అమ్మతో కొన్ని క్షణాల
అమ్మతో కొన్ని క్షణాల
నాలుగు వేదాలను కలిపి
గట్టిగా ఉచ్చరించాను....ఆశ్చర్యం
అన్ని శ్లోకాల నిండా అమ్మ శబ్దాలే
చిన్నప్పుడు మాట వినలేదని
నాన్న సాచి కొట్టాడు...వెంటనే
నా కన్నీళ్లు అమ్మ కళ్ళల్లో రాలాయి
నేను ఎన్ని అద్దాలలో చూసుకున్న
ఏ అద్దంలోనూ అందంగా లేను
ఒక్క మా అమ్మ కళ్ళల్లో తప్ప
కన్నీళ్లు నా కళ్ళకు తెలియవు
ఎప్పుడైనా నాకు ఏడుపొస్తే....
తన కళ్ళను అరువిస్తూ అమ్మ
నదిలోకి తొంగి చూశాను
అలల నిండా నా కన్నీళ్లు, తాకితే
తెలిసింది అన్నీ అమ్మ జ్ఞాపకాలే
ఆనాడు అమ్మ గోరుముద్దల్లో
అన్నీ తెలుగు అక్షరాలే...నేడు
నా కవితల నిండా ఆమె సంతకాలే
ఏడిస్తే కన్నీళ్లు రాలటం లేదు
చూస్తే నా కనురెప్పల మధ్య
కనిపించని అమ్మ తన దోసిళ్లతో
అమ్మ నుంచి చాలా నేర్చుకుంటాం
ఒక నది నడకను తప్ప, నది అంటే
అమ్మ చీర కొంగులోని త్యాగాలు
అమ్మ గతించి పాతికేళ్లు...ఇప్పటికీ
అద్దంముందు నిలబడితే చాలు
తలదువ్వి, ముద్దుపెడుతూ అమ్మ
