మా ఊరు
మా ఊరు


నాకు మా ఊరు అంటే చాలా ఇష్టం.
నా కంటే కూడా !
ఎందుకంటే ఇక్కడ కొండరాళ్లు కూడా
హంపి శిలల్లా దేవరాగం ఆలపిస్తాయి.
మా ఊరి వాగు అయితే
చెప్పక్కర్లేదు
వయ్యారన్నంతా ఒలకబోస్తూ
కన్నెపిల్లలు కదులుతున్నట్లు అనిపిస్తోంది.
మా ఊరిలో
పచ్చటి పంట పొలాలు
అమ్మ ఒడిలో వెచ్చగా పండుకున్నట్లు
శైశవాన్ని తిరిగి
గుర్తుకు తెస్తుంది.
మా ఊరి జతగాళ్ళను
చూచినప్పుడల్లా నేనేం
కోల్పోయానో
నాకు అవగతమవుతుంది.
జారి పోయిన బాల్యం
తెగిపోయిన బంధాలు
అన్నీ ఒక్కసారే మళ్ళీ
నా ముందుకు వచ్చినట్లు
మనసు తేలిక అయితది.
మ
ా ఇంటి ముందు పేడ అలికి
రంగు రంగుల ముగ్గులేసి ఇంటిని
ముస్తాబు చేసినప్పుడల్లా
నేను మా అమ్మ లో
నేను ఓ రవివర్మను చూసేటోన్ని.
మా నాన్న కాడి కట్టి
సెలకోల చేత బట్టి
కోడె గిత్తల వెంట
కదులుతూ ఉంటే మా నాన్నలో
గొప్ప ఉత్పత్తి దారుణ్ణి చూశా.
మా ఊరి కొండ
మాకు తిరుపతి కొండంత.
బడి విడిస్తే చాలు కొండ ఎక్కేటోళ్ళం.
కలీకాయలు, రేగుపళ్ళు, బలిజపళ్ళు
దోసిళ్ళు దోసిళ్ళు నిక్కరు జేబుల్లో
చక్కగా చేరి పోయేవి.
ప్రకృతిలో మేము ఉన్నామా ?
ప్రకృతే మా వూరిలో ఉందా ?
అన్నట్టు ఉండే
మా ఊరు అంటే నాకు చాలా ఇష్టం.
నా కంటే కూడా !