ఆమె రాకముందు
ఆమె రాకముందు
ఆమె ఆగమనానికి మునుపు
నేనో రాతి బండను
జడత్వం నిండిన జీవిని !
ఆమె వచ్చింది సుడిగాలిలా
రాతిని రమ్యమైన శిల్పంగా చెక్కింది
చైతన్యాన్ని కడుపునిండా త్రావించింది
తన గుండెను గుడిగా చేసి
నన్ను ప్రతీష్టించుకుంది
నిత్య పూజలందుకుంటున్నా....
ఆమె రాకముందు
పోగొట్టుకున్న నా ప్రేయసి సమాధిపై
తలవాల్చి ప్రొద్దంతా గడిపే వాడిని
ఆమె వచ్చింది
తన కనులలో నా ప్రేయసిని చూచుకోమంది
కన్నీరు తుడిచింది
కారుణ్యం వర్షించింది
నుదుట ముద్దెట్టింది
కుదుట పడి మురిశాను నేను
ఆమె రాకముందు
ఎందరున్నా నేనో ఒంటరిని
అందరినీ సందడిగా
చూస్తున్నాను ఆమెలో
భార్యగా అనురాగం కురిపించింది
అమ్మగా లాలించింది
నాన్నగా పాలించింది
ఆమె రాకముందు
నేనో శ్వాసిస్తున్న పీనుగను
వసంతం లా వచ్చింది
కోకిలలా గానించింది
నన్నువీణలా చేసి
ఏ తంత్రులుఎలా మీటిందో
నాలో క్రొత్త పులకింత!
ఏదో పారవశ్యం
ఏదో మైకం
ఆమె రాకముందు
కన్నీళ్లతో కడుపు నింపుకుంటున్న నాకు
జీవితంలో మాధుర్యం కూడా ఉందని తెలియదు !
నా ప్రక్క శయనించి
తన కౌగిలిలో నన్ను దాచుకుని
ఎన్ని కమనీయ కథలు చెప్పిందో!
ఎంత వింత సుఖాన్ని ఇచ్చిందో !
ఆమె రాకముందు
నేనో అంతర్ముఖుడను
గదిలోన ఘడియ వేసి
ఉక్కు కప్ప బిగించి
గోడకు జాగిల పడి
శూన్యంలోకి చూస్తూ.....
ఆమె వచ్చింది సుడిగాలిలా
తాళం బ్రద్దలు కొట్టింది
కప్పను వీధిలో విసిరేసింది
కన్నులను ముద్దెట్టింది మృదువుగా
వ్రెలు పట్టి నడిపించింది
ప్రకృతి అందాలను చూపింది!
ఆ ప్రకృతిని నేనే అన్నది...
గడిచిపోతున్నది కాలం
కుళ్ళు కాలం!
ఎంత ఈర్ష్యా చిత్తమో కాలానికి
కాఠిన్యంతో ఆమెను తీసుకెళ్లింది
ఆమె సమాధి ప్రక్కన
చిన్న రాతిముక్కలా పడివున్నా నేను!
