తడి సంతకం
తడి సంతకం


ఈ రోజు
ఇంకా తను రాకపోయేసరికి
మనసెందుకో దిగులు రాగమందుకుంది.
చెప్పులకు చెప్పకుండా
మట్టిని హత్తుకున్న నా అడుగులను తడిగా తడుముతూ
రాత్రి తనొచ్చిన రహస్యాన్ని విప్పేది.
తనొచ్చే ప్రతిసారీ
చెట్ల ఆకులన్నీ హార్మోనియం మెట్లవుతాయి.
చినుకు వేళ్ళతో ఆలపించే టపటప సంగీతానికి
సరిపడా కవితొకటి కూర్చమని వెంటపడుతూనే ఉండేది.
రాత్రంతా ఇంతడేసి జల్లు కళ్ళతో
కురిసి కురిసి నేను కనపడకపోయేసరికి
తెల్లారేపాటికల్లా ఇంటి ముందు నీటిగుంటై టెంటు వేసేసేది.
బెంగ తిరిగేదో ? ఏమో కాని
చుట్టూ ఏ చెట్టూలేని చోటు చూసి
ఆత్మీయతా తుంపర్లను అమాంతం నాపై కుమ్మరించిపోయేది.
కనీసం ఉరుములతో కబురైనా పెట్టకుండా
తలను చెమ్మగా తడిమేది.
<
p>
ఒక్కోసారి
దూరపు చుట్టంలా సందెకాడ వచ్చి
ఉదయానికల్లా తుర్రుమనేది.
మరోసారి దగ్గరి బంధువై మబ్బులన్నీ సద్దుకొచ్చి
పొమ్మన్నా చూరట్టుకు వేలాడేది.
తానో నీటిమొక్కై
మనస్సును చినుకు పూల బుట్టను చేసేది.
వాన
ఒక గంధపుసాన.
సమయాల్ని ,కొన్ని కప్పుల పొగలుగక్కే 'టీ'లనీ అరగదీసి
కోట్ల క్షణాల్ని సుగంధభరితం చేస్తుంది.
చినుకు
నాలో ఎప్పుడు తడిసంతకం పెట్టినా
మది మోయలేనన్ని జ్ఞాపకాలతో తడిచి మొపెడౌతుంది.
హృది పత్రానికంటిన దిగులు కాటుక కరగాలంటే
చిరుజల్లుగా తను రావాల్సిందే మరి.