జీవన సంక్రమణం
జీవన సంక్రమణం
పురుడు పోసుకున్న పుష్యమీ మాసం
కమ్మిన పొగమంచుతో
పండగ పరిమళాన్ని మోసుకొచ్చింది
పంట చేలన్నీ తుషార బిందువులతో
అభ్యంగనస్నానాలు ఆచరించాయి
మకర సంక్రమణం లోకి తొంగి చూస్తున్న
దినకరుడు నులి వెచ్చని కిరణాలతో
భోగిమంటల అనుభూతిని
అందిస్తున్నాడు
బుడబుక్కలవాని ఢమరుకనాదం
జంగమ దేవర జానపద గీతాలు
డూడూ బసవన్నల విన్యాసాలు
హరిదాసుల హరినామ సంకీర్తనలు
ఆహ్లదమంతా ఆరుబయటే నాట్యం చేస్తుంటే
పసిడి వన్నెల పాపాయిలా పండుగ నవ్వులు రువ్వుతోంది
భోగభాగ్యాల భోగితో
మధురానుభూతుల సంక్రాంతి కలగలిసి
పాడిపంటల కనుమ కనువిందుగా
మనిషి జీవన సంక్రమణకు
నవ్య హారతులు అద్దాయి