అమ్మంటే
అమ్మంటే
అమ్మంటే మరో బ్రహ్మ.... పుట్టించిన దైవతమే...!
ఆమె తోడి లోకమంత. రెట్టీంచిన దైవతమే...
పంట, చేను వాగు వంక అందమైన ప్రకృతియే..
స్త్రీ తనమును తనరూపుగ కట్టించిన దైవతమే
అవనిలోని ప్రతి అణువూ అమ్మేగా ప్రశ్నెందుకు
ఆడపిల్ల ఐశ్వర్యం సృష్టించిన దైవతమే,
కిన్నెర వాగయ్యెనుగా..!బాపూ బొమ్మగ మారెను...
మహిళా మణిరత్నమునే వెలిగించిన దైవతమే..
శ్రీ వాణీ గిరిజమ్మలు ముగురమ్మలు మనకు రక్ష.....
విశ్వమంత మహిళలనే చూపించిన దైవతమే.
అమ్మ కవిత రాసేందుకు అమ్మకేది తీరికా!
అమ్మ గజలు పాడేందుకు ఆమెకేది తీరికా!
అలసటనే మాటనేది మరచిపోయి ఎన్నాళ్ళొ!
విరామమే ఎరుగనట్టి తల్లికేది తీరికా!
ఆకొనగా బిడ్డచెంత నిలుపునుగా కోరినది!
తన ఆకలి ఎరిగేందుకు మాతకేది తీరికా!
రేయనకా పగలనకా కష్టించే శ్రమజీవి
ప్రతిఫలమును ఆశించని జననికేది తీరికా!
దూరంలో కొడుకుండగ తిన్నాడో!లేదోయను!
ముద్ద దిగక గొంతునుండ , అవ్వకేది తీరికా...!
తననుదుటిన ప్రేమగీత రాసాడా దేవుడు
చిత్రరేఖ గీసేందుకు అబలకేది తీరికా
ఇల్లంతా పరుగెడుతే కార్యస్థలి రంగస్థలే....
నాట్యమునే చేసేందుకు మహిళకేది తీరికా
మాతృహృదయ అనురాగం సృష్టిలోని రహస్యమే
ఇంతింతని కొలువలేని మమతకేది తీరికా!
అమ్మలోని ఆప్యాయత ఎరుగలేము ఓ శ్యామా!
కరిగేందుకు హిమము చూడ కాంతకేది తీరికా.....
