Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kavi voleti

Drama

4.9  

kavi voleti

Drama

ఈ చేయి వదలొద్దు

ఈ చేయి వదలొద్దు

4 mins
923


ఉదయం లేస్తూనే అమ్మ లోపలనుంచి పిలిచింది "ఒరేయ్ బాలు కి వొళ్ళు కాలే జ్వరం వచ్చింది కాస్త వాడి సంగతి చూడు"

 అని. 

 చూసాడు మనోహర్ . కాస్త ఎక్కువగానే ఉన్నట్టుంది కానీ అంత ప్రమాదకరంగా ఏమీ అనిపించలేదు వాడి పరిస్థితి .  నాలుగు సంవత్సరాల బాలు మగతగా పడుకొని ఉన్నాడు .

తల్లి సోమమ్మ వేగంగా ఏ పని చేయలేదు ఏదో పడుతూ లేస్తూ వంట చేస్తుంది మిగతా పనంతా పని మనిషి చేస్తుంది కానీ ఆఫీస్ కి సెలవు పెట్టే పరిస్థితి లేదు మనోహర్ కి. ఈరోజు ఎలాగైనా ప్రాజెక్ట్ పూర్తి చేసి మేనేజర్ దగ్గర తన గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి వచ్చిన మంచి అవకాశం ఇది. ఇదే టాస్క్ చేయలేక తన కొలీగ్స్ చాలామంది చేతులెత్తేస్తే తన మీద నమ్మకంతో తనకు ఇచ్చాడు మేనేజర్ కాబట్టి వెళ్లాల్సిందే.


 ఈలోగా ఫోన్ మోగింది "హలో మనోహర్ గారా?"

" అవును చెప్పండి"


" నేను రాజేష్. స్వర్ణ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను."


" ఆ చెప్పండి"


" మీ భార్య సుగుణ గారు కదా?"

" అవును తన ఇన్సూరెన్స్ డబ్బు కోసం నిన్న వచ్చాను ఆఫీస్ కి"


" అవునండి కానీ ఆమె చేసిన ఇన్సూరెన్స్ పాలసీ ఒరిజినల్ డాక్యుమెంట్ మీరు ఇవ్వలేదు. అది ఇస్తే మీకు రెండు రోజుల్లో డబ్బు అందుతుంది."


" సరే నేను రెండు రోజుల్లో డాక్యుమెంట్ పట్టుకు వస్తాను "


"ఒక్క నిమిషం నేను రేపు ఎల్లుండి సెలవు లో ఉంటాను సార్ తరువాత మూడు రోజులు పండగ సెలవులు ఆ తరువాత మేనేజర్ గారు హైదరాబాద్ వెళుతున్నారు కాబట్టి మీరు డాక్యుమెంట్ ఈరోజు ఇస్తే మంచిది లేదంటే మరో పది పదిహేను రోజులు ఆగాల్సి ఉంటుంది "


తన పరిస్థితి అంతా వివరించే ఓపిక లేక 

"సరే ఈరోజు ఇస్తాను" అనేసి ఫోన్ పెట్టేసాడు మనోహర్ .

ఇప్పుడు ఆఫీస్ కన్నా ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ ముఖ్యం అనిపించింది మనోహర్ కి

 మెల్లిగా చైత్ర దగ్గరికి వెళ్ళాడు. ప్రతిరోజు మామ్మ కి చేదోడువాదోడుగా ఉంటూ తమ్ముడిని రెడీ చేసి తాను రెడీ అయ్యి బస్సు కోసం వెయిట్ చేస్తూ సిద్ధంగా ఉండేది చైత్ర. కానీ ఈరోజు తను కూడా కొంచెం బద్దకం గా ఉంది మెల్లిగా తట్టి లేపాడు.

" డాడీ నేను ఈరోజు స్కూల్ కి వెళ్ళను" గారంగా చెప్పింది.

" సరే తల్లి నీ ఇష్టం కానీ నాకు ఒక సాయం చెయ్యి"


" చెప్పండి డాడీ"


" తమ్ముడికి ఒంట్లో బాగాలేదు కాస్త చూస్తూ ఉండు నేను మన పాత ఇంటికి వెళ్లి అమ్మ ఇన్సూరెన్స్ చేసిన పాలసీ డాక్యుమెంట్ తీసుకొస్తాను సరేనా"


 "తమ్ముడికి ఒంట్లో బాగాలేదు అనగానే ఒక్కసారిగా ఆందోళన పడిపోయింది చైత్ర.


" ఏమైంది డాడీ వాడికి"

ఆమె గొంతులో అప్పుడే ఆందోళన.


" ఏం కాదు తల్లి కొద్దిగానే"


" సరే డాడీ కానీ మీరు ఇలాంటప్పుడు వెళ్లడం అవసరమా ముందు వాడిని డాక్టర్ గారికి చూపించి అప్పుడు వెళ్ళచ్చు కదా ప్లీజ్"


" కొంచెం అర్జెంట్ తల్లి" అని ఎలాగోలా ఒప్పించి అమ్మని కూడా ఒప్పించి మేనేజర్ కి సెలవు కోసం ఫోన్ చేసి పాత ఇంటికి బయలుదేరాడు మనోహర్.

 భార్య సీత రెండు నెలల క్రితం హఠాత్తుగా విషజ్వరం సోకి మరణించింది .కొన్ని రోజుల పాటు ఆ ఇల్లు వదిలిపెట్టి ఇంకో ఇంట్లోకి వచ్చేసారు. కానీ పాత ఇంటి ఓనరు ఆ ఇంటిని ఎవరికి అద్దెకు ఇవ్వకపోవడంతో కొన్ని పెట్టెలు బీరువాలు అక్కడే ఉంచేశారు. "ఇప్పుడు ఎన్ని వెతకాలో ఏమిటో " అనుకున్నాడు మనోహర్ .


అరగంట ప్రయాణం తర్వాత పాత ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లోకి అడుగుపెడుతూనే దిగాలుగా అయిపోయింది మనోహర్ మనసు.

 ఏదో తెలియని బాధ గుండెల నిండా నిండిపోయింది. తనని సీత పిలుస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు ఏవేవో ఊహలు. ఇల్లంతా ఒకప్పటి శోభను సంతోషాన్ని కోల్పోయింది.

అచ్చం తన లాగే..


డ్రెస్సింగ్ టేబుల్ మీద తమ ఫోటో,తానిచ్చిన గోల్డ్ చైన్ చూపిస్తూ సీత నవ్వుతున్న ఫోటో..

వెళ్లెప్పుడు ఇవి కూడా తీసుకెళ్లాలి అనుకున్నాడు.


 ఈ లోగా మళ్లీ ఫోన్ మోగింది

" డాడీ నేను..

తమ్ముడికి మామ్మ మందు వేసింది కానీ ఇంకా తగ్గలేదు మీరు త్వరగా రండి"


 చైత్ర కంగారుకి కాస్త ఇబ్బంది పడినా తమాయించుకున్నాడు మనోహర్.

 "వచ్చేస్తున్నా సరిగ్గా గంటలో అక్కడ ఉంటా" అని ఫోన్ పెట్టేసాడు.


 భార్య బట్టల బీరువా అల్మరా అన్నీ వెతికాడు. దొరకలేదు .

ఎక్కడ పెట్టి ఉంటుందో గుర్తు రావట్లేదు.

 ఇంతలో బీరువాలో ఇంకో అర తీశాడు.

 అందులో అన్నీ పాత డైరీలు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా డైరీలో మడత పెట్టి పెట్టిందేమో అనే సందేహం వచ్చింది.

 సీతకి డైరీ రాసే అలవాటు ఉంది దాదాపు ఏ రోజూ తాను డైరీ రాయడం మానలేదు. అవును ఆఖరి రోజుల్లో కూడా తాను డైరీ రాసే ఉంటుందా. ఏం రాసి ఉంటుంది చదవాలనిపించింది. వెంటనే ఆ సంవత్సరం డైరీ తీసాడు.

 ఈలోగా మళ్లీ ఫోన్ .

"ప్లీజ్ చైత్ర ఒక్క అరగంటలో అక్కడ ఉంటాను"

 అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.

 

సీత చనిపోయింది జూలై 22 సాయంత్రం. రెండు రోజుల ముందు అంతా హాస్పిటల్ లోనే ఉంది కాబట్టి డైరీ రాయలేదు ఆఖరి పేజీ జూలై 19 రాత్రి రాసి ఉంది.


" ఈరోజు అసలు ఏమి బాగాలేదు.

 పొద్దున లేస్తూనే చలి జ్వరం అనిపించింది. నీరసంగా కూడా ఉంది. ఎలాగోలా లేచి పిల్లల్ని రెడీ చేశాను. ఈయనకు చెప్పి హాస్పిటల్కు వెళ్దాం అనుకున్నాను. కానీ ఈయన ఎప్పటిలాగే చాలా బిజీ. ఉదయం నుంచి నా ముఖమే చూడలేదు. లేచింది మొదలు ఉరుకులు పరుగులు.నేను కూడా ఇబ్బంది పెట్టాలనుకోలేదు. ఆఫీస్ కి వెళ్లిపోయారు. ఇంకా రానేలేదు నాకైతే జ్వరం ఎక్కువగానే ఉంది .

ఎంత రాత్రైనా ఈరోజు హాస్పిటల్ కి వెళ్లి చూపించుకోవలసిందే. గుడ్ నైట్ .


 మనోహర్ కి గుర్తుంది ఆ రాత్రి తను పది గంటలకి వచ్చాడు రాత్రికి ఏదో టాబ్లెట్ వేసి మర్నాడు ఉదయం తీసుకెళ్లాడు హాస్పిటల్ కి.

 అప్పటికీ ఏమీ ఉండదు లే ఎందుకు కంగారు అనుకుంటూనే ...

"తన ఆ అలసత్వమే ఈ విషాదానికి కారణం..సందేహం లేదు"చిన్న అలజడు..మనసులో

డైరీలో ప్రతి పేజీలో ఒక సూక్తి రాసి ఉంది .

ఆ పేజీలో క్రింద ఉన్న వాక్యం 

"ధనం వెంట వెళ్లేవారికి ధనమూ దక్కదు సుఖమూ దక్కదు"


 అది చదవగానే మనోహర్ కళ్లలో నీళ్లు ఆగలేదు. ఆ మాటలు ముమ్మాటికీ తన గురించి రాసినవే.

 నిజానికి తాను సీతకు ఏ లోటూ చేయలేదు.

 కానీ ఏం ప్రయోజనం.


 ఆపదలో స్పందించనప్పుడు డబ్బు బంగారం జీవితాన్ని నిలబెడతాయా.. ప్రాణాన్ని తిరిగి ఇచ్చే సిరి ఉందా.

 బంధాల్ని నిలబెట్టే ధనం ఉందా..

 తానెంత కళ్లుమూసుకుపోయి ప్రవర్తించాడు.

 అక్కడే కూలబడిపోయాడు మనోహర్ ..

దుఃఖం ఆగడం లేదు.


 ఒక్కసారి బాలు గుర్తొచ్చాడు.

సీత తనకేదో చెప్తున్నట్టు అనిపించింది..

 వెంటనే ఇంటికి తాళం వేసి బయల్దేరాడు .


     ****


బాలుని హాస్పిటల్లో చూపించి అన్ని టెస్టులు చేయించి ఇంటికి వచ్చేసరికి రాత్రి తొమ్మిది అయింది.

 తనకు ఏమీ లేదని తెలిసాక మనోహర్ మనసు కాస్త తేలిక పడింది.

 ఆ రాత్రి బాలుని తన దగ్గరే ఉంచుకోవాలని అనుకున్నాడు. ఇంకా కొంచెం జ్వరం గానే ఉంది వాడికి .

తన చేతి మీద తల పెట్టుకుని పడుకున్నాడు.

 నిజానికి సీత విషయంలో తాను కొంచెం ముందే డాక్టర్ కి

చూపించి ఉంటే కాస్త బాగుండేదేమో.

 తన ఈగో తన ధనదాహం ఇవే తనని తప్పుదారి పట్టించాయి. ముమ్మాటికి ఇది నిజం.

 తన కళ్ళలో నీళ్ళు బాలు చూడకూడదు అనుకున్నాడు.


 రాత్రి పది అయింది మళ్లీ ఫోన్ మోగింది. స్వర్ణ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అదే ఏజెంట్.

 ఫోన్ శబ్దానికి కళ్ళు తెరిచాడు బాలు.

 ఫోన్ కట్ చేసాడు మనోహర్.

ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.

 "నాన్నా ఇక్కడే ఉంటారా? వెళ్లిపోరు కదా ?"

వచ్చీరాని మాటలతో ముద్దుముద్దుగా అడిగాడు బాలు.


" లేదు నాన్నా నీకు తగ్గేదాకా నీ దగ్గరే ఉంటాను సరేనా"


 సంతృప్తిగా కళ్ళు మూసుకున్నాడు బాలు..

   ********


Rate this content
Log in

Similar telugu story from Drama