kottapalli udayababu

Drama Classics Inspirational

4  

kottapalli udayababu

Drama Classics Inspirational

"ఆడదాని శత్రువు "

"ఆడదాని శత్రువు "

11 mins
327


ఆడదాని శత్రువు (కథ)-కొత్తపల్లి ఉదయబాబు

ఆ వీధి మలుపులోకి వేగంగా కారును తిప్పుతున్న నేను హఠాత్తుగా బ్రేక్ వేసాను. నడిచేటప్పుడు నడక నియమాలు పాటిస్తూనే ఒక చేయి ఏడేళ్ల పాప భుజం మీద రక్షణగా వేసి కబుర్లు చెబుతూ నడుస్తున్న ఆమె ఆ హఠాత్పరిణామానికి పాపను రెక్క పుచ్చుకుని పక్కకు లాగి బాలన్స్ కుదరక విసురుగా దూరంగా పడిపోయింది.

 నిజానికి తప్పు నాదే. ..రెండు తప్పులు చేసాను. ఒకటి వీధి మలుపు తిరుగుతున్నప్పుడు హారన్ కొట్టి పాదచారులను ఎలెర్ట్ చెయ్యకపోవడం. రెండు, వీధిమలుపులో వెళ్లాల్సిన వేగం కన్నా రెట్టింపు వేగంతో కారు నడపటం. 

 నా గుండె గుభేలుమంది . ఏం గొడవ చేస్తారో ఏమిటో...డబ్బుకోసం కార్ల కింద పడి వేలకు వేలు దోచేస్తున్నారు జనాలు ఈ నగరం లో. పొద్దున్నే ఎవరి ముఖం చూశానో ఏమో. ..అనుకుంటూ గబగబా కారు దిగాను. అప్పటికే జనం వాళ్ళ చుట్టూ మూగేసారు.

ఆమె లేచినిలబడి కంగారుగా ''అవనికా. . అవనికా. ..'' అంటూ పాపను దగ్గరకు లాక్కుని ఒళ్ళంతా తడుముతూ '' అవనీ .దెబ్బలేమీ తగల్లేదుకదామ్మా ?’’అంది ఆందోళనగా. 

''నువ్వు నన్ను పక్కకు లాగేశావు కదా..నాకేమీ కాలేదు అమ్మమ్మా ..''అంది పాప గౌనుకు అంటిన దుమ్ము దులుపుకుంటూ..ఆమె తన చీరకొంగుతో పాప ముఖం మెల్లగా మెత్తగా తుడవసాగింది.

అవనిక తన కళ్ళు పత్తికాయల్లా చేసి విస్పోరితమైన కళ్ళతో ''అమ్మమ్మా . నీ మోచేతికి రక్తం. '' అని అరిచింది గట్టిగా. .

అపుడు చూసుకుంది ఆమె. 

విసురుగా పడటంతో కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డు వలన కాబోలు ఆమె మోచెయ్యి బెత్తెడు మేర చర్మం కొట్టుకు పోయి రక్తం చిమ్మడంతో ఎర్రగా మంకెన పూవులా ఉంది. 

''పర్వాలేదులే...అని ఆమె తన చీరకొంగును అదిమి పెట్టింది.

''వాటర్ తో కడిగి చీర కొంగు తడిపి అపుడు దెబ్బ చుట్టూ చుట్టండమ్మా..ఇదిగో వాటర్ బాటిల్.'' అంటూ ఎవరో ఉద్యోగస్తురాలు అనుకుంటా, తన భుజాన ఉన్న హ్యాండ్-బాగ్ లోంచి వాటర్ బాటిల్ తీసి అందించింది. పాప బాటిల్ లో నీళ్లు మెల్లగా పోస్తుంటే ఆమె గాయం కడుక్కుని తర్వాత చీర కొంగు తడుపుకుని మోచెయ్యి చుట్టూ చుట్టుకుని బాటిల్ ఇచ్చిన ఆవిడకు తిరిగి ఇచ్ఛేసి '' కృతజ్ఞతలండీ.'' అంది.

''అదిగో వచ్చింది మహాతల్లి. కారుల్లో కూర్చుంటే ఒళ్ళు తెలీదు కాబోలు ఈ డబ్బున్నవాళ్ళకి.'' అంది ఎవరో లేబర్ అనుకుంటా.

నేను ఆ మాటలు పట్టించుకోలేదు. ఆమె దగ్గరగా వచ్చాను. '' అయ్యో. ..ఎంత దెబ్బ తిగిలిందో. .. నిజంగా తప్పు నాదేనండీ . నన్ను క్షమించండి. పాపా. రియల్లీ ఐయామ్ సారీ బంగారు. '' అన్నాను పాపను దగ్గరకు తీసుకుని. 

''పరవాలేదండీ..మనకు తెలియకుండా యాదృశ్చికంగా జరిగేవాటినే ప్రమాదాలు అంటారు. మీరు చదువుకున్నవారిలా ఉన్నారు. అలా క్షమాపణలు చెప్పకండి. మోచెయ్యి దగ్గర చర్మం రేగిందంతే.’’ అందామె

'' లేదు మేడం. పదండి. ఈ పక్క సందులోనే నాకు స్నేహితురాలి నర్సింగ్ హోమ్ ఉంది. ఒకేసారి క్లీన్ చేయించుకుని ఎందుకైనా మంచిది ఏ. టి.ఎస్. ఇంజక్షన్ చేయించుకుందురుగాని. ప్లీజ్. రండి..పాపా..రామ్మా..''

 

నా మాట కాదనలేక ఆమె అవనికతో వచ్చింది. అవనిక కారు ఎక్కిన దగ్గరనుంచి దిగేవరకూ కబుర్లు చెబుతూనే వుంది. నేను అన్నీ వింటూ ఆమెను పరిశీలించాను.

 

గుండ్రటి ముఖం... సమాజాన్ని బాగా చదివినట్టుగా చురుకైన చూపులు, కోటేరు ముక్కు, పచ్చని పసిమి ఛాయా, నుదుట గుండ్రని చక్కని కుంకుమ బొట్టు, కాటుక కళ్ళు, తన పెద్దరికానికి తగ్గట్టు కట్టిన ఆధునికమైన, ఖరీదైన చీరకట్టు నాకు చాలా నచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక ఆదర్శ మహిళకు ప్రతీకగా ఉందామె.

“ మీ పేరు? ఏం చేస్తుంటారు?’’ అడిగాను

‘’ ఈ పాప నా మనవరాలు. మా మావగారికి మందులు తేవడానికి షాప్ కి వెళ్తున్నాం. నేను గృహిణి నే...నా పేరు కల్యాణి.’’ అంది ఆమె కారు ఒక్కసారి సడెన్ బ్రేక్ వేసాను.

‘’వాట్... ఏమన్నారు? కల్యాణా మీ పేరు? నా అసిస్టంట్ పేరు కూడా కళ్యాణే.’’ అంటూ మళ్ళీ కారు నెమ్మది గా పోనిచ్చాను.

‘’అలాగా.అమ్మయ్య భయపెట్టేసారు సుమండీ...మళ్ళీ ఎవడు కారుకి డాష్ ఇచ్చాడా అని కంగారు పడ్డాను.’’ అంది కల్యాణి వీపుమీద రెండు దెబ్బలు కొట్టుకుని 

‘’బై ది బై నాపేరు చాందినీ బేగం.నేను అమ్మావాళ్ళ ఇంటికి వచ్చాను. నేను పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే. ఉండేది మాత్రం ఆంద్ర రాజమండ్రిలో... అక్కడ నాకు సొంత కాన్వెంట్ ఉంది. దానికి నేనే మేనేజింగ్ డైరెక్టర్ ని. తరచుగా హైదరాబాద్ వస్తుంటాను. అమ్మ వాళ్ళు నాంపల్లి లో ఉంటారు. ఇక్కడ ఒకపెళ్ళికి నేను నా అసిస్టెంట్ కల్యాణి వచ్చాము. తను వాళ్ళ తమ్ముడి ఇంటికి ఉదయమే వెళ్ళింది. వాళ్ళ మదర్నీ చూసేసి ఇక్కడకు వస్తుంది. ఇక్కడ ముగ్గురం కలుసుకుని సాయంత్రం వరకు గడిపి సాయంత్రం ట్రైన్ కి వెళ్లిపోతాము. ఇంతలో ఇలా జరిగిపోయింది.” అన్నాను నోచ్చుకున్నట్టుగా..

‘’పొరపాట్లు మనుషులం మనం కాక ఎవరు చేస్తారు చెప్పండి.మీరు కావాలని చేసింది కాదుగా.మీరు తెలుగు చాలాబాగా మాట్లాడుతున్నారు ముస్లిం అయినా.’’అంది కల్యాణి మెచ్చుకోలుగా.

‘’అవునండీ...నేను చెబితేనే గానీ నేను ముస్లిం అని ఎవరూ అనుకోరు.’’ అన్నాను నవ్వుతూ.

నేను కారుని నా స్నేహితురాలు ‘’ మాళవికా నర్సింగ్ హోం’’ ముందు ఆపాను. దిగి లోపలి నడిచాము.మాళవిక నన్ను చూస్తూనే, చూస్తున్న కేసులన్నీ ఆపేసింది. నేను కల్యాణిని పరిచయం చేసి జరిగింది చెప్పాను.

‘’ మీరు ఎంతో హోమ్లీగా ఉన్నారు మేడం. నాకు మీలా ఉన్నవాళ్ళంటే గౌరవం తో కూడిన అభిమానం.మా చందూకి కొంచెం స్పీడ్ ఎక్కువ..ఇపుడు చాలా నయం. తన స్పీడ్ ని మా బావగారు తొంభై శాతం లాగేసుకున్నారు. లేకపోతేనా... అయినా కారు ఎక్కితే నీకు ఒళ్ళు పైన కనిపించవే...నువ్ చెప్పినదాన్ని బట్టి ఈరోజు నీ అదృష్టం బాగుండి పెద్ద ప్రమాదం తప్పింది.’’ అని ఇద్దరికీ ఇంజెక్షన్ ఇచ్చి దెబ్బలకు అయోడిన్ వేసి కట్టు కట్టింది మాళవిక.

కల్యాణి దగ్గర ప్రిస్క్రిప్షన్ అడిగి తీసుకుని వాళ్ళ మావగారి మందులు తెప్పించింది కాంపౌండర్ని పిలిచి. డబ్బులు ఇవ్వబొయింది కల్యాణి .మాళవిక తీసుకోలేదు.నేనూ ‘’వద్దండి మీరు ఈవేళ మాకు గెస్ట్’’ అన్నాను.

కల్యాణి ససేమిరా ఒప్పుకోలేదు.

‘’ తప్పు మాళవిక గారు..ఇదే సహాయం మీరు మరో పేద పేషంట్ కి చేయండి.నేను చాలా సంతోషిస్తాను. నా దగ్గర తీసుకోననడం సమంజసం కాదు. ఈ ఋణం తీసుకోవడం కోసం మళ్ళీ నేను ఏ కుక్కపిల్లగానో, పిల్లిపిల్లగానో మీ ఇంట్లో పుట్టాలి. అంత అవసరమంటారా? ఆమె అన్న మాటలకి మేమిద్దరం నవ్వు ఆపుకోలేకపోయాం.

‘’మీరు చాలా తమాషాగా మాట్లాడతారు. స్వచ్చందంగా మీరు మాట్లాడే విధానం నాకు చాలా నచ్చింది.మా అసిస్టెంట్ కూడా మిమ్మల్ని చూస్తే వదిలిపెట్టదు. ‘’ అన్నాను నేను.

‘’ ఇందు లో తమాషా ఏముంది చాందిని గారూ...మనం ఒకళ్లకొకళ్ళం ఇపుడే పరిచయం అయ్యాం. ఒకరిని ఒకరు కలుపుకునే స్థాయి స్నేహం పెరిగేవరకు ఎవరికీ వారం స్వచ్చమైన స్నేహమే చేస్తాం. చదువుకున్నవాళ్ళం. ఉన్నంతలో మంచి పోజిషన్ లోనే ఉన్నాం. అందులో మనం అసూయ పడేది ఏమీ లేదు. మాళవికగారు డాక్టర్ చదువుకున్నారు. మీరు చదువుకుని సొంత కాన్వెంట్ కి ఓనర్ అయ్యారు. నాకు ఉద్యోగం చేసే ఉద్దేశం లేదు కాబట్టి ప్రశాంతంగా గృహిణిగా హాయిగా ఉన్నాను. ఇంత విశాలంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన మధ్య మంచి స్నేహమే తప్ప చెడు వాతావరణం ఉండే అవకాశమే లేదు, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కల్పిస్తే తప్ప.’’అన్న కల్యాణి మాటలకు మెచ్చుకోలుగా చూసింది మాళవిక.

‘’ యు ఆర్ రియల్లీ గ్రేట్...మీ అంత విశాలంగా మేము కూడా ఆలోచించమేమో. ఏది ఏమైనా మాఇద్దరికీ మంచి స్నేహితురాలుగా దొరికారు మీరు. ఈ స్నేహం ఇలాగే కొనసాగాలి.సరేనా?’’ అంది మాళవిక కల్యాణి చేయి మృదువుగా నొక్కుతూ.

‘’అవును కల్యాణి గారు. మాళవిక మాటే నా మాట...ఈ క్షణం నుంచి మనం మంచి స్నేహితులం.’’ నేను కూడా కల్యాణి తో కరచాలనం చేసాను .

‘’మీ ఇద్దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నన్ను మీ స్నేహితురాలిగా కలుపుకున్నందుకు.ఈ సందర్భంగా మీరు ఇద్దరూ మా ఇంటికి టీకి రావాలి. మళ్ళీ సాయంత్రమే వెళ్ళిపోతానంటున్నారు. మీ అసిస్టెంట్ గారిని కూడా తీసుకురావాలి.రాకపోతే నామీద ఒట్టే.. ఇది నా సెల్ నెంబర్.....వచ్చేముందు ఒక్కసారి కాల్ చేయండి...నేను రెడీ గా ఉంటాను.మరి వెళ్లి వస్తాను ఫ్రెండ్స్...ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. మావగారు కంగారు పడుతూ ఉంటారు. ‘’ అని మేమిద్దరం ఇచ్చిన మా విజిటింగ్ కార్డ్స్ తీసుకుని పాపతో వెళ్ళిపొయింది కల్యాణి.

ఆమె అటు వెళ్లిందో లేదో మేమున్న గదిలోకి అడుగు పెట్టింది నా అసిస్టంట్ కల్యాణి.

 

********************* 

మా కల్యాణి వచ్చాకా కబుర్లలో పడిన మేము మాళవిక హెచ్చరికతో ఇందాకా పరిచయం చేసుకున్న కల్యాణికి ఫోన్ చేసి వస్తున్నాం అని చెప్పాము. ఆమె రమ్మని ఫోన్ లోనే సాదరంగా ఆహ్వానించింది.

పదినిముషాలలో భరణి కాలనీ లోని ఆ అపార్ట్ మెంట్ కు చేరుకున్నాం.

మమ్మల్ని లిఫ్ట్ దగ్గర చూస్తూనే చిరునవ్వుతో ఆహ్వానించింది కల్యాణి. ముగ్గురం లోపలి అడుగుపెట్టాం. విశాలమైన మూడు పడక గదులు, హాలు, డైనింగ్ హాలు ఉన్న అపార్ట్మెంట్.ఎక్కడి వస్తువులు అక్కడ స్థిరపడి అతిధుల రాకకోసం ఎదురు చూస్తున్నట్టు ఉన్నాయి.

మాళవిక వెనుకగా నడవబోయిన నన్ను జబ్బపుచ్సుకుని ఒక్కసారిగా వెనక్కు గుంజింది నా అసిస్టంట్ కల్యాణి.

‘’ఏమైందోయ్’’ అడిగాను సీరియస్ గా.

‘’ ఆవిడ...ఆవిడ ఎవరో తెలుసా...మా బావ రెండో పెళ్ళిచేసుకున్నది ఆవిడనే.నేను రాను లోపలికి’’

అంది.ఆశ్చర్యపోవడం నావంతు అయింది.

“ఎలా చెప్పగలవ్...?’” అడిగాను.

ఎదురుగా హాల్లో ఉన్న దంపతుల ఫోటో చూపించింది. ఆయన్ని గుర్తుపట్టాను. మా కల్యాణి పెద్దకొడుకు పెళ్ళిలో చూసాను.

‘’ తప్పు. గుమ్మంలోకి వచ్చి లోపలికి వెళ్ళకపోతే ఏమనుకుంటుంది? నీకిష్టం లేకపోతె మాట్లాడకు,రా..’’ అని తన చెయ్యి పుచ్చుకుని లోపలి నడిచాను.

కల్యాణి మా ఇద్దరికీ కుర్చీలు చూపించింది. మంచినీళ్ళు ట్రే లో పట్టుకుని వచ్చి ఇచ్చింది. మా కల్యాణి తీసుకోలేదు.మేమిద్దరం కొద్దిగా మర్యాదకోసం తాగాము.

ఇంతలో లోపల నుంచి వచ్చిన పాప మా కల్యాణిని గుర్తు పట్టి ‘’ చిన్నమ్మమ్మా..’’ అంటూ వచ్చి వొళ్ళో చేరింది. ఈసారి కల్యాణిగారు ఆశ్చర్యపోయింది.

‘’ఆవిడ నీకెలా తెలుసమ్మా?’’ అడిగింది అవనికని.

నేను మా కల్యాణిని ఆమెకు పరిచయం చేసాను. ‘’ సారీ అండి.ఇక్కడకు వచ్చాకనే తెలిసింది.మా కల్యాణి ఎవరో కాదు మీవారి మరదలు.’’

‘’అలాగా.నమస్తే అమ్మా. అవును. అక్కయ్యకు మీకు పోలికలు కనిపిస్తున్నాయి.చాలా సంతోషంగా ఉంది మనం ఇలా కలవడం.’’ అంది కల్యాణి ఆనందం వ్యక్తం చేస్తూ.

మా కల్యాణి అవుననలేదు. కాదనలేదు. అసలు కల్యాణికేసి చూడలేదు. మంచినీళ్ళ గ్లాసులు తెసుకుని వెళ్లి లోపల పెట్టేసి వేయించిన జీడిపప్పు, కలాకండ్ స్వీట్స్ ఉన్న పళ్ళాలతో వచ్చి మా ముగ్గురికి అందించింది కల్యాణి.నేను మాళవిక తీసుకున్నాం. ఆమె అందిస్తున్న ఆ ప్లేట్ తీసుకోకుండా మా కల్యాణి

‘’ అమ్మ రాలేదా బంగారూ..’’ అడిగింది పాపని.

‘’ వచ్చింది చిన్నమ్మమ్మా.డాడీ, తను కలిసి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు. చాలా దూరమంట. అందుకని నన్ను అమ్మమ్మదగ్గర వదిలేసి వెళ్ళారు. నేను హాలిడే హోం వర్క్ చేసుకోవాలి. లోపలకి వెళ్తున్నా అమ్మమ్మ..’’ అనేసి మొదటి పడక గదిలోకి వెళ్ళిపోయింది అవనిక.

‘’ నేను వస్తున్నా ఆగవే...మీ తాతయ్య ఎక్కడకి వెళ్లాడూ...’’ ఆరాలు తీసుకుంటూ అవనిక వెనకాలే లోపలి వెళ్ళిపోయింది మా కల్యాణి.

నాకు ప్రాణం చివుక్కుమనిపించింది. అది గమనించినట్టుగా మాళవిక నా ముఖం లోకి చూసింది. అర్ధమైనదన్నట్టు తలూపాను నేను.

కల్యాణి మాముందుకు వచ్చి మరో కుర్చీలో కూర్చుంది.

‘’అయితే అవనిక...’’ అర్దోక్తిగా ఆగిపోయాను స్వీటు నోట్లో పెట్టుకుంటూ...

‘’ నాకు ఒక అమ్మాయి..అబ్బాయి..అమ్మాయికి అమ్మాయి, అబ్బాయి.అబ్బాయికి ఇద్దరూ అబ్బాయిలే.వాళ్ళు భావించినా భావించకపోయినా ఆయన పిల్లలు ఇద్దరూ నా పిల్లలే...మనవలు నలుగురూ నా మనవలే. నేను ఈ ఇంటి ఇల్లాలిని అయినపుడు వారు పరాయివాళ్ళు అనే మాట ఎందుకొస్తుంది మేడం.అసలు అలా ఆలోచించే తత్వమే నాది కాదు.

ఎందుకంటే వివాహం ముందే మాకు జరిగిన చర్చ లో వారు నాకు దాపరికం లేకుండా అన్ని విషయాలు చెప్పారు. దురదృష్టవశాత్తూ ఆమెకు వచ్చిన నొప్పి అపెండిసైటిస్ అని గుర్తించి హాస్పిటల్ కు తీసుకువెళ్ళే లోపే ఆమె తన ప్రాణాలు కోల్పోవడం మావారి దురదృష్టం. పిల్లల దురదృష్టం. మన చెయ్యి దాటిపోయాకా చేసేది ఏమీ లేదు. మన చేతిలో ఉన్నప్పుడు చేయగలిగిన అవకాశం ఉండి కూడా చేయకపోతే అది మానవత్వం అనిపించుకోదు.

తన భావి జీవితం సుఖ శాంతులతో గడవాలని, వారివారి కుటుంబాలతో సుఖంగా ఉన్న పిల్లలకు తనవల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదని , అటువంటి భరోసా నేను ఇవ్వగలను అని మాట ఇచ్చిన మీదటనే ఆయన నన్ను వివాహం చేసుకున్నారు. దాతల సహకారంతో డిగ్రీ వరకు చదివిన నేను ఏ దిక్కూ మొక్కూ లేక ఒక అనాధాశ్రమంలో అనాధగా బతుకుతున్న నాకోసం, నా జీవితానికి ఒక ఆధారం కల్పించడం కోసం వెతుక్కుంటూ వచ్చిన ఆయన భగవంతుడు నాకు ప్రసాదించిన ఒక వరం. 

ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుని ఆ డబ్బులు నా స్వార్ధం కోసం దాచుకోవడం కంటే, నన్ను ఆ స్థాయికి పెంచిన పెద్దలందరికీ సాయం గా ఉంటూ, చదువు రానివారికి ఆ వయసులో తమ పిల్లలు రాసిన ఉత్తరాలు సంతోషంగా చడువుకునేలా చదవడం, రాయడం నేర్పించాను.ఆ ఆనందం నాకు వర్ణనాతీతం.

అవకాశం వచ్చింది కదా అని నా హద్దులు దాటి ప్రవర్తిస్తే రేపు చివరి ఘడియల్లో చూసే దిక్కు కూడా వుండదు. ఈవయసులో ఆడది తన హద్దు తెలుసుకుని ప్రవర్తించడం నాకు చాలా అవసరం అని ఎందరెందరో జీవితాలను చూసి తెలుసుకున్నాను.

‘నువ్వు ఆనందంగా ఉండు...నన్ను ఆనందంగా ఉంచు...మనమిద్దరం ఉన్నంతకాలం సంతోషంగా జీవిద్దాం’అంటారాయన, అంతకన్నా ఈ వయసులో ఆడదానికి కావలసింది ఏముంది మేడం? చెప్పండి!’’’

అంది కల్యాణి ఆర్ద్రతతో...

ఆమె ఉన్నత వ్యక్తిత్వానికి నాకైతే కన్నీళ్లు ఆగలేదు. నాకు కనపడకూడదనేమో మాళవిక చమర్చిన కళ్ళను నేను చూడకుండా తుడుచుకోవడం నా దృష్టిని దాటిపోలేదు.

నేను కళ్ళు తుడుచుకోవడం చూసి ‘’ ఆరే.. బాగా ఎమోషనల్ అయినట్టున్నారే...సారీ అండి. మొదటిసారి ఇంటికి వస్తే మిమ్మల్ని బాధ పెట్టాను. ‘మౌనంగానే ఎదగమనీ..’.అన్న పాట నాకు చాలా చాలా ఇష్టం...అది మగవాడికి వర్తిస్తుందో లేదో నాకు తెలీదు గానీ మనసున్న స్త్రీ ఎపుడూ తనకు వర్తింపచేసుకోవాలని నా ఉద్దేశం మేడం.అయినా నా కన్నా విద్యావంతులు ...గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టు నేను మీకు చెప్పడమేమిటి నా పిచ్చి గానీ...సరే...ఇపుడు చల్లగా ఐస్క్రీం...’’అంటూ డీఫ్రీజ్ లోంచి కోన్ ఐస్క్రీం ను అందించింది కల్యాణి.

‘’అయినాయా మీ ముచ్చట్లు...ఇక వెళ్దామా?’’అంటూ విసుగ్గా వచ్చింది మా కల్యాణి.

‘’పాపతో మాట్లాడి బాగా వేడేక్కిపోయినట్టున్నావ్...ఐస్క్రీం తీసుకో చల్లబదతావ్...” అంది మాళవిక.

‘’ అవి తింటే మళ్ళీ ఈ ఇంట్లో ఈ కుక్కో పిల్లో అయి పుట్టాలి. ఇందాకా ఆవిడ అలా సెలవిచ్చింద న్నారుగా...నాకెందుకు ...నేను బాగానే ఉన్నాను గానీ వెళ్దాం పదండి.ఏంటి ఇక్కడే పాతుకుపోయారిద్దరూ...? స్వీట్లు నచ్చాయా...స్వీటుల్లాంటి మాటలు నచ్చాయా?’’వంకర చూపులు చూసుకుంటూ అంది మా కల్యాణి.

 

‘’మీరు వచ్చినప్పటినుంచి ఏమీ తీసుకోలేదు.’’ అంది కల్యాణి చిరునవ్వుతో స్వీట్ ప్లేట్ అందిస్తూ...

‘’నాకు సుగరండీ.. స్వీట్ తినను...హాట్ అంటే ఎలర్జీ..ఏమీ అనుకోకండి.’’ ముక్తసరిగా అంది మా కల్యాణి

 దాని మూడ్ మాకు అర్ధమైపోయింది. నా ఆలోచన పసికట్టినట్టుగా మాళవిక లేచింది.

 ‘’రాకరాక వచ్చారు. ఇల్లు చూడండి.’’ అని ఇల్లంతా చూపించింది.హాలుకు మూలగా ఉన్నగదిలో వాళ్ళమావగారు కాబోలు పడుకుని ఉన్నారు.

‘’చాలా కృతజ్ఞతలు కల్యాణి గారు.మంచి ఆతిధ్యం ఇచ్చారు.వెళ్లి రామా మరి?’’అన్నాను నేను.

‘’ఒక్క నిముషం.’’ అని తన పడకగదిలోకి వెళ్లి జాకెట్టు ముక్కలు, పళ్ళు, పసుపు కుంకుమ, పువ్వులు ఉన్న కారీ బాగ్ లతో వచ్చింది కల్యాణి.

‘’ఇవన్నీ ఏమిటండి?’’ అడిగాను నేను

‘’ ఇంటికి వచ్చిన ముత్తైదువులకు బొట్టు పెట్టె సాంప్రదాయం. అంతేతప్ప మరేమీ లేదు.’’ అని ముగ్గురికి బొట్టు పెట్టి అందించింది.

‘’అరె..పాపకి చెప్పలేదే?’’ అంది మాళవిక

‘’నేను చెప్పాలే పదండి.’’ విసురుగా లిఫ్ట్ తలుపు తీసి ముందుగా లోపలకి దూరింది మా కల్యాణి.

‘’అపుడపుడూ ఫోన్ చేస్తూండండి మేడం.’’ లిఫ్ట్ వరకూ వచ్చి సాగనంపింది కల్యాణి

‘’తప్పకుండా...’’ అని బయల్దేరిపోయాం.

********

ఫోనుల్లో ఏదో ఒక సమయం లో ఒకరి అనుభవాలు ఒకరు కలబోసుకోవడం తో మాళవికకు, నాకు కల్యాణిగారు చాలా మంచి స్నేహితురాలు అయింది. ముఖ్యంగా స్త్రీలలో సహజంగా ఉండే అసూయ, స్వార్ధం, ఎదుటి స్త్రీని చూసి ఓర్వలేని గుణం... ఇవేవీ ఆమెలో మచ్చుకైన కనపడవు.

పైగా ఆ కళ్ళల్లో ఆర్ద్రత, సేవాభావం, మనసుతో మాట్లాడటం ఇవన్నీ ఆమెకు పెట్టని ఆభరణాలుగా కనిపిస్తాయి అర్ధం చేసుకునేవాళ్ళకి.

స్కూల్లో అడ్మిషన్స్ అన్ని పూర్తీ అయి మళ్ళీ క్వార్టర్లీ పరీక్షలవరకు హడావుడి లేకపోవడంతో తమ్ముడి ఇంట్లో ఉండి కే.జీ.హెచ్.లో చెక్-అప్ చేయించుకుందామని బాధ్యత అంతా మా కల్యాణికి అప్పగించి నెలరోజులు వైజాగ్ క్యాంపు వేసేశాను.

ఖాళీసమయం ఎక్కువ అయిపోవడంతో బోర్ గా అనిపించి మళ్ళీ నాకిష్టమైన పుస్తక పఠనంలో లీనమవ్వసాగాను. నేను ప్రస్తుతం చదువుతున్నది మానసిక శాస్త్రం మీద ఒక ప్రముఖ రచయిత రాసిన పుస్తకం. అలా చదువుతుంటే చిన్నప్పుడు ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు తెలుగు రెండవ పేపర్ లో మీ స్నేహితునికి ఫలానా అంశం మీద లేఖ రాయండి అన్న ప్రశ్న ఒకటి ఉండేది. అప్పటికి మాకు ఉన్నంత పరిజ్ఞానం మేరకు ఊక దంపుడుగా బోలెడు విషయాలు రాసేసేవాళ్ళం.

సరిగ్గా నాకు ఇప్పుడు ఉత్తరం రాయాలనిపించింది. ఎవరి గురించి ఎవరికీ రాయలబ్బా...అనుకుంటూ చేతిలో పుస్తకం పక్కనపెట్టి ఆలోచనలో పడ్డాను. అంతలో కల్యాణి గారినుంచి ఫోన్ వచ్చింది. మా కల్యాణి కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదట. మాళవిక తో మాట్లాడానని తానూ బాగున్నానని చెప్పి ‘’ కార్పోరేట్ విద్యమీద మీ అభిప్రాయం?’’ అని అడిగింది.

నేను ఇరుకున పడ్డాను. నేను చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని, నా స్నేహితులందరినీ గమనించి బ్రతుకు తెరువు నేర్చుకున్నాను. కానీ మా అత్తగారి సహకారంతో ఆంగ్ల మాధ్యమంలో కాన్వెంట్ నడుపుతున్నాను. మా కాన్వెంట్స్ అసోసియేషన్ నియమాల ప్రకారం నడుచుకుంటున్నాను. నా జీవితానికి పునాది అయిన ప్రభుత్వ పాఠశాలను సమర్ధించాలా? ప్రస్తుత జీవనాధారమైన కార్పోరేట్ విద్యనూ సమర్ధించాలా?

‘’ నన్ను ఇరుకున పెట్టేసారు. ఆలోచించి చెబుతాను.’’ అన్నాను నవ్వేస్తూ. కల్యాణి కూడా నవ్వేసి ‘’మరి ఉంటాను.’’ అని పెట్టేసింది.

తను ఫోన్ చేస్తే ఏవో సొల్లుకబుర్లు మాట్లాడదు. ఏదో ఒక టాపిక్ మాట్లాడి నా అభిప్రాయం అడుగుతుంది. తన అభిప్రాయం చెబుతుంది. అందుకే కల్యాణి గురించి నేను ఏమనుకుంటున్నానో ...నా మనసులో తన పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందొ కాగితం మీద పెట్టాలనిపించినది.

లెటర్ హేడ్, పెన్ను తీసుకుని రాయసాగాను.

‘’ప్రియమైన కల్యాణి గారికి,

మీ చందూ హృదయపూర్వక నమస్కారాలు.ఫోన్ లో మాట్లాడుకుంటున్నాం కదా...ఈ ఉత్తరమేంటి అని ఆశ్చర్యపోకండి.ఫోన్ మాటలు గాలిలో కలిసిపోతాయి. అవే మాటలు మల్లెపూవు హృదయంలాంటి తెల్లకాగితం మీద పరుచుకున్నప్పుడు అది ఒక మంచి జ్ఞాపకమౌతుంది.

నా జీవితంలో ఎందరెందరో స్త్రీ మూర్తులను చూసాను. ముఖ్యంగా నా కాన్వెంట్ కు వచ్చే రకరకాల మనస్వత్వాల ఆడవాళ్ళను చూస్తె ఇలాంటివాళ్ళూ ఉంటారా అనిపిస్తుంది. ఒక డైరెక్టర్ గా నా కాన్వెంట్ అభివృద్ధికి సహకరించే వారి సూచనలు అన్నీవింటాను. ఆచరించదగ్గవి అమలు చేస్తాను.

కానీ మీ పరిచయం అయాకా ప్రతీ స్త్రీని దగ్గరగా పరిశీలించడం నేర్చుకున్నాను. వారి సున్నిత భావాలు, పరిస్తుతులని బట్టి వారు ప్రవర్తించే విధానం ఇలా ఎన్నెన్నో...

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఒక చిన్న పరిచయం స్నేహంగా మారి నాలోకి నేను చూసుకుంటూ ఉంటె నేనేనా ఇలా ఆలోచిస్తున్నది అనిపిస్తోంది. ఈ మార్పుకు కారణం మీరు అని సగర్వంగా చెప్పగలను.

మీరు నాకు చేసే ఫోన్ కాజువల్ గా అనిపించదు. ఒక విజ్ఞాన ప్రవాహాన్ని మోసుకొచ్చే సాధనం లా కనపడుతుంది.

మీరు అనాధాశ్రమంలో వూహ తెలిసినప్పటినుంచి నిన్న మొన్నటివరకు చెప్పిన మీ అనుభవాలు, ఆయా పరిస్తితులలో మీ భావసంఘర్షణ ఇవన్ని తలుచుకుంటుంటే నాకు తెలియని ఒక కొత్త ప్రపంచాన్ని చూసినట్టుగా ఫీల్ అవుతున్నాను.

మీ సౌమ్యత, ఓర్పు, సహనం అవే మీకు ఈనాటి చక్కని జీవితాన్ని ప్రసాదించాయి. సాటి స్త్రీలపట్ల మీకున్న విశాల దృక్పధం ఈనాడు నా కాన్వెంట్ లో చదువుకుంటున్న ఆడపిల్లలందరికి నేర్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకున్న అత్యంత ఆత్మీయులైన మిత్రుల స్థానంలో మాళవిక తరువాతి మీరే...

ఒక సందర్భంలో మాళవిక నా భర్త ప్రాణాలను కాపాడిన దేవత. అందుకని .

మన పరిచయం అయిన నాటినుంచి ఈనాటివరకూ మాళవిక, మా కల్యాణి గురించి ఒక్క పరుషపు మాట మీనోట వినలేదు. అంత గొప్ప మనత్వత్వం మీది. మీ స్నేహం లభించడం నా అదృష్టం.

సరదాగా ఈ నాలుగు మాటలు రాయాలనిపించింది.ఉంటాను మరి.....మీ మిత్రురాలు చందూ.’’

ఇలాగే మా కల్యాణికి కూడా రాసేస్తే...రాసేద్దాం. అనుకుని మరో పేపెర్ మీద రాయడం మొదలెట్టాను.

‘’ కల్యాణి. ఎలా ఉన్నావ్? ఇన్నేళ్ళ మన పరిచయ జీవితంలో నీకు మొదటిసారి ఉత్తరం రాయాలనిపించి రాస్తున్నాను.

ఇదే మొదటి ఉత్తరం కాబట్టి నీ గురించి నేను క్లుప్తంగా స్పుటంగా చెప్పదలుచుకున్నాను. కొన్ని మాటలు నిన్ను బాధించవచ్చు. వీలయితే దిద్దుకో. దిద్దుకోపోయినా నష్టం లేదు.

నువ్వు నా కాన్వెంట్ లో చేరిన మొదటినాడు నీ చంకలో పిల్లవాడితో వచ్చావు, చేరిన మొదటి క్షణం నుంచి వాడిని సంరక్షించుకుంటూనే ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా నువ్వు పనిచేసిన ఆ రోజు జీవితం లో మరిచిపోలేను. తల్లిగా బాధ్యత నిర్వర్తిస్తూనే, కాజువల్ టీచర్ గా కాకుండా క్లాసులోని పిల్లలందరూ నీ పిల్లలే అన్నభావంతో పనిచేశావ్. ఒక ఉత్తమ ఉపాధ్యాయిని నాపిల్లలకు దొరికింది అని ఆనందించాను.నువ్వెప్పుడూ first impression is the best impression అని అంటూ ఉంటె అప్పట్లో అర్ధం కాలేదు.

నా అనారోగ్య కారణాలవల్ల, నా పిల్లలు చిన్న పిల్లలు కావడం చేత, దాదాపు సమ వయస్కులం కావడం చేత నీతో స్నేహం చేసాను. అది మనతో పాటే పెరిగి పెద్దదై మతాలు వేరైనా అభిమతాలు ఒకటై, శరీరాలు వేరైనా ఆలోచనలు, ఆచరణ ఒకటై ముందుకు సాగాం.నాతొ సమానమైన హోదా కల్పించి, గౌరవం పొందే అవకాశం నీకు కల్పించాను. నీకన్న ఆర్ధికంగా ఎన్నో రెట్లు ఉన్నతస్థాయిలో ఉన్న నీతో ‘’ఏమే’’ అని పిలిపించుకునే అంత చనువు ఇచ్చాను. నా కాన్వెంట్ అభివృద్ధి చెందడంలో నీ పాత్ర ఖచ్చితంగా ఉందని నేను చెప్పగలను.

అయితే పిల్లలు పెద్దైన కొద్దీ నీ అవసరాలు పెరిగి నీకు అవసరమైనప్పుడల్లా డబ్బు డిమాండ్ చేయడం ప్రారంభించావ్. ఈ ప్రపంచం లో ఎంతటి ఉన్నత కట్టడానినైనా బీటలు తీయించే సాధనం ‘’డబ్బు’’. స్నేహమైన, వ్యాపారమైనా, ఒక ప్రాజెక్ట్ అయినా ఏదైనా సరే...

ఆనాటినుంచి మన స్నేహం బీటలు వారడం మొదలెట్టింది. నువ్వు నా దగ్గర కేవలం డబ్బు కోసమే పనిచేసే వ్యక్తిగా మారిపోయినపుడు చాలా బాధ పడ్డాను. కాని అవసరం నాది.ఇప్పడు స్నేహితుల్లా నటిస్తున్నామనే చెబుతాను నేనైతే.

ఇకపొతే మనకు ఈమధ్య కొత్తగా పరిచయమైనా కల్యాణి గారి గురించి. ఆవిడకు సాటి స్త్రీకి ఇచ్చే కనీస గౌరవం, మర్యాద కూడా ఇవ్వక నీ సంకుచిత మనస్తత్వాన్ని చాటుకున్నావ్.నీ అక్క మరణిస్తే నీ బావ పెళ్ళిచేసుకుని ఆమెను ఆ స్థానం లోకి తెచ్చుకున్నాడు. అనాధ అయిన ఒక స్త్రీకి న్యాయం జరిగిందని సంతోషించలేని నీ అనుచిత ప్రవర్తనకి చాలా అసహ్యం వేసింది.

చదువు లేకపోవచ్చునేమో గాని ఏరకంగా చూసినా ఆమె నీకన్నా ఎంతో ఉన్నతురాలు. నువ్వు పనిచేసిన మొదటి రోజు నుంచి జీతం తీసుకున్నావ్. కాని ఆమె తన వారికి మానవత్వంతో సేవచేసింది. ఆమె తన అనాధాశ్రమంలో చేసిన సేవ శ్రీకృష్ణుని తులసిదళం తో తూచగలిగిన రుక్మిణి భక్తీ తో సమానం నా దృష్టిలో.

ఆడదానికి ఈలోకంలో శత్రువు మగవాడు కాదు కల్యాణి. ఆడదాని శత్రువు ‘ఆడదే...’

మగవాడిలో ఆడదాని పట్ల ఆరాధనాభావం, పరిపూర్ణ ప్రేమతత్వం ఉంటుంది. అతన్ని తృణీకరిస్తే ఒక్కసారిగా కక్ష తీర్చుకుంటాడు గాని శత్రువులా చూడడు.

కానీ తన కన్నా ఈప్రపంచంలో ఏ ఆడది కొద్దిగా ఉన్నతంగా కనిపించినా ద్వేషం, కసి, అసూయ,కడుపుమంట...వంటి సహజలక్షణాలతో ఆడదానికి ఆడదే శత్రువు అవుతుంది. అది తెలుసుకో...ఈ నాలుగు మాటలు నీకు చెప్పాలనే ఈ ఉత్తరం రాస్తున్నాను. నేను వచ్చాక నాతొ పోట్లాడతావ్.నాకు తెలుసు. ఉంటాను మరి...చాందినీ బేగం.’’

అమ్మయ్య...రెండు ఉత్తరాలు రాసేసాను. రాసినవి పదేసి సార్లు చదువుకున్నాను.అంతరంగం దూదిపింజలా తెలిపోసాగింది.మనసులో భావాల్ని కాగితం మీద పెడితే ఇంత హాయిగా ఉంటుందా..అవుననే అనిపించింది నాకు.

రెండు ఖాళీ కవర్లు తీశాను. చెరో ఉత్తరం చెరో కవర్లో పెట్టాను.

అప్పుడు వచ్చింది ఒక చిలిపి ఆలోచన.మా కల్యాణి పేరు సి. కల్యాణి. ఆ కల్యాణి పేరు పి. కల్యాణి

మా కల్యాణికి రాసిన ఉత్తరం ఉన్న కవరు మీద పి. కల్యాణి చిరునామా, తనకు రాసిన ఉత్తరం ఉన్న కవరు మీద మా కల్యాణి చిరునామా రాసి కవర్లు అతికించేసాను.

ఉత్తరం చదివినా మా కల్యాణి ప్రవర్తనలో మారు రాదు.ఎందుకంటే ఆడదాని శత్రువు ఆడదే కనుక.

                                 

                                     సమాప్తం 

 

 

 


Rate this content
Log in

Similar telugu story from Drama