ఇప్పుడు
ఇప్పుడు
ప్రేమకు నిజ ప్రతిరూపం..చూపాలా ఇపుడు..!
ముద్దు మురిపాల అద్దం..కాచాలా ఇపుడు..!
మనసంతా నీపైనే..తెలియలేవు బిడ్డ..
అనురాగపు ఆలయమే..చూడాలా ఇపుడు..!
కనే వేళ తనప్రాణం..ఏమాయెనొ అసలు..
నీ మాయన పడిన వెలను..కట్టాలా ఇపుడు..!
చందమామ వైపుచూపి..పెరుగన్నం పెట్టె..
తనకొంగే ఊయల కద..మరవాలా ఇపుడు..!
నీకోసం సర్వస్వం..విడనాడెను కాద..
ఆప్యాయత చిరునామా..చెప్పాలా ఇపుడు..!
ఎన్నితిట్లు ఎన్నిబాధ..లోర్చె నిన్ను పెంచ..
'నేను-నేను' అంటావే..తెలియాలా ఇపుడు..!
కంటిపాప కన్న మిన్న..నీవు కదా తనకు..
తను పాడిన జోలపాట..కావాలా ఇపుడు..!
పై చదువులు ఎన్ని చదివి..ఎంత ఎదిగినావొ..
తాను తప్పు చేసిందా..ఎంచాలా ఇపుడు..!
అవును కదా మూర్ఖత్వం..పేగుకెలా తెలుసు..
ముక్కలైన ఆ మనసును..విడవాలా ఇపుడు..!
రేపు ఎలా ఉంటుందో..తెలవారిన కదా..
కన్న గుండె తడిని కాస్త..తుడవాలా ఇపుడు..!
ఎలా నీవు ఉన్నావో..చూడాలని తపన..
ఇంత చిన్ని తన ఆశను..తీర్చాలా ఇపుడు..!
