మరీచిక
మరీచిక


శ్వాసకూ, ఆశకూ మధ్య శోధనతో
కొట్టుమిట్టాడుతోంటుంది దేహం
ఆత్మకూ, అంతరాత్మకూ మధ్య వేదనతో
పడిలేస్తోంటుంది హృదయం
దేహానిది గోదావరి దాహం
హృదయానిది వేసారిన మోహం...
దేహం ఆశల వలయంలో భ్రమిస్తూ
హృదయం ఆశయాల కలలో శ్రమిస్తూ
సాగే ఆరాటాల పరుగులో
కొనసాగే జీవన పోరులో
విజయమెరుగని హృదయం
ఓటమి వేటలో, ఒంటరి బాటలో
ఎండమావుల వెంట ఏకాకిగా పయనిస్తూ
బండబారిన బతుకును గడిపేస్తూ
వ్యామోహాల దాహాన్ని తీర్చుకోవడానికి
పరితపిస్తూ పరిభ్రమిస్తోంది...
ఆశలకై ధ్యానిస్తూ, శ్వాసిస్తూ,
వాటి సాధనా దుఃఖంలో సుఖించే
మనిషి ... మంచితనం ముసుగేసుకుని
ఏదో రోజు గతించక తప్పదని తెలిసీ...
కుంచించుకు పోయిన అంతరాత్మ
ఆవేదన గుర్తించక వదిలేసి, వెలేసి
పాప కూపాన పడి లేవ లేక
పశ్చాత్తాప దీపాన్ని వెలిగించలేక
తిమిర కుహరంలో, అస్థిర దేహంతో
అత్యాశలతో రమిస్తూ, స్కలిస్తూ
తుదిశ్వాసలోనైనా, చితివరకూ
క్షమ - ప్రేమ, నీతి - రీతి, స్మృతి - కృతి
కానని పరాన్న జీవిలా బ్రతికేస్తుంటే....
మార్చేదెలా? బలైన బతుకుల్ని ఓదార్చేదెలా??