దిగులు కమ్మిన వేళ
దిగులు కమ్మిన వేళ


దిగులు కమ్మిన వేళ
పగటి వెలుతురు దిగిపోయే వేళ
సూర్యుడు తన పనిని
చంద్రునికిచ్చి విశ్రాంతికోసం
పరుగులెత్తే వేళ...
గుండె చిన్నబోతోంది
వెండి వెన్నెల వచ్చి ఓదార్పునిస్తున్నా
ఊరట దొరకని ఉలిపిరి హృదయం
ఉగిసలాడుతోంది....
ఆత్మను తాకే ఓ చిన్ని
మమతల ఊటని తలుస్తూ
ఉస్సురంటూ ఊపిరి
నిట్టూర్పు లో కలిపేసి వదులుతోంది..
మొగలి పువ్వు అందమే చూసే కళ్ళకు
మొగలి పరిమళం పట్టలేని గుండె,
గుబులుతో అలుగుతోంది
వాకిట విరిసిన జాజులు
తెల్లగా నవ్వేస్తూ..
ఓయ్ ఏమిటోయ్
ఇంత ఏమరుపాటు
కాసిన్ని నీళ్లు తెచ్చి మా నోళ్లు
తడపమన్నట్టు తలలూస్తున్నాయ్..
ఏమో దారి తెన్ను లేని
ఆలోచనలు దారం తెగిన గాలిపటాలె
గుండె పొరలు ఒలిచి వాస్తవాన్ని
చూద్దామనే ఉహూ విందామనే&
nbsp;
ఆరాటం అస్సలు ఉండనివ్వదే...
కోయని మల్లెలు కోపంగా చూస్తున్నాయ్
మొగ్గ మందారం విచ్చకుండానే
నొచ్చుకొని మరింత ముడుచుకుపోతుంది
ఇదే తెగులంటే
మొక్కకి నీరే ప్రాణం కదా
అదే ఎక్కువ వర్షిస్తే
నీరెక్కువై మొక్క ప్రాణం తీసినట్టు
హద్దుల్లేని ప్రేమ కూడా పొద్దు తెలియనివ్వదేమో....
ప్రాణం తీసేస్తుంది నిలువునా....
ఇక గుండె చుట్టూ కుదురు కట్టి
ఇతరాలని ఇటువైపు రానివ్వకుండా
ముళ్ల రోజాలని చుట్టూ దడి
కట్టాలేమో...
సరేలే కానీ
ఇదిగో నిన్నే
ఎం చేస్తున్నట్టు
ఈ మాయ అలుముకుంది
నా మనసునేనా
మరి మరి తలచిన నీకు
పొలమారుతుందని
మరచినట్టు,మనసుని మలచి
నే స్వరం మార్చుతున్నా
అర్ధమవుతుందా నీకు...?
గుండెనద్దుకున్న... గుబులు..?