బాల్యం
బాల్యం
మరుపురాని జ్ఞాపకాలే బాల్యమంతా
గోరుముద్దలు అన్నం ఆనందమే కదా
వెన్నెల బైట నిద్రలే తియ్యటి ఫలం
చెప్పుకున్న కథలో విజ్ఞానపు గ్రంథులు ..
తొలకరి వానలో చిందుల పర్వాలు
కాళ్ళ కంటిన బురదే కమనీయం దృశ్యం
చింపిరి జుట్టు సుందర వదనమే అందం
గడిచిన రోజులన్నీ అపురూపమైన అనందం..
ముచ్చటైన ఆటలెన్నో ఆడుతూ
ఇంటి ముంగిట సందళ్లుతో తిరుగుతూ
గుండెలో ఆనందపు పొంగులు అనుభవిస్తూ
మోకాళ్లు బెందులు గుర్తుండే జ్ఞాపకాలు..
బోరింగు నీళ్ళు మూసి మూసి
బిందెలెన్నో పగలగొడుతూ
తెల్లవారుజామున తొందర పనులు ఎన్నో
పాఠశాల సమయానికి పరుగులన్నీ...
పొలం గట్లపై మయూరపు నడకలు
రేగు చెట్టుపై ముళ్ళకంపతో పోరులు
చెరువులోనూ చేప పిల్లల వేటలు
వంట చెరుకు కోసం గొడ్డలి వేటులన్నీ..
పాఠశాల ఆవరణం పాటల తోరణం
సూర్యాస్తమయానికి ఇంటికి ఉరుకులు
గురువుగారి బెత్తముతో గురుపూజలెన్నో
వీపు పైన వాతలు విమానపు మాతల్లా..
బాల్యమంటే గుర్తొచ్చేసాయి బంగారు రోజులు
మురిసిపోయిన మురిపాల ముచ్చట్లు
కాకి ఎంగిలి కబుర్లతో సరదాలన్నీ
నిజమైన భాగ్యము బాల్యంలోనే దొరుకు..
నిజమైన స్నేహానికి అచ్చొచ్చిన కాలం
కల్మషం లేని చిరునవ్వే బాల్యము
ఎలాంటి ఈర్ష్యాద్వేషం లేని పసి హృదయం
తలుచుకున్న ఇప్పటికీ సంతోష సమయం..
గుండెలో అలజడి పెరిగినప్పుడల్లా
గడిపిన బాల్యం తలుచుకుంటే చాలు
చిరునవ్వుల బాల్యం చింతలెన్నో తీర్చే
గుండె ధైర్యం వచ్చి ముందుకు సాగిపోయే...
