gopal krishna

Classics Fantasy Inspirational

4  

gopal krishna

Classics Fantasy Inspirational

బరువు-బాధ్యత

బరువు-బాధ్యత

5 mins
268



  నేనోసారి మా ఇంటికి వెళ్ళొస్తానండీ, మా నాన్నకి ఆరోగ్యం బాగోలేదుట" ఆఫీస్ నుండి హడావుడిగా వచ్చి, బ్యాగ్ లో బట్టలు సద్దుతోంది హైమ. "ఇప్పుడు అంత అవసరమా, రేపు ఆఫీస్ లో పార్టీ ఉంది. నేను లీవ్ పెట్టలేను. నువ్వు ఊరెళ్తే పిల్లలను స్కూల్ కి ఎవరు రెడీ చేస్తారు?" దాదాపుగా అరుస్తున్నట్లే అన్నాడు శేఖర్. "అదేంటండీ అలా అంటారు మా నాన్నకి బాగోలేకపోతే నేను వెళ్ళొద్దా? మా నాన్నకంటే మీకు ఆఫీస్ లో పార్టీ ఎక్కువైపోయిందా?" హైమ మనసులో కోపం, నిరాశ, నిస్పృహ కనిపిస్తున్నాయి. బ్యాగ్ భుజానికి తగిలించుకుంటూ ఉంటే, "అంత బాగోలేకపోతే ఏదో ఒక హాస్పిటల్ లో చూపించమని చెప్పు. కావాలంటే వెయ్యో రెండువేలో పంపిద్దాం" హాల్లో సోఫాలో కూర్చొని తీరిగ్గా సీరియల్ చూస్తున్న అత్తగారు సలహా ఇచ్చారు.

    హైమ ఏమీ మాట్లాడకుండానే అత్తగారివైపు నిరసనగా చూస్తూ "నేను రెండ్రోజుల్లో తిరిగి వస్తా నండీ, కొంచెం పిల్లల్ని చూసుకోండి" అంటూ భర్తకి చెప్పి, "ఇంట్లో అల్లరి చెయ్యొద్దు. నేను తొందరగా వచ్చేస్తాను" అంటూ పిల్లలకి నచ్చచెప్పి బయట పడింది. "దానికి ఎంత పొగరు కాకపోతే వెళ్ళొద్దు అంటే వెళ్తుంది. అలాంటిదాన్ని క్షమించకూడదు" రంకెలు పెడుతోంది అత్తగారు. "నువ్వున్నావ్ కదా సీతా, రెండ్రోజులు ఆ మాత్రం పిల్లల్ని చూసుకోలేవా. వాళ్ళేమీ చిన్నపిల్లలు కాదుగా. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు కదా" అన్నారు హైమ మామగారు

   "నాకేమవసరం, నేనెందుకు చూసుకోవాలండీ. ఇన్నాళ్ళూ ఇంట్లో గొడ్డు చాకిరీ చేశానుగా" దాదాపుగా అరిచినంత పని చేస్తోంది ఆవిడ. "కొంచెం నోరు తగ్గించుకో. ఆ అమ్మాయికి తల్లీ, తండ్రీ కుటుంబం ఉందికదా. తనకేమైనా తోబుట్టువులున్నారా? ఒక్కర్తే ఆడపిల్ల. ఆమాత్రం వాళ్ళని చూసుకోకపోతే ఎలాగా"? గట్టిగానే అన్నారు రంగనాథ్ గారు. "నాన్నా, మీరు అన్నింటికీ దాన్ని వెనకేసుకొని రావడం నాకిష్టం లేదు. ఎప్పుడైతే పెళ్లయ్యిందో అప్పుడే ఆ ఇంటివాళ్ల తో తనకు అనుబంధాలు పోగొట్టుకోవాలి" అదొక రూల్ అన్నట్లు మాట్లాడాడు శేఖర్.

  "ఇదేరా మీలో నాకు నచ్చని గుణం. మీరంటే నాకు ఎందుకు అసహ్యమేస్తుందో అర్థమైందా? తాను నీకంటే ఎక్కువ చదివింది. ఎక్కువ సంపాదిస్తోంది. ఇంట్లో ఆఫీస్ లో చాకిరీ చేస్తోంది. నీ భార్యని ఒక్క రోజైనా ప్రేమగా పిలిచావుట్రా, అదీ ఇదీ అంటావు, ఏమే అంటావు. నీ చదువు నీకు సంస్కారం నేర్పించ లేదురా. మీరు ఇద్దరూ మానవజాతిలో పుట్టాల్సిన వాళ్లు కాదు". విసురుగా అక్కడినుండి లేచి వెళ్లి పోయారు ఆయన. "పనీ పాటూ లేక మీ నాన్న బుర్ర రాను రాను పనిచెయ్యడం మానేస్తోంది" విసురుగా అన్నారు సీత.

    ఆ రెండు రోజులు ఇంట్లో అంతా నిశ్శబ్దం. పిల్లలు తమ పనులే కాకుండా చిన్నచిన్న ఇంటిపనులూ చేసారు బామ్మకి. అయినా వాళ్ళమీద అసంతృప్తి ఆవిడకి. మీ అమ్మ ఇలా చేసింది, అలా చేసింది ఇల్లంతా పాడుచేసేసింది అంటూ నానామాటలు అనడం పిల్లలకి బాధగా అనిపించేది. అయినా వాళ్ళేమీ అనలేదు. రెండు రోజులు రెండు యుగాల్లా అనిపించింది పిల్లలకి. కోడల్ని వెనకేసుకొచ్చినందుకు భర్తని సూటిపోటి మాటలు అనడం మొదలెట్టారు సీత.

    రెండ్రోజుల తరువాత ఇంట్లో అడుగుపెట్టింది హైమ. ఆమెను శత్రువుని చూసినట్లు చూడ్డం మొదలెట్టాడు శేఖర్. కనీసం మీ నాన్నకి ఎలా ఉంది అని అడుగుతాడేమో అనుకుంది కానీ అలాంటివేమీ అతని నోట్లోంచి రాలేదు సరికదా, ఎక్కడిపనులు అక్కడే తగలడ్డాయి, వెళ్లి ఇల్లంతా శుభ్రం చెయ్యి అంటూ పురమాయించాడు. ఒళ్ళంతా హూనమై పోయేలాగా ఇల్లంతా శుభ్రం చేసి, డిన్నర్ వండి టేబుల్ మీద సర్దేసింది.

   అందరూ భోజనాలు చేస్తుండగా చెప్పింది, మా నాన్నగారికి బాగోలేదండీ, మతిమరుపు వచ్చేసింది. దాంతో పాటూ ఫిట్స్ వస్తున్నాయట. మొన్నామధ్య బజార్లో పడిపోతే ఎవరో ఇంటికి తెచ్చి అప్పచెప్పా రుట. అమ్మ బాగా భయపడిపోయింది. అందుకే అమ్మా నాన్నలని ఇక్కడికే తెచ్చి చూసుకుందామని అనుకుంటున్నాను" అంది. ఒక్క క్షణం నిశ్శబ్దం. తరువాత "ఇక్కడికెలా తీసుకొస్తావ్ అమ్మాయ్. ఇది నీ అత్తగారిల్లు. ఇక్కడ వాళ్ళకి స్థానం లేదు" కరాఖండీగా తేల్చేసింది అత్తగారు.

   "మనింట్లో కుదరదు హైమా, నీకు అంతలా వాళ్ళని చూసుకోవాలనిపిస్తే ఏదైనా ఆశ్రమంలో చేర్పిద్దాం. పదిరోజులకో, నెలరోజులకో ఒకసారి వెళ్ళి వాళ్ళని చూసి వద్దువుగాని. వాళ్ళిక్కడ ఉంటే మా అమ్మా నాన్నలకి, పిల్లలకి కూడా ఇబ్బందిగా ఉంటుంది" చెప్పాడు శేఖర్. హైమకి లోపలనుండి దుఃఖం, దాంతో పాటూ కోపం తన్నుకుంటూ వచ్చాయి. "వాళ్ళు నా తల్లిదండ్రులండీ, మీకు మీ అమ్మా నాన్నా ఎంత ముఖ్యమో, నాకు కూడా వాళ్ళు అంతే ముఖ్యం. వాళ్ళకోసం మీరేమీ ఖర్చు చేయక్క ర్లేదు. నా జీతం డబ్బుల్లోంచే ఖర్చు చేస్తాను" అంతే గట్టిగా చెప్పింది. 

    "నీకు పెళ్లయ్యాక సొంతం అంటూ ఏమీ ఉండదు. నీ భర్త ఇష్టం ప్రకారం జరగాలి. కావాలంటే వాళ్ళని ఆశ్రమం లో పెడదాం అంటున్నాడుగా. మళ్ళీ రెట్టించి మాట్లాడతావేంటి" చిరాకు పడుతూ చెప్పింది అత్తగారు. "మా అమ్మా నాన్నలను చూసుకోవలసిన బాధ్యత oనా మీద ఉంది. వాళ్ళు బతికున్నంతకాలం నాతోనే ఉంటారు. భర్త అంటే కేవలం భార్య మీద అజమాయిషీ చెయ్యడమే కాదు. భార్య కష్టసుఖాల్లో కూడా పాలుపంచుకునేలాగా ఉండాలి. భరించేవాడు భర్త అన్నారు కానీ బాధించేవాడు భర్త కాదు" శేఖర్ కళ్ళల్లోకి చురుగ్గా చూసింది హైమ.

   "నీకు రానురాను నోరు బాగా లేస్తోంది. ఇలా అయితే ఈ ఇంట్లో నీ స్థానం గురించి నేను ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి వస్తుంది" చెప్పాడు శేఖర్. "నేను మీకు బానిసను కాదండీ. మా పుట్టింటి వాళ్ళు నన్నెంతో గారాబంగా పెంచారు. వాళ్ళని వదిలి మీ ఇంటికి వచ్చి, అలవాటు లేని పనులన్నీ చేస్తూ, ఇంట్లో చాకిరీ అంతా చేస్తూ, ఉద్యోగం చేసి సంపాదించి మీకే ఇస్తూ ఉంటే నాకు మీరు ఎంత విలువ ఇస్తున్నారో మీకూ తెలుసు, నాకూ తెలుసు. నాకు నా సంసారం అంటే, నా భర్తా పిల్లలూ అంతే. అలాంటప్పుడు మీ అమ్మా నాన్నలని చూసుకోవలసిన బాధ్యత నాకు లేదు" కరాఖండీగా చెప్పేసింది.

   "అలా అయితే నువ్వు నోరుమూసుకుని బయట కి వెళ్లిపోవచ్చు" అంతే గట్టిగా చెప్పాడు శేఖర్. "నోరు మూసుకుని వెళ్లిపోవడానికి నేనేమీ మీ బానిసని కాదు. డబ్బిచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాను. నేను బయటికి వెళ్లిపోవాలని మీరు కోరుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. నేను మిమ్మల్ని కొనుక్కున్న డబ్బు నా జీతం అన్నీ కలిపి వడ్డీ తో వసూలు చేసుకునే వెళతాను. మీరు దానికి సిద్ధంగా ఉండండి" చెప్పింది హైమ.

    కోడలు ఇలా గట్టిగా మాట్లాడుతుంటే రంగనాథ్ గారు లోపల్లోపలే ఆనందంగా ఉన్నారు. భార్య కొడుకుల నోటి దురుసు అతనికి తెలియంది కాదు. ఇన్నాళ్ళకి వాళ్ళని ఎదిరించే కోడల్ని చూసి అతను లోపల్లోపలే చాల సంతోషంగా ఉన్నారు. "అది అలా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటే నోరుమూసుకుని అలా సినిమా చూసినట్లు చూస్తారేంటండీ, గట్టిగా బుద్ధి చెప్పడం మానేసి నోరుమూసుకు కూర్చుంటా రేంటి?" అరిచారు సీత గారు. "అనవసరమైన విషయాల్లో నేను జోక్యం చేసుకోను. ఒకప్పుడు నువ్వే కదా జోక్యం చేసుకోవద్దు అన్నావు" తన గదిలోకి వెళ్తూ చెప్పారు.

   రాత్రంతా ముభావంగానే గడిచింది. హాల్లో పడుకున్న హైమ ని పట్టించుకునేవారులేరు. పిల్లలు తల్లిపక్కనే పడుకుని ఏవేవో కబుర్లలో మునిగి పోయారు. తెల్లవారు ఝామున బాత్రూం లో దబ్బు మని శబ్దం వినిపించేసరికి ఉలిక్కిపడి లేచి, పరుగున వెళ్ళింది హైమ. బాత్రూం లో కాలుజారి పడిపోయారు అత్తగారు. ఎలాగో ఆవిణ్ణి బలవంతంగా పైకి లేపి, నెమ్మదిగా హాల్లోకి చేర్చి, ఆవిడకి బట్టలు మార్చి, వేడిగా కాఫీ పెట్టి ఇచ్చింది.

  తరువాత బెడ్రూమ్ లోకి వెళ్ళి భర్త ని లేపింది. ముందు రాత్రి జరిగిన సంభాషణ మనసులో ఉందేమో, "హే, బయటికి పో. నన్ను డిస్టర్బ్ చేయకు, నీకు పనీ పాటూ లేదు" అంటూ హైమని కసురుకున్నాడు. ఆమె ఏదో చెప్పబోతే అటువైపు తిరిగి పడుకున్నాడు. హైమ వెళ్ళి మామగారిని నిద్రలేపి తీసుకొచ్చింది. అప్పటికే అత్తగారు లేచి కూర్చోడానికి నానా అవస్ధ పడుతూ ఉంటే అంబు లెన్సు ని పిలిచి హాస్పిటల్ కి బయల్దేరారు. ఈ అలికిడికి నిద్రలేచిన శేఖర్ తల్లిని హైమ సహాయంతో హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. తుంటి ఎముక విరిగింది ఆరేడు నెలలు బెడ్ మీద ఉండాలని డాక్టర్ చెప్పడం తో శేఖర్ బాగా డీలా పడిపోయాడు.

   పది రోజులు హాస్పిటల్ లోనే ఉండి అత్తగారికి ఆపరేషన్ అయ్యాకా ఇంటికి తీసుకొచ్చింది హైమ. "మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి. వేళకు మందులూ అవీ ఇవ్వండి. నేను వెళ్తున్నాను. మా నాన్న బాధ్యత నా మీద ఉందని చెప్పానుగా. మీరే వద్దు అనుకున్నప్పుడు మీ పిల్లలు కూడా నాకు వద్దు. నేను బయల్దేరుతున్నాను. అత్తయ్య మీ ఆరోగ్యం జాగ్రత్త" అంటూ చెప్పి, ఇంట్లోంచి బయటికి వచ్చింది. "అమ్మా, హైమా నన్ను క్షమించు. కోడలివని నిన్ను చిన్న చూపు చూసి అత్తగారినని లేని అహంకారం ప్రదర్శించాను. నాకు భగవంతుడు సరిగా బుద్ధి చెప్పాడు".

    "హాస్పిటల్ లో నువ్వు చేసిన సేవలు మరిచి పోలేను. ఎన్ని జన్మలెత్తినా నీ ఋణం తీర్చుకోలేను. నువ్వెక్కడికీ వెళ్లొద్దు. నన్ను క్షమించు. మీ అమ్మా నాన్నలను ఇవాళ శేఖర్ వెళ్ళి తీసుకొస్తాడు. మనకి వాళ్ళేమీ బరువు కాదు. అందరం ఒక్కచోట కలిసి ఉందాం. ఒక మనిషిని వంటకి ఇంకో మనిషిని పనికి పెట్టుకుందాం. మనకి అదేమీ బరువు కాదమ్మా, నన్ను మన్నించు" అంటూ ప్రాధేయపడ్డారు. "నిజమే హైమా, భర్తననే అహంకారంతో నేను సంస్కారం మరిచి ప్రవర్తించాను. నన్ను మన్నించు. భర్త అంటే అధికారం చెలాయించడం కాదు. భరించేవాడు భర్త. నీ కష్టాల్లో, సుఖాల్లో, నీ సంతోషంలో, విచారంలో నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టకుండా ఉంటానని పెళ్ళి నాడు చేసిన ప్రమాణాలు మరిచిపోయిన మూర్ఖుణ్ణి.

    "ఇవాళే వెళ్ళి అత్తయ్యని, మామయ్యని తీసుకొస్తాను. నువ్వు ఇన్నాళ్ళూ చాల శ్రమ పడ్డావు. ఇవాళ విశ్రాంతి తీసుకో. నాన్న వెళ్ళి ఇప్పటికే మాట్లాడిన పనిమనిషిని తీసుకొస్తారు". అంటూ చెప్పాడు. "మిమ్మల్ని పిల్లల్ని వదిలి నేను మాత్రం ఉండగలనా, అమ్మా నాన్నా, పెద్దవాళ్ళైపోయారు. వాళ్ళ శేష జీవితం సంతోషంగా గడిచిపోతే వాళ్ళ కూతురిగా పుట్టినందుకు వాళ్ళ ఋణం తీర్చు కున్నానని సంతృప్తి ఉంటుందండీ" అంది హైమ.

     "ఇలాగైనా మీకు జ్ఞానోదయం కలిగి అందరం కలిసి ఉందామన్నందుకు చాల సంతోషంగా ఉందిరా శేఖర్. నువ్వెళ్ళి వాళ్ళని జాగ్రత్తగా తీసుకొని రా" అంటూ కొడుక్కి సంతోషంగా వీడ్కోలు పలికి, "నీకు ఇన్నాళ్ళకైనా కోడలిమీద ప్రేమ కలిగినందుకు చాల సంతోషంగా ఉంది సీతా" అన్నారు రంగనాథ్ గారు. "నా మాటలతో మిమ్మల్ని కూడా హింసించినందుకు నన్ను క్షమించండి" అంటూ భర్త చేతుల్ని తన చేతిలోకి తీసుకొని కళ్ళకద్దుకొని నమస్కరించారు ఆవిడ.


Rate this content
Log in

Similar telugu story from Classics