SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

4  

SATYA PAVAN GANDHAM

Classics Inspirational Others

"కథలో రాజకుమారి-1"

"కథలో రాజకుమారి-1"

6 mins
689


"ఒరేయ్..వెధవ!

పని పాటు లేని సన్నాసి!

బారెడు పొద్దెక్కినా ఆ మొద్దు నిద్ర వదలవేంట్రా ..?

"అసలే రాత్రికి పల్లవి పెళ్లి!

అయినా వీడింకా లేవలేదా..?

ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయ్!" అంటూ మావయ్య కూడా వచ్చి నీ గురించి అడిగి వెళ్ళాడిందాక!

అయినా.. ఉద్యోగం సద్యోగం లేని అయ్యగారు అంత అర్థరాత్రుల్ల వరకూ బయట ఏం పని వెలగబెడుతున్నారో..!

చవట..! దద్దమ్మ..!!

ఈ రెండు మూడు రోజులైనా ఆ పెళ్లి పనుల్లో మీ మావయ్యకి కాస్తో కూస్తో సహాయం చెయ్యకూడదు...!

ఆ పిల్లని చేసుకునే అదృష్టం, యోగ్యత ఎలాగో లేదు నీకు.

ఇప్పుడు కూడా తప్పించుకు తిరిగితే, పిల్లనివ్వలేదని నేనేదో నిన్ను కావాలని వాళ్లకు దూరం చేసినట్టు నీ మేనమామ అనుకుంటాడు. అసలే కోపదారి మనిషి.

అయినా నిన్నని ఏం లాభం లే, నిన్ను ఇంత గారాబం చేస్తూ వెనకేసుకొస్తున్న మీ అమ్మననాలి."

అంటూ బయట హల్ లో నుండి గట్టిగా అరుస్తూ, తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ బాగా నిద్రలో మునిగిపోయిన పవన్ ని లేపే ప్రయత్నం చేశాడు వాళ్ల నాన్న.

                             *****************

పాపం, ఆ పెళ్లి పనులతోనే నలుగుతూ రాత్రి కొంచెం ఆలస్యంగా పడుకున్న పవన్ ఆ మాటలకు మంచం మీద నుండి ఉలిక్కి పడి లేచాడు.

అలా పవన్ గబాలున లేచేసరికి, తన కాళ్ళ దగ్గర వాళ్ళమ్మ బాధ పడుతూ కూర్చుని ఉండడం గమనించాడు. తనలా నిట్టూరుస్తూ కూర్చోడానికి కారణం పవన్ కి ముందే తెలుసు.

"ఎందుకమ్మా..! పదె పదే అదే తలుచుకుని బాధ పడతావ్...!

జరిగాల్సిందేదో జరిగిపోతుందిగా..!

ఐనా ఇప్పుడేమయ్యిందని చెప్పు!

నువ్విలా బాధ పడుతూ కూర్చుంటే నా మనసంతా అదోలా ఉంటుంది." అంటూ వాళ్ళమ్మని ఓదార్చే ప్రయత్నం చేశాడు పవన్.

"ఒరేయ్.. కన్నా!

నిజం చెప్పు,

ఇన్నేళ్లలో ఎప్పుడూ నువ్వు పల్లవిని ఇష్టపడలేదా..?

ఒకప్పుడు నువ్వే చెప్పావ్.. తనని ఇష్టపడుతున్నాను" అని,

ఇప్పుడేమో తనంటే నీకెలాంటి అభిప్రాయం లేదంటున్నవ్!

ఆ రోజు పల్లవి పెళ్లి విషయం వచ్చినప్పుడు కూడా..

మీ నాన్న గారు, నేను నీకిచ్చి చేద్ధామనుకుని నీ అభిప్రాయాన్ని కూడా అడిగితే, నీకు తనని పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఏ మాత్రం లేదని నువ్వు ఖరాఖండిగా తెగేసి చెప్పావ్. దానికి నాకు ఏమనాలో కూడా అర్థం కాలేదు. ఈ విషయం తెలిసి మావయ్య కూడా చిన్న బుచ్చుకున్నాడు. తనకి కూడా నువ్వంటే ఇష్టం, పల్లవిని నీకిచ్చే చేద్దామనుకున్నాడు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా నాన్న!

ఆ రోజు నువ్వు అదంతా చెప్తుంటే, నాకెందుకో నమ్మబుద్ధి కాలేదు. నీ కళ్ళను గమనిస్తుంటే మాత్రం నువు చెప్తుదంతా అబద్ధమనిపించింది.

నాకిప్పటికి పల్లవినే కోడలిగా చేసుకోవాలనుంది...

మీ ఇద్దరికీ ఈడు జోడూ బాగుంటుందని చిన్నప్పటినుండి ఎన్నో కలలు కన్నాను. నా అన్న కూతురే నా ఇంటి కోడలని మురిసిపోయాను. ఇరుగుపొరుగు అందరికీ అదే చెప్పుకున్నాను.

ఇప్పటికైనా మించిపోయింది లేదు...

నీ మనసులో మాట చెప్పరా కన్నా...

మీ నాన్న గారితో, మావయ్యతో నేను మాట్లాడతాను.

ఈ అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పు..!

నువు నా దగ్గర ఏదో దాస్తున్నావ్ కదూ...!" అంటూ పవన్ మనసులో అసలేముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది వాళ్ళమ్మ.

"ఓసి పిచ్చి అమ్మ...!

నీకెన్ని సార్లు చెప్పాలి..

మా ఇద్దరి మధ్య ఏమీ లేదని,

అయినా మా ఇద్దరిని చిన్నప్పటి నుండి మీరే చూస్తున్నారుగా,

ఎప్పుడైనా మేమిద్దరం కనీసం మాట్లాడుకోవడం చూసారా?

ఒకవేళ పొరపాటున మాట్లాడుకున్నా..

ప్రతి చిన్న విషయానికి మా మధ్య గొడవేనన్న సంగతి మీకు తెలుసు కదా!

వరసకు తను నా మేనమామ కూతురే అయినా...

మేమిద్దరం బావా మరదళ్లలా ఎప్పుడైనా ఉన్నామా?

అసలు మీ ముందుకాని, వెనుక కానీ సఖ్యతగా మెలిగామా?

అయినా ఇప్పుడు నా దగ్గరేముంది చెప్పు!

నాన్న గారు ఇందాకన్నట్టు ఓ ఉద్యోగమా సద్యోగమా...?

ఎప్పుడూ నా తోడుండే ఒక్క ఆయన గారి తిట్లు తప్ప!

పల్లవికి తెచ్చినబ్బాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, తనకు తగ్గ వరుడు, పైగా అత్తయ్యకి దగ్గర బంధువులు. అది మావయ్యకి పల్లవికి కూడా ఇష్టమయ్యే కదా దీనికి ఒప్పుకున్నారు!

నాన్న గారినీ చూస్తేనే భయపడి ఆమడ దూరంలో నిల్చునే నువ్వు.. అసలీ ఈ టైంలో వాళ్ళని అడుగుతాననడం కరెక్టేనా అమ్మా..?

పోని ఇప్పుడేల్లి నువ్వు ఆయన్ని అడిగావే అనుకో..!

నిన్నెం అనలేక..

"పనీపాట లేని వెధవ!, సమయం సందర్భం లేకుండా, నీకు ఇష్టం అయినప్పుడు ఒకలా, ఇష్టం లేనప్పుడు మరొకలా మాట్లాడడానికి సిగ్గు లేదా? నీ ఇష్టం వచ్చినట్టు మాటలు మారుస్తావా రా..!" అంటూ నా చెంప చెళ్లుమనిపించినా అనిపిస్తారు! అసలే శిశుపాలుడిలా ఆయన దృష్టిలో వంద తప్పులను చేసిన దోషిగా మిగిలిపోయాను. ఇప్పుడీ సంఘటనతో నన్ను ఇంట్లో నుండి బయటకు గెంటేసినా గెంటేస్తారు. ఇదంతా నీకిష్టమా చెప్పు!

అయినా తనంటే నాకు ఇష్టం లేదు, అప్పుడేదో తెలియక నీతో అలా చెప్పాను. తన అభిప్రాయం తెలిసిన తర్వాత నేను కూడా నా మనసు మార్చుకున్నాను.

అందుకే, ఇదంతా ఇక్కడితో వదిలేసి కొంచెం ప్రశాంతంగా ఉండు, మా బుజ్జి తల్లి కదూ!" (తన తల్లి బుగ్గలు రెండు నిమురుతూ..)

అంటూ బాధపడుతున్న తన తల్లిని ఓదారుస్తూ...

పడక మంచం మీద నుండి లేచాడు పవన్.

                         *****************

రాత్రి రానే వచ్చింది.

పల్లవి పెళ్లి సమయం కూడా ఆసన్నమైంది!

పెళ్లి పీటలపై పసుపు బట్టలతో నవవధూ వరులిద్దరూ పెళ్లికి రెడీగానే ఉన్నారు.

చుట్టుపక్కలున్న ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పెళ్లి పెద్దలు వారిద్దరిని ఆశీర్వదిస్తూ... వారివురు కలిసే ఆ సుముహూర్తం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

పల్లవి స్నేహితురాళ్ళు తనని పక్కనే ఉండి ఆటపట్టిస్తున్నారు.

పెళ్లి పంతులు వేదమంత్రాలు చదువుతున్నాడు..

ఒకపక్క ఆడంబరంగా పెళ్లితంతు జరుగుతుంటే, పల్లవి మనసు మాత్రం ఇంకెక్కడో ఉంది.

వరుడు పక్కనే ఉన్నా, తన చూపులు మాత్రం ఇంకెవరినో వెతుకుతూ అలసిపోతున్నాయి.

"అవునూ... బావెక్కడ అత్త!" అంటూ పక్కనే ఉన్న పవన్ వాళ్ల అమ్మని అడిగింది పల్లవి. దానికి పవన్ వాళ్ళమ్మ సమాధానం చెప్పేలోపు...

"పనికిమాలిన వెధవ !

ఇప్పటివరకూ ఇక్కడే వున్నాడు.. ఇంతలోనే ఎక్కడ తగలడి చచ్చాడో!

అయినా నీకేం కావాలమ్మా!" అంటూ అది విన్న పవన్ వాళ్ల నాన్న బదులిచ్చాడు.

(ఏం లేదన్నట్టు గానే తలాడించింది పల్లవి)

"ఎందుకు బావ..!

ఈ టైంలో కూడా వాడిని ఆడిపోసుకుంటావ్...!

ఎప్పుడూ వాడిని ఏదోకటి అనందే నీకు నిద్ర పట్టదే!

అందుకే, నువ్విలా ఏదోకటంటావనే కాబోలు, ఇక్కడికి రాకుండా ఏదో పరాయి వాడిలా దూరంగా నిల్చున్నాడు వాడిందాకా. నేనే ఓ చిన్న పని పడిందని బయటకి పంపించాను.

అయినా ఈ పాటికి వచ్చేసి ఉండాలే!" అంటూ మధ్యలో కలుగజేసుకుని సముదాయించాడు పల్లవి తండ్రి.

"ఇంకెక్కడ వస్తాడు.. ఆ వంకతో అయ్యగారు ఈ పెళ్లి పనులు నుండి తప్పించుకుని, బయట జులాయి తిరుగుళ్ళు తిరగడానికి పోయి ఉంటాడు. వాడికి బరువా? బాధ్యతా?"

అంటూ మళ్ళీ తన తిట్ల దండకాన్ని మొదలెట్టాడు పవన్ వాళ్ల నాన్న.

"ఇప్పుడే చెప్పానా...అదుగో మళ్ళీ!

ఇక ఛాల్లే ఆపు బావా!" అంటూ ఆయన తిట్ల దండకానికి అడ్డుపడే ప్రయత్నం చేశాడు పల్లవి తండ్రి.

ఇంతలోనే చెదిరిన జుట్టు, నలిగిన బట్టలతో, తలపై కుర్చీలు మోసుకుంటూ అక్కడికి వచ్చాడు పవన్.

"ఏరా..!

ఈ పెళ్లి పనులంతా నీ భుజాన్నే వేసుకుని మోస్తున్నట్టు, నువ్వే చేసినట్టు ఇక్కడున్న ఈ నలుగురికి నీ గొప్పలు చూపించుకుందామనా?

ఇలా బాగా కష్టపడిపోయిన వాడిలా వచ్చావ్ ఈ టైంలో ఇక్కడికి"

వెళ్లి ఆ మాసిన గుడ్డలైనా మార్చుకురాకూడదు!

నా పరువు తీయడానికి నువ్వొక్కడివి చాలు!" అంటూ ఆ బంధువులందరి ముందూ కోపంగా కసరడంతో...

అక్కడున్న వారిలో కొంతమంది తనని జాలిగా చూసారు, మరికొంతమంది అది చూసి నువ్వుకున్నారు.

పవన్ తల్లి మనసు మాత్రం ఆ మాటలకు తల్లిడిల్లింది. కానీ, తానేమీ అనలేని పరిస్థితి.

"ముహూర్తానికి టైం అవుతుంది...

బాబు.. భజంత్రీలు రెఢీ గా ఉండండి..

అమ్మా ఆ జీలకర్ర బెల్లం తీసుకో..!" అంటూ మరొకపక్క పంతులు గారు పెళ్లి సమయం ఆసన్నమైందంటూ అక్కడున్న వారిని తొందరపెడుతున్నారు.

వాళ్ల నాన్నన్న మాటలకు నొచ్చుకుని అక్కడి నుండి వచ్చేస్తున్న పవన్ మాత్రం

"∆ ఎంత చేసినా నాన్నగారికి నా మీదున్న ఆ చెడు అభిప్రాయం ఇంకెప్పటికి పొదేమో?

నేను పనికిమాలిన వాడిని కాదని, ఈ పనులన్నీ నేనే చేస్తున్నానని నిరూపించుకోవాలనుకున్న ప్రతిసారీ ఆయన ముందు నేనో వెధవలా మిగిలిపోతున్నా..

"గట్టిగా చెప్పాలని ఉంది వాళ్ళందరి ముందే ఆయనికి, నేనేం వెధవని కాదని." కానీ, ఇలా నా క్షణికావేశంతో ఆయన్ని ఎదిరించి ఇన్నాళ్లుగా కాపాడుకుంటున్న ఆయన పరువు, ఈ ఒక్క క్షణంలో పోతే...

ఆయనికి నాకు మధ్య మరింతగా శత్రుత్వం పెరుగుతుందనే ఆలోచన దాన్ని అడ్డుకుంటుంది.

కనీసం అమ్మా నాన్న కోరుకున్నట్లు పల్లవి మనసులో చోటు సంపాదించి, ఈ రోజు తన పక్కన ఆ పెళ్లి పీటలపై కూర్చున్నా...

ఆయన నాకు కొంచెం విలువైన ఇచ్చేవారేమో?

వాళ్ల గురించి కాకపోయినా, కనీసం పల్లవి నా గురించి ఒక్క సారైనా ఆలోచించి ఉంటే బాగుండేది. ఎవరికి తెలియని నా ప్రేమని నాలో నేనే సమాధి చేసుకోవడానికి ఇంకొన్ని క్షణాలు మాత్రమే మిగిలున్నాయి.

నిన్న మొన్నటి వరకూ నా సొత్తే అనుకున్న పల్లవి, ఈ క్షణం నుండి వేరొకరి ఇల్లాలు కాబోతుంది.

అందుకే, ఈ క్షణం ఈ ప్రపంచం ఆగిపోతే బాగుండనిపిస్తుంది. లేదా ఈ క్షణం కనీసం నా ఊపిరైనా ఆగిపోతే బాగుండును."

అని తనలో తను అనుకుంటూ బరువెక్కిన హృదయంతో అక్కడనుండి నిదానంగా, నిశబ్ధంగా వెళ్ళిపోతాడు పవన్!

పల్లవి మాత్రం పవన్ వంక అలానే చూస్తుండిపోతుంది, తన మదిని కూడా ఏవేవో ఆలోచనలు తొలిచేస్తున్నాయి.

"∆ బావ విషయంలో నేనలా చేయకుండా ఉండాల్సింది!

∆ నేను చేసిన పనికి తను ఎంతగా హర్ట్ అయ్యాడో!

∆ నేను చేసినవి, చేస్తుందంతా తప్పేమో?

∆ తను అర్థం చేసుకున్నట్టు నన్ను చిన్నప్పటి నుండి పెంచిన మా అమ్మానాన్న కూడా అర్థం చేసుకోలేదు? రేపు నన్ను ఈ కట్టుకోబోయే వాడు కూడా అంతలా చేసుకోలేడేమో?

∆ నా అభిప్రాయాలు, నా ఆలోచనలు తనకి చెప్పడమే తప్ప, అసలు తన మనసేంటో కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా ఎప్పుడూ చేయలేదు.

∆ అమ్మ.. నాన్న.. తమ్ముడు, అత్త.. మావయ్యలతో పాటు ప్రతి చిన్న విషయంలో నాకెప్పుడూ సలహాలిచ్చే బావ కూడా రేపటి నుండి నా పక్కనుండడు.

∆ నాకోసం అన్ని త్యాగాలు చేసిన బావకి, నేను మాత్రం తనకి ఒకింత అన్యాయమే చేసానేమో?

∆ నీ విషయంలో నేను చేసిన తప్పులకు నన్ను క్షమించు బావ!"

అంటూ తన మనసులో అనుకుంటూ లోలోపల పడుతున్న మనోవేదన కన్నీళ్ళ రూపంలో విడుస్తుంది పల్లవి.

(తన బాధకి కారణం తన తల్లిదండ్రులను వదిలెలుతుందన్న బెంగతో అనుకుంటున్నారు అక్కడున్న వారంతా.

కానీ, తనకి మాత్రమే తెలుసు ఆ నిట్టూర్పు సెగల మాటున దాగిన కారణమేమిటో?)

                          *****************

ఆ కారణంతో పాటు, ఆ బావ మరదళ్లు వదిలిన అన్ని సందేహాలకు మీరు కూడా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు కదూ..

అందుకే కథలోకి వెళ్ళిపోయి,

పవన్ అనుకున్నట్టు ఆ క్షణమే ఆగుతుందో?,

లేక చివరి క్షణంలో ఆ పెళ్లే ఆగి, వారిద్దరూ ఒక్కటవుతారో?

అసలేం జరగబోతుందో?

చూసేద్దామా మరి!

అయితే పాఠకులారా "కథలో రాజకుమారి-2" వరకూ కొంచెం ఓపిక పట్టండి.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.

రచన: సత్య పవన్✍️✍️



Rate this content
Log in

Similar telugu story from Classics