జీవితం అనుభవాలు
జీవితం అనుభవాలు


జీవన ప్రవాహంలో
నలిగి నలిగి
ఎన్ని మూర్చనలు పోయి
ఆ నవ్వును సంతరించికుందో?
ఆ దేహం
ఎడతెరిపి లేని
కష్టాల జడివానకు అడ్డు నిలిచి
ఎన్ని ప్రాణాలకు
ఆసరా అయిందో?
ఆ చిరునవ్వు
దుఃఖ తరంగాల వరిపిడికి
గాయపడిన ఆ దేహాన్ని
చొక్కాలో దాచేసిన
మందహాసానికి తెలుసో లేదో
అలసిన ఆ కన్నులతో పలికిస్తున్న
ప్రేమామృత పరిభాషలు
మరలిపోయిన వసంతాలకు వెరవక
తరలివచ్చే శిశిరాలకు బెదరక
>పాలిపోయిన ఆ పంటి మెరుపుకు
తెలుసేమో?
దాచేసిన కష్టాల కరచాలనాలు
మాసిన గడ్డం మాటున దాచేసిన
గాయాల సలపరింతలు
అతను నిలబడిన
ఆ నేలకు తెలుసేమో?
చీకటి మజిలీలను దాటి
తీరం చేరిన ఆ జీవన నౌకకు
తెలిసేమో?
స్థితప్రజ్ఞతకు
అతనో నిలువెత్తు రూపమని
ఎన్నో అనుభవాలను నిక్షిప్తం చేసుకున్న
నెరిసిన ఆ జుట్టుకు తెలుసేమో?
అనుభవాల ఆస్తిపరుడు అంటే ఇతనని