అసలు రూపం
అసలు రూపం


ప్రతిరోజు అద్దంముందు అరగంట నిలబడి
అందాలను చూసుకుంటూ తెగ మురిసిపోతారు
అందరికన్నా అందంగా ఉండాలని ఆరాటపడుతు
చిన్న మచ్చ కనిపించినా తెగ బాధపడతారు
రంగులు అద్దుకుని రంగమ్మత్తను నేనే అనుకుంటారు
తెల్ల జుట్టుకు నల్లని బ్రాండెడ్ రంగులు పూసుకుని
సినిమా హీరోలమంటూ కాలర్ ఎగిరేస్తారు
పాపం అద్దానికేం తెలుసు అబద్ధం చెప్పడం
నిజరూపం చూపిస్తే నిప్పులా మండిపోతారు
తలతల మెరిసే తెల్లని అద్దాన్ని
సర్ఫ్ నీళ్ళతో కసిగా కడిగేస్తారు
మనుషుల ఆలోచనల మర్మమంతే
తమపై ఆరోపణలు వస్తే తట్టుకోలేరు
ఎదుటి వాళ్ళకు అంటగడతారు నేరాలు-
మంచిగా ఉన్న అద్దాన్నయితే కడిగేశారు గాని
మలినమైన మనసును మాత్రం మా
ర్చుకోరు
వయసు మీదపడుతుంటే వచ్చే ముడతలు చూసి
కలవరపడతారు కాలంచెప్పే యదార్ధాన్ని చూసి
కళ్ళముందుండే నిజాలను మాత్రం ఒప్పుకోరు
కళ్ళుమూసుకుని కాలంతో కుస్తీ పడతారు
బాహ్య అందాలకోసం బాధపడే మనుషులు
తమ అంతరంగాలను మార్చుకోవడానికి ప్రయత్నించరు
ఎప్పుడూ ఎదుటివాళ్లలో లోపాలను వెతుకుతూ
తమ తప్పులు కప్పిపుచ్చుకొని ఆనందపడతారు
పదిమందిలో గొప్పల మెప్పుల కోసం
అసలు రంగుపై అత్తరు వాసనలు జల్లుకొని
నిజస్వరూపం బయటపడకుండా నటిస్తారు
దాచినా దాగదు మనుషుల అసలు రూపం
మీ ప్రవర్తనే అద్దంలా చూపెడుతుంది మీ ప్రతిబింబం
పూసుకున్న పైపై మెరుపులు కరిగిపోయాక
కనిపిస్తుంది అసలు సిసలైన వికృతరూపం