Gayatri Tokachichu

Children

3  

Gayatri Tokachichu

Children

బర్త్ డే పార్టీ

బర్త్ డే పార్టీ

2 mins
202


బర్త్ డే పార్టీ (చిన్న కథ )

***********************************


"రేపు సుభద్ర కొడుకు పుట్టిన రోజు. పుట్టిన రోజుకు అందరం వెళ్ళాలి "

భర్తతో చెప్పింది అనిత.


"నాన్నా!యషు బర్త్ డే కి ఫారెస్ట్ ఫారెస్ట్. అందరం చెట్లు, పూవులు, ఆకులు ఉండే డ్రెస్ వేసుకోవాలి."కూతురు రష్మి ఉత్సాహంగా చెప్పింది.


"వెరీ గుడ్!వెరీ గుడ్ "అన్నాడు శేఖర్.


ఈమధ్య అందరూ బర్త్ డే పార్టీలకు స్పెషల్ అని పెడుతున్నారు. అందరూ ఒకే రంగు డ్రెస్ వేసుకోవాలనో, మోడరన్ డ్రెస్సులో, లేకపోతే సాంప్రదాయమైన డ్రెస్సులో ఇలా రకరకాలుగా. మొన్నా మధ్య శేఖర్ ఫ్రెండ్ కూతురు బర్త్ డే కి సముద్రం స్పెషల్ పెట్టాడు. అందరూ గవ్వలు,చేపలు నీళ్లు ఉండే డ్రెస్సులు వేసుకొచ్చారు. అదో రకమైన ట్రెండ్ ఇప్పుడు నడుస్తున్నది.


రెండో రోజు శనివారం. ఆఫీసు పని ఇంకా అవటం లేదు. మధ్యాహ్నం దాకా పని చేసుకొని ఒకసారి రష్మిని తీసికొని క్రింద ఫ్లాట్ కి వెళ్ళాడు శేఖర్.

సుభద్ర, కేశవ్ లు బర్త్ డే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇంటి బయటచెట్టు బోదెలు, కొమ్మలతో అలంకారం. ఇల్లంతా అడవి సెట్టింగ్. రెండు మూడు జంతువుల బొమ్మలు కూడా పెట్టారు. కాసేపు మాట్లాడి పైకి వచ్చాడు శేఖర్.


సాయంత్రం బట్టలు వెదుకుతూ కంగారు పడుతోంది అనిత.


"మా కిద్దరికీ చెట్లు, లతలు ఉన్న డ్రెస్సులు వున్నాయి. మీకే అట్లాంటి చొక్కా లేదు. ఇప్పుడెలా?"


"పోనీ నేను మాములు చొక్కా వేసుకుంటా!"

అన్నాడు శేఖర్.


"నాన్నా!నువ్వు అందరికంటే ఆడ్ గా ఉంటావు. నువ్వు త్వరగా వెళ్లి చెట్లు చెట్లు ఉండే చొక్కా తెచ్చుకో!"

రష్మికి కంగారుగా వుంది.


పార్టీలో అందరూ చెట్లు, లతలూ ఉన్న డ్రెస్సులతో ఉంటే వాళ్ళ నాన్న ఒక్కడే మామూలు చొక్కా వేసుకుంటే అవమానంగా ఉండదూ!


చేసేదేమీ లేక కారు తీసికొని బజారుకు వెళ్ళాడు శేఖర్.

అప్పటికి నాలుగయింది.

పార్టీ అరింటికి.

శనివారం కావటం వలన షాపులన్నీ రష్ గా వున్నాయి. ఎంత తిరిగినా చెట్ల చెట్ల డిజైన్ చొక్కా కనిపించలేదు శేఖర్ కు.


అక్కడే పూల కొట్టు దగ్గర మామిడాకులు అమ్ముతుంటే ఒక ఆలోచన వచ్చి కావలసినవి కొనుక్కొని ఇంటి కొచ్చాడు.


అప్పటికే అనిత, రష్మి తయారయ్యి ఉన్నారు.


"దొరికిందా!"ఇద్దరూ ఒకేసారి ఆత్రంగా శేఖర్ ని అడిగారు.


"మీరు వెళ్ళండి!నేను తయారయ్యి వస్తాను."


"సరే!"నంటూ రష్మి, అనిత పార్టీకి వెళ్లారు.


దాదాపు అరగంట గడిచింది.

పార్టీ సందడిగా వుంది. కేకు ఫారెస్ట్ కేకు. వడ్డించే ప్లేట్లు, గ్లాసులు చెక్కవి. అందరి డ్రెస్సులు అడవి పూలు, చెట్లు. కొంత మంది జంతువుల మాస్కులు పెట్టుకున్నారు. పిల్లలుకొంత మంది కోతులు, కుందేళ్ల లాగా తయారయ్యారు. మొత్తానికి అంతా అరణ్యమయం.


రష్మికి కంగారుగా వుంది. నాన్న ఇంకా రాలేదు. తనతోటి పిల్లలతో ఆడుకుంటున్నా కూడా తండ్రి కోసం గుమ్మం వైపు చూస్తూ వుంది.


అదిగో!అప్పుడే అక్కడికి ఒక కోయదొర ప్రత్యక్షమయ్యాడు.

షార్ట్ వేసుకొని దాని మీద దట్టంగా ఆకులు చుట్టుకొని, పైన అచ్చాదన లేకుండా మెళ్ళో గవ్వల పేరు వేసుకొని,తల మీద ఆకులు చుట్టుకొని, కళ్ళ క్రింద తెల్ల చారలు పెట్టుకొని,చేతిలో బల్లెం లాంటిది పట్టుకొని....


ఒక్కసారి పిల్లలంతా గొల్లుమని నవ్వటం మొదలు పెట్టారు.

పెద్దవాళ్ళు విభ్రాంతిగా చూసి నవ్వారు.


"అద్భుతంగా వచ్చావు శేఖర్!మా బాబు పుట్టిన రోజుకు. అద్భుతం!ఆహా!అడవికి సరిగ్గా సరిపోయింది. నాకు రాలేదు ఇలాటి ఐడియా!"


అంటూ కేశవ్ శేఖర్ చేతులు పట్టుకొని ఉపేశాడు.


ఇక మిగిలిన అతిథులు శేఖర్ ని చప్పట్లతో అభినందించారు.

పార్టీ సందడిగా ముగిసింది.


రష్మి సంతోషానికి అవధుల్లేవు. పార్టీలో వాళ్ళ నాన్న అందరికంటే గొప్ప హీరో అయ్యాడు.


రాత్రి పాప పడుకొంది.

"ఈ ఐడియా ఎలా వచ్చిందండీ?"

అంది అనిత.


షర్ట్ దొరకలేదు అనితా!ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోతే బంగారు తల్లి ఊరుకుంటుందా!"


పాపముంగురులు సవరిస్తూ మెల్లిగా బదులిచ్చాడు రష్మి నాన్న శేఖర్.


ప్రతి తండ్రీ అంతేకదా!కూతురు కోసం....


****************************************


Rate this content
Log in

Similar telugu story from Children