపిల్లల్లా ఏడుపు ఎందుకురా? అడిగారు. ఏమీ లేదులెండి. ఎందుకో కొంచెం ఎమోషనల్ అయ్యాం అంది అక్క. మర్నాడు శ్రీమతి కూడా ఫ్లైట్ దిగింది. "ఎన్నోసార్లు చెప్పాను అందరం ఒక్కచోట ఉందాం అని, నా మాట విన్నారా" కళ్ళు తుడుచుకుంటూ నాన్నగారి కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు ఒత్తుతూ అంది. కావడానికి కోడలే కానీ, కూతురితో సమానంగా చూసేవాళ్ళు నా శ్రీమతిని. అక్క కూడా తనని తోబుట్టువులాగే చూసేది. అక్క పిల్లలు ఇల్లంతా హడావుడి చేస్తున్నారు. బంధువులు వస్తున్నారు. ఎవర్నీ పరామర్శకు వచ్చినట్లు ప్రవర్తించొద్దని ముందుగానే అక్క చెప్పేది. దాంతో ఇల్లంతా పండగ వాతావరణం కనిపించేలా ఉంది. చక్కని వాతావరణం. చాల సంతోషంగా ఉందిరా ఇవాళ. మీ అమ్మ పదేపదే గుర్తొస్తోంది" ఆయన మోహంలో చెప్పలేని సంతృప్తి కనిపిస్తోంది. ఎక్కడ విచార ఛాయలు కనిపించడం లేదు.

    "ఆయన పరిస్థితి కష్టంగా ఉందని అర్థమైంది నాకు. ఇంటికొచ్చిన బంధువులను, స్నేహితులను, పిల్లల్ని పెద్దల్ని ఒకచోట కూర్చోపెట్టడం కొంచెం కష్టమే అయ్యింది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏడవద్దు, కన్నీళ్లు కనిపించనివ్వద్దు అంటూ స్పష్టం చేసాం. ఒకరిద్దరు పెద్దవాళ్ళు అసలు మీకు మనసులేదేమోరా.. మీకోసం ఆయన ఎంత కష్టపడ్డారని. ఆయన ఆఖరి దశలో మీకు బాధ కలగడం లేదా"? నిష్ఠూరంగా చెప్పారు. అందరి మాటలకూ మౌనం సమాధానం అయ్యింది.

    అందర్నీ తన చుట్టూ కూర్చోపెట్టుకున్నారు. "నేను ఎంతో ఇష్టపడి మీ అమ్మని చేసుకున్నాను. ఆమెను ఏ నాడు ఒక్క మాట అన్నది లేదు. ఆమె మాట నాకు వేదవాక్కు. ఒంటిచేత్తో ఈ ఇంటిని నడిపించడమే కాదు, ఈ కుటుంబగౌరవాన్ని బంధువుల్లో, ఈ ఊళ్ళో రెట్టింపు చేసింది ఆమె. మీ అమ్మ వెళ్ళిపోయింది శివరాత్రి నాడు. ఆమె శివైక్యం చెందింది అని అందరూ అంటే కొంచెం బాధగా ఉండేది. తాను నన్నొదిలి ఎలా వెళ్లిపోగలదు"?

    "ఎందరో మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పినా ఆమె మీద ఉన్న, ప్రేమ గౌరవం నన్ను ఆ ఆలోచన వైపు వెళ్లనివ్వలేదు. నాకో అందమైన జీవితాన్ని ఇచ్చింది మీ అమ్మ. ఇవాళ నేను ఆమెను మళ్ళీ కలుసుకోబోతున్నాను. నాకు చాల ఆనందంగా ఉంది. పిల్లల్ని ప్రయోజకుల్ని చేశాను. అనుక్షణం నీ ఆలోచనలతో, నువ్వు చెప్పిన మాటల్నే వేదవాక్కుగా భావించి నేను వాళ్ళని ప్రయోజకుల్ని చేశాను. వాళ్ళు సాధించిన ప్రతి విజయాన్నీ నీకే అంకితం ఇస్తున్నాను అనుకునేవాణ్ణి" అమ్మ ఫోటో ఆయన చేతుల్లో ఉంది. చిన్నపిల్లాడు తనకిష్టమైన వస్తువు పట్టుకున్నట్లు భద్రంగా పట్టుకున్నారు.

   "ఈ రోజు నాకు ఎలాంటి లోటు లేదని అర్థమైంది. నాకోసం ఆలోచించే మీరంతా నా చుట్టూ ఉన్నారు. జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించడం అంటే వందేళ్లు బతకడం కాదురా. జీవితంలో కష్టాల్ని చిరునవ్వుతో స్వీకరించడం, సుఖాలని అలాంటి చిరునవ్వుతోనే అనుభవించడం. నా జీవితంలో ఇవే చేసాను. నాకేమీ బాధగా లేదురా, ఎన్ని కష్టాలొచ్చినా చిరునవ్వు విడిచిపెట్టకండి" భారంగా ఊపిరి తీసిన నాన్నగారి ఆఖరి శ్వాస అదేనని డాక్టర్ గా నాకు తెలుసు. అందరూ మౌనంగా కన్నీళ్లు తుడుచుకున్నారు. దుఃఖాన్ని ఆపుకోలేని వాళ్ళు భోరున ఏడ్చారు. ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి.

    వచ్చేవాళ్ళు వచ్చి చూస్తూ, పలకరిస్తూ, పార్థివ దేహానికి నమస్కారం చేస్తూ "చాల గొప్ప వ్యక్తి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్త్వం ఆయనది"...ఇలా చెప్పుకుంటూ ఉంటే, అటువంటి తండ్రికి కన్నబిడ్డగా గర్వంగా అనిపించింది. బాధాతప్త హృదయాలతో ఆయనకు గౌరవమైన వీడ్కోలు పలికి వచ్చాను. తదనంతరం చేయాల్సిన కార్యక్రమాలను లోపం లేకుండా నిర్వర్తించాను. అది ఆయన చూస్తారో చూడరో నాకు తెలియదు. కానీ ఆయనకు ఇచ్చే గౌరవం అది. ఆయన నిర్దేశించిన మార్గంలో ముందుకు పయనించడం నాకో గొప్ప అనుభూతి నిస్తోంది.


Rate this content
Log in

Similar telugu story from Tragedy