మౌన తరంగాలు
మౌన తరంగాలు


పండుగకో, పబ్బానికో, ఉత్సవానికో, ఊరేగింపుకో
కోరికల విమానం గాలిలో ఎగురుతది
మైకులు అరుస్తుంటే, డీజే గెంతులేస్తుంటే
చిందులేస్తాం, పతాక స్థాయిలో శరీర కదలికలు
కొంతసేపు ఆనంద విహారం
నేలను తాకుతాయి చెమటనదులు
సిగమూగే శబ్దాల మధ్య గడపలేం ఎక్కువసేపు
అలసట ఆక్రమిస్తది నిలువెల్లా
నిశ్శబ్ద తరంగాలను ఆహ్వానిస్తాం
ఆదరిస్తాం, అక్కున చేర్చుకుంటాం
గర్జనల దోస్తానా వదిలి
మౌనం చేయి పట్టుకొని కూర్చుంటాం
నిలకడగా ఉండటమో, నిద్రపోవడమో చే
స్తాం
శబ్దాలు చెవిని సోకినా మేలుకోనంత విశ్రాంతి
శక్తి తిరిగి పుంజుకోవాలంటే
నిశ్శబ్దం చెరువులో ఈత కొట్టాల్సిందే
ధ్యానాన్ని ఆశ్రయించినపుడు
మన చెవులు శబ్దాన్ని వింటాయి వదిలేస్తాయి
పట్టు విడుపులు కాదు పట్టించుకోవు
యోగనిద్రను మేల్కొల్పితే
మనసు, మనిషి ప్రశాంతతలో
నిశ్శబ్దం ఎక్కువైనా ప్రమాదమే
మౌనాన్ని పాటించే అడవిలో అర్ధరాత్రి గడపడం
ఒంటరితనంలో నిశ్శబ్దం ఊబిలోకి దిగడం
మనిషిని వణికిస్తుంది, చల్ల చెమటలు పుట్టిస్తుంది