రంగుల రాగాలతో
రంగుల రాగాలతో


ఎరుపు రంగుల్లో వున్నాయి చైతన్యపు రాగాలు,
తెలుపు రంగు చెబుతుంది శాంతి పాఠాలు,
హరిత రంగు చూపుతుంది ప్రకృతి పరవశ కాంతులు,
నలుపు తలుపుల్లో కానవచ్చు దుఃఖంనిండిన హృదయాలు.
తెలియదు నాకు
వర్ణాలను వర్ణించే
పదముల జాడలు.
కనులకు చూపలేను
చెలిమికి అర్ధంగా నిలిచేటి
అపురూప రంగును,
మనసు ముందు వుంచలేను
ఆశపడే కోరికల రంగును,
అనుబంధాలలో వెతకలేను
ప్రేమల రంగును,
గుండె లోలోపల లేని చిరునవ్వు వెలికితీయవు
ఏ రంగును.
బాధలు మరిపించు
రంగుల పండుగే వేయాలి
అనురాగానికి సొగసైన రంగును,
మంచిచెడుల ఆలోచనా విజ్ఞతే
చూపాలి శుభకర రంగును,
సత్య అందాన్ని చూపే వలపే
కనుగొనాలి ప్రేమరంగును,
విశ్వమైత్రి కావ్యంగా నిలిచిన అక్షరాలలో చూద్దాం
హరివిల్లులోన రంగును,
ప్రతీ రంగుల తలపు
మేల్కొలుపు రాగమైతే
హోళి కేళి వసంతోత్సవం
నిత్య సంతోషాలతో మదిలో పదిలం.