నా బాల్యం
నా బాల్యం
బాల్యమంటే విరిజాజుల పూతోట
బాల్యమంటే ఆనందాల హరివిల్లు
అమ్మే తొలి దైవం
నాన్నే తొలి గురువు
అమ్మ వాక్కు వేద వాక్కు
నాన్న వాక్కు బ్రహ్మ వాక్కు
బాల్యంలో ఆడుకొన్న అటలు
మరచి పోలేని తీపి గురుతులు
మట్టి చేతులతో పచ్చి చింత కాయలను తెంపి
పచ్చి మిరప ఉప్పు కలిపి
బండ మీద పచ్చడి చేసుకొని తిన్న ఆ దృశ్యం
ఇంకా కళ్ళల్లో మెదులు తూనే ఉంది
మామిడి తోపుల్లో దొంగ చాటుగా
మామిడి కాయలు తెంపుకొని
పొట్లంలో దాచుకొన్న ఉప్పూ కారంతో
అద్దుకొని తిన్న ఆ దృశ్యం ఇంకా
కళ్ళముందు కదలాడుతూ ఉంది.
జీరంగుల్ని పట్టుకొని
దారం కట్టి అగ్గిపెట్టెలో దాచి
చింత చిగురు తినిపించి
రెక్కల శబ్ధంవింటూ గాలిలో వదిలి
ఆ దృశ్యాన్ని తలచుకొంటే ఏదో తెలియని ఆనందం
ఇసుక గూళ్ళు కట్టుకొని
మా బాహుదా ఏరులో జలకాలాడిన బాల్యం
మునగ చెట్టు బెండ్లు కట్టుకొని
వూరవతల దిగుడు బావుల్లో
ఈత కొట్టిన బాల్యం
బుడ్డి లాంతరు వెలుగులో
పుస్తకాలతో కుస్తీ పడుతున్నప్పుడు
మసి బారిన ముక్కును, ముహాన్ని చూసి
స్నేహితులంతా నవ్వుకొన్న బాల్యం
చిన్న చెట్లను నాటి ఈతాకులు కప్పి
పందిరి వేసి ఆకుల తోరణాలు కట్టి
సీతా రాముల పెళ్ళిలో
పురోహితుల వేషం కట్టిన బాల్యం
నా బాల్యం మళ్ళీ నాకు కావాలి
నా బాల్యాన్ని నాకెవరైనా తెచ్చి ఇస్తారా?
