పచ్చటి ఊపిరి
పచ్చటి ఊపిరి
పచ్చని ఊపిరి.....
మట్టిలో
పొర్లాడి, పోరాడి ఇన్ని గింజల్ని పండించడమే
తెలుసనుకునేవు
బిడ్డా.....
అదే మట్టిని మందుపాతర చేసి
నిన్నూ, నీ రాజ్యాన్ని కూల్చడం కూడా చేతనౌను
దుక్కి దున్ని
ఇంత కూడును పుట్టించడమే తెలుసనుకునేవు
ఆ తిండే తిని
ఆ తిండి ఇచ్చినోడి వెన్ను పొడిచే
నిన్నూ , నీ కుయుక్తులనీ ఎండగట్టం కూడా ఎరుకౌను
మట్టి పెళ్లలపై
రక్త సంతకాలు చేయడమే కాదు
ఓ దొర కాని దొరా...
మట్టిని దోచుకోచూసే
నీ రుధిరాన్ని తెల్లబరచడమూ తెలుసు
ఇన్నెందుకులే....
పదిమాసాలు మోసి
పాలిచ్చి పెంచిన తల్లినే గుర్తుంచుకోని నీలాంటి వాడికి
గుక్కెడు గంజి
పిడికెడు బువ్వా పెట్టి
నిన్నో మనిషిని చేసింది
మేమేనని తెలియచెప్పడమూ
మాకు మట్టితో పెట్టిన విద్య
నీలాంటి కలుపు మొక్కల్ని ఏరేయడం
పొలంలో కలుపు తీసినంత సులువు
చీడ పురుగులాంటి నీ చేష్టల్ని కూకటివేళ్ళతో సహా పెకలించడం
ఎరువు చల్లినంత సునాయాసం
నేలతల్లిని కాపాడుకోవడం
ప్రాణాలలో పచ్చని ఊపిరి నింపుకున్నంత సున్నిత వ్యవహారం.....
సుధామురళి