Varun Ravalakollu

Romance


4.9  

Varun Ravalakollu

Romance


నీలి మేఘం ...

నీలి మేఘం ...

5 mins 403 5 mins 403

“ఏంట్రా అలా ఉన్నావ్?” అడిగింది ఆశ్లేష.

“నీలాల కనుపాపల మేఘాల నుంచి జారుతున్న ప్రేమ ధారలలో తడుస్తుంటే ఇంకెలా ఉండను?” అన్నాడు విశ్లేష్.

“మన పేర్లు సగం కలిశాయి కానీ మన మనసులు కొంచెం కూడా కలవలేకపోయాయి” అని మనోశ్లేష చెబుతుంటే విని ఇప్పుడెందుకు దాని గొడవ అనుకుంటూ, “ఇంతకూ ఎవరా అందగత్తె?” అంది ఆశ్లేష.

“ఎవరూ అంటే ఎలా చెప్పను? మేఘన తన పేరు. సున్నితంగా స్పందించే మనోభావాలకి రారాణి. నా భావాలను చూపులతో ఛేదించే మనోజ్ఞానసరస్వతి. పరిస్థితులకు లొంగకుండా మందహాసం పూయించే ఓ మధురానుభూతి” అని చెప్పుకొచ్చాడు విశ్లేష్.

“అంత నచ్చిందా?”

“అంతా నచ్చింది”

“ఐతే పెళ్ళెప్పుడు?”

“ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్టు అయిపోయిన వెంటనే”

“ఇంతకీ మీ మేఘానికి చెప్పావా?”

“మేఘం కాదు మేఘన”

“ఆవిడకే..., చెప్పావా?...” పక్కనే ఉన్న కెమెరాను చేతికి అందుకుంటూ అంది ఆశ్లేష.

“చెప్పలేదు కానీ ఎందుకో తనకు కూడా నేను తన ప్రేమలో తడుస్తున్నానని తెలుసు అనిపిస్తుంది”

“ఎందుకు అనిపించదు..., నాక్కూడా అలాగే అనిపించింది కానీ ఏం లాభం” అంది ఆశ్లేష నిర్లిప్తంగా.

“ఏంటి?” అన్నాడు విశ్లేష్.

“ఏమీ లేదులే. ముందు నీ మేఘానికి చెప్పు నీ ప్రేమ సంగతి”

“సరే ఈ షూట్ కానివ్వు” అంటూ ట్రైపాడ్ భుజానికెత్తుకుని ముందుకు నడిచిన విశ్లేష్ ని చూస్తూ, “ఎక్కడ షూట్? ఎవరి ఫోటోస్ తియ్యాలి? 200D సరిపోతుందా?” అడిగింది ఆశ్లేష.

“సరిపోతుంది. ఇక్కడ్నుంచి 2 మైళ్ళు ముందుకెళ్తే సముద్రం వస్తుంది, అక్కడే. పద వెళ్దాం” అన్నాడు విశ్లేష్ ట్రైపాడ్ (కెమెరా స్టాండ్) కార్ వెనుక సీట్లో పెడుతూ.

అడుగులో అడుగు వేసుకుంటూ, “ఐనా నేను ప్రేమించడమే తప్పు. చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు. ఒకే చదువు చదివినా తను ఫోటోగ్రాఫర్, నేను అసిస్టెంట్ అయ్యాం కదా అలాంటప్పుడు ఎందుకు ఆశపడటం” అని లోపల నొచ్చుకుంటూ బయటకు నవ్వుకుంటూ వచ్చి కార్ ఎక్కింది ఆశ్లేష.

కార్ లో పాట ప్లే అయ్యింది. ఆ పాట నచ్చక – ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో...’ అంటూ పాడేవరకూ ఆడియో సిస్టమ్ రిమోర్ట్ కి తన చేతి వేళ్ళతో జోల పాడాడు విశ్లేష్.

“ఏంటి..., మళ్ళీ అమ్మాయి ఫోటోస్ తియ్యడానికి వెళ్తున్నామా?” అంది ఆశ్లేష.

“భలే కనిపెట్టేస్తావ్ నువ్వు. ఇందాక చెప్పా కదా మేఘన అని, తన ఫోటోస్ తియ్యడానికే” అన్నాడతను.

“ఎందుకు కనిపెట్టనూ..., కోరుకున్నవాడు వాడు కోరుకున్న దాని కొంగుకు గుడికడుతుంటే నేను అందులో గంటకొడుతుంటా కదా? కనిపెడతా! ఎందుకు కనిపెట్టను” మెల్లిగా అంది ఆశ్లేష.

సముద్రుడు సమీపించాడు. సన్నిహితులులా అలలు పలకరిస్తున్నా బదులిస్తూ మనసారా నవ్వులు రువ్వలేకపోయింది ఆశ్లేష.

“నవ్వుతూ కూర్చుంటే ఎలా..., తను వచ్చేసరికి అన్నీ సిద్ధం చెయ్యాలిగా” అన్నాడు విశ్లేష్.

“అన్నీ అంటే?”

“కెమెరా స్టాండ్స్, బ్యాలెన్సింగ్ పాడ్స్, ఇంకా లొకేషన్. ఎక్కడ బాగుందో కూడా చూడు. ఫోటోలో తన అందానికి సముద్రంతో సన్నిహిత్యం సబబుగా ఉండాలి కదా” అన్నాడు విశ్లేష్.

జడుసుగా జవాబుగా, “ఆ ఎడమ వైపు ఉన్న బోట్ దగ్గర?..” అన్న ఆశ్లేష మాటలు విశ్లేష్ చెవిన పడ్డాయి.

“ఎడమ వైపు కాదు కుడివైపు చూడు. లైట్ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు. ISO రేంజ్ కూడా బాగుంటుంది కదా. పైగా వెనుక చిన్నచిన్న చెట్లు కూడా ఉన్నాయి. ఇంత మంచి లొకేషన్ వదిలేసి బోట్ కావాలా?...” అని అడిగాడు.

“ఇంత వివరంగా చెప్పిన తర్వాత బోట్ ఎందుకు” అని కళ్ళతో నవ్వి, “ఫోటో తియ్యడానికి కూడా కెమెరాతో పనిలేదు కళ్ళతో తీసుకో” అని మనసుతో ఉడుక్కుంది.

విశ్లేష్ మాత్రం ఒకచోట నిలవకుండా ఫోటో తియ్యడానికి అన్నీ సిద్ధం చేస్తున్నాడు. ఆ చేష్టలను చూసి ఆపుకోలేక, “ఏది మీ కుందనపు బొమ్మ? కుందన్ వర్క్ కానీ చేయించుకోవడానికి వెళ్ళిందా?” అంది ఆశ్లేష.

విశ్లేష్ కోపంగా చూశాడు.

ఆశ్లేష, “సారీ” అంది.

“ఎందుకు నీకంత కుళ్ళు? అవును తను అందంగా ఉంటుంది. ఉంది. నిజమే కదా చెప్పాను, దానికి కూడా వెక్కిరించాలా” అన్నాడు విశ్లేష్.

“చేసింది తప్పే ఇంకెప్పుడూ అనను” అంటూ అడుగులు ముందుకేసింది ఆశ్లేష.

“ఎక్కడికెళ్తున్నావ్?” అడిగాడు విశ్లేష్.

“ఎక్కడికీ లేదు. సెట్ చెయ్యడం అంతా అయిపోయింది కదా నేను ఎందుకు నువ్వే తీసేయ్ ఫోటోస్” అంది ఆశ్లేష.

“అవునా..., మరి షూట్ అయిపోయేలోపు ఏదైనా అవసరమైతే తనకు డ్రెస్సింగ్ ఎవరు చూసుకుంటారు, ఇంకా స్టిల్ గురించి ఎవరు చెప్తారు?” అన్నాడు విశ్లేష్.

ఆశ్లేష అమాంతం చూస్తూ, “నేను చేసుకున్న కర్మరా... ఇది నాకు తప్పుతుందా” అంటూ మళ్ళీ దగ్గరకు నడిచింది.

“నా వైపు కాదు అటు నడువు. మొన్న తీసిన ఫోటోస్ లో కూడా కలర్ పాలేట్ లో నాయిస్ వచ్చింది” అన్నాడు.

“అదేం లేదే...” అనుకుంటూనే ఫ్రేమ్ లోకి నడిచింది ఆశ్లేష.

ఒక ఫోటో తీశాడు. ఆశ్లేష మోములో ఏదో తెలియని వెలితి.

“ఏమయ్యింది కొంచెం నవ్వు” అన్నాడు విశ్లేష్.

“గుండెనిండా ఇందాకటి దాకా నువ్వే కదరా ఉన్నావ్..., ఇప్పుడు ఏమైంది అని నన్ను అడుగుతావే? నన్ను కాదని నేను నీకు చోటిస్తే నువ్వు నన్ను కాదని వెళ్ళావ్. నువ్వు వెళ్ళాకే కదా గుండెలో బాధకు చోటు దొరికింది. అదే నువ్వు ఉంటే బాధెక్కడిది, బాధకు చోటెక్కడిది?!” అని తిట్టుకుంటూనే ఇష్టంలేని నవ్వు నవ్వింది.

విశ్లేష్ రెండు మూడు ఫోటోస్ తీసాక, “కొత్త స్టిల్స్ ఏమైనా ఆలోచించావా?” అన్నాడు.

“తను వచ్చాక తనతో ట్రై చేద్దాంలే” అంది ఆశ్లేష.

“లేదు అలా కాదు. నువ్వు ట్రై చెయ్. నచ్చితే తనచేత చేయిద్దాం. నీ ఫోటోలు బాగున్నాయంటే తను బాగుంటుంది. కాబట్టి తన ఫోటోలు ఇంకా బాగా వస్తాయి” అన్నాడు విశ్లేష్.

“అంటే ఏంటి అర్థం..., నేను బాగాలేననే కదా?” అంది ఆశ్లేష.

“లేదు, మేఘన చాలా బాగుంటుందని” అన్నాడు విశ్లేష్ కెమెరాలో ఉన్న ఫోటోస్ చూస్తూ.

ఇంకొన్ని ఫోటోస్ తీశాడు. ఆశ్లేష స్టిల్స్ ఇస్తూ నిలుచుంది.


“ఇంకొంచెం రంగుంటే బాగుండేవి” అన్నాడు విశ్లేష్ ఫోటోలు చూస్తూ.

ఆశ్లేషకి కోపం ముంచుకొచ్చింది. ఆ కోపాన్ని చూపులకు అరువిచ్చింది.

విశ్లేష్ గమనిస్తూ, “నిన్ను కాదు ఫోటోస్ లో కాంట్రాస్ట్ రేంజ్ ఎక్కువైంది దాని గురించి” అన్నాడు.

***

“ఇంకా ఎంతసేపు పడుతుంది?” అంది ఆశ్లేష.

“ఏమో..., వర్షం కోసం, వరాల కోసం, మంచికోసం, అంతెందుకు..., మనసుకి నచ్చిన దానికోసం కూడా ఎదురు చూడాల్సిందే కదా?” అన్నాడు విశ్లేష్.

“అవును సార్ నిజమే! ఇంతకీ మీకు చెప్పడం ఎన్ని గంటలకు వస్తాము అని చెప్పారు” అనిన ఆశ్లేష మాటలకు, “నాకు చెప్పినదాని ప్రకారం 3 గంటలకే వస్తాను అని చెప్పింది” అని బదులిచ్చాడు విశ్లేష్.

“ఓహ్ అవునా..., మరి ఇప్పుడు 3:30 దాటింది కదా?” అంది ఆశ్లేష.

“వస్తుందిలే మళ్ళీ మళ్ళీ అడగకు. మన పని ఇదే కదా, 5 గంటలకు వచ్చినా మనకు పోయేదేముంది?” అన్నాడు.

“నీకేమో ఎదురుచూపులు, నాకేమో వ్యధల ఊసులా?” ఏంటి దేవుడా ఈ శిక్ష అనుకుంటూ అక్కడే కూర్చుంది ఆశ్లేష.

విశ్లేష్ ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసి తన మొబైల్ కి కెమెరా SSD ని కనెక్ట్ చేస్తూ తన పనిలో తాను నిమగ్నమైపోయాడు.

ఆశ్లేషకు ఆరంభమే విసుగొచ్చింది కానీ ఏమీ చేయలేకపోయింది.

“చిన్న చేపలను పెద్ద చేపలు తిన్నప్పుడు గంటలు నిమిషాలను ఎందుకు తినవు” అనేంత సందేహం వచ్చేలా సమయం వేధించింది. వేధించినా వీడను అంటూ లోకం కాలం వెంట పరుగులు తీసింది. గడియారం కాలపు పాదదాసిలా 6 గంటలను సూచించింది.

“ఆవిడ నెంబర్ మీ దగ్గర లేదా? ఒకసారి ఫోన్ చేయకూడదా...” అంది ఆశ్లేష విసుగ్గా.

“చేస్తాను” విశ్లేష్ డైల్ చేశాడు. రెండు ఘడియలు ముగిశాక, “తను ఫోన్ లిఫ్ట్ చెయ్యట్లేదు” అన్నాడు విముఖతతో.

తను రానందుకు కొంచెం సంతోషమే కానీ విశ్లేష్ మోములో విచారం నచ్చక, “బాధపడకు విశ్లేష్, ఈరోజు రాకపోతే ఏంటి, రేపు వస్తుందిలే. నేను ప్లాన్ చేస్తా మంచిగా షూట్ చేద్దాం” అని చెప్తూ కార్ లోకి సామాను మొత్తం ఎక్కించింది.

విశ్లేష్ కార్ స్టార్ట్ చేశాడు. తన స్టూడియో దగ్గరకి వెళ్తాడనుకుంటే విశ్లేష్ మాత్రం ఏదో ఆలోచిస్తూ కార్ ఇంటికి పోనిచ్చాడు. సమయం రాత్రి 8 దాటింది. విశ్లేష్ కార్ దిగి ఇంట్లోకి అడుగులేశాడు.

నాలుగడుగులు వేశాక, “కెమెరాలు దించద్దులే కారులో ఉండనివ్వు” అని చెప్పి, “అయ్యో..., నిన్ను ఇంటి దగ్గర దింపడం మర్చిపోయానే” అన్నాడు.

ఆశ్లేష నవ్వి, “ఇప్పటికైనా గుర్తొచ్చాను సంతోషం. అమ్మ ఎదురు చూస్తుంటుంది వెళ్దామా?” అంది.

“ఆంటీకి ఫోన్ చేసి చెప్పు ఇంకో గంటలో వస్తామని. కొంచెం తలనొప్పిగా ఉంది కాఫీ తాగి వెళ్దాం” అన్నాడు.

“సరే” అంటూ ఆశ్లేష కూడా కార్ దిగి ఇంట్లోకి అడుగులేసింది.

“ఇంట్లో ఎవరూ లేరా?” వాకిలి దాటగానే అడిగింది.

“లేరు. అమ్మ వాళ్ళు విజయవాడ వెళ్ళారు” అని చెప్పాడు విశ్లేష్.

“మరి కాఫీ ఎవరు పెడతారు?”

“నేనే” అన్నాడు విశ్లేష్.

“వద్దులే నేను తీసుకొస్తా” అంటూ ఆశ్లేష వంటగదిలోకి కదిలింది.

“సరే నేను నా బెడ్ రూంలో ఉంటా కాఫీ అవ్వగానే పిలువు” అంటూ విశ్లేష్ వెళ్ళాడు.

కొద్దిసేపట్లోనే కాఫీ సిద్ధమై విశ్లేష్ ఆచూకీ చెప్పమని ఆశ్లేషని అడిగింది. విశ్లేష్ ని పిలిచినా సమాధానం రాకపోవడంతో కాఫీ కప్ తీసుకుని బెడ్ రూమ్ వైపు అడుగులేసింది ఆశ్లేష. బెడ్ రూమ్ తలుపు తీసే ఉంది. ఆశ్లేష లోపలికి నడిచింది. ఇంతలో బయటనుంచి తలుపు ఎవరో వేశారు శబ్దం రాకుండా. రూమ్ లో పవర్ పోయింది.

చీకట్లో ఏదో జారుతున్న శబ్ధం. ఒక్కసారిగా వెనుకనుంచి ఏదో వెలుతురు. తిరిగి చూసి ఆశ్చర్యపోయింది ఆశ్లేష. మూతి ముడుచుకున్న తన ఫోటో పెద్దదిగా గోడ నిండా వెలుగుల మధ్యలో దర్శనమిచ్చింది. తను దానిని చూస్తుండగానే తన వెనుక ఉన్న మరో గోడపై వెలుతురు. ఇంకొక ఫోటో. ఈసారి నవ్వుతో. నోటికి చేతిని అడ్డం పెట్టుకుంటూ నవ్వుతుంటే కలువ కళ్ళలో తేనె చినుకులు ఉద్భవించాయి. ఇంతలో ఎడమవైపు ఉన్న గోడపై మళ్ళీ వెలుగుల మధ్యలో ఆశ్లేష నడుంపై చేయి వేసుకుని సముద్రపు వదనంలో విరిసిన సాగరకన్యలా ఉన్న మరొక ఫోటో జాలువారింది. దానిని చూసి మనసు విశ్లేష్ భావాలతో విహరిస్తుండగానే కుడివైపున ఉన్న గోడపై తను గడ్డం కింద చేయి పెట్టుకున్న ఇంకొక ఫోటో చమక్కున మెరిసింది. అలా నలుదిక్కులా తనని తాను అంత అందంగా చూసుకుంటూ మురిసిపోయింది ఆశ్లేష.

ఇంతలో తలుపు తెరుచుకుంది. విశ్లేష్ వాకిట్లో నుంచుని ఆశ్లేషను చూస్తున్నాడు నవ్వుకుంటూ. ఆశ్లేష ఆనందభాష్పాలను తుడుచుకుంటూ కాఫీ అంది.

విశ్లేష్ కాఫీ అందుకుంటూ, “మేఘన బాగుందా?” అని అడిగాడు.

“ఏది, ఎక్కడ...?” అడిగింది ఆశ్లేష అర్థంకానట్లుగా.

“అంటే నీకు నచ్చలేదా?”

“ఇంత నలుపు ఈ అందగాడికి నచ్చుతుంది అనుకోలేదు” అంది ఆశ్లేష.

“ఐతే మేఘన కాదు నీలి మేఘం అని చెప్పాల్సింది నీకు అర్థమయ్యేది” అన్నాడు ఆశ్లేష చెంపని ముద్దాడుతూ.

అంటే నేను నా మీదే కుళ్ళుకున్నానా అని మనసారా నవ్వుకుంటూ, “నిజమే నీలి మేఘానికే మనమధ్య చోటిస్తా ఇంకెవరికీ ఇవ్వను” అంది.

“ఎందుకలా?” అన్నాడు విశ్లేష్.

“అదైతే కోపమొచ్చినప్పుడల్లా కరుగుతుందిగా అందుకు” అంది మనసులో ఇంకా ముంగిట్లో కొలువైన ప్రియుని పెదవులను ముద్దాడుతూ.

***


Rate this content
Log in

More telugu story from Varun Ravalakollu

Similar telugu story from Romance