gowthami ch

Drama

2.3  

gowthami ch

Drama

దృష్టికోణం

దృష్టికోణం

6 mins
417


అమ్మా.... కాఫీ...." అంటూ పూర్తిగా కళ్ళుకూడా తెరవకుండానే కప్పుకున్న దుప్పటిలోనుండి అరిచింది కీర్తన. "అప్పుడే తెల్లరినట్లుంది మీ కూతురికి కాఫీ అంట పెట్టి ఇవ్వు." అంటూ న్యూస్ పేపర్ చదువుతూ అన్నాడు విక్రాంత్. 

"ఏమే ఇప్పుడు తెల్లారిందా నీకు. లే , లేచి నడువు.

 ముందు స్నానం చేసి తయారవ్వు గుడికి వెళదాం" అంటూ చేతిలోని కాఫీ కప్ మంచం పక్కన బల్లమీద పెడుతూ కూతుర్ని లేపింది మీనాక్షి.


హా....అని ఆవలించుకుంటూ మొహం మీద దుప్పటి తీసి లేచి కాఫీ అందుకుంటూ "గుడ్ మార్నింగ్ అమ్మ , లవ్ యూ" అంటూ వాళ్ళ అమ్మ బుగ్గలపై ముద్దు పెట్టింది. "ఏమే రాక్షసి అయ్యిందా నిద్ర" అని నవ్వుతూ లోపలికి వచ్చిన వాళ్ళ అన్నయ్య తో "ఎరా స్టుపిడ్ రాత్రంతా నిద్రపోనివ్వకుండా దయ్యాల కథలు చెప్పి భయపెట్టి ఇప్పుడేమో తాపీగా నవ్వుకుంటావా" అంటూ వాళ్ళ అన్న మొహంపై దిండు విసిరింది. "ఎరా ఇదంతా నీ పనా వెధవ. యిద్దరూ ఇద్దరే నాకు సరిపోయారు. అయినా నువ్వు కూడా ఏంటే , పోయి పోయి వాడిని అడిగావు కథ చెప్పమని." "నేనేమి అడగలేదు అమ్మ వాడే కావాలని కథ చెప్తానని వచ్చాడు."


 "సరే సరేలే ఇది రోజు ఉండేదే కానీ లెయ్యి లేచి తయారవ్వు. ఈరోజు శుక్రవారం కదా గుడికి వెళ్లి వద్దాం" అంటూ కాళీ కప్ తీసుకొని వంటింట్లోకి వెళ్ళిపోయింది మీనాక్షి.


"అమ్మా నేను రెడీ" అంటూ బయటకి వచ్చిన కూతుర్ని చూసి "ఒసేయ్ మనం వెళ్ళేది గుడికి, హోటల్ కి కాదు. వెళ్లి డ్రెస్ మార్చుకొని చక్కగా లంగా ఓని వేసుకోపో" అంటూ అరిచింది. "పో అమ్మ ఈ కాలం లో కూడా నీ చాదస్తం. జీన్స్ వేసుకొని వస్తే నీ దేవుడు గుడిలోకి రానివ్వడా? కొడతాడా? అయినా గుడికి వెళ్లాలంటే దేవుడంటే భక్తి ఉండి , మనసు పవిత్రంగా ఉంటే చాలు . అవి రెండూ నాకు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నేను పట్టించుకోను."అంది కీర్తన.


 "అయినా ఈ కాలం పిల్లలకి పెద్దవాళ్ళు ఏమి చెప్పినా, కాదు అనడం ఫాషన్ అయిపోయింది." అంటూ గుడికి బయల్దేరింది. గుడిలో దణ్ణం పెట్టుకొని ప్రసాదం తీసుకొని కొంచెం సేపు గుడి ఆవరణలో కూర్చొని ఇంటికి చేరారు యిద్దరూ. "అమ్మ నేను ఇంక కాలేజీ కి వెళ్ళొస్తాను" అని చెప్పి "ఎరా అన్నయ్య వస్తున్నవా లేదా నన్ను వదిలిపెట్టడానికి" అంటూ వాళ్ళ అన్నయ్య వైపు చూసింది. "అయ్యో రానంటే తమరు ఊరుకుంటారా! పదండి మేడం" అని నవ్వుకుంటూ చెల్లి వెనకాలే బయటకి నడిచాడు. చెల్లిని కాలేజీ లో దింపి ఆఫీస్ కి వెళ్లాడు విక్రాంత్. ఇంట్లో పనంతా ముగించుకొని మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ సర్దుకొని ఉద్యోగానికి వెళ్ళిపోయింది మీనాక్షి.

********************


"ఒరే విక్రాంత్ ఎక్కడ ఉన్నావ్?" త్వరగా రా పెళ్లి వారు వచ్చే సమయం దగ్గర పడింది. "వస్తున్నాను అమ్మ బయట తోరణాలు కడుతున్నాను." అంటూ లోపలికి వచ్చి "ఇప్పుడు చెప్పు అమ్మ ఇంకేం చేయాలో" అడిగాడు విక్రాంత్. "ఇదిగో ఈ మాల మీ నాన్న గారి ఫోటో కి వెయ్యాలి నాన్న. నాకు అందడం లేదు" అంటూ చేతిలోని పూలమాల విక్రాంత్ కి ఇచ్చింది మీనాక్షి. పూల మాల వేసి వెనక్కి తిరిగి తన తల్లి వైపు చూసిన విక్రాంత్ తో "ఈ సమయంలో మీ నాన్న గారు కూడా ఉండుంటే ఎంత సంతోషించేవారో కదా ?" అంది మీనాక్షి. " అవునమ్మ నాన్నకి చెల్లంటే ప్రాణం. ఎప్పుడు అంటుండేవారు చెల్లికి మంచి సంబంధం తెచ్చి ఘనంగా పెళ్లి చేయాలిరా అని . కానీ ఈ క్షణం లో మన మధ్యలేకుండా పోయారు" అని ఒకరినొకరు చూసుకొని బాధపడ్డారు.


"అమ్మ ఒక్క నిముషం ఇటు రావా" అంటూ కూతురు పిలుపు విని కళ్ళు తుడుచుకుని గదిలోకి వెళ్ళింది మీనాక్షి. "అమ్మ ఈ చీర కట్టడం నాకు రావట్లేదు అమ్మ కొంచెం సరి చెయ్యవూ" అంటున్న కూతుర్ని చూసి నవ్వుకుని "ఈరోజు నీ నిశ్చితార్థం. అంతా కుదిరితే ఇంకో నెలలో నే పెళ్లి కూడా. ఇంకా చీర కట్టుకోవడం నేర్చుకోకపోతే ఎలాగే రేపు పెళ్ళిఅయ్యాక ఎలా కట్టుకుంటావ్." అంటూ తలమీద మొట్టికాయ వేసి చీర కట్టి కూతుర్ని సిద్ధం చేసింది. "అవునే నిశ్చితార్ధానికి మీ అత్తగారు పెట్టే చీర నీ దగ్గరే ఉంది గా "అడిగింది మీనాక్షి.


"అయ్యో ! మర్చిపోయాను అమ్మ అది జాకెట్ కుట్టమని గిరిజ కి ఇచ్చాను. నిన్ననే కుట్టేసాను అంది తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇప్పుడెలా ! " "సర్లే పెళ్లి వారు రావడానికి ఇంకా సమయం ఉంది కదా ఈలోపు మీ అన్నయ్య ని పంపించి తెప్పించేస్తానులే నువ్వేం కంగారు పడకు" అంటుండగా "వద్దు అమ్మ అన్నయ్య ని పంపొద్దు. ఇంట్లో ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా అన్నయ్య లేకుంటే ఎలా . నేనే వెళ్లి తెస్తాను , అది కూడా కాకుండా జాకెట్ సరిగా ఉందొ లేదో అక్కడే వేసుకొని చూసి తెచ్చుకోవచ్చు. వాళ్ళు రావడానికి ఇంకా చాలా టైం ఉందిగా ఆలోపు వచ్చేస్తాను" అని చెప్పి చీర మార్చుకొని డ్రెస్ వేసుకొని ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. "అమ్మ ఇప్పుడే చీర తీసుకున్నాను. ఇంకొక 10 నిముషాలలో బయలుదేరుతాను" అని ఫోన్ చేసి చెప్పింది. "సరే ఇంక నేను బయలుదేరుతాను" అని చెప్పి అక్కడి నుండి బయటకి అడుగుపెట్టింది కీర్తన.


జోరుగా వర్షం మొదలైంది. "అయ్యో ఇప్పుడే రావాలా ఈ వాన కూడా! ఇంకొంచెం సేపు ఆగివుండవచ్చు కదా. ఇప్పుడు నేనెలా వెళ్ళాలి అక్కడ పెళ్లి వారు వచ్చే టైం అయింది." అంది కీర్తన. "ఇప్పుడెలా వెళ్లగలవు! ఇలా రా లోపలికి వచ్చి కూర్చో కొంచెంసేపు. వర్షం తగ్గిన తరువాత వెళ్లొచ్చు" అని తన స్నేహితురాలు అనడంతో లోపలికి వెళ్ళి కూర్చుంది. ఇంతలో కరెంట్ పోయింది. "ఈ వర్షం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు ఎలాగోలా వెళ్లిపోతానులే , లేకుంటే ఇంకా ఆలస్యం అయిపోతుంది" అని గొడుగు అడిగి తీసుకొని అక్కడి నుండి బయలుదేరింది కీర్తన. కొంత దూరం నడచిన తరువాత ఆటో కోసం చూసింది. ఎంత సేపటికీ ఒక్క ఆటో కూడా రాకపోవడంతో విషయం అమ్మకి చెప్పి అన్నయ్యని పంపించమని అడగాలని వాళ్ళ అమ్మకి కాల్ చేసింది.


ఇంట్లో పెళ్లివారు రావడంతో ఫోన్ లోపల పెట్టేసి బయటకి వెళ్లి వాళ్ళకి ఆహ్వానం పలికారు విక్రాంత్ మఱియు మీనాక్షి. వాళ్ళకి ఆతిధ్యం ఇచ్చి పళ్ళు పాలహారాలు తెచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు. ఒకవైపు గుమ్మంవైపు చూస్తూ పెళ్ళి వారు అమ్మాయి గురించి ఎక్కడ అడుగుతారో అని కంగారు పడుతూ కూర్చుంది మీనాక్షి. ఎంతకీ వాళ్ళ అమ్మ ఫోన్ తీయక పోవడంతో వాళ్ళ అన్నయ్య కి చేసింది. తను కూడా తీయకపోవడంతో ఇంకేమి చేయాలో తెలియక ఆటో కోసం అక్కడే ఎదురు చూస్తూ నించుంది.


రాత్రి 8 అవుతుంది ఈ వర్షానికి ఒక్క ఆటో కూడా రావడంలేదు ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు అక్కడ పెళ్లి వారు వచ్చేసుంటారేమో అని కంగారు పడుతూ నించున్న కీర్తన ని ఎవరో 3 దొంగలు వెనక నుండి వచ్చి చేతులు వెన్నక్కి లాగి , గొంతు మీద కత్తి పెట్టి ఒంటి మీద నగలు , డబ్బులు , సెల్ ఫోన్ అన్ని లాక్కుని బురధలోకి తోసేసి పరిగెత్తి పారిపోయారు. వాళ్లు తోసిన తోపుకి 10 అడుగుల దూరం లో ఉన్న ముళ్ళ కంప మీద పడింది. ఒళ్ళంతా బురద , ముళ్ళు గుచ్చుకొని రక్తం వస్తుంది. నేల గీక్కుని పోయింది. ఎలాగోలా ముళ్లనుండి బయట పడి కొంచెం దూరం నడిచింది. డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఒక ఆటో అతను కీర్తన పరిస్థితిని చూసి జాలిపడి ఆటో ఎక్కించుకున్నాడు. ఆటోలో కూర్చొని అతనికి కృతజ్ఞతలు చెప్పి జరిగింది వివరించి తన దగ్గర డబ్బులు లేవని చెప్పింది.


"పరవాలేదు అమ్మ నీ పరిస్థితి అర్ధమైంది అసలే నిశ్చితార్థం అంటున్నావు నా కూతురికే ఇలా అయితే డబ్బులు అడుగుతానా! నువ్వేమి భయపడకు వీలైనంత త్వరగా నిన్ను ఇంట్లో దిగబెడతాను" అని ఆటో ఫాస్ట్ గా పోనిచ్చాడు. "ఎవరో కానీ సమయానికి వచ్చారు నా ప్రాణం కాపాడిన దేవుడు మీరు" అని రెండు చేతులు జోడించి నమస్కరించింది. ఆటో ఆగిన సెభ్ధం వినపడి పరిగెత్తుకుంటూ బయటకి వచ్చిన మీనాక్షి కూతురి పరిస్థితిని చూసి స్తబ్దురాలై ఉండిపోయింది. విక్రాంత్ పరిగెత్తుకుంటూ వెళ్లి చెల్లి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టాడు. ఇదంతా చూస్తున్న పెళ్లి వారు ఆశ్చర్యపోయారు.


"ఏమైంది చెల్లి ఏంటి ఈ దెబ్బలు" అని అడిగిన అన్నయ్య ని చూసి ఏడుస్తూ జరిగినదంతా వివరించింది. "సర్లే అయిందేదో అయిపోయింది ఏడవకు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకో" అని లోపలికి పంపాడు. కూర్చున్న చోట నుండి లేచి బయటకి వెళ్లిపోబోతున్న పెళ్లి వారిని చూసి "ఎక్కడికి వెళ్తున్నారు ఒదిన గారు కూర్చోండి అమ్మాయి వచ్చేసిందిగా ఇంకొక నిముషంలో రెడి అయ్యి వచ్చేస్తుంది "అంది మీనాక్షి. "ఇదంతా చూసిన తరువాత కూడా ఇంకా మీ సంబంధం చేసుకుంటాం అనుకుంటున్నారా? కళ్ళముందే వెళ్లిందిగా లోపలికి మీరు చూడలేదా? ఆ చిరిగిన బట్టలు , బురద తో నిండిన ఆ ఒళ్ళు చూస్తేనే అత్థమవుతుంది మీ అమ్మాయిని ఎవరో....

నలిపేసినట్లున్నారు." అంటూ రాగం తీసింది. 


"మీరు ఏం మాట్లాడుతున్నారో అర్ధమవుతుందా! మీ కళ్ళ ముందే నిజం చెప్పిందిగా వినపడలేదా?" అడిగాడు విక్రాంత్. "వినపడింది నాయనా! ఎవరైనా చెడిపోతే నేను చెడిపోయాను అని అందరిలో చెప్తారా ఏంటి !" అని రాగాలు తీయడం మొదలుపెట్టింది. "అయినా ఇదంతా చూసి కూడా మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను అనడానికి మా వాడేమన్నా తిక్కలోడనుకున్నారా? "


"అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకండి జరిగిందంతా మా అమ్మాయి వివరంగా చెప్పింది కదా అయినా అమ్మాయి బట్టలు , ఒంటి మీద గాయాలు చూసి అలా అపార్ధం చేసుకుంటే ఎలా! దయచేసి నమ్మండి ఒదిన గారు. నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోతే ఊర్లో మా పరువు పోతుంది. చెయ్యని తప్పుకు ఇంత పెద్ద శిక్ష వేయకండి దయచేసి కూర్చోండి. "అంటూ ప్రాధేయ పడింది. మీనాక్షి. "ఇంక మీరు ఏమి చెప్పినా నేను వినను." లేరా వెళ్లిపోదాం అంటూ కొడుకుని పైకి లేపబోతుండగా..."ఒక్క నిముషం ఉండమ్మా.. అయినా వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పేముంది? అసలు ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? కొంచెం ఆలస్యంగా వచ్చింది అంతే కదా అందుకు కారణం చెప్పింది కదా. మరి ఇంకెందుకు పెళ్లి రద్దు చేస్తున్నారు?" "అదేంటి రా ఆ పిల్ల అవతారం చూసావా ఎలా ఉందో. అయినా ఈ మాట ఎలా అనగలుగుతున్నావ్ రా. "


"అమ్మ...ఇంక చాలు ఆపండి. ఈ మాటలు వింటే ఆ అమ్మాయి ఎంత బాధ పడుతుందో ఆలోచించారా!. ఇది ఒక ఆడపిల్లకి సంబంధించిన విషయం ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇంక నువ్వు చెప్పిన విషయానికి వస్తే ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న బట్టలు , గాయాలు వాటిని మాత్రమే చూసి ఈ నిర్ణయానికి వచ్చావు. కానీ నేను ఆ అమ్మాయి కళ్ళలో చూసాను తప్పు జరిగితే ఆ ఫీలింగ్ కళ్ళలో దాచలేరు. మనిషి అబద్ధం చెప్పొచ్చు కానీ కళ్ళు చెప్పలేవు. తను చెప్పినదంతా నిజమే . మీరు ఎన్ని చెప్పినా నేను తననే పెళ్లి చేసుకుంటాను. "ఎప్పుడూ ఒక వైపు నుండే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం తప్పు. ఎదుటి వారి దృష్టికోణం నుండి కూడా ఆలోచించాలి. అప్పుడే అసలు నిజాలు తెలుస్తాయి." అని వాళ్ళ అమ్మకి సర్ది చెప్పాడు.


"నన్ను క్షమించండి వదిన గారు నేనే మీ అమ్మాయిని తప్పుగా అర్ధం చేసుకున్నాను. నా కొడుక్కి తెలిసింది కూడా నాకు తెలియలేదు. దేవుడు అందరికి ఒకేలా చూడగలిగే 2 కళ్ళు ఇచ్చాడు. కానీ ఒక్కొక్కరి దృష్టికోణం ఒక్కోలాగా ఉంటుంది. నా కడుపున పుట్టిన నా కొడుక్కి నాకే ఎంత తేడా ఉందొ చూడండి." అని క్షమాపణ అడిగి "పెళ్లికి ఒక మంచిరోజు చూసి మీకు కబురు చేస్తాం. ఇంక మేము వెళ్లి వస్తాం." అంది. "అమ్మాయి ఇంకా తయారయ్యి రాలేదు కదా వదన గారు ఒక్క క్షణం ఉండండి వచ్చేస్తుంది" అని మీనాక్షి అంది. "అదేమీ అవసరం లేదులేండి వదిన గారు. తతంగం అంతా అయిపోయిందిగా ఏం పర్వలేదులే అమ్మాయిని రెస్ట్ తీసుకొనివ్వండి." అని వెళ్లిపోయారు. ఇదంతా లోపాలనుండి విన్న కీర్తన తనని ఇంతలా అర్ధంచేసుకొనే భర్త లభిస్తున్నందుకు సంతోషంతో మనసులోనే అతనికి కృతజ్ఞత చెప్పుకుంది.



Rate this content
Log in

Similar telugu story from Drama