శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

అరుణోదయం

అరుణోదయం

2 mins
469



             అరుణోదయం

            -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


    బాల్య స్నేహితురాలు అరుణ మాఊర్లో ఏదో పనిమీద వచ్చి నాదగ్గర ఒకరోజు గడుపుదామని వచ్చింది. కొన్నేళ్ల తర్వాత కలుసున్నాం. ఒకరికొకరం చాలా మారిపోయామనిపించింది.


    కుశల ప్రశ్నలయ్యాకా....కుటుంబ విషయాల్లోకి వచ్చాము. 


   "అవునూ...మీ పిల్లలు పెళ్లీడుకొచ్చేసినా....ఇంకా మీ అత్తగారి దగ్గర కాపురమెలా చేస్తున్నావే బాబూ"...అంది తలపట్టుకుని.


   దాని మాటలకు ఎలా సమాధానం చెప్పాలో అర్థంగాక చిన్నగా నవ్వాను.


   "ఏమో బాబూ...నేనైతే వాళ్ళకి చాకిరీ చేయాల్సివస్తుందని పెళ్ళైన వెంటనే వేరు కాపురం పెట్టేసాను" అంది ఎంతో గొప్పగా.


   "అవునా....అయితే నువ్వు చాలా ఆనందంగా వుంటున్నావన్నమాట" అన్నాను కూల్ డ్రింక్ని చేతికిస్తూ. 


   "ఆనందంగా ఉన్నానా అంటే మరీ అంతకాదు. కొన్నాళ్ళు నేనూ ఆయనా బానే ఉన్నాం. ఆతర్వాత మా ఆయన గోల మొదలెట్టాడు. వాళ్ళకి నేనొక్కడినే కొడుకుని. వాళ్ళకిప్పుడు వయసు మీరింది. వాళ్ళ దగ్గరకు వెళ్లిపోదామంటూ. లేదా వాళ్లనైనా మనింటికి తీసుకొచ్చేస్తానంటూ. దానికి ససేమిరా నేనొప్పుకోలేదు. ఈ విషయంలో చాలా గొడవలు పడ్డాం. ఏమనుకున్నారో ఏమో...వాళ్ళను తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో పెట్టారు. హమ్మయ్య...ఓ సమస్య తీరిందని అనుకున్నాను. కానీ...మా ఆయన మాత్రం నాతో ముభావంగా ఉంటూ మా అమ్మగారింటికి రావడమే మానేశారు. నన్నూ వెళ్ళొద్దని రూలు పెట్టడంతో మా అమ్మను చూడలేకపోతున్నాను" అంది కొంచెం దిగులుగా. 


   తన విషయంలో ఇంత జరిగినా...మీ అత్తగారితో ఎలా ఉన్నావో అని నాతో అన్నమాట నాకసలు నచ్చలేదు. 


   "సరే....రాకరాక వచ్చావు మాఇంటికి. ఒకసారి మాఇల్లు చూద్దువు గానిరా అన్నాను" మాట మారుస్తూ.


   ఇల్లంతా చూపిస్తూ...మా అత్తగారు వుండే తలుపు తోసాను. అక్కడ  మా అత్తగారితో పాటూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న ఆమెను కూడా పరిచయం చేశాను. 


   అరుణ ఆశ్చర్యపోయినట్టుంది...స్నేహితుల్లా ఎంతో చక్కగా కబుర్లాడుకుంటున్న వాళ్ళని చూసి.


   "అయితే మీ నాన్నగారు పోయాకా మీ అమ్మగార్ని కూడా నీతోనే ఉంచుకుంటున్నావా? ఇద్దరి ముసలోళ్ళని చూడ్డం నీకు కష్టమనిపించడం లేదూ"....? నాకు ఏదో సానుభూతి కురిపిస్తూ మాట్లాడుతుంటే మనసులో మంటెక్కింది. అయినా తమాయించుకుంటూ శాంతంగానే చెప్పాలనిపించింది.


    "చూడు అరుణా...వాళ్ళెవరో కాదు...నన్నూ, మా ఆయన్ని నవమాసాలు మోసి కనిపెంచిన ప్రాణదాతలు. ఈవయసులో వాళ్ళకి పిల్లలతోడు మరీ అవసరం. వారు మాకు బరువు, బాధ్యత అనుకుంటే....అంతకన్నా వారికి అవమానం లేదు. ఒకవిధంగా చెప్పాలంటే మూర్ఖులకంటే హీనమవుతాము".


   "ఇన్నాళ్ళైనా...మీ అత్తగారి దగ్గరే కాపురం ఎలా చేస్తున్నావని అడిగావు చూశావూ...దానికి సమాధానం ఇప్పుడు చెప్తాను...


   "నిజమే...కొత్తగా పెళ్ళై అత్తారింటికి వచ్చినప్పుడు అక్కడ కొత్తగా ఉండి ముక్కూ మొఖం తెలియని వారింటికొచ్చి సేవలు చేయడమేంటని ప్రతి కోడలకూ అనిపించవచ్చు. ఎప్పుడైతే పుట్టిల్లు దాటి అత్తింటికి వచ్చామో...అప్పుడే ఇది నా ఇల్లు, నా మనుషులు అనుకుంటే...సేవ చేస్తున్నామనే ఫీలింగ్ రానేరాదు. అప్పుడప్పుడు ఏమైనా చిన్నచిన్న మనస్పర్థలు వచ్చినా పెద్దవాళ్ళు ఏదో అన్నారని సర్దుకుపోతే అంతటితో ఆగిపోతుంది. నేను అలాంటివేమీ పెద్దగా పట్టించుకోలేదు కాబట్టే... మళ్లీ నాతో ప్రేమగానే ఉండేవారు. ఆ సఖ్యత మా మధ్య ఉంది. ఇది నా అనుభవంతో చెప్పిన మాట. అందుకేనేమో మా అత్తగారి మనసులో నేను స్థానం సంపాదించుకోగలిగాను".


   "ఆమధ్య మానాన్నగారు పోయి అమ్మ ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ...మా అత్తగారు నాతో ఏమన్నారో తెలుసా"...? నువ్వు మీ అమ్మగారిని ఇక్కడకు తీసుకొచ్చేస్తే మనతో పాటూ వుంటారు. నాకూ మంచి కాలక్షేపంగా ఉంటుంది అన్నారు. నా మనసులో మాట కూడా అదే. నేనింకా చెప్పనైనా చెప్పకుండానే ఆవిడ నోటితో ఆవిడే ఈ మాటన్నారు. ఏ వయసు వాళ్లకు ఆ వయసు వాళ్ళు తోడుంటే వారి ముచ్చట్లే వేరుగా ఉంటాయి.


   చూశావు కదా... వారిద్దరూ ఎంత సంతోషంగా కబుర్లాడుకుంటున్నారో...? మాతో పాటూ వాళ్ళనీ చూసుకుంటూ సమయానికి ఓ ముద్ద పెడుతున్నాం. పెద్దగా బరువులు ఏమీమోయడం లేదు కదా. వారు మా కళ్లెదుటే ఉండటం వలన ఎంతో ఆరోగ్యంగా వుంటున్నారు. వారితో మేమూ సంతోషంగా ఉంటున్నాం. 


   మా అమ్మను మా అత్తగారే ఇక్కడకొచ్చి ఉండిపోమని చెప్పడం...ఆవిడలో నేను చూసిన గొప్ప సంస్కారం. నాకెంతో నచ్చిన విషయం. 


   ఇలా ఎక్కడో గానీ జరగవు. కానీ జరిగితే...ఉన్నంతలో అందరూ సంతోషంగానే ఉండచ్చు" అని నాకు చేతనైన రీతిలో చెప్పాను.


   అంతా విన్నాకా....అరుణ మనసులో ఏదో కదలిక వచ్చినట్టుంది. తెల్లవారాకా నానుంచి సెలవు తీసుకుంటూ వెళ్లిపోతుంటే....అరుణ ముఖంలో అరుణోదయం చూసాను....!!*


         ****     *****    ****


   


   


Rate this content
Log in

Similar telugu story from Inspirational